4, మే 2024, శనివారం

జీవన మంజూష మే24


 నేస్తం,

         మాయ తెరలు మనసు పొరలను కమ్మేసినప్పుడు వాస్తవం మనకు కనబడదు. సృష్టిలో ప్రతి జీవి మాయలో పడక తప్పదు. భగవంతునికే తప్పని మాయ, మనిషెంత అని అనుకొని సరిపెట్టుకోక తప్పదు. పాశాల మాయలో మనిషి బలహీనుడో లేదా బలవంతుడో అవడమూ సృష్టి ధర్మమే. కాలాలు మారుతున్నాయి. వాటితోపాటుగా మనిషి అవసరాలు మారిపోతున్నాయి. విషయంలో మనం ఎవరినీ తప్పు పట్టలేం. ఎందుకంటే ఎవరి అవసరం వారిది.

         ఒకప్పుడు చిన్న సాయమైనా మనం పొందితే సాయాన్ని మనమున్నంత వరకు జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళం. ఇప్పుడు మనకెవరైనా సాయం చేసినా అది మనకు వాళ్ళు చేయాల్సిన బాధ్యత అని మన అహం చెబుతోంది. ఆనాటి నుండి ఈనాటి వరకు పని ఒకటే అయినా మన ఆలోచనా విధానంలోనే తేడా. దీనికి అనేక కారణాలు. ధనపాశాలు బలంగా చుట్టేసుకుంటున్న మన జీవన విధానాలు ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. శాశ్వతానికి, అశాశ్వతానికి తేడా ఒక అక్షరమే అయినా అర్థము, పరమార్థము అందరికి అవగతమే. అన్నీ తెలిసినామనకేమీ తెలియదని, నిమిత్తమాత్రులమని మనమనేసుకుంటూ సరిపెట్టేసుకుంటున్నామిప్పుడు.

          వాస్తవానికి, భ్రమకి మధ్యలో బతుతున్నామని తెలిసినా అదే బావుందని, మనమనుకుంటూ మన పిల్లలకు కూడా ఇలాగే బతకాలని నేర్పేస్తున్నాం. మన ప్రవర్తనే రేపటి మన జీవితాన్ని నిర్దేశిస్తుందని తెలుకోలేక పోవడం మన దురదృష్టం. కాలానికి మనం అతీతులం కాదని తెలుసుకున్న రోజు బంధాలు, బంధుత్వాలు మనకు గుర్తుకు వచ్చినా, క్షణం వారికి గుర్తుండక పోవడం అసహజమేమీ కాదు. నటించడం మనకి నేర్పిన కాలమే ఎదుటివారికి ఆస్కార్ తరహాలో నటన నేర్పించగలదు.

         ఎవరినైనా మాట తూలడం గొప్ప కాదు. అదే మాటకి మనం బాధ పడినప్పుడు మనసు క్షోభ అర్థం అవుతుంది. స్థిరత్వం, స్థితప్రజ్ఞత మనం కొనుక్కుంటే దొరకడానికి అంగడి సరుకు కాదు. మన దగ్గర డబ్బులున్నాయని ఏదైనా మన పాదాక్రాంతమౌతుందని అనుకుంటే ప్రపంచంలో మనకన్నా మూర్ఖులు మరెవరూ ఉండరు. ఏది ఎలా ఉన్నా మనం మాత్రమే బావుండాలనుకుంటే మనమేంటో మన మనసుకి తెలుస్తుంది. మనసే లేదంటే మరో మాటే లేదు. అయినా ఈరోజుల్లో కంటికి కనబడని మనసుతో మనకేం పని ఉందంటారా..! అవును కదా ఇదీ నిజమే ఇంగ్లీషులో లేని మనసు గోల మనకెందుకులే అని మనమూ మనసు లేని మనుషుల్లానే ఆధునికంగా, ధనికంగా బతికిద్దాం


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner