ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న మాటలు ఎంత నిజంగా నిజమెా మరోసారి ఋజువైంది. చరిత్ర పునరావృతమైంది. శ్రీ శ్రీ గారు మళ్ళీ మీరే గెలిచారు.
27, ఫిబ్రవరి 2018, మంగళవారం
చరిత్ర పునరావృతం...!!
గాజుబొమ్మ జీవితం...!!
ఆరాధించాలనిపించే
అందమైన ఆహార్యం
మాటలు నేర్చిన
మనసులు దోచే ముగ్ధత్వం
కల'వరాలను' కలత పరిచే
కనికట్టు ఆమె సొంతం
గుండె నిండుగా మిగిలిపోయే
చివురాకుల సున్నితత్వం
నిత్య యవ్వనిగా
జీవించాలన్న ఆరాటం
కోరికల కొలిమిలో
కాలిపోయిన కాంక్షల వలయం
వెరసి ముగిసిన
మరో సినీ విచిత్రం
ముట్టుకుంటే పగిలిపోయే
గాజుబొమ్మ జీవితం...!!
26, ఫిబ్రవరి 2018, సోమవారం
గెలుపు కోసం...!!
కలల దుఃఖాన్ని మోస్తూ
సాగుతోంది జీవిత పయనం
అలల ఆటుపోట్లకు తడుస్తూ
మిగిలిపోతోంది కడలి తీరం
వేదనల రోదనలను భరిస్తూ
ఆశ నిరాశల్లో కొట్టుమిట్టాడుతోంది జీవం
మౌనాల్లో మాటలను దాచేస్తూ
మనసు మోహాన్ని కట్టిపడేస్తోంది హృదయం
క్షణాల కాలాన్ని గుప్పిట బంధించేయాలంటూ
ఆరాటాల పోరాటంలో పడి వాస్తవంలో అలసిపోతోంది అంతరంగం
గెలుపు కోసం నిత్యం రణం చేస్తూనే ఉంది
ఓటమిని ఒప్పుకోలేని అహం...!!
23, ఫిబ్రవరి 2018, శుక్రవారం
కొన్ని....!!
కొన్ని మౌనాలింతే
కనులతో మాటాడేస్తూ
మనసును పరిచేస్తూ
కొన్ని బంధాలింతే
వెంట పడుతూ వేధిస్తూ
గతజన్మ సంబంధాలుగా
కొన్ని సంతోషాలింతే
చిరునవ్వులొలికిస్తూ
అనుకొని అతిథులుగా
కొన్ని అక్షరాలింతే
శరాలుగా మారుతూ
శాపాల శాసనాలు లిఖిస్తూ
కొన్ని స్నేహాలింతే
విడదీయలేని సాన్నిహిత్యాలుగా
వదలలేని పాశాలుగా
కొన్ని జీవితాలింతే
బతుకు అర్ధం తెలియకుండా
ఏకాకుల్లా బతికేస్తూ....!!
ఆకాశం అవతలి వైపుకి....!!
ఆత్మ దర్శనం కోసం నిత్యాన్వేషణ చేసి పరమానందం కోసం మనిషి తనకు తానుగా పొందవలసింది జ్ఞాన యోగమని చక్కని అలతి పదాల్లో వివరించారు. అక్షరాల అక్షయాన్ని కలం బలంతో మాటల వీణలు మ్రోగిస్తూ తన కవితలను ఆ నుండి అం, అఃలతో సాగించి అమ్మానాన్న, బంధాలు, బలహీనతలు, అనుబంధాలు,సమానతలు, అసమానతలు, నిత్యావసరాలు, చెత్తబుట్ట, చిగురుటాకు,.. ఇలా ప్రకృతిలోని ప్రతి సాధనాన్ని, సున్నిత అంశాలను తనదైన ప్రత్యేక శైలిలో అక్షరాలను అందంగా పదాల్లో పొందు పరచి మన ముందుంచారు.
జనన మరణాల తరువాత ఏమిటి అన్న సందేహానికి పరిపూర్ణ జీవితాన్ని చూసిన జమ్ములమడక భవభూతిశర్మ గారి "ఆకాశం అవతలి వైపుకి" కవితాసంపుటి ఓ చక్కని సమాధానం అవుతుంది. ఆత్మ దర్శనం కోసం అన్వేషించే నిత్యాన్వేషణలో జ్ఞానయోగ మార్గానికి సాధన, పరమానందాన్ని పొందడమే మోక్షమని సరళ పదాల్లో చెప్పడమే ఓ తార్కాణం.
ఇక రెండో వైపున ఏముందనేది శర్మ గారి మాటల్లోనే చూద్దాం. గమ్యం తెలియని జీవన ప్రయాణాన్ని ఆత్మసాధనలో అనంత విశ్వాన్ని, విశ్వ పరిణామక్రమంలో ప్రకృతిలో జరుగుతున్న మార్పులను జీవితానికి వైజ్ఞానికి శాస్త్రానికి, మనకు తెలియని విశ్వా చైతన్యానికి అన్వయిస్తూ అంతరిక్షాన్ని, ఆ వింతలను తన భావాల్లో మనకు చూపి మనలో సరికొత్త ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం చేశారుమేథస్సుకు అంతు చిక్కని నిగూఢ శక్తిని అక్షరీకృతం చేయడంలో కృతకృత్యులయ్యారనే చెప్పవచ్చు.
ముఖపుస్తక పరిచయమే అయినా అభిమానంగా ఆదరించే శర్మగారు ఈ "ఆకాశం అవతలి వైపుకి" కవితాసంపుటికి నన్ను నాలుగు మాటలు రాయమనడం మహద్భాగ్యంగా భావిస్తూ ... మరిన్ని కవితా సంపుటాలు వెలువరించాలని కోరుకుంటూ.. మనఃపూర్వక అభినందనలతో ...
22, ఫిబ్రవరి 2018, గురువారం
స్వోత్కర్ష ఎక్కువైతే...!!
మన గొప్పలు మనం చెప్పుకుంటే తప్పు లేదు కానీ, ప్రతి ఒక్కళ్ళ మీద పడి ఏడవడం ఎంత వరకు సబబో విజ్ఞులే చెప్పాలి. భాషని, భాషలోని లోతుపాతుల్ని అవపోసన పట్టిన వాళ్ళు కూడా ఎదుటివారిలో తప్పుల్ని ఎట్టి చూపరు, సున్నితంగా చెప్తారు. నాలుగు అక్షరాలూ రాయడం వచ్చింది కదా అని ఎవరిని పడితే వారిని అంటుంటే ఎదురుదెబ్బలు తప్పవు. గొప్పదనం మనం ఆపాదించుకుంటే రాదు. వ్యక్తిత్వం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి దానితోనే మనకు విలువ వస్తుంది. నోటి దురుసుదనంతో మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఆ గొప్పదనం తుడిచిపెట్టుకు పోతుంది.
అక్షరాలకు కూడా అధికారాన్ని, హోదాను, డబ్బుతో కొలుస్తూ కులాలను విరివిగా ఆపాదించేస్తున్న రోజులివి. మంచి చెడు అన్ని చోట్ల ఉంటుంది, అందరిలో ఉంటుంది. అందుకని అందరిని ఒకే గాటిన కట్టేయడం కూడా సరి కాదు కదా. నాలుగురాళ్లు వెనకేసుకోవచ్చుకాని నలుగురి నోళ్లు కొట్టి సంపాదించడం కాదు. నీతులు చెప్పడం చాలా సుళువు కానీ ఆ చెప్పే నీతులలో ఒక్కటైనా పాటించడం కనీస బాధ్యత అని మనలో ఎందరం అనుకుంటున్నాం. నలుగురి గోడల మీద నుంచి నాలుగు నాలుగు ముక్కలు సేకరించి అన్ని కలిపేసి మన సొంతమే అని మన గోడ మీద పెట్టేసుకుంటే మనమేమి మంచివాళ్ళం అయిపోము, మన బుద్ది తెలియనంత వరకే మన ఆటలు, ఒకసారంటూ మన ఊసరవెల్లి రంగులు బయటపడ్డాక జీవితంలో మన మొఖం ఎవరు చూడరు. ముఖ్యంగా స్నేహాలకు, అనుబంధాలకు విలువలనిచ్చే కొద్దిమంది అస్సలు దగ్గరకు కూడా రానివ్వరు. మన చిల్లర వేషాలు తెలియనంత వరకే మన ఆటలు సాగేది. ఫంక్షన్లు, పార్టీలు చేసి డబ్బులు ఎగ్గొట్టే రకాలు, మన ముందు ఒకలా నటించి, మన వెనుక అవాకులు చెవాకులు వాగుతూ మన కొంపల్లో చేరి మనల్ని వాడుకుంటూ మరో నాలుగు ఇళ్లల్లో నాలుగు రకాలుగా గడుపుతుబతికే బతుకులు, నేపద్యాలంటూ వల్లె వేస్తూ నలుగురి దగ్గరా నాలుగు మాటలు చెప్పి డబ్బులు దండుకుని ఎదుటివారిలో తప్పులు వెదుకుతూ బతికేసే జనాలు, స్నేహం ముసుగులో నయవంచన చేసి పదిమంది దగ్గరా కాసిన్ని కన్నీళ్లు ఒంపేస్తే మంచితనం వచ్చి పడిపోదు. ఇలాంటి వాళ్లకు శూన్యం కూడా చుట్టమై రావాలంటే భయపడుతుంది.
ఏంటో నేస్తం చాలా చెప్పాలని ఉన్నా ఇన్ని రోజులు నిస్తేజంగా ఉండిపోయాను. ఇంకా బోలెడు చెప్పాలనే ఉంది కానీ ఇప్పటికే నా మీద కారాలు మిరియాలు నూరే వాళ్ళు ఎక్కువై పోయారు. మరోసారి మరిన్ని కబుర్లతో ... !!
ప్రియ నేస్తానికి పుట్టినరోజు శుభాకాంక్షలు...!!
21, ఫిబ్రవరి 2018, బుధవారం
జీవన 'మంజూ'ష (8)..!!
ఏమిటో ఈ హడావిడి జీవితాలు. ఎక్కడ చూసినా అంతులేని అగాధాలు పరుచుకున్న అనుబంధాలు, అర్ధం కాని సంబంధాలు కాన వస్తున్నాయి. నేటి మన వివాహ వ్యవస్థ చాలా బలహీన పడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు బరువు బాధ్యాల నడుమ భార్యాభర్తలు కీచులాడుకున్నా తమ ఉన్న బంధాలకు బద్ధులై సరిపెట్టుకునేవారు. ఇప్పటి రోజుల్లో సామాజిక మాధ్యమాల పుణ్యమా అని మంచిని మరచి చిన్న చిన్న మాట పట్టింపులకే తమతో పెనవేసుకున్న అనుబంధాలను వదలి వేయడానికి క్షణం కూడా ఆలోచించడం లేదు. ఖరీదైన విలాసవంత జీవితాల వైపు మొగ్గు చూపుతూ క్షణిక సుఖాల కోసం జీవితాలను అధఃపాతాళంలో పడవేసుకుంటున్నారు. వ్యక్తిత్వాలకు విలువ లేకుండా డబ్బుకు దాసోహమౌతున్నారు. వివాహ బంధమనే కాకుండా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై పోవడానికి ఈ సామాజిక మాధ్యమాలు చాలా దోహద పడుతున్నాయి. మనం కోరుకుంటున్న మార్పు ఇదేనా..?
మన చుట్టూ ఉన్న ప్రతి అనుబంధంలోనూ నిజాయితీ ఉండాలని అనుకోవడంలో తప్పు లేదు, కానీ మనం ఎంత వరకు నిజాయితీగా ఉంటున్నామని మనస్సాక్షిని ప్రతి ఒక్కరు ప్రశ్నించుకుంటే మనం కోరుకుంటున్న మార్పు మనతోనే మొదలౌతుంది. అనుబంధాలను వ్యాపారంగా మార్చుతున్న కొందరు తమకంటూ కనీసం ఒక్క కన్నీటిచుక్కను కూడా మిగుల్చుకోలేరు. అధికారం, డబ్బు, హోదా ఇవేవి అనుబంధాలను, మానవతా విలువలను మనకు ఆపాదించలేవు. ప్రతి మనిషికి వ్యక్తిత్వం చాలా విలువైన ధనం. అది లేని నాడు కోట్లు ఉన్నా గుణానికి పేదవారే. తమ చుట్టూ ఎందరున్నా ఎవరు లేని ఏకాకుల్లా మిగిలిపోతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కొన్ని వేల జీవితాలు అసంతృప్తిలో నలిగిపోతూ త్రిశంకు స్వర్గంలో తేలుతున్నాయనడానికి మన చుట్టూ ఉన్న నిదర్శనాలు చాలు. మనకు లేని సంతోషం ఎదుటివారికి ఉందని ఈర్ష్య పడితే పెద్దలు చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకోవడమే " ఒకళ్ళకి పడి ఏడిస్తే ఒక కన్ను.." సామెత మనకు నిజమై పోతుంది. ప్రపంచంలో డబ్బు, హోదాతో గెలవలేనివి కొన్ని ఉంటాయని మనము గుర్తెరిగి నడుచుకుంటే రేపు పోయినప్పుడు మోయడానికి నలుగురు దొరుకుతారు, లేదా... ఆ నలుగురే కాదు కన్నవాళ్ళు, కడుపున పుట్టినవాళ్ళు కూడా అసహ్యించుకునే బ్రతుకై పోతుంది. ..!! ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం....
19, ఫిబ్రవరి 2018, సోమవారం
త్రిపదలు....!!
1. కొన్ని మౌనాలింతే
కనులతో మాటాడేస్తూ
మనసును పరిచేస్తూ.... !!
2. పంజరం నుండి పయనం
వింతల పుంతల విశ్వంలోనికి
స్వేచ్ఛా విహంగాలై...!!
3. చీకటి రంగును పులుముకుంటూ
వెన్నెల వర్ణానికి అడ్డుపడాలని
గ్రహణపు ప్రయత్నమే ఎప్పుడూ...!!
4. మూసిన రెప్పల చాటున
రాలిన స్వప్నాలను
మెలకువలోఏరుకుంటున్నా...!!
5. తప్పని పరిస్థితిలో
నెలవు వదలిన చినుకు
అన్యాక్రాంతం కాబోయింది
6. అక్షరాలెలా ఒంపులు తిరుగుతున్నాయెా చూడు
నీ చేతిలో చిక్కినందుకేమెా
ఇలా నవరసాలొలకబోస్తున్నాయి...!!
7. మనసును దాయలేనివి
నా అక్షరాలు
మౌనానికి మాటలు నేర్పుతూ....!!
8. తల్లడిల్లే తలపులు
మది వాకిట నిలిచినా
అక్షరాలకెంత ఆదరణో అక్కునజేర్చుకోవడానికి...!!
9. ఆశల విహంగాలకు
ఆశయాల ఊతమిచ్చి
ఆచరణలో పయనించేదే కవి(త)త్వం...!!
10. అక్షరం ఆకర్షిస్తోంది
భావాలతో అలంకరించుకుంటూ
భాషకు వన్నెలద్దుతూ...!!
11. ప్రేమలేఖ పలకరించిందేమెా
మదిలోని సంతసాలు
చిరునవ్వుల దోబూచుల్లో...!!
12. నా అక్షరాలింతే
మనసుని తడిమి వస్తాయి కదా
ఎప్పుడూ తడిగానే ఉంటాయి..!!
13. నా రాతలింతే
ఓటమి వద్దంటూ
గెలుపు మైత్రిని ఆహ్వానిస్తాయి...!!
14. పాత అనుభవమే కాని
సరి కొత్తగా రాసేందుకే
ఈ అక్షర విన్యాసం...!!
15. కొన్ని అక్షరాలంతే
కాగితమ్మీద జారిపోతుంటాయి
మనసుని పరిచేస్తూ... !!
16. కొన్ని పలకరింపులంతే
భావాలను పంచుకుంటాయి
మనసుకు దగ్గరౌతూ..!!
17. కొన్ని దరహాసాలంతే
సజీవమై నిలిచిపోతాయి
దశాబ్దాలు గడచినా....!!
18. కొన్ని అభిమానాలంతే
అల్లుకుపోతుంటాయి
ఆసరాగా నిలుస్తూ...!!
19. అమ్మలాంటిదే అక్షరం
ఆత్మీయంగా అల్లుకుంటూ
మనసుని మురిపిస్తుంది...!!
20. అక్షరంలో నీ మనసు
అద్దంలా అగుపడుతోంది
చదవనవసరం లేకుండా...!!
21. కొన్ని జ్ఞాపకాలనంతే
మనతోపాటు తీసుకుపోతూ
కాలానికి అనుసంధానం చేసేస్తుంటాం...!!
22. మనసాక్షరాలైనందుకేమెా
మానసాలను కొల్లగొడుతూ
పదవిన్యాసాలు అంబరాన్నంటుతున్నాయి...!!
23. లలాట లిఖితమైనందుకేమెా
అర్ధమయ్యి కాకుండా ఆటలాడుతోంది
ఎన్నిసార్లు వల్లె వేసినా...!!
24. నన్ను నేనే మలుచుకుంటున్నా
ఉలి దెబ్బలతో దేహాన్ని
రాతిలోని మనసును రాతలో చూపించాలని..!!
25. కొన్ని బాధ్యతలంతే
బంధాలకు బంధీలై
జీవించేస్తాయి కడవరకు...!!
26. సహనమూ శాపమేమెా
ఆశనిరాశల నడుమ
ఎటూ తేల్చలేని సందిగ్ధావస్థలో...!!
27. అముద్రితమైనా
అక్షయమైన భావనల
కలబోతే కదా మనసాక్షరాలు....!!
28. కలత మేఘం మిగిలింది
కల్లలైన కలలకు
ఓదార్పు వెతుకుతూ...!!
29. మనసు గానమే
నిరంతరం
సరిగమలు నేర్వకున్నా....!!
30. మనసు...
పంచుకున్న మౌనాల
అక్షర సమాహారం...!!
ద్విపదలు..!!
1. నీటి మీది రాతలంతే
తేలిపోతూ చులకనౌతున్న బంధాలై..!!
2. కొన్ని మాటలంతే
మరువలేని బాసలుగా...!!
3. మనసు మాట్లాడేస్తోంది
జీవితంలో నిర్మలత్వానికి ఓ అర్ధాన్నిస్తూ...!!
4. నైతికత ఇస్తుందేమెా
జీవితానికి ఆత్మతృప్తిని..!!
5. వరాలన్నీ నావే
వసంతమై నువ్వు నన్ను చేరితే...!!
6. వర్ణాలంతటా వయ్యారాలే
హరివిల్లుకు అందుకే అన్ని అందాలు...!!
7. కాలానికి ధీటుగా జవాబిస్తూ
మనోనిబ్బరంతో క్షణాలను ఒడిసిపడ్తూ...!!
8. నిశ్శబ్దం నవ్వుతోంది
ఏ తలపు కదిలిందో మరి....!!
9. మనసు సహకరించడం లేదు
మౌనసమీక్షలన్నీ నీతోనే నిండుకున్నాయని...!!
10. మనసును గెలిచిందిగా
ఓడిన మౌనం నీ మాయకులోనై...!!
11. నమ్మకమే నీవయ్యావు
సమస్య వీగిపోతుంటే....!!
12. మనసు మౌనమైంది
మాటలన్నీ నీవయ్యాక...!!
13. ముడి విడివడదు
మాట మౌనం మనమని నీవంటే..!!
14. ఎందరికో విశేషాన్నైన నేను
నీకెందుకు సశేషంగా మిగిలిపోతున్నానో...!!
15. ముగింపు అవసరం లేని కథ
తరగని చెలిమికి అక్షయమైన పాత్రలుగా...!!
16. అక్షరానికి ఎప్పుడూ ముచ్చటే
నిన్ను తనలో చూసుకుంటానని...!!
17. భావాల బంధనాలన్నీ విడిపోయాయి
స్వేచ్ఛావిహంగాలైన అక్షరాల ధాటికి...!!
18. విచ్చుకుందో వేకువ
మలిరాతిరి మధుర సంతసాలను వెంటేసుకుని....!!
19. నిమజ్జనం చేసినా మళ్ళీ పుడుతోంది
నేనే నీవుగా మారిన జ్ఞాపకమైనందుకేమెా..!!
20. ఆనందం ఆర్ణవమైంది
అద్దంలో నాలో నిన్ను చూస్తూ..!!
21. మనదైన అంతరంగం
అంతరాలకు అందకుండా...!!
22. చెదిరిన మనసొకటి
నా అనే ఆనవాళ్ళకై వెతుకుతూ...!!
23. వసంతం వలసెళ్ళినట్లుంది
మరో ఉగాదికైనా వస్తుందో రాదో...!!
24. ఓ క్షణం చాలదూ
మమతల మాధుర్యాన్ని పంచడానికి...!!
25. గాయమూ గోప్యమైంది
మాటల గారడిలో మునిగిన మదికి... !!
26. దాయాల్సింది ఏముంది
నేను నువ్వు ఒకటిగా మారినప్పుడు...!!
27. విశేషంగా మిగిలిపోదామిలా
సశేషాలను చెరిపేస్తూ..!!
28. మనసులోని మమతను చూస్తున్నా
మౌనానికి మాటలను అలంకరిస్తూ...!!
29. మాటలు మర్చిపోవాలనుకుంటున్నా
గాయాలను మాన్పుకోవాలని....!!
30. గేయాలైన గాయాలే అన్నీ
గమనం మరచిన మదిలో....!!
18, ఫిబ్రవరి 2018, ఆదివారం
ఏక్ తారలు...!!
1. ప్రతి క్షణము పున్నమే_కనుల ఎదుట నీవుంటే... !!
2. మనసు చిత్తరువులే అన్నీ_మంజువాణి మనోభావాలుగా...!!
3. గోదారి గలగలలే మనసంతా_నీ స్నేహారాధన సవ్వడికి....!!
3. స్వరజతులుగా సాగుతున్నాయి_గోదారి గంగమ్మ పరవళ్ళ ఉరవళ్ళు...!!
4. నిస్తేజమౌతున్న అనుబంధాలు_కపట స్నేహాల పాలబడి..!!
5. చీకటింటికి చుట్టాలొచ్చారు_నిశ్శబ్దానికి వరసలు కలుపుతూ..!!
6. తడిసిన కన్నుల్లో వి రిసింది_నిశ్శబ్దరాగంలో ప్రేమ మెరుపు...!!
7. ఆలాపనలన్నీ నీతోనే ముడి పడ్డాయి_మనసు మౌనాలను చిత్తగిస్తూ...!!
8. మనసు మురిసింది నీ స్నేహానికి_మమతలను అల్లుకుంటూ...!!
9. మనసులొక్కటైన చెలిమి_మది నిండిన జ్ఞాపకాల చిరునామాతో...!!
10. జీవితం తెరచిన పుస్తకమే_చూడలేని కాగితాలెన్నో దానిలో...!!
11. నిశ్శబ్దంలోనూ శ్లేషలే_మన ఆంతరంగికాలను అక్షరబద్దం చేస్తూ....!!
12. మర్మాలెన్నున్నా కలిసిన మనసులే_అరుదైన చెలిమి నీడలో...!!
13. శకలాలన్నీ ఏరుకుంటున్నా_ముక్కలన్నీ పేర్చి జ్ఞాపకంగా పదిలపర్చుకుందామని...!!
14. వ్యాపకాలన్నీ నీతోనే_జ్ఞాపకాలకు తావు లేకుండా...!!
15. చెలిమి స్వచ్ఛమైనదే_మనసుకు మాలిన్యమంటనంత వరకు..!!
16. ఆంతర్యానికెంత ఆనందమెా_జనించే ప్రతి భావనలోనూ నీవుంటుంటే...!!
17. మౌనం మనదైంది_అంతరంగాలోకటైన వేళ...!!
18. అతిశయమే మనసుకి_విడిపోనిది మన స్నేహమని...!!
19. కలలన్నీ కల్లలే_విలువలేని అనుబంధాల ఆటల ముందు...!!
20. మూడుముళ్ళెప్పడూ ముచ్చటైనవే_అర్ధాంతరపు బంధాలకు కనువిప్పు కలిగిస్తూ...!!
21. కల కల'వరిస్తోంది'_మెలకువలో మరవద్దని..!!
22. సశేషాలన్నీ విశేషాలే_శ్లేషలను మిగిల్చేస్తూ...!!
23. మకరందమూ మత్తెక్కించే మధువే_అక్షరాలకు భావాల లేపనమై...!!
24. పెదవంచున చిరునవ్వవుతావా_పరితపించే మనసుకు సాంత్వనగా...!!
25. ఓటమితో వాదిస్తున్నా_గెలుపు చిరునామా నీవని చెప్తూ...!!
26. విస్మయానికీ అచ్చెరువే_విశేషణమైన నీ పద విన్యాసానికి...!!
27. జ్ఞాపకాలన్నీ మనవే_విడివడని మన చెలిమికి ప్రతిరూపాలై....!!
28. మౌనమే అక్షరమైంది_కాగితాన్ని కలలతో నింపేద్దామని...!!
29. వాడినా పరిమళాలే అనునిత్యం_కాలాన్ని మెాసుకెళ్తూ మిగిలిన జ్ఞాపకాలు...!!
30. గతానికి భయమెక్కువ_వర్తమానంతో రాజి పడలేక...!!
15, ఫిబ్రవరి 2018, గురువారం
జీవన "మంజూ"ష ...!! (6)
ఈ నెల నవ మల్లెతీగలో నా వ్యాసం ....
11, ఫిబ్రవరి 2018, ఆదివారం
శోధన....!!
నిరంతర సంఘర్షణల్లోనుంచి
జీవన పరిణామ క్రమాన్ని
ఆవిష్కరించడానికి పడే
తపనలో మేధస్సుకు చిక్కని
ఆలోచనల వలయాలు
ఆక్రమించిన మనసును
సమాధాన పరిచే క్రమంలో
నన్ను నేను శోధించుకుంటూ
తప్పొప్పుల తూకాలను
అసహజ అంతరాలను
అర్ధం కాని ఆవేదనలను
కోల్పోతున్న బంధాల బాధ్యతలను
మధ్యస్థంగా మిగిలిపోయిన
వ్యక్తిగత వ్యవస్థలోని లోపాల భారాన్ని
ముసురు పట్టి ముసుగులోనున్న
మానవత్వపు మమకారాన్ని
వెలుగుపూలు పూయించాలన్న
ఆరాటంలో ఆలంబన చేసుకున్న
ఆత్మ పరిశీలన నుండి అంకురమై
మెుదలైందే ఈ అక్షర ప్రయాణం....!!
8, ఫిబ్రవరి 2018, గురువారం
ప్రేమంటే...!!
రాసి రాసి
నలిపి పడేసిన
కాగితాలు ఏరుకుంటే
వాటిలో దొరికే
రాతల్లోని భావమేమెానని
వెదుకుతుంటే..
కలం నుంచి
జారి పడిన అక్షరాలు
పదాలతో జత కట్టి
పరిచయాన్ని పెంచిన
మనసుతో మమేకమై
మౌనాన్ని మాటలుగా
పరిచిన కలవరాల కలకలం...!!