29, అక్టోబర్ 2023, ఆదివారం

స్నేహమంటే..!!

నేస్తం,

         ఏ బంధం ఎందుకన్నది మనకు అది ఏర్పడినప్పుడు తెలియదు. ఈ సృష్టిలో ప్రతి దానికి ఏదోక కారణముంటుంది. మనకు మంచి జరిగిందా, చెడు జరిగిందా అన్న దానికి కూడా ఏ కారణము లేకుండా లేదు. చెడు నుండి ఓ పాఠాన్ని నేర్చుకుంటాం. మంచి నుండి కాస్త సంతోషాన్ని పొందుతాం. ఈ విశ్వం మనకు పాఠశాల వంటిదని మనం నమ్మక తప్పదు. మనందరి మాస్టారెవరో మీకు తెలిసిపోయింది కదా!

        కొందరితో మాట్లాడినప్పుడు కొన్ని మాటలు మన మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. మన అనుకున్న బంధాలు, ముఖ పరిచయమున్న సంబంధాలు, మనతో అవసరాలు తీర్చుకున్న అనుబంధాలు కనీసం మాట మాత్రంగానైనా అనలేని మాట, మనతో ముఖ పరిచయం లేకున్నా, మనకు ఏమీ కాకున్నా “ మీకు నేను చేస్తాను “ అన్న మాట మనకిచ్చే సంతోషం వెల కట్టలేనిది. 

         ఈ మధ్యన నా ఇంజనీరింగ్ నేస్తం యశోద అన్న మాట బోలెడు సంతోషాన్ని అందిస్తే, ఈరోజు ముఖపుస్తక నేస్తం అన్న అదే మాట అత్యంత సంతోషాన్ని అందించింది. నాకు సాయమందించిన వారున్నారు, నాద్వారా అందుకున్న వారున్నారు కాని వారెవరి నోటి నుండి రాని మాట నా రాతల వలన పరిచయమైన ముఖపుస్తక నేస్తం అన్నందుకు నిజంగా చాలా చాలా సంతోషమనిపించింది. థాంక్యూ సోమచ్ అండి . 

         చిన్ననాటి స్నేహితులం అందరం కలవాలనుకున్నప్పుడు ఒకొక్కరి ఫోన్ నెంబర్ దొరకగానే వెంటనే ఫోన్ చేసి మాట్లాడేసుకున్నాం ముప్పై ఏళ్ళైనా. అది అప్పటి స్నేహానికున్న అనుబంధమనుకుంటా. ఇప్పుడు కాలేజ్ వాళ్ళంతా కలవాలనుకున్నప్పుడు ఫోన్ నెంబర్లు చూసినా, మనం ఫోన్ చేసి మాట్లాడాలన్నా ఏదో సంకోచం. ఎవరి హోదా ఏమిటో, మనం పలకరిస్తే మాట్లాడతారో లేదో అని కూడా సందేహమే. చూద్దాం ఏ స్నేహం గొప్పదనమెంతో..!!

           

11, అక్టోబర్ 2023, బుధవారం

సాధన పుస్తక సమీక్ష..!!


              “సాధనమున పనులు సమకూడు ధరలోన..!!

   మనసుకు హత్తుకునే కథలు రాయడంలో అందె వేసిన చేయి మన డాక్టర్ లక్ష్మీ రాఘవ గారిది. హంగులు, ఆర్భాటాలు లేకుండా, మన చుట్టూ జరిగే సంఘటనలను కథలుగా మలచడమే కాకుండా, సమస్యలకు తగు రీతిగా పరిష్కారాలు కూడా చూపించడం వీరి కథలలోని ప్రత్యేకత. చాలా కాలం నుండి రాయడం వీరికి అలవాటైన విద్యే. వీరి కలం నుండి వెలువడిన మరో కథల సమాహారమే సాధన “. ఇందులో ప్రతి కథా మనకు ఏదోకటి నేర్పుతుంది.

      విమలమ్మ లాంటి వారు ఇంటికొకరు వుంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా భార్యాభర్తల మధ్యన గొడవలు రావు. జీవితాన్ని ఎలా జీవించాలోజీవితంలో చక్కగా చెప్పారు.

దేవుడి న్యాయంకథ చదివిన ప్రతి ఒక్కరి మనసుని తడుతుంది. అమ్మ జ్ఞాపకాన్ని ఆత్మీయంగా దాచుకోవడంచేజారిపోయిందనుకుంటే, తిరిగి చేరడం చాలా హృద్యంగా అమ్మ ముక్కుపుడక గురించి రాసారు

మనం సవరించుకోవాల్సిన సమస్యలకు సమాధానం ఆత్మహత్య కాదని చెప్తూ, ఎంత పెద్ద సమస్యలకైనా పరిష్కారం ఏదొక రూపంలో దొరుకుతుందని తెలిపే కథసవరణ “.

మనం చేసే వృత్తికి, స్వార్థం లేని మంచితనానికి చక్కనినిర్వచనం కథ.

జంతుప్రేమను తెలిపే కథరాణీ - రాజా “ . రాణీ మనసు మాటలు బావున్నాయి.

రాయడం తెలిసిన వారంతా గొప్ప రచయితలు ఎలా అవగలుగుతారో! రచయితల సంఘాలు ఎంత వరకు కొత్త వారిని ప్రోత్సహిస్తూ(నిరుత్సాహ పరుస్తూ), రాతల్లో మార్పులు, చేర్పులు చెబుతారో వగైరా రచయితల సాధకబాధకాలు వివరంగా చెప్పిన కథఅనుభవం “.

కష్టపడకుండా వచ్చే సొమ్ముతో ఇబ్బందులు, చిన్నతనంలో ఆకతాయితనంగా మెుదలైన పందెం డబ్బుల సంపాదన, తర్వాత తెచ్చిన చిక్కులు, తెలుసుకున్న జీవిత సత్యాలు తెలియాలంటేశివ B K “ కథ చదివితీరాల్సిందే

ప్రతి తల్లీ, తండ్రి తప్పక చదవాల్సిన కథపొరబాటు “. ఇద్దరు పిల్లల అలవాట్లు, చదువు వగైరాల మధ్యన పోలిక తెచ్చిన తంటా, వాటికి పరిష్కారాలు సూచించడం చాలా బావుంది.

మనసులోని నమ్మకానికి, దొంగ స్వాముల మోసాలకు తేడా తెలిపే కథనమ్మకం “.

ఊరిలో వారికి మాట ఇచ్చిన తండ్రి కాలం చేస్తే ఇద్దరు బిడ్డల ఆలోచనల వ్యత్యాసాన్ని విప్పి చెప్పిన కథమాట విలువ “. మనిషి ఉన్నా లేకున్నా మాట విలువను తెలిపిన కథ ఇది.

అనుకోనివి జరగడమే జీవితం. వెళ్తా అని చెప్పిన కొడుకుని మందలించిన తల్లికి తెలియదు, తిరిగిరానని కొడుకుకి తెలియదు. అనుకోకుండా వచ్చిన నోటి మాట నిజమైన వేళ. మనసుకి బాధనిపించే కథవెళ్ళొస్తా “.

ఆత్మీయత మనం పెంచుకునే ప్రాణులపైనా వుంటుంది. వస్తువులపైనా వుంటుంది. మమకారం వదులుకోవడం కన్నా ప్రాణం వదిలేయడమే సుళువనిరామయ్య బంటుకథ చెబుతుంది. వయసుడిగిన వారి మనసు పడే బాధను చూపిన కథ కూడా.

అమ్మ ఏం చేసినా పిల్లల బాగు కోసమేననిఅమ్మ నిర్ణయంకథ తెలుపుతుంది.

కులవృత్తికి సాటి లేదు గువ్వలచెన్నా! “ అన్న పెద్దల మాట నేటి కరోనా కాలానికి నిజమైన వేళ.. హెడ్మాస్టర్ తండ్రికి తన ముందు రెండు తరాల కులవృత్తిని గుర్తుకు తెచ్చిన ఇంజనీరు కొడుకు చేద్దామనుకున్న ఆధునిక వ్యాపారం గురించిహెడ్మాస్టర్ కొడుకుకథలో మనం చదవవచ్చు

వయసుతో వచ్చే మార్పులు, ఆలోచనలు కాలానుగుణంగా కొందరికి చాదస్తంగా అనిపించడం సహజం. మనమూ ఓరోజు వయసుకే చేరతామని అనుకోము. చక్కని మాటలను కూతురితో తల్లికి చెప్పించి, అమ్మమ్మను ఆనంద పరిచిన మనుమరాలి కథ. “ వయసు “.

కవులు కనుల భాష్యాలు కవితలుగా, పాటలుగా వినిపించారు. కాని కనుల మనసు కలతనికళ్ల కలవరంలో కొత్తగా, సరదాగా చెప్పినా నిజాన్ని చెప్పారు రచయిత్రి

కొందరు వ్యక్తులు కొద్ది పరిచయంలోనే కలకాలం గుర్తుండిపోతారు. ప్రతిఫలమాశించని వ్యక్తులు బహు అరుదు. అలాంటి అరుదైనమస్తానుచనిపోయినా సజీవుడే

జ్వాల అనుకోకుండా పల్లెటూరు అమ్మాయి సీతకు నేర్పిన కంప్యూటర్ తరువాత రోజులలో పల్లెకు, అక్కడి వారికి ఎలా ఉపయోగ పడింది అన్న కథసీత “.

ఎవరికి ఎవరితో బుుణానుబంధమో తెలిపే కతబుుణం “.

చేజారి పోయిందనుకున్న అమ్మ జ్ఞాపకం తిరిగి ఎలా చేరిందన్న కథేఉంగరం “. మంచితనం ఇంకా లోకంలో కొందరిలో మిగిలున్నదనడానికి కూడా నిదర్శనం కథ.

తండ్రి తప్పుకు కొడుకు చేసినదిద్దుబాటు కథ. అందరికి బాగా నచ్చే కథ.

మరణానికికాపరిఎలా పని చేస్తాడు. అతని మనసు ఎలా ఆలోచిస్తుంది. అంతిమ ప్రయాణం ఏర్పాట్ల గురించిన వివరణ కాపరికథ.

మంచంలో వున్న అమ్మ బుుణం కొడుకు ఎలా తీర్చుకున్నాడన్నది కొడుకు బాధ్యతకథ.

విమాన ప్రయాణంలో సరదా సంఘటనఎర్ర రిబ్బనుకథ

చెడు జరిగినా అది మన మంచికే అన్న పెద్దల మాట నిజం. కరోనా మూలంగా కలతల కుటుంబంలో జరిగిన మంచిరహస్యంకథ.

పురాణాల నుండి నేర్చుకున్న తెలివి ఈనాటి పిల్లలది. “ ప్రశ్నకథ లో కరోనా రాకుండా కట్టుకునే మాస్క్ ని హనుమంతుడి నోటితో పోల్చడం బావుంది.

జీవితంలో ప్రతి మనిషికి సమస్యలు సహజం. వాటిని అధిగమించి ఉన్నతస్థాయిని అందుకోవడం కొందరికే సాథ్యం. అలా స్థాయిని సాధించినసాధనకథ అందరికి ఆదర్శప్రాయం.

        ఇరవై ఏడు కథలతో వెలువడిన సాధనకథా సంపుటి చదవడం మెుదలు పెడితే ఆపడం కుదరలేదు. ఇందులో కథలు మా అమ్మమ్మ చదివి ఆమెకు దగ్గరగా ఉన్న కథలను నాకు, అమ్మకు వివరించడమే పుస్తకం ప్రత్యేకతని మరోసారి చెప్పనవసరం లేదు. నాకున్న అనేక కారణాల దృష్ట్యా పుస్తకం పంపి చాలా కాలమయినా చదవడానికి ఇప్పటికి తీరింది. మూడు రోజులు పట్టింది చదివి నా అభిప్రాయాన్ని ఇలా రాయడానికి. మరిన్ని మంచి మంచి కథలు మీ నుండి కోరుకుంటూ..ఆలస్యానికి మన్నించమంటూ..హృదయపూర్వక అభినందనలు లక్ష్మీ రాఘవ గారు




2, అక్టోబర్ 2023, సోమవారం

జీవన మంజూష అక్టోబర్23


 నేస్తం,

          కాల ప్రవాహం పరుగులు తీస్తూనే వుంటుందెప్పుడు. ప్రవాహంలో కొట్టుకుపోతామా లేక ఎదురీది నిలదొక్కుకుంటామా అన్నది మన బలాల, బలహీనతలపై ఆధారపడి వుంటుంది. కాలానికి విశ్రాంతి లేదెప్పుడు. నీటి ప్రవాహం మాత్రం ఎక్కడోచోట ఆగక తప్పదు. మనిషి మనసు వేగాన్ని బట్టి జయాపజయాలు వుంటాయి. గెలుపనేది మన విజయానికి తార్కాణం కాదెప్పుడు. విజయం ఎలా వచ్చిందనేది కూడా అవసరమే. కాని ఇప్పటి పరిస్థితుల్లో గెలిచామా లేదా అన్నది పరిగణన లోనికి తీసుకుంటున్నాం. గెలుపు వెనుక మంచి చెడు చూడటం లేదు. నిజంగా మనిషి గెలవడం అంటే ఏమిటో మనలో ఎంతమందికి తెలుసు?

         కుటుంబంలోనైనా, సమాజంలోనైనా వ్యక్తిగా మనం గెలవడం అంటే ఫలితాన్ని ఆశించకుండా మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం. భార్యాభర్తలతో మెుదలైన కుటుంబం ముందు తరాల పెద్దల బాధ్యతను తీసుకోవడంతో పాటుగా, పిలల్ల పెంపకం, కుటుంబ అవసరాలు వగైరా బాధ్యతలను తీసుకుంటుంది. పిల్లలు తమకన్నా బావుండాలన్న దురాశ పెద్దలకు వుండటంలో తప్పేం లేదు. దురాశతోనే ఇప్పటి తరాలను భారమైనా దూరం పంపుతూ, ఒంటరి పక్షులుగా మారిపోతున్నారు బోలెడుమంది. మనసులో బాధున్నా పైకి ఆనందాన్ని నటిస్తున్నారు

           మన చుట్టూ వున్న ఎంతోమంది పిల్లలుండి అనాధలుగా బతకడం మనం చూస్తూనే వున్నాము. అలాగే పెద్దలుండి పిల్లలు నిరాదరణకు గురౌతున్న సంఘటనలు చూస్తున్నాం. పదిమంది పిల్లలున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు కరువైన నిరాశ్రయులు ఎందరో. ఈరోజుల్లో వృద్ధశ్రమాలు కళకళలాడుతున్నాయంటే కారణాలు అనేకం కావచ్చు. కాని రేపటి రోజున మనమూ దశకు చేరుకోవాల్సిన వాళ్ళమేనని మర్చిపోతున్నాం. ఇంతకు ముందు మనమెలా బతికామన్నది కాదు అవసాన దశలో మనకెంతమంది అందుబాటులో వున్నారన్నది ముఖ్యం. మనం చూడలేక పోవచ్చు కాని రేపటి రోజున మన చావు చెప్తుందట మనమేంటన్నది. ఈరోజు డబ్బు, అధికారం, అంగబలం వున్నాయని విర్రవీగితే రేపు కాల ప్రవాహం ఎటు విసిరి కొడుతుందో మన ఊహకు కూడా అందదు. పైవాడు మంచి రచయిత. ఎవరి ముగింపు వారికి పుట్టినప్పుడే రాసేస్తాడు. దాన్ని మార్చాలనుకోవడం మన భ్రమ. ఇది తెలుసుకుని మన నడక, నడవడి వుంటే చరిత్రలో మనకో పేజి కాకపోయినా కనీసం పేరా అయినా మిగులుతుంది


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner