30, అక్టోబర్ 2020, శుక్రవారం
నమస్కారం...!!
నేస్తం,
మనకి పని లేదని అందరికి కూడా పని లేదనుకుంటే ఎలాగేటి? మన అభిరుచే ఎదుటివారికి కూడా ఉండాలనుకోవడం ఎంత వరకు సబబంటావ్? నీ చేతికున్న ఐదు వేళ్ళు ఓసారి చూసుకుంటే తెలీదేటి ఆ సంగతి. ఇష్టాయిష్టాలు, ప్రేమాభిమానాలు అందరికి ఒకేలా ఉంటాయేటి? ఇరవైనాలుగు గంటలూ నిన్ను ఎంటర్టైన్ చేయడానికే ఎదుటివారు అనుకుంటే అది ఎంత వరకు సమంజసమెా ఆలోచించు. నీ బాధకు కోపానికి ఎదుటివారిని కారకులుగా చేయడం సమంజసమంటావా! ఎవరి బాధలు వారికుంటాయి. మనం మరో బాధకు కారణం కాకుండా ఉండాలి చేతనయితే.
ఎవరి అనుబంధాలు, అభిమానాలు వారికుంటాయ్. మనకు వచ్చినంత మాత్రానా మనం ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం కరక్ట్ కాదు కదా. ఫోనుల్లో అదేపనిగా మాట్లాడుకుంటేనో, క్షణం తీరిక లేకుండా చాటింగులు చేసుకుంటేనో అభిమానమున్నట్లు అనుకునేవారిని ఎవరు ఏం చేయలేరు. ఒక్కోసారి నిజంగా చాలా బాధ వేస్తోంది. టెక్నాలజీ ఎందుకు అభివృద్ధి చెందిందా అని. సమయం, సందర్భం లేకుండా మాటలు, వీడియెాలు, ఫోటోలు పంపేస్తారు. పోని అవేమన్నా ఉపయెాగకరమైనవా అంటే అదీ ఉండదు. ఎంత ఇరిటేషన్ అంటే ఎదురుగా ఉంటే నాలుగు పీకాలన్నంత. మళ్ళీ వాటికి తోడు రెస్పాన్స్ ఇవ్వడం లేదని ఇష్టం వచ్చినట్టుగా మాటలు. వీటికి తోడుగా ముక్కు మెుహం తెలియకపోయినా మెసెంజర్ కాల్స్.
ప్రతి ఒక్కరి సహనానికి ఓ హద్దు ఉంటుంది. అది చెరిగిపోతే మనం తట్టుకోలేం. అర్థంపర్థం లేని మెసేజ్లు, ఫోటోలు, వీడియెాలు వగైరాలు పెట్టి ఎదుటివారిని బాధించకండని సవినయంగా మనవి చేసుకుంటున్నా. ఇది నా వ్యక్తిగతం. ఎవరిని ఉద్దేశించి కాదు. నా మీద కారాలు మిరియాలు నూరకుండా అర్థం చేసుకుని, అర్థవంతమగా మెలగండి. విరక్తి వచ్చేటట్లు చేసుకోకండి.
నమస్కారం.
వర్గము
కబుర్లు
29, అక్టోబర్ 2020, గురువారం
ఆస్వాదన..!!
నేను స్వేచ్ఛాజీవిని
సర్దుబాట్లు దిద్దుబాట్ల
మధ్యన నలుగుతూ
కట్టుబాట్లు పాటించే
సంప్రదాయవాదిని
నేను రెక్కలు తెగిన పక్షిని
దిక్కులు తెలియని
అయెామయంలో పడి
గాలి వాటుకు కొట్టుకుపోతున్న
అమాయకపు ప్రాణిని
నేను స్వగతాన్ని
గుండెకు గాయాలెన్నౌతున్నా
జ్ఞాపకాల అలమరా తెరుస్తూ
కురిసే చినుకుల తడిలో
చుట్టుముడుతున్న బాల్యాన్ని ఆస్వాదిస్తున్నా...!!
వర్గము
కవితలు
27, అక్టోబర్ 2020, మంగళవారం
భూతల స్వర్గమేనా..31
పార్ట్..31
తర్వాత సంఘటనలు వేగంగానే జరిగిపోయాయి. మా AMSOL వాళ్ళు నన్ను మార్కెటింగ్ చేయడం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు పెద్దగా. ఎలాగూ నేనే మార్కెట్ చేసుకోగలనని వాళ్ళకు తెలుసు. కాకపోతే నేను ఎవరికి H1B చేయమన్నా కాదనేవారు కాదు. ఉష, వినయ్ గారు, రూఫస్, శ్రీనివాస్ గారేపల్లి ఇలా చాలా మందికి H1B చేసారు. నాకు బయట మార్కెటింగ్ వాళ్ళు చాలామంది తెలుసు. నివాస్ గారిని టెస్టింగ్ టూల్స్ నేర్చుకోవడానికి నరేంద్ర పరిచయం చేసాడు. శామ్ ని శ్రీనివాసరెడ్డి పరిచయం చేసాడు.
నాకు జాబ్ సిటిగ్రూప్, డాలస్ (డెల్లాస్) లో వచ్చింది. అప్పటికి నేను AMSOL కి చెప్పి వేరే కంపెని ద్వారా జాబ్ లో జాయిన్ అయ్యాను. కాకపోతే మధ్యలో వెండర్ TCS. అందుకే నేను జాయిన్ అవనని చెప్పాను. TCS మనీ సరిగా పే చేయరని, మీతో పని చేయడం ఇష్టం లేదని వాళ్ళకే చెప్పేసాను. అలా జరగకుండా చూసుకుంటామని చెప్పారు. 3 మంత్స్ ప్రాజెక్ట్ అది. డాలస్ లో శ్రీనివాస్,సంధ్యా వాళ్ళింటికి వెళ్ళాను. కార్సన్ సిటిలో నా మెుదటి ప్రాజెక్ట్ కొలీగ్ శ్రీనివాస్ గారేపల్లి. అప్పుడు వాళ్ళింట్లో శ్రీనివాస్ అమ్మానాన్నలు ఇండియా నుండి వచ్చి ఉన్నారు. ఓ వారం రోజులు వాళ్ళింట్లో ఉండి, వాళ్ళింటికి కాస్త దగ్గరలో మెాటల్ లో మరొక అమ్మాయు మధుతో కలిసి ఉన్నాను. శ్రీను వాళ్ళింట్లో ఉన్న వారం రోజులలో శ్రీను వాళ్ళ అమ్మగారు సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే తెలుగు సీరియల్స్ అలవాటు చేసారు. ప్రతిది అంతకు ముందు కత చెప్పి మరీ చూపించేవారు. నాకు భలే ఆశ్చర్యం వేసేది. ఏ స్టోరికా స్టోరి కన్ఫ్యూజ్ కాకుండా అలా ఎలా గుర్తుంచుకుంటారా అని. అంతకు ముందెప్పుడూ నాకు టి వి సీరియల్స్ చూసే అలవాటు లేదు రామాయణం,భారతం ఆదివారం చూడటం తప్ప. సినిమాలు మాత్రం చూసేదాన్ని.
సిటి గ్రూప్ లో నాతోపాటు డాని అనే అమెరికన్ జాయిన్ అయ్యాడు. మేమిద్దరము TCS ద్వారానే వచ్చాము. మాకు సపరేట్ కాబిన్స్ ఇచ్చారు మెుదట్లో. అంతా మీటింగ్స్, డిస్కషన్స్ ఉండేవి. మాకేమెా బోర్ కొట్టేది. తర్వాత నార్త్ ఇండియన్స్ TCS ఎంప్లాయీస్ కొంతమంది ఇండియా నుండి వచ్చారు. మమ్మల్నే వాళ్ళకు హెల్ప్ చేయమని చెప్పేవారు. వాళ్ళంతా ఓ బాచ్ లా ఉండేవారు. మాతోపాటు ఓ పాకిస్తానీ అతను, తమిళ్ అతను కూడా కలిసారు. తర్వాత డాటాబేస్ కి పెద్దాయన ఐరిష్ అతను డాన్ వచ్చారు. మాదంతా ఓ గ్రూప్ అన్నమాట.
జనం ఎక్కువైయ్యాక నేను, డానీ, డాన్, పాకిస్తాన్ ఆయన ఒకే రూమ్ లో వర్క్ చేసుకునేవారం. తర్వాత కాబిన్ లు ఎలాట్ చేసారు. ఎవరికి ఫోన్ వచ్చినా బయటకు వెళ్లి మాట్లాడుకునేవారు. నాకేం ప్రోబ్లం లేదు కాబట్టి నేను రూమ్ లోనే ఉండి మాట్లాడుకునేదాన్ని. డాని నవ్వేవాడు. నీకందరి లాంగ్వేజ్ వచ్చు, కాని నీ లాంగ్వేజ్ ఎవరికి రాదు అని. డాన్ కూడా నేనుండే మెాటల్ లోనే ఉండేవాడు. మెాటల్ నుండి సిటీ గ్రూప్ కి ట్రాన్స్ పోర్టేషన్ ఉండేది. నేను దానిలో వెళతానంటే డాన్ ఒప్పుకునేవాడు కాదు. రోజు తన కార్ లో తీసుకువెళ్ళి, తీసుకువచ్చేవాడు. ఆప్యాయంగా డచస్ యనమదల అని పిలిచేవాడు. సుడోకో బాగా ఆడేవాడు. పెన్సిల్ స్కెచ్ చాలా బాగా వేసేవాడు.
అందరికి ఒకటే పని ఉండే నాకు మూడు పనులుండేవి. కోడింగ్, టెస్టింగ్ లతోపాటు డాటాబేస్ ఫైల్స్ ఎవరికి కావాలన్నా నా అప్రూవల్ ఇవ్వాల్సి వచ్చేది. డాన్ డాటాబేస్ ఫైల్స్ రిక్వెస్ట్ ల ప్రకారం క్రియేట్ చేస్తే నేను అప్రూవల్ ఇవ్వాల్సి వచ్చేది. డాన్, డాని కి పెద్దగా పడేది కాదు. ఇద్దరికి మధ్యలో నేను సమన్వయం చేయడమన్న మాట. మాతో ఓ చైనీస్ ఆమె, మిగతా అందరు అమెరికన్స్ ఉండేవారు మా టీమ్ లో.
అమెరికన్స్ లో మంచి గుణాలు చాలా ఉన్నాయి. ఎవరు కనిపించినా చక్కగా గ్రీట్ చేస్తారు. మనం తెలియకపోయినా నవ్వుతూ పలకరిస్తారు. మనవాళ్ళే మనం కనబడితే తల తిప్పుకుపోతారు. పిల్లల గురించి కూడా ఓ విషయం చెప్పాలి. డాని కి ముగ్గురు పిల్లలని చెప్పాడు. నేను సొంత పిల్లలనుకున్నాను. కాదట ముగ్గురిని పెంచుకుంటున్నాడట. వాళ్ళ కోసం ఎంత కేరింగ్ గా ఉండేవాడో. డాని కూడా చిన్నవాడే. అయినా వాళ్ళకు ఏది తక్కువ కానిచ్చేవాడు కాదు. వాళ్ళకు ఇచ్చిన మాట కోసం జాబ్ పోతుందన్నా కూడా కేర్ చేయలేదు. వాడి మంచి మనసుకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పిల్లల కోసం త్వరగా వెళిపోతున్నాడని కోపం తెచ్చుకున్న మానేజర్ కోపాన్ని మేం తగ్గించి సర్దిచెప్పాము. లంచ్ కూడా మేం ముగ్గురం కలిసి చేసే వాళ్ళం. మధ్య మధ్య నార్త్ ఇండియన్ విశ్వనాథ్ వచ్చేవాడు మాతో కలిసి. నా కూరలేమెా బాగా కారంగా ఉండేవి. డాన్ కి ఇష్టమే కాని కారం తినలేకపోయేవాడు. TCS జనాలు మాత్రం బాగా కటింగ్ లు ఇస్తూ పెత్తనం మా మీద కూడా చేయాలని చూసేవారు. మేం అస్సలు పడనిచ్చేవారం కాదు. అలా మా వర్క్ సాగుతూ ఉంది.
మళ్లీ కలుద్దాం..
వర్గము
ప్రయాణం
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో కొత్త జాబ్ ... అన్ని దేశాల వారితో ప్రాజెక్ట్ ... అనుభవాలు ...
నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి, రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..
26, అక్టోబర్ 2020, సోమవారం
శిఖరాగ్రమంటే..!!
నాన్న చేయి పట్టుకుని
నడిపించినప్పటి
ఆనందమా
అమ్మ కొంగు చాటున
దాగిన చిన్నప్పటి
అమాయకత్వమా
ముసుగులను తొలగించిన
మనిషితనాన్ని చూసినప్పటి
మనోగతమా
గాయాల జ్ఞాపకాలను
గతానికి అమ్మేసినప్పటి
పనితనమా
కలతలను కలలుగా మార్చేస్తూ
అక్షరాలతో ఆడుకున్నప్పటి
ఆత్మస్థైర్యమా
చరిత్రలో మిగలకున్నా
చెదరని చిరునవ్వుకు
చిరునామాగా మిగలటమా..!!
వర్గము
కవితలు
కాలం వెంబడి కలం...25
మద్రాస్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడే మా మామయ్య కూతురికి పుట్టుకలోనే హార్ట్ లో మూడు హోల్స్ ఉండటంతో మద్రాస్ రామచంద్రా మెడికల్ హాస్పిటల్ లో నాన్న చూపించారు. 7వ నెలలో పాపను హాస్పిటల్ లో జాయిన్ చేస్తే ఓ నెల తర్వాత ఆపరేషన్ చేసారు. అమ్మావాళ్ళు హాస్పిటల్ కి, చిన్న బాబాయి వాళ్ళింటికి తిరుగుతూ ఉండేవారు. నేను కూడా హాస్పిటల్ కి వస్తూ, పోతూ ఉండేదాన్ని. పాపకు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఓ నెగెటివ్ బ్లడ్ అవసరమైతే చిన్న బాబాయి ఇచ్చారు.
పూర్ణచంద్రరావు గారికి నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు అమెరికా వెళ్ళడానికి పనికి వచ్చారు కాని నేను అమెరికా వెళ్ళడానికి పనికిరానని చెప్పి నాన్నతో గొడవ పెట్టుకున్నాడు. అది నాకు తెలియదు. బెంగుళూరులో ఇంటర్వ్యూ ఉందని చెప్పి వెళ్ళి రమ్మన్నారు. వెళ్ళి వీళ్ళ చుట్టాలైన జైపాల్ గారిని కలిసి, మా ఇంజనీరింగ్ రూమ్మేట్ శారదకి పాప పుడితే తనని చూసి మళ్ళీ మద్రాస్ వచ్చాక కాని నాకు అసలు విషయం తెలియలేదు.
పూర్ణచంద్రరావు అల్లుడు అలైడ్ ఇన్ఫర్మాటిక్స్ కంపెని CEO క్రిష్ కి ఫోన్ చేసి విషయం చెప్పి ఓ 1500 వదిలించుకోవడం తప్ప మరేం ఉపయెాగం లేకుండా పోయింది. ఈ విషయాలేవి మా రాధ పెదనాన్నకు చెప్పలేదు. వెంటనే జాబ్ వెదకడంలో పడ్డాను. నాన్న కూడా చూసి HIETవాళ్ళ KCG Electronics లో నెలకి 5000కి జాయిన్ అయ్యాను. ఓ నెల ట్రైనింగ్ అన్నారు. రెండు బాచ్లుండేవి. మాది మార్నింగ్ షిఫ్ట్. 8 నుండి 2.30 వరకు. అమ్మావాళ్ళు,మేము మాంగాడుతల్లి గుడికి వెళ్ళి, దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు పాపను తీసుకుని ఊరు వెళిపోయారు. నేను హాస్టల్ ఖాళీ చేసి వడపళని బాబాయి వాళ్ళింట్లో ఉండి రెండు బస్ లు మారి ఆఫీస్ కి వెళుతుండేదాన్ని. అద్దెఇల్లు చూడమని బాబాయితో చెప్పాను. మా ఆఫీస్ లో నాతోపాటు నా ఇంజనీరింగ్ క్లాస్మేట్ సుబ్బారెడ్డి కూడా జాయిన్ అయ్యాడు. ఫస్ట్ ఇంట్రడక్షన్ రోజు తనే గుర్తుపట్టాడు నన్ను. మాతోపాటుగా అక్కడే పరిచయమైన రాజగోపాల్ కూడా సొంత తమ్ముడిలా ఉండేవాడు. ఎక్కువ అందరు తమిళియన్స్ ఉండేవారు. రాజగోపాల్ కి తమిళ్ కూడా వచ్చు. షరా మామూలే మా బాచ్ లో నేనొక్కదాన్నే అమ్మాయిని. మా ముందు బాచ్ లో రెంజు, యాస్మిన్ నాకు మంచి ఫ్రెండ్స్. AS/400 వర్కంతా ఇక్కడే నేర్చుకున్నా. చాలా సరదాగా గడిచిపోయేది ఆఫీస్ వర్క్. కాకపోతే రెండు బస్ లు మారి రావడం బాగా కష్టంగా ఉండేది. బస్ లు బాగా రష్ గా ఉండేవి.
శ్రావణ మాసంలో నోము నోచుకోమని రాణి అక్క(మద్రాస్ చిన్న బాబాయి వైఫ్) అంటే, నాకు ఇష్టం లేకపోయినా మా ఆడపడుచుని అడిగితే, నీ అవసరాలన్నీ తీర్చుకుంటున్నావని అంది. ఇదే మాట రాణి అక్కకి ముందే చెప్పానిలా అంటుందని. అన్నా కూడా మామయ్య పూజ చేసుకోమని చెప్పారు. అమ్మావాళ్ళను పిలిచాను. మా భారతి అమ్మమ్మ, పసి అక్క, అమ్మా వాళ్ళు వచ్చారు. పూజ బాగా జరిగింది. రాఘవేంద్ర వాళ్ళ బావగారిని నేను మామయ్య అనే అనేదాన్ని. ఆయన ఫోటోలు కూడా తీయించారు. పూజ అయ్యాక అమ్మ బట్టలు తేలేదని వాళ్ళిద్దరికి డబ్బులు ఇవ్వబోతే, కూలి ఇస్తున్నారా అని గొడవ పెట్టుకున్నారు. అమ్మ బాధ పడుతూ వెళిపోయింది. తర్వాత నేను మద్రాస్ వెళిపోయాను.
మళ్లీ ఆఫీస్, వర్క్ మామూలే. రోజూ ఆ బస్ లలో వెళ్ళి రావడం బాగా ఇబ్బందిగా ఉండేది. తట్టుకోలేక ఓ రోజు రాజగోపాల్ మీద బాగా అరిచేసాను ఇల్లు చూస్తారా లేదా అని. మెుత్తానికి ఇల్లు ఆఫీస్ కి కాస్త దూరంగా దొరికింది. బస్ ఎక్కనక్కర్లేదు. బాబాయ్ వాళ్ళింట్లో ఉన్నప్పుడే అమ్మ కూడా వచ్చింది. రాఘవేంద్ర కూడా వచ్చి ఇల్లు చూసాక వస్తానని చెప్పి వెళ్ళాడు. అప్పటికి మా పెళ్ళి జరిగి సంవత్సరం. మౌర్య కడుపున పడ్డాడు. అప్పటికే బాగా సన్నగా ఉండేదాన్ని. దానికి తోడు బాగా నీర్సం. ఆ కోపంలో రాజగోపాల్, సుబ్బారెడ్డి ల మీద అరిచేసాను. పాపం వెంటనే ఇల్లు చూసేసారు. అమ్మా నేను కొత్తింటికి వచ్చాము. తర్వాత బాగా నీర్సం వచ్చి ఓ రోజు రాత్రంతా సెలైన్ పెట్టాల్సి వచ్చింది. నాన్న కూడా అప్పుడు నా దగ్గరే ఉన్నారు. బాబాయ్ వచ్చి చూసి వెళ్ళారు. డాక్టర్ నాన్న ఫ్రెండ్ వైఫ్.
ఇదుగో ఇల్లు చూడండి, వచ్చేస్తాను అని వెళ్ళిన మనిషి అడ్రస్ లేడు. మధ్యలో నాలుగవ నెలలో వర్షాలు బాగా పడ్డాయని, రాఘవేంద్ర వాళ్ళ అక్కాబావలకు జ్వరాలు వచ్చాయని తెలిసి చూడటానికి వెళ్ళాను. అమ్మానాన్న ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఓ పది రోజులు నాతో బాగా గొడవ పెట్టుకున్నారు. నన్నంట మా అమ్మకన్నా చాలా బాగా చూసుకుంటారట, జాబ్ మానేయాలట నేను. అప్పటి వరకు ఆవిడ ఎన్ని మాటలన్నా నేను ఎదురు తిరిగి ఏమీ అనలేదు. అప్పుడు కూడా మామయ్యతో అన్నాను. నాది, పిల్లల బాధ్యత మీరు తీసుకుంటానంటే జాబ్ మానేస్తానని. ఆయన వీళ్ళు ఇలాగే అంటారు, నువ్వు జాబ్ చేసుకోమ్మా అని చెప్పారు. అప్పటి వరకు ఆవిడ నన్ను చేసినవన్నీ అడిగేసానని ఆవిడ కోపంతో నన్ను ఇంట్లో నుండి వెళిపొమ్మంది. ఆయనేమెా ఇది నీ ఇల్లు నువ్వెప్పుడయినా రావచ్చని అన్నారు. నాకు అప్పటికి నాలుగో నెల. వాంతులు మెుదలయ్యాయి. ఆ పది రోజులు తిండి సరిగా లేదు. పక్కింటి ఉమక్క వాళ్ళు ఏదోకటి తినమనేవారు. ఈయన ఏం మాట్లాడకుండా అమ్మని వచ్చి తీసుకువెళ్ళమని చెప్పాడు. అమ్మానాన్న, నేను మద్రాస్ వెళిపోయాం. నాన్న వస్తూ, వెళుతూ ఉండేవారు. అప్పటి నుండి రాఘవేంద్ర రోజూ ఫోన్ చేయడం, డైవోర్స్ పేపర్స్ పంపిస్తాను, సంతకాలు చేసి పంపు అని చెప్పడం జరుగుతోంది.
మా ఇంటి పక్కనావిడ ముస్లిం. మనకా హింది అంతంత మాత్రమేనాయే. అమ్మ,ఆవిడ బానే మాట్లాడుకుంటూ ఉండేవారు. సాయంత్రం వచ్చాక మీ అమ్మ మాట్లాడింది నాకేం అర్థం కాలేదనేది. అమ్మ హింది బానే మాట్లాడేది. మా ఇంటివారు తమిళియన్స్. ఆయన పోలిసాఫీసర్. అప్పట్లో ఫోన్ ఇంటివాళ్ళదే లాండ్ లైన్ మాకు కూడా. ఈయన రోజూ ఫోన్ చేయడం, మేం మాట్లాడటం చూస్తూ వాళ్ళకి మన తెలుగు అర్థం కాకపోయినా, భావం అర్థం అయ్యేది. మా పక్కింటావిడకి మా ఆయన రాలేదని రోజూ క్యూరియాసిటి. అలా నాకు ఏడవ నెల వచ్చే వరకు రోజు ఇదే మాట ఫోన్ లో. ఓ రోజు అమ్మకు బాగా కోపం వచ్చి, పంపించు, సంతకం పెడుతుంది. దాని జీవితం నాశనమయ్యింది ఇంకేముందిలే అంటే, ఆ తర్వాత రోజు హైదరాబాదు నుండి ఫ్లైట్ లో దిగారు అయ్యవారు. మా ఇంటాయన పిలిచి అమ్మాయి చాలా మంచిది బాగా చూసుకో, కంటనీరు పెట్టించకు అని చెప్పారు.
పెళ్ళైన ఆరు నెలలకే ఓ అరవై ఏళ్ళ జీవితానుభవం వచ్చేయడం ఓ విశేషమే మరి.
వచ్చే వారం మరిన్ని కబుర్లతో...
వర్గము
ముచ్చట్లు
23, అక్టోబర్ 2020, శుక్రవారం
భూతల స్వర్గమేనా..30
పార్ట్.. 30
హ్యూస్టన్ ఎయిర్ పోర్ట్ లో దిగి కో ఆర్డినేటర్ చెప్పిన హోటల్ లో రూమ్ తీసుకున్నాము. వాడికి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసాను. డాక్యుమెంట్స్ అన్నీ రడీగా పెట్టుకుని మరుసటి రోజు ప్రొద్దుట 8 కంతా రడీగా ఉండమని చెప్పాడు. వెహికల్ వచ్చి పిక్ చేసుకుంటుందని చెప్పాడు. మరుసటి రోజు 7.30 కే రడీ అయ్యి కిందకి లాబీ లోనికి వెళ్ళాము. చాలా మంది మాలాంటి వాళ్ళు ఉన్నారక్కడ.ఇండియన్ ఒకావిడ ఫోన్ మాట్లాడుతోంది. ఎందుకో నాకు తెలిసిన వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుందనిపించింది. ఆమె ఫోన్ మాట్లాడటం అయ్యాక అడిగాను. నా గెస్ కరక్టే. నాన్న ఫ్రెండ్ సాంబశివరావు అంకుల్ కూతురు. వాళ్ళాయన వీసా స్టాంపిగ్ కోసం వచ్చారట.
మమ్మల్ని కొంత మందిని తీసుకుని వెహికల్ మెక్సికో బయలుదేరింది. అమెరికా, మెక్సికో బోర్డర్ దగ్గర ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని మెక్సికో లోనికి ఎంటరయ్యాము. వీసా స్టాంపిగ్ అయితే తప్ప మళ్ళీ అమెరికా భూభాగం లోనికి అడుగు పెట్టలేమన్న మాట. మమ్మల్ని అమెరికన్ ఎంబసి దగ్గర వదిలి వెహికల్ వెళిపోయింది. గేట్స్ ఓపెన్ చేసారు లోపలికి వెళ్ళి కూర్చున్నాము. మమ్మల్ని పిలిచినప్పుడు వెళ్ళి ఫింగర్ ప్రింట్స్ ఇచ్చి వీసా స్టాంపిగ్ ముందు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాము.
మా పేర్లు పిలిచి, కౌంటర్ నంబర్ చెప్పిన కౌంటర్ దగ్గరకి వెళ్ళాము. అక్కడ లేడి ఉంది. అడిగిన పేపర్స్, పాస్పోర్ట్ ఇచ్చాము. చూసి వీసా రిజెక్ట్ అయ్యింది. అవుటాఫ్ కంట్రీకి వెళ్ళమని చెప్పింది. నాకు కోపం వచ్చింది. పోస్ట్ లో వీసా స్టాంపిగ్ కి పంపితే అవుటాఫ్ కంట్రీకి వెళ్ళమంటేనే కదా ఇక్కడికి వచ్చామన్నాను. పక్క కౌంటర్ లో మరొకావిడతో మాట్లాడి మధ్యాహ్నం రమ్మన్నారు. సరేనని బయటికి వచ్చేసాం. బ్రోకర్ కి ఫోన్ చేసి విషయం చెప్పాను. మేం బయటికి వచ్చిన కాసేపటికే సాంబశివరావు అంకుల్ అల్లుడు కూడా బయటికి వచ్చాడు. మేం ఫోన్ కలక్ట్ చేసుకున్న చోటికి వచ్చాడు. ఏమైందని అడిగితే మధ్యాహ్నం రమ్మన్నారు. వీసా ఇస్తారో ఇవ్వరో తెలియదన్నాడు. ఇస్తారులెండి, మీరు కంగారు పడవద్దని చెప్పాము. మేం మళ్లీ లోపలికి వెళితే రేపు రమ్మన్నారు. అంకుల్ వాళ్ళ అల్లుడి ఫోన్ మా దగ్గర ఉండిపోయింది. నైట్ చాలా సేపు ఉన్నాము. ఇంకా రాలేదని మేము మెక్సికోలో హోటల్ లో రూమ్ తీసుకుని అక్కడికి వెళ్ళాము. ఎప్పటికో బ్రోకర్ కాల్ చేసి,వచ్చి ఫోన్ తీసుకువెళ్ళాడు. మరుసటి రోజు కూడా ఇదే తంతు. మధ్యాహ్నం రండి, తర్వాత రేపు రండి అని పంపేసారు. మీకు లాయర్ ఉన్నారా అని అడిగారు. లేరు కంపెనీ లాయర్ మాత్రమే ఉన్నారని చెప్పాను. AMSOL సుబ్బరాజు కి, లీగల్ వ్యవహారాలు చూసే బాల ఇటికిరాలకి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు విషయం చెప్తూనే ఉన్నాను. హోటల్ వాళ్ళకి సరిగా ఇంగ్లీష్ రాదు. మనకేమెా స్పానిష్ రాదాయే. ఏదో ఓలా, కోముస్తాస్ వంటి కాసిని పదాలే తెలుసాయే.
ఆ టైమ్ లోనే నాకు జాబ్ కి ఇంటర్వ్యూ వచ్చింది. టెక్నికల్ ఇంటర్వ్యూ ఫోన్ లోనే చేసాను. సెలక్ట్ అయ్యాను కూడా. నేను AMSOL తో పని చేసినన్ని రోజులు నా ప్రాజెక్ట్స్ నేనే చూసుకున్నాను. AMSOL లో చాలా మందిని జాయిన్ చేసాను కాని ఎప్పడూ ఒక్క డాలర్ కూడా తీసుకోలేదు. నాకు డబ్బులు సరిగా ఇవ్వకపోయినా ఏం అనలేదు.
రెండు రోజులయిన దగ్గర నుండి మా ఆయన టార్చర్ మెుదలయ్యింది. ఏదో నా తప్పు వలన వీసా ఇవ్వనట్టుగా. ఐదో రోజు లోపల రూమ్ లోనికి పిలిచి నా డాక్యుమెంట్స్ అన్ని మళ్ళీ చూసి చాలా ప్రశ్నలు అడిగారు. ఎలా ఇండియా నుండి వచ్చింది మెుదలు అంతా ఎక్స్ ప్లెయిన్ చేసాను. ఆఖరికి C1 వీసా ఇస్తామని చెప్పారు. నేను ఆవిడని యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ అనేసి బయటికి వచ్చేసాను. నిజంగా ఐదు రోజులు ఎంత నరకమమటే అంత నరకం. మెారల్ సపోర్ట్ లేదు. కంపెనీ నుండి హెల్ప్ లేదు. ఆఖరికి నా వీసా ప్రాసెస్ అయ్యాక లాయర్ ని పంపించమా అని అడిగారు. నిజంగా అమెరికన్ ఎంబసిలో కొందరు వేరే దేశాల వాళ్ళని కుక్కల కన్నా హీనంగా చూస్తారు.
నెల రోజులకు C1 వీసా తీసుకుని బయటికి వచ్చి, మెక్సికోలో మందు షాపింగ్ చేసాం. 2 బాటిల్స్ తకీలా వేరే అబ్బాయిని తీసుకుని వెళ్ళి తీసుకున్నాం. మెక్సికో బోర్డర్ దాటి హ్యూస్టన్ లో మళ్లీ అదే హోటల్ కి వచ్చి, మరుసటి రోజు ఫ్లైట్ లో హంట్స్విల్ చేరుకున్నాము.
అప్పటికే C1 వీసా ఇస్తే ఏం చేయాలో లాయర్ తోనూ, నాకు తెలిసిన వాళ్ళందరితోనూ మాట్లాడాను. బాలా తో కూడా మాట్లాడాను. నాకు మెుదటి నుండి జరిగిపోయిన దాన్ని గురించి పెద్దగా ఆలోచించడం అలవాటు లేదు. నెక్స్ట్ ఏం చేయాలని చూసుకుంటాను. నాకు గ్రీన్ కార్డ్ కి ఫైల్ చేసిన I 140 పనికిరాదు అమెరికాలో ఉండటానికి. I 485 ఫైల్ చేయాలి అదీ నెల లోపల. I 485 ఫైల్ చేయడానికి లేబర్, I 140 క్లియర్ అయ్యి కట్ ఆఫ్ డేట్ ఎవైలబుల్ ఉండాలి. C1 వీసా ఎక్స్పైర్ అయ్యే లోపల ఫైల్ చేయాలి. మామూలుగా అయితే C1 వీసాతో I 485 ఫైల్ చేయకూడదు. రాఘవేంద్ర ఫ్రెండ్ ఉదయకుమార్ తనకు తెలిసిన కంపెనీతో మాట్లాడి I 485 ఫైల్ చేయించడానికి అవసరమైన పేపర్ వర్క్ అంతా పంపమన్నారు. ఆ కంపెనీకి అప్పటికే మంచి పేరు లేదు. కాని తప్పదు మరో ఆల్టర్నేట్ లేదు. మెుత్తం పేపర్స్ అన్ని రడీ చేసి C1 వీసా ఎక్స్పైర్ అయ్యే ముందు పంపుదామని పోస్టాఫీస్ కి వెళ్ళి పోస్ట్ చేసి ఇంటికి వస్తుంటే, బాలా ఫోన్ చేసి మెుత్తం పేపర్స్ సెట్ AMSOL కి కూడా పంపమన్నారు. మళ్లీ పోస్టాఫీస్ కి వెళ్ళి ఆ పేపర్స్ బ్లాక్ పంపాను. సరిగ్గా రేపు C1 వీసా అయిపోతుందనగా మాకు I 485 కి ఫైల్ చేసినట్టు రిసిప్ట్ వచ్చింది. బ్లాక్ ఫోన్ చేసి చెప్పాను. మీకు స్టేటస్ ప్రోబ్లం ఏమీ ఉండదులెండి అని చెప్పారు. తర్వాత I 485 కి ఫింగర్ ప్రింట్స్ కి ఇంటర్వ్యూ వచ్చింది. తర్వాత I 485 డాక్యుమెంట్ వచ్చింది. బాలాకి చెప్పగానే ఇక మీకు ఇబ్బందేం లేదు లెండి అని చెప్పారు.
మళ్లీ కలుద్దాం...
వర్గము
ప్రయాణం
21, అక్టోబర్ 2020, బుధవారం
శ్రీ శ్రీ కళావేదికలో నా పరిచయం
శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ శ్రీ కత్తి మండ ప్రతాప్ గారి సారధ్యం లో శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న కవి తో ముఖాముఖీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మీకోసం...
యత్రనార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవతాః ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని మన భారతీయ సంస్కృతి.ఒక సాధారణ మధ్యతరగతి వ్యవసాయ నేపథ్య కుటుంబం లో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి కష్టాలను అవరోధాలను అధిగమించి ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూల పరిస్థితులుగా మలచుకుని తనను తానుగా మలచుకున్న ఆమె తీరు అమోఘం అద్బుతం. అలుపెరగని ఆదర్శమూర్తి.
ఆమె జీవిత మజిలీలో అక్షరమే తన ఊపిరి అంటున్న
" శ్రీమతి మంజు యనమదల" గారు.... జీవితం.కవితాప్రస్థానం ఈ రోజు ఆమె మాటలలో......
రమావతి: మేడమ్ మీ కుటుంబ నేపథ్యం. మీ విద్యాభ్యాసం వివరాలు చెప్పండి
మంజు : కృష్ణా జిల్లా జయపురం అనే పల్లెటూరు అమ్మమ్మ గారింట్లో పుట్టాను.నాన్నగారు యనమదల సుబ్బారావు గారు, టీచర్ గా పనిచేస్తూ రిజైన్ చేసి, వ్యవసాయం మీద మక్కువ తో వ్యవసాయం చేసేవారు.అమ్మ సామ్రాజ్యం గృహిణి. అవనిగడ్డ లో నేను2 నుండి 6వరకు చదువుకున్నాను. తరువాత వ్యవసాయరీత్యా విజయనగరం జిల్లాకు వెళ్ళిపోయాం అక్కడ జొన్నవలస గ్రామంలో పదవతరగతి వరకు గవర్నమెంట్ హైస్కూల్ లో, తర్వాత ఇంటరు మహరాజా కళాశాలలో విద్యనభ్యసించి బళ్ళారి విజయ్ నగర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసాను.
నేను ఏకైక సంతానం.
రమావతి: మీ వైవాహిక జీవితం వృత్తి వివరాలు చెప్పండి.
మంజు : నా భర్తగారు యార్లగడ్డ రాఘవేంద్రరావు. ఇద్దరు కుమారులు 1.మౌర్య చంద్ర.(ఆర్కిటెక్చర్)
2.శౌర్యచంద్ర.(ఇంటర్)
నా ఇంజనీరింగ్ అయిపోయాక బెంగుళూరు లో C.M.C లో AS/400 కోర్స్ చేసాను. మద్రాసు లో 2సంవత్సరాలు Software జాబ్ చేసా తరువాత బాబు పుట్టాక అవనిగడ్డ Polytechnic కాలేజీ లో లెక్చరర్ గా చేసాను. తరువాత అమెరికా లో దాదాపు 8సంవత్సరాలు సాఫ్ట్ వేర్ మరియు వివిధరకాల ఉద్యోగాలు చేసాను.మళ్ళీ ఇండియా కి తిరిగి వచ్చి హైదరాబాద్ లో అమెరికా కు చెందిన కంపెనీలో project quality manager గా చేసి కుటుంబ బాధ్యతలతో ఉద్యోగం మానేసా.తరువాత మళ్ళీ కొన్నాళ్ళు ఉద్యోగం చేసి ప్రస్తుతం ఆరోగ్యం బాగోక మానేశాను.
రమావతి : మేడమ్ కవిత్వం అంటే ఎలా ఉండాలి .వర్థమాన కవులకు మీరిచ్చే సలహాలు చెప్పండి( అంటే ఎంత నిగర్వంగా సమాదానం చెప్పారో )
మంజు: నాకు పెద్దగా సాహిత్యపు లక్షణాలు తెలియవు మూలాలు కూడా తెలియదు కేవలం రాయాలనే కోరిక తప్ప, మనసులోని భావాలను,గత జ్ఞాపకాలు, మౌన సంఘర్షణలే అక్షర రూపాలు. నాకు ఆరోగ్యం బాగోలేనపుడు నేను ఆనందంగానే ఉన్నాను అని ముసుగు వేసుకోవడానికి కూడా నా రచనలు ఉపయోగపడ్డాయి.కొత్తవారికి నేనిచ్చే సలహా ఎవరిని అనుకరించకండి మీ మనసులో ఉన్నది కాగితం మీద అక్షర రూపంలో పెట్టేయండి. మన కవితలు వేరే వారిని ఇబ్బంది పెట్టకుండా, సమాజం లో మార్పు తేలేకపోయినా హాని చేయకుండా ఉండాలి.
రమావతి: మేడమ్ మీకు కవితలు రాయడానికి ఎవరు స్పూర్తి మీ కవితా ప్రస్థానం వివరాలు చెప్తారా!
మంజు: నాకు 2వ తరగతి నుండి పుస్తకాలు చదపడం అంటే చాలా ఇష్టం.నేను 10 thలో చిన్న చిన్న కవితలు రాస్తూ ఉండేదాన్ని.నేను ఇంజనీరింగ్ లో ఉండగా నా స్నేహితులు నాకు తెలియకుండా ఆహ్వానం అనే సాహితీ పత్రికకు మౌనం అనే కవితను పంపించారు అది బహుమతి తెచ్చి 25/పారితోషకం కూడా ఇచ్చారు (నవ్వుతూ) అక్కడ నుండి నా రచనా వ్యాసంగాలు మొదలయ్యాయి. మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండేది కాదు రాయడం. నాకు ఆరోగ్యం బాగోలేనపుడు రచనలతోనే సేదతీరుతున్నానని అందరూ ఆహ్వానించారు. నేను అమెరికా నుంచి వచ్చాక పేదరికం తో చదువుకోలేని పిల్లలకోసం నా సన్నిహితుల సహకారంతో ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించాను. దానికోసం ఒక బ్లాగ్ ఓపెన్ చేసాను. సలహాలు-చిట్కాలు, కబుర్లు కాకరకాయలూ అనే బ్లాగ్స్ కూడా ప్రారంభించాను.మెల్లగా ఫేస్ బుక్ లో నా కవితా ప్రస్థానం మొదలయింది.
రమావతి: ఇంతవరకు మీరు రాసిన పుస్తకాలు వ్యాసాలు గురించి వివరించండి
మంజు:
1. అక్షర సాక్షిగా నేను ఓడిపోలేదు.
2.చెదరని శి(థి)లాక్షరాలు
3.అక్షర స(వి)సన్యాసం అనే కవితాసంపుటాలు
4.నా స్నేహితురాలు వాణి తో కలిసి గుప్పెడు గుండె సవ్వడులు అనే కవితాసంపుటి
5.సడిచేయని (అ)ముద్రితాక్షరాలు అంతర్లోచనాలు అను వ్యాస సంపుటాలు
6.ఏ'కాంతాక్షరాలు అనే లఘు కవితాప్రక్రియ 28 అక్షరాలను రెండు వ్యాక్యాలుగా చేసే ప్రక్రియ
ఇవి ముద్రితమైన పుస్తకాలు.
ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ అని నా అమెరికా అనుభవాలను ప్రచురిస్తున్నారు
రమావతి:శ్రీ శ్రీ గారి సాహిత్యం పై మీ అభిప్రాయం
మంజు: నా చిన్నప్పుడు నుంచి ఆయన సాహిత్యం చదివేదాన్ని ఆయనే నాకు ఇన్సిపిరేషన్. ఆయన కవితలు చదువుతుంటే మనకు తెలియకుండానే మనసు ఉత్తేజితమౌతుంది. శ్రీ శ్రీ గారి భావపదజాలం ఉత్ప్రేరకం లాగా సమాజం పై మన భాద్యతను తెలియజేస్తుంది.
రమావతి:సాహిత్యం లో ఇటీవల వస్తున్న నూతన ప్రక్రియలవలన ఏమైనా ఉపయోగం ఉందంటారా!
మంజు: ఉందండి అనేక ప్రక్రియలలో వివిధరకాల కవితలు రాయడానికి ప్రతి ఒకరు ప్రయత్నిస్తున్నారు. ఏ ప్రక్రియలోనైనా మంచినే తీసుకోవాలి. మరుగున పడిపోయిన సాహితీవేత్తలు కొత్తగా రాసే కవులు అందరూ ముందుకు వస్తున్నారు.
రమావతి: మేడం మీకొచ్చిన పురస్కారాలు అవార్డులు చెపుతారా!
మంజూ: నాకు అవార్డులు తీసుకోవడం ఇష్టం ఉండదు. నా ఆరోగ్యరీత్యా నేను ఎక్కడకు వెళ్ళలేను తప్పక మూడు అవార్డులు హైదరాబాద్ లో తీసుకోవలసివచ్చింది. గిడుగు రామమూర్తి గారి పౌండేషన్ ద్వారా ఒక అవార్డు వచ్చింది. సుధీక్షన్ ఫౌండేషన్ వారు, కవితాలయం గౌరవ పురస్కారం ఇచ్చారు. 2021 కి గాను ఐడియల్ ఉమన్ అవార్డ్ లివ్ అండ్ లెట్ లైవ్ ఫౌండేషన్ వారు ఎంపిక చేసారు.
వర్గము
కబుర్లు
20, అక్టోబర్ 2020, మంగళవారం
ఏక్ తారలు
1. మనసు మధనం అనంత సాగరం_పంచభూతాల సాక్షిగా...!!
2. సంద్రానికెంత ఓర్పో_నీలాకాశం దుఃఖాన్ని పంచుకోవడంలో...!!
3. మునగడమైతే మునిగాం_కాని బయటికెలా రావాలో తెలియడం లేదే...!!
4. శూన్యాన్నీ అలంకరించాయి అక్షరాలు_చతుర్ముఖుని చకితుణ్ని చేస్తూ..!!
5. పలకరించే మనసుకు తెలుసు_గుప్పెడు గుండె గుట్టేమిటో...!!
6. కాలానికే సాధ్యం_ఓపలేని కష్టాన్ని దాచేయాలంటే..!!
7. కల్మషం లేనిదే కాలం_కష్టసుఖాలను తనలో ఇముడ్చుకుంటూ...!!
8. అన్నీ ధన సంబంధాలే ఇప్పుడు_రక్త సంబంధాలను వెలి వేస్తూ...!!
9. అసంపూర్ణ ఆకారాలివి_ఆత్మీయతలెరుగని అనుబంధాలుగా మిగులుతూ..!!
10. కాలానికి తెలుసు సమాధానం_మనం ఎదురుచూడాలంతే..!!
11. మనసు తెలిసిన మాటలే అన్నీ_అక్షరాలతో చేరి మమతలందిస్తున్నాయిలా..!!
12. మనసు దాయలేని మౌనం_జారి పడుతోందిలా అక్షరాల్లో..!!
13. మాలిమి చేసుకోవడం తెలియాలంతే_మనసేంటి మరేదైనా దాసోహమే...!!
14. మాటలక్కర్లేకుండా మాయ చేస్తుంది_మనసు చాతుర్యమదేగా...!!
15. నటిస్తూనే ఉండాలి_చిరునవ్వు చెదరకుండా ఉండటానికి..!!
16. ప్రశాంతంగా ఉందనుకున్నా_ఏ చప్పుడూ లేని నిశ్శబ్దమని తెలియక...!!
17. నీ పరిచయం పాతదే_అక్షరార్చన అనుభూతే సరికొత్తగా ఇలా...!!
18. చెక్కిలినొదార్చేది కన్నీరేనేమెా_నెచ్చెలి ఎద బరువును దించడానికి..!!
19. ఎన్నో గురుతులు_నీకు మాత్రమే తెలిసేలా...!!
20. నీలోనే సమాధానముంది_ఆటుపోట్లు అవగతమైన జీవితం కనుక...!!
21. అహం ప్రదర్శనే అనునిత్యం_బాధ్యతల నుండి తప్పించుకు తిరిగేవాడికి..!!
22. నిజాన్ని అస్సలు తట్టుకోలేడు_బతుకంతా అబద్ధంలో బతికేవాడు...!!
23. మనసుకి భరోసానే_బాధ్యతలు మెాసే మనిషున్నప్పుడు..!!
24. మనిషి తత్వమే ఇదనుకుంటా_వద్దన్న బంధాల వెంట పరుగులిడుతూ.. !!
25. సాగించాలి సమరం గెలుపుకై_వెన్నుపోట్లకు ధీటుగా నిలబడుతూ...!!
26. అక్షరమెంత అనుభవశాలో_జీవితాల గెలుపోటములను సమంగా లిఖిస్తూ..!!
27. అనుభవాలన్నీ అక్షరాల్లోనే_మనసును తేలిక చేస్తూ...!!
28. శూన్యంలో వెదుకుతున్నా_అక్షరాలకు అందని భావాలను..!!
29. అనంతమైపోతున్నా_అక్షయమై అక్షరాల్లో ఇమిడిపోవాలని...!!
30. కాలం కలను వదిలెళ్ళింది_నన్నక్కడే ఉండిపొమ్మంటూ...!!
వర్గము
ఏక్ తార
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో వీసా ... అమెరికన్ ఎంబసి లో ముప్పు తిప్పలు ...
నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి, రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..
19, అక్టోబర్ 2020, సోమవారం
కాలం వెంబడి కలం..24
మా పెళ్ళైన రెండు నెలలకు మా మామయ్యకు కూతురు పుట్టింది. రాఘవేంద్ర వాళ్ళ అక్కకు యాక్టివా మీద వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయ్యింది. చెయ్యి నొప్పి చేసింది. చూడటానికి మా పిన్ని వచ్చింది. అంతకు ముందే స్కూల్ లో నా సీనియర్ మా మేనత్త కూతురు రాణి సూసైడ్ చేసుకుంది. చూడటానికి నేను, మా ఆడపడుచుతో కలిసి వెళ్ళాను. అమ్మా వాళ్ళందరు కూడా వచ్చారు. రాణి చాలా ఆత్మాభిమానం గల ఆడపిల్ల. తన పెళ్ళికి కూడ వెళ్ళాను. అత్తవారింట్లో మెుదట్లో కాస్త కోపతాపాలున్నా తర్వాత తను చాలా అడ్జస్ట్ అయ్యింది. ఓసారి పిన్ని వాళ్ళింటికి వెళితే, నన్ను చూడటానికి కూడా వచ్చింది. అత్తింటి వారు అందరు ఒకటై ఆ అమ్మాయిని ఒంటరిని చేసేసారు. తను చాలా ఇండివిడ్యువాలిటి ఉన్న మనిషి.తనని బాగా క్రిటిసైజ్ చేసారు అందరు. అయినా సరిపెట్టుకుని ఉంది. ఒంటికి, ఆరోగ్యానికి మంచిదంటే ఏ చిట్కా అయినా చేసేది. అలాంటి మనిషి ఒళ్ళు కాల్చుకుని చనిపోయిందంటే నాకు ఇప్పటికి అది నమ్మశక్యం కాని విషయమే. ఏం జరిగిందన్నది భగవంతునికి తెలియాలంతే. కల్లాకపటం తెలియదు, తన మనసులో ఏముంటే అదే మాట్లాడేది. ఇప్పటికి నా మనసు బాధ పడే సంఘటన అది. తనకి ఏ రకంగానూ మెారల్ సపోర్ట్ దొరకలేదు అన్నది నాకు అర్థం అయిన విషయం. ఆ సమయంలో మరో మాట ఎప్పుడు వినాల్సి వస్తుందేమెానని అన్న మా ఆడపడుచు మాట నాకు అర్థం కాలేదప్పుడు. నేను ఎంత సున్నిత మనస్కురాలినైనా పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కునే శక్తి నాకుందని ఆవిడకు తెలియదనుకుంటా.
ఆడపిల్లకు కష్టం వస్తే ఆదుకునే పుట్టిల్లు ఉండటం ఎంతైనా అవసరం. లోకం ఏమనుకుంటోందోనని ఆలోచిస్తే ఆ ఆడపిల్ల ఎంత వేదన పడుతుందో ఎవరికీ తెలియదు. ఆడపిల్లకు మంచికి, చెడుకి అక్కరకు రాని పుట్టినింటి వారు ఉన్నా లేనట్లే. ఆడపిల్లకు పెళ్ళి చేసి పంపేస్తే మన బాధ్యత తీరిపోదు. కష్టం వచ్చినప్పుడు గుండెల్లో దాచుకుంటేనే ఆడపిల్ల బతకగలుగుతుంది. నీకు మేమున్నామన్న భరోసా ఇవ్వగలగాలి. ఈరోజుల్లో పుట్టింటివారికి ఆడపిల్ల బాధ్యతను గుర్తు చేసినా కూడా పట్టించుకోని వారెందరో. కష్టం వచ్చిన ఆడపిల్లను సంప్రదాయం ప్రకారం పుట్టింటికి తీసుకువెళ్ళి నిద్ర చేయించడం కూడా మరచి తప్పించుకు తిరుగుతున్న ఎందరో పుణ్యాత్ములు ఈనాడు తారస పడుతున్నా నోరు మెదిపి ఏమి అనలేని దుస్థితి. ఇలాంటి కష్టం మాత్రం ఏ ఆడపిల్లకు రాకూడదని భగవంతుని కోరుకుంటున్నా.
మా మామయ్య కూతురు ప్రియకు అన్నం కాకాని లో పెట్టినప్పుడు నన్ను అమ్మ వచ్చి తీసుకువెళ్ళింది. ఈయనకు ముందే ఫోన్ చేసి చెప్పారు. ఫంక్షన్ కి వెళ్ళి వచ్చాకా మా ఆడబిడ్డ గారు పద్ధతి గురించి ఓ పెద్ద క్లాస్ తీసుకున్నారు. అలా ఓ ఆరు నెలలు వాళ్ళింట్లో ఉన్నాను. మధ్య మధ్య హైదరాబాదు వెళ్ళి వస్తూ. రాఘవేంద్ర వాళ్ళ బావగారు హైదరాబాదు వెళ్ళిరావడానికి డబ్బులిచ్చేవారు. రాఘవేంద్ర రొయ్యల చెరువులు కౌలుకి వేయడానికి వాళ్ళ అక్కని డబ్బులడిగితే ఇవ్వలేదు. బావగారేమెా పెళ్ళి చేయగానే బాధ్యత అయిపోయిందా! మంచి చెడు చూడాలి కదా అన్న మాటయినా అన్నారు. మా ఊరి పసి అక్క పాతికవేలు రాఘవేంద్రకు ఇచ్చే ముందు, ఇలా కావాలని అడిగాడు, అని చెప్తే తనే చూసుకుంటాడులే అని చెప్పాను. ఏ గొడవలయినా డబ్బులతోనే వస్తాయి అక్కా అని చెప్పాను. తర్వాత తను డబ్బులు రాఘవేంద్రకు ఇచ్చానని చెప్పింది.
నాకు మద్రాస్ లో జాబ్ నాన్న చూసారు. తనకు తెలిసిన వాళ్ళ దగ్గర. మా జయపురం చిన్న బాబాయ్ అక్కడే ఉంటారు. నన్ను చిన్నప్పుడు బాగా ఎత్తుకునేవారు. ఆఫీస్ ఓపెనింగ్ కి నేను, రాఘవేంద్ర మద్రాస్ వెళ్ళాము. తర్వాత మద్రాస్ హాస్టల్ లో ఆఫీస్ కి కాస్త దగ్గరలో ఉన్నాను. ఆఫీస్ తైనంపేటలో. మా హాస్టల్ టీ నగర్ లో. AS/400 ట్రైనింగ్ సెంటర్ అది. అలైడ్ ఇన్ఫర్మాటిక్స్. పూర్ణచంద్రరావు అని నాన్న ఫ్రెండ్ చూసుకునేవారు. వాళ్ళ అల్లుడు క్రిష్ అమెరికాలో Allied Informatics కంపెనీ CEO. మా రాధ పెదనాన్నకి చుట్టాలు. నన్ను AS/400 నేర్చుకోమన్న పెద్దమనిషీయన.
వచ్చే వారం మరిన్ని కబుర్లతో....
వర్గము
ముచ్చట్లు
17, అక్టోబర్ 2020, శనివారం
భూతల స్వర్గమేనా...29
పార్ట్..29
చాలా ఆలశ్యంగా పాస్పోర్ట్ రెన్యువల్ అయి వచ్చింది. మా కిరణ్ ఫ్రెండ్ అశ్విన్ ఓ రోజు ఫోన్ చేసి అక్కా నేను మెక్సికో వెళ్ళి వీసా స్టాంపిగ్ వేయించుకున్నాను. ప్రోబ్లం ఏమి రాలేదు అని చెప్పాడు. అక్కడ కాంటాక్ట్ చేయాల్సిన పర్సన్ వివరాలు ఇచ్చాడు. పిల్లల ఫోటోలు కూడా చూసుకునేదాన్ని కాదు. చూస్తే బెంగ వేసి పిల్లలను చూడటానికి వెళిపోవాలనిపిస్తుందని. చిన్నవాడిని ఇండియాలో వదిలి వచ్చాకా చాలా రోజులు పక్కలో చేయి వేసి వెదుక్కునేదాన్ని. వాడు పుట్టిన తర్వాత అప్పుడప్పుడూ, అప్పటికప్పుడు నాకు తెలియకుండానే నీర్సం వచ్చేది. బాగా మంచినీళ్ళు తాగేసి కాసేపు పడుకుంటే కాస్త తగ్గేది. మా డాక్టర్ కాకాని గారు కొన్నాళ్ళు చూసి థైరాయిడ్ డాక్టర్ దగ్గరకి పంపారు. అప్పటి నుండి థైరాయిడ్ టాబ్లెట్ మెుదలయ్యింది. తర్వాత నెమ్మదిగా వేరే హెల్త్ ప్రోబ్లమ్స్ మెుదలయ్యాయి. మెడ, చెయ్యి నొప్పి అని జనరల్ ఫిజీషియన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. B12 లెవెల్ చెక్ చేయించారు. బాగా తక్కువ ఉందని మెడికేషన్ ఇచ్చారు. ఓ వారం రోజులు రోజూ ఇంజక్షన్, తర్వాత వారానికి ఒకటి, ఆ తర్వాత 15 రోజులకు ఒకటి, తర్వాత నెలకి ఒకటి లైఫ్ లాంగ్ చేయించుకోవాలని చెప్పారు. చెయ్యి, మెడ నొప్పి తగ్గకపోవడంతో స్పెషలిస్ట్ ఫాంబ్రో కి రిఫర్ చేసారు. ఆయన చాలా సీనియర్ డాక్టర్. MRI తీయించి, లోపల ఫ్లూయిడ్ అయిపోయిందని చెప్పి, ఓసారి స్టెడాయిడ్ ఇంజక్షన్ చేసి చూద్దామని చెప్పి చేసారు. నాకు నొప్పి ఏమి తగ్గలేదు. ఫిజియెాథెరపి 20 రోజులు చేయించారు. హీట్ టీట్ర్మెంట్ కూడా చేసారు. అయినా ఏమి రిలీఫ్ రాకపోగా కాలర్ బోన్ దగ్గర ప్రోబ్లం అయ్యింది. మరోసారి స్టెరాయిడ్ ట్రై చేద్దామని చేసారు కాని అది కాస్తా భుజం దగ్గర మిస్ప్లేస్ అయ్యి, బ్లడ్ వచ్చి బాగా పెయిన్ వచ్చింది. మరోచోట చేసారు. ఓ 10 నిమిషాలయ్యాక చెయ్యి ఎత్తమని, ఇంక ఈ పెయిన్ తగ్గదు. సర్జరీలో కూడా 50%ఛాన్స్ ఉంది. చేయను అని చెప్పారు. ఆ రాత్రి నా జీవితంలో ఎప్పుడూ పడనంత బాధ అనుభవించాను ఆ ఇంజక్షన్ తో. ప్రసాద్ గారు ఆరోజు మాతో పాటు హాస్పిటల్ కి వచ్చారు. ఎప్పుడూ హాస్పిటల్ లోపలికి రాని మా ఆయన కూడ లోపలికి వచ్చారు. ఇంజక్షన్ చేసిన తర్వాత వీళ్ళు లోపలికి వచ్చారు. నాకు తెలియకుండానే కళ్ళమ్మట నీళ్ళు కారిపోయాయి. డాక్టర్ వదిలేస్తే కొడతావా నన్ను అంటే, అవునని తల వూపాను. ఇంటికి వచ్చాక ఈయన వర్క్ కి వెళిపోయాడు.
ప్రసాద్ గారు మధ్య మధ్య వచ్చి చూసి వెళ్ళుతున్నారు. నాకు సాయంత్రం అయ్యేసరికి పెయిన్ బాగా ఎక్కువై చెయ్యి కదిలించలేక పోయాను. భరించలేక మా గోపాలరావు అన్నయ్యకి ఫోన్ చేసాను. తను తీయలేదు. వెంటనే వదినకి చేసాను. వదినకి విషయం చెప్పాను. ఆ ఇంజక్షన్ అంత పెయిన్ ఉండదు. నీకు మిస్ ప్లేస్ అయ్యింది అని చెప్పింది. కాల్చిన ఇనుప చువ్వ గుచ్చితే ఎలా ఉంటుందో ఆ ఇంజక్షన్ చేసినప్పుడు, తర్వాత అంత నొప్పి ఉందని చెప్పాను. పెయిన్ ఎక్కడ నుండి వస్తుందో కనుక్కోవడానికి EMG test కూడా చేయించారు కాని పెయిన్ ఎక్కడ నుండి వస్తుందో కనుక్కోలేక పోయారు. ఇదంతా రామస్వామి దగ్గర 10 నెలలు పని చేసినప్పటి పుణ్యమని నాకు అర్థమయ్యింది. EMG test 3వ రౌండ్ కాస్త పెయిన్ ఫుల్ గా ఉంటుంది. ఎన్ని టెస్ట్ లు చేసినా, ఎన్నిసార్లు MRI లు తీసినా నా హెల్త్ ప్రోబ్లం కి సొల్యూషన్ దొరకలేదు.
నేను ఎక్కడికి వెళ్ళినా B12 ఇంజక్షన్ మంత్లీ చేయించుకోవడం జరుగుతూనే ఉంది. చాలామందికి మెక్సికో వెళితే వీసా స్టాపింగ్ అవుతోందని చెప్పారు. మా ఆయన మాటిమాటికి ఇండియా వెళతాననడంతో, ఇండియా వెళితే వీసా స్టాంపిగ్ ప్రోబ్లం అవుతుందనిపించింది. ఎలాగూ AMSOL కంపెనీ వాళ్ళు I 140 ఫైల్ చేసారు కదాని, మెక్సికో వీసా స్టాంపిగ్ కి వెళడానికి ప్రాసెస్ కంప్లీట్ చేసి, వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని, ఫ్లైట్ టికెట్స్ హ్యూస్టన్ కి తీసుకున్నాము. అక్కడి హోటల్ నుండి వీసా ప్రాసెస్ చూసే మెక్సికన్ అమెరికన్ ఎంబసికి ట్రాన్స్పోర్టేషన్ చూస్తాడు. డ్రాపింగ్, పిక్ అప్ అంతా చూసుకోవడానికి వాడికి మనీ పే చెయ్యాలి ముందే. అంతా పే చేసి, పేపర్స్ అన్నీ రడీ చేసుకుని, కంపెనీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి, హ్యూస్టన్ బయలుదేరాము. హంట్స్విల్ ఎయిర్ పోర్ట్ కి విష్ణు తన కార్ లో మమ్మల్ని డ్రాప్ చేస్తూ, మాటల్లో మారుతి అని తన ఫ్రెండ్ కూడా మెక్సికో వీసా స్టాంపిగ్ కి వెళితే అవలేదని చెప్పాడు. శౌర్య పుట్టిన తర్వాత మారుతి వీసా స్టాంపిగ్ అవలేదని ఇండియా వెళిపోవడం నాకూ గుర్తుంది. కాని మెక్సికో లో తనకి ప్రోబ్లం అయ్యిందని తెలియదు. ఒకింత అనుమానం మెుదలయ్యింది. ముందు చెప్తే బావుండేదిగా అన్నాను. సరే కాని ఏదయితే అది అవుతుంది అని బయలుదేరాం మెక్సికోకి.
మళ్లీ కలుద్దాం...
వర్గము
ప్రయాణం
14, అక్టోబర్ 2020, బుధవారం
ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు పుస్తక సమీక్ష
" తెలుగు సాహితీ లోకానికి సరికొత్త వెలుగు రవ్వలు సాగర వచనాలు "
రచనలు చాలామంది చేస్తారు, కాని కొందరి రచనలు మాత్రమే సాహితీ చరిత్రలో అజరామరంగా నిలిచిపోతాయి. విలక్షణమైన విషయాలను లక్షణంగా పాఠకులకు అందించడం కొందరికే సాధ్యం. ఆ కొందరిలో సాగర్ శ్రీరామ కవచం ఒకరు. సాగర్ గారి రచనల శైలి విభిన్నంగా ఉంటుంది. ఎవరు తీసుకోని సరికొత్త వస్తువులతో నవలలు, సాహితీ వ్యాసాలు రాయడంలో అందె వేసిన చేయి. ఇంగ్లీషు సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని అవపోశన పట్టిన విజ్ఞానగని. ఓ రచయితకు ఉండాల్సిన ముఖ్య లక్షణాలన్ని సాగర్ గారిలో నిండుగా మెండుగా ఉన్నాయి. ఆయన రచనలు చదువుతున్నప్పుడు మనం ఆయా పాత్రల్లో లీనమైపోతామనడంలో ఎట్టి సందేహము లేదు. ఇది మన కథేనా అన్న మీమాంస రాక మానదు. యాతన నవల చదివినప్పుడు...ఆ నవల ప్రభావం నుండి బయటకు రావడానికి చాలా సమయమే పట్టింది నాకు. మా నాన్నగారు యాతన చదువుతూ తన మనోభావాలనే రాశారని చెప్పడమే ఇందుకు సాక్ష్యం. వీరి రచనలు చదివిన పాఠకుడు ఎంతగా పాత్రలో లీనమైపోతాడో తెలియడానికి ఇదో ఉదాహరణ. దహనం, అవస్థ, యాతన వంటి సామాజిక, మనో వైజ్ఞానిక నవలలు అందించిన ఆ చేతి నుండి సాహిత్యం గురించి, రచన, రచయిత, భాష, విమర్శ వంటి విషయాలతో పాటుగా ఇప్పటి వరకు ఎవరు చెప్పడానికి సాహసించని సరికొత్త కోణంలో వస్తువు, శిల్పము, ప్రచ్ఛన్న వస్తుశిల్పాల తీరుతెన్నుల గురించి సోదాహరణముగా వివరించిన వ్యాసాల సమాహారమే ఈ " ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు " పుస్తకం. నిజమైన ప్రతిభకు పట్టం కట్టే రోజులు వస్తే ఈ పుస్తకం తెలుగు సాహితీ చరిత్రలో సముచిత స్థానాన్ని అందుకుంటుంది. తెలుగు సాహిత్యంలో ఓ నూతనాధ్యాయానికి నాంది పలుకుతుంది.
మూడు భాగాలుగా ఈ వ్యాస పరంపర కొనసాగుతుంది. మెుదటి భాగములో ప్రచ్ఛన్న వస్తుశిల్పాల గురించి వివరణాత్మక విశ్లేషణ చేసారు. సాహిత్యంలో ఒక వస్తువుని అనుసరించి మరో వస్తువు దానిని అనుసరించి శిల్పశోభితము ఉంటుందన్న సిద్ధాంతం ఉంది. కాని " ఒక వస్తువుని అనుసరించి మరో వస్తువు దానిని అనుసరించి సాగే శిల్పంతో సమాశ్రియంగా మరో ప్రచ్ఛన్న శిల్పం ఉంటుందని " ప్రతిపాదించి దానిని సోదాహరణముగా వివరించిన మొదటి వ్యక్తి సాగర్ శ్రీరామ కవచం గారు. ఈ ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు రచయిత పరిణితి మూలంగా , రచయితకు తెలియకుండానే కథలో కాని, కవిత్వంలో కాని మధ్యలో పుట్టి ముగింపుకి వచ్చేసరికి తారాస్థాయికి చేరుకుంటాయి. సాధారణ రాయిని ఉలితో నేర్పుగా, ఓర్పుగా చెక్కితే నలుగురు మెచ్చే అందమై శిల్పం ఎలా ఏర్పడుతుందో మనందరికి తెలిసిన విషయమే. దీనినే ఉదాహరణగా తీసుకుని కథలో, నవలలో,కవిత్వంలో వస్తుశిల్పాల ప్రాముఖ్యత, వాటి నుండి ప్రచ్ఛన వస్తుశిల్పాల ఆవిర్భావం ఎలా జరుగుతుంది, కవిత్వంపై ప్రచ్ఛన్న వస్తుశిల్పాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది తదితర అంశాలను సవివరంగా ప్రచ్ఛన వస్తుశిల్పాలు వ్యాసాలలో వివరించారు. నాణేనికి బొమ్మా బొరుసు ఎలా ఉంటాయెా అలాగే రచనకు వస్తుశిల్పాలని, వస్తువుకి నీడ ఉన్నట్టుగా, శిల్పానికి ఛాయ ఉంటుందని అవే ప్రచ్ఛన్న వస్తుశిల్పాలని సోదాహరణముగా తన వ్యాసాలలో వివరించారు. సాహిత్యంలో వస్తువు, శిల్పము మిధ్య కాదని చెప్తూ, అవి కనబడవు, తారసిల్లుతాయంటారు. ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రకి అనుగుణంగా రచన చేయాలంటే రచయిత ఒకానొక తపోస్థితికి చేరుకుని తాదాత్మ్యం పొందాలి. అప్పుడే ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్ర అనుభవమౌతుంది. వస్తు శిల్పాల సాధనలో రచయితలో పొడజూపే భావతీవ్రతే ప్రచ్ఛన్న వస్తుశిల్పాల విస్పోటనానికి కారణమౌతుంది. ప్రతి అద్భుత రచనలోనూ ఈ ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు రచయితకు తెలియకుండానే ప్రవేశించి ఆ రచనను పతాకస్థాయికి తీసుకువెళ్తాయి అని కన్యాశుల్కం, త్రిపుర భగవంతం కథలోనూ ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రను మనం గమనించవచ్చంటారు సాగర్ గారు. ప్రచ్ఛన్న వస్తుశిల్పాలపై విస్తృత పరిశోధనలు జరగడానికి విమర్శకుల సహకారం ఎంతైనా అవసరం ఉందంటారు.
రచనలో ప్రధాన వస్తుశిల్పాల పాత్ర బలహీనపడి, ఆ క్రమంలో ప్రచ్ఛన్న వస్తుశిల్పాల శకలాలు ఏర్పడి, వాటి పాత్రని క్రియాశీలకంగా నిర్వహించి, రచనకు అత్యుత్తమ స్థాయిని కలిగిస్తాయి. రచనాక్రమంలోప్రచ్ఛన్న వస్తుశిల్పాల శకలాలన్ని ఒకే రకంగా ఉండవు. బలమైనవి, బలహీనంగానూ, బలహీనమైనవి బలంగానూ, శైథిల్యావస్థలోనున్నవి కొన్ని బలపడి రచనను ముందుకు తీసుకుపోతే, మరికొన్ని కనబడకుండా పోతాయి. ఈ ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్ర రచయిత భావజాలానికి కేంద్రంగా పని చేస్తుంది.
రాయడానికి తీసుకున్న వస్తువుకి, వ్యక్తీకరించే శిల్పానికి మధ్యన శూన్యత ఏర్పడి ఆ రచనను ముందుకి సాగనివ్వదు. బలవంతంగా రాయాలని ప్రయత్నిస్తే సహజత్వం ఉండదు. ఈ స్థితి చాలామంది రచయితలకు అనుభవమే అయివుంటుంది. అలాంటి సమయంలో ఓ ఆలోచనా మెరుపుతో తిరిగి మెుదలైన రచనలో అంతకు ముందున్న వస్తుశిల్పాల స్థితిగతులు మారతాయి. దానికి కారణం రచయితకు తెలియకుండా ప్రవేశించే ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు. రచయిత చేతిలో కీలుబొమ్మలుగా మారకుండా, మెాతాదుకు తగినట్టుగా ఈ ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు ఉంటే మనకు రచన మాత్రమే కనబడుతుంది. రచయిత ఆ రచనలో కనిపించడు. అదే రచన తనంతట తానుగా వచ్చి రాయించుకుంటే, నేరుగా ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు ఆ రచయితను ఆవహించి తమ పాత్రకు న్యాయం చేసి వెళిపోతాయి. ఈ స్థితి రచయితకు, ఆ రచనకు అత్యుత్తమం.
" వస్తువు శకలాలుగాను, శిల్పం శకలాలుగాను కేంద్ర స్థానం నుండి తప్పుకుని ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్ర పోషిస్తాయని " సాగర్ గారు చెప్తున్న సూత్రీకరణపై రాబోయే కాలంలో చర్చలు జరగడం అవసరం కూడాను.
రచన పరిపుష్టిలో ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రను వివరిస్తూ " వస్తువు రూపము, స్వభావముతో పాటుగా భౌతిక, రసాయన నియమాలననుసరించి అస్తిత్వం ఉంటుందని, ఒక రూపం నుండి మరో రూపానికి మారుతుందని చెప్తూ, పరిణామం చెందడం ద్వారా వస్తువు తన స్థితిని మార్చుకుంటూ లక్షణాలను కూడా మార్చుకుంటుందని నీరు గడ్డ కట్టడం, బాగా వేడి చేసినప్పుడు ఆవిరిగా మారడం ఉదాహణగా చెప్తూ, వస్తువు పరిమాణాత్మక స్థితి నుండి గుణాత్మక స్థితికి చేరుకుంటుందని వివరిస్తారు. వస్తువుకుండే సంకేతాలను, ఆ సంకేతాలు వివిధ భాషలలో వివిధ రకాలుగా ఉంటాయని, వాటికి లిఖితపూర్వక గుర్తింపు, ఉఛ్ఛారణలో పదాలుగా మారడాన్ని సాంకేతికాలు అంటరాని, సాంకేతికాలు సాంకేతీకరణాలు కావడాన్నికూడా తన వ్యాసాలలో వివరించారు. నిజానికి భాషలో వస్తువులుండవట. వస్తువుకి సంబంధించిన భావనలు మాత్రమే ఉంటాయంటారు. వస్తు జ్ఞానం భాషపై ఆధారపడి ఉంటుందని, సమాజ అభివృద్ధికి అనుగుణంగా వస్తువు రూపొందిన్చబడిందని, రచయిత ఒక వస్తువును ఎంచుకునే క్రమంలో ఆ వస్తువుకుండే ద్వంద్వ స్వభావాన్ని గుర్తెరిగి రచన చేయాలని, ప్రతి రచనా సమాజహితానికే అయివుండాలని ఓ హెచ్చరిక కూడా చేస్తారు. భాష బతికి బట్ట కట్టాలంటే ఎన్నో అవసరాలు, సంఘర్షణలు తప్పవంటారు.
" వస్తువు నాశనం అవడం వలన గాని, రూపాంతరం చెందడం వలన గాని భాష ఉనికి ప్రశార్థకమౌతోందని, అందువలన సాహితీకారులు తమ సాహిత్యం ద్వారా వస్తువు ఉనికిని కాపాడాలని చెప్పారు. ఒకే వస్తువుని తీసుకుని పలువురు కవిత్వం చెప్పడం మూలంగా వస్తువు అసలు స్వభావం పోతుందని చెప్పడం గమనార్హం.
సరికొత్త వస్తువునెంచుకుని, దాని స్వభావాన్ని గమనించి కవిత్వం చెప్పడం ద్వారానే కవి ప్రతిభ బయట పడుతుందని, వస్తువు ముడి సరుకు మాత్రమేనని, దానితో పాటుగా అనేక ఇతర వస్తువుల సహాయ సహకారాలు అవసరమని చెప్తూ, కేవలం వస్తువుని ఎంచుకోవడంతోనే సరైన కవిత్వం ఎవరు రాయలేరని చెప్పారు. విస్తృత వస్తువు రచనాక్రమంలో శకలాలుగా విడిపోయి, వాటి నుండి ప్రచ్ఛన్న వస్తువులు ఏర్పడి, రచన నిర్మాణంలో ప్రధాన వస్తువుని మించిపోయి, రచనను సంపూర్ణంగా ఆక్రమిస్తాయి. దీని మూలంగా రచన అద్భుతస్థాయిని చేరుకుంటుంది. అది రచయితకు తెలియకుండా జరిగిపోతుందంటారు.
ఒక వస్తువుని ఆవిష్కరించే ఆలోచన క్రమాభివృద్దే శిల్పం. వస్తువుకి ప్రాణం పోసేది శిల్పం. కవిత ఆరంభంలోనే ఆయువుపట్టుగా మారుతుంది శిల్పం. సక్రమ శిల్ప నిర్మాణం లేని కవితలో జీవముండదు. ఇక్కడ శిల్పానికి, వ్యక్తీకరణకి భాష ప్రధానం. భాష నుండే సరైన శైలి సాధ్యమని, సాహిత్యంలో సమాజ హితానికి భాషను సక్రమంగా వాడాలని, రచన చేసే ముందు రచయితకు సమాజ స్థితిగతుల పట్ల సరైన అవగాహన అవసరమని, సాహిత్యంలో భాషకు భావం కూడా ముఖ్యమేనని ఇలా చాలా విషయాలు తన వ్యాసాలలో చర్చించారు. సాహితీకారులకు తగు సూచనలు కూడా చేసారు. శిల్ప సాధన కోసం పేరున్న కవులను అనుకరించవద్దని, వేరే వారి రచనలు తమ రచనలుగా చెప్పుకోవడం మంచి పద్ధతి కాదని, ఆ రచనలు ఎక్కువ రోజులు మనలేవని కూడా చెప్పారు. శిల్ప సాధనకు అభ్యాసం ముఖ్యమని, శిల్పమంటే అవగాహన అని, కవిత్వం ప్రయత్నించి రాయడం కాకుండా, తనంతట తానుగా వచ్చి రాయించుకునే కవిత్వం, చక్కని శిల్పంతో శోభిల్లే కవిత నాలుగు కాలాలు నిలబడుతుందని, దీనికి కవికి నిజాయితీ ముఖ్యమని అంటారు. ఎక్కువ పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో విషయాలు తెలుకోవచ్చని చెప్పారు. నిజమే కదా అది.
వస్తు సాకారమంటేనే ప్రచ్ఛన్న వస్తుశిల్ప సౌందర్యం, దీనిని గురించి విమర్శకుడు రచయితకు సరైన అవగాహన కల్పిస్తే ఆ రచన చక్కగా పండుతుందంటారు సాగర్. వస్తువు స్వభావాన్ని, ప్రవృత్తిని, నిర్మాణ, పునర్నిర్మాణాన్ని, ప్రచ్ఛన్న వస్తుశిల్పాల సాధనలో అంతర్వాణి పాత్రను, మేధస్సును కూలంకషంగా చర్చిస్తారు.
ప్రచ్ఛన్న వస్తుశిల్పాల గురించి చర్చించేటప్పుడు వస్తువు బాహ్యముఖీనం. శిల్పం అంతర్ముఖీనమని మరువకూడదని, బంగారం నగగా రూపాంతరం చెందే క్రమంలో జరిగే విధానమే రచనలో ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రని, వస్తువుకి పాజిటివ్, నెగెటివ్ ఛాయలే కాకుండా తటస్థ ఛాయలుంటాయని, రచయిత పదాల దానకర్ణుడంటూ, ఆ పదాల కూర్పుతో కావ్యముగా మలిచే క్రమంలో ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు కనబడకుండా తమ పని తాము చేసుకుపోతాయి. రచన పూర్తయ్యాక అది చూసి రచయితే ఆశ్చర్యానికి గురౌతాడు. రాయించేది రామభద్రుడట అన్న చందాన. ఇప్పటి సాహిత్యానికి ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రని అధ్యయనం చేయడం కనీసావసరమని సాగర్ ఘంటాపథంగా చెప్తున్నారు.
రెండవ భాగమైన సాగర వచనంలో రచన ఎలా ఉండాలి, రచయిత లక్షణాలేంటి, రచనలను పాఠకులకు అందిచడంలో పత్రికల పాత్ర తదితర అంశాలను సవివరంగా వివరిస్తారు. రచనను ఓ క్రియాశీలక సృజనాత్మక కార్యాచరణగా అభివర్ణిస్తారు. విమర్శకుల కోణంలో కవిత్వం రెండు పార్శ్వాలుగానే ఉందని చెప్తూ, బాహ్యముఖీన,అంతర్ముఖీన కవిత్వమే కాకుండా, మూడో పార్శ్వమైన రహస్యముఖీన తత్వాన్ని తెలివైన పాఠకుడు ఆస్వాదిస్తాడంటారు. అనుసరణకు, అనుకరణకు తేడా వివరిస్తారు. అనుకరణ తప్పని చెప్పకపోవడం సాహిత్య దోషమని నొక్కి వక్కాణించారు. మహిళా ఉద్యమాలు, స్త్రీ ఉద్యమాల ఆవశ్యకత గురించి, మహిళకు, స్త్రీ కి గల చిన్న తేడాని చూపిస్తారు. మంచి సాహిత్యం మాత్రమే భాషని బతికిస్తుందని, అంతరించిపోతున్న భాషను రాత ద్వారా కూడా బతికించుకోవాలని, సాహిత్యం లేని భాష సజీవభాషగా మనలేదని, సాహిత్యము, విమర్శ వేరు వేరు కాదని, గొప్పదనం రచనదే కాని రచయితది కాదని, అలా కాకుండా ఆ రచన గొప్పదనాన్ని రచయిత ఆపాదించుకుంటే, ఆ కీర్తి కిరీటంతో అక్కడే ఆగిపోతాడన్న హెచ్చరిక కూడా ఉంటుంది.
" అనుభూతి యెుక్క తీవ్రస్ధాయిా బేధాలే కవిత్వం " అని అంటూ శక్తి రూపాలను గుర్తు చేస్తూ, సాహిత్యంలో భౌతికశాస్త్ర నియమాన్ని E =mc² ను కవిత్వ వస్తు శక్తిగా వివరించడం, రచయితలు, పత్రికలు ఏ కాలంలోనూ ఓడిపోలేదని, సాహిత్యంలో గురుశిష్యుల అనుబంధాన్ని, వాస్తవాలను పాఠకులకు చేరవేయడంలో రచయిత అనుసరించాల్సిన పద్ధతులు, విమర్శనకారుల రూపంలో ప్రవచనకారులు సమాజంపై చిమ్మే విషాన్ని అరికట్టాలంటారు. అపసవ్య మార్గంలో పోతున్న సమాజానికి సద్విమర్శ మేలు చేస్తుందంటూ, ఈనాడు తప్పు దారిలో అభ్యుదయవాదులమని చెప్పుకుంటూ ప్రభుత్వ ఫండ్స్ బోలెడుమంది నొక్కేస్తున్నారన్న బాధను వ్యక్తపరిచారు. కవి కాని, కవిత్వం కాని సమాజాన్ని మారుస్తాయన్న ఆశాభావం వీరి వ్యాసాల్లో కనిపిస్తుంది.
విభిన్న అంశాలతో మూడవ భాగంలో అస్తిత్వవాదం గురించి, వర్తమాన విమర్శ గురించి, వస్తు శిల్పాల గురించి, పోస్ట్ మెాడ్నరిజం సిద్ధాంతం గురించి, విమర్శ లేకుండా పాఠకుడు ఉండడు, రచయితా - విమర్శ వేరు కాదని చెప్తూ, సాహిత్యానికి విమర్శ అవసరాన్ని వివరిస్తారు.
ఓ నిజమైన సాహితీకారుడు తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఈ వ్యాసాల నిండా ఉన్నాయి. నా వరకు నాకు ఇవన్ని చాలా అమూల్యమైన అక్షర సంపదే. ఎందుకంటే ఏ సాహితి లక్షణాలు తెలియకుండా రాసే నాకు ఓ రచన వెనుక ఇంత యుద్ధం చేయాలా అని ఆశ్చర్యం వేసింది. ఓ రచన ఎలా ఉండాలి, ఆ రచన చేయడానికి కావాల్సిన ముడి సరుకు, అలంకారాలు, రచయితకు ఉండాల్సిన లక్షణాలు, వస్తువు పై అవగాహన, భాషపై పట్టు, సమాజం పట్ల అంకితభావం, సాహిత్యాన్ని భౌతిక, రసాయన శాస్త్రాలతో కలిపి తాత్విక లక్షణాలను రచయితలు ఎలా ఆపాదించుకుంటారో, సంపూర్ణ రచన ఎలా వెలువడుతుందో మెుదలైన విషయాలన్నింటిని " ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు " వ్యాసాలలో వివరించారు. ప్రచ్ఛన్న వస్తుశిల్పాల గురించి వివరణలు, విశ్లేషణలు రాబోయే సాహితీ తరాలకు ఎంతయినా అవసరం. ఈ ప్రతిపాదనలను అంగీకరించడం, వీటి మీద విస్తృతమైన పరిశోధన చేయాల్సిన ఆవశ్యకత మన తెలుగు సాహితీకారులకు ఉంది.
ఈ పుస్తకం గురించి నాదైన మాటలో చెప్పాలంటే..
" కవిత్వానికి వస్తువు జ్ఞానమైతే శిల్పం ఆత్మ వంటిది."
తెలుగు సాహిత్యానికి ఏం కావాలో తెలియజెప్పిన అక్షర మణిహారం " ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు " పుస్తకాన్ని అందించిన సాగర్ శ్రీరామ కవచంకి హృదయపూర్వక అభినందనలు..
పుస్తకం కావాల్సిన వారు సంప్రదించాల్సిన నెంబరు
9885473934
వర్గము
సమీక్ష
13, అక్టోబర్ 2020, మంగళవారం
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో హెల్త్ ప్రోబ్లమ్స్ ... స్టెరాయిడ్ మిస్ప్లేస్ ... జీవితంలో ఎప్పుడూ పడనంత బాధ ...
నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి, రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో హెల్త్ ప్రోబ్లమ్స్ ... స్టెరాయిడ్ మిస్ప్లేస్ ... జీవితంలో ఎప్పుడూ పడనంత బాధ ...
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో హెల్త్ ప్రోబ్లమ్స్ ... స్టెరాయిడ్ మిస్ప్లేస్ ... జీవితంలో ఎప్పుడూ పడనంత బాధ ...
12, అక్టోబర్ 2020, సోమవారం
కాలం వెంబడి కలం.. 23
పెళ్ళైన మూడో రోజో, నాలుగో రోజో నాకు సరిగా గుర్తు లేదు కాని.. రాఘవేంద్ర బావగారు ఓ పుస్తకం నా చేతికిచ్చి రాఘవేంద్రకి ఇమ్మన్నారు. ఏముందా అని చూసాను. వాళ్ళు మా పెళ్ళికి ముందే ఈ ఇల్లు కొనుక్కున్నారు. ఇల్లు బాగు చేయించడానికి, కరంట్ బల్బులు, రంగులు వగైరా ఖర్చులు అన్నీ ఉన్నాయి దానిలో. నాకెందుకని రాఘవేంద్రకు చూపించాను. ఏంటివి అంటే తనేం మాట్లాడలేదు. నాకెందుకులే అని నేనూ వదిలేసాను ఆ విషయాన్ని.
నాకు అప్పటి వరకు ఒకే మనిషి రెండు రకాలుగా ప్రవర్తిస్తారని తెలియదు. మనం మంచివాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మనతో బావుంటూనే, మన ముందో మాటా, వెనుకో మాటా మాట్లాడతారని అస్సలు అనుకోం కదా. పెళ్ళికి ముందు నా ప్రపంచం వేరు. పెళ్ళైన తర్వాత అంతా మారిపోయింది. అంతకు ముందెప్పుడూ ఇంట్లో కాని, చదువుకునేటప్పుడు హాస్టల్ లో కాని ఎక్కడా ఒక్కదాన్నే ఉండలేదు. నేను అమ్మానాన్నలకు ఒక్కదాన్నైనా ఎప్పుడూ ఒంటరినని ఫీల్ కాలేదు. అందరి మధ్యలో పెరిగాను. వీళ్ళు అందరు ఉన్నా ఎవరికి వారే. రాఘవేంద్ర వాళ్ళ బావగారు పొద్దున్నే రైస్ మిల్ కి వెళిపోయేవారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేవారు. కాసేపు ఆ మాటా ఈ మాటా మాట్లాడేవారు. అక్క చల్లపల్లి లో టీచర్. వంట చేసి బాక్స్ తీసుకుని వెళిపోయేది. మా ఆయన పొద్దున వెళితే ఏ అర్ధరాత్రో రావడం. అప్పుడప్పుడూ ఇంట్లో ఉండటం. నాకేమెా కాస్త ఇంటి పని, అప్పుడప్పుడూ వంట చేయడం మెుదలయ్యింది. వంట అసలు రాదు. కాఫీ మాత్రం పెట్టేదాన్ని. పసి అక్క బావగారితో వినాయక చవితికి పిండి వంటలు, నాకు, రాఘవేంద్రకి బట్టలు పంపించింది. పసి అక్క ఎక్కువగా రావడం మా ఆడపడుచు కి ఇష్టం ఉండేది కాదు. అమ్మ పసి అక్కతో నా చీరలన్నీ, రెండు బంగారు గాజులు, నేను దాచిన చిల్లర బాక్స్ ఇచ్చి పంపింది.
మా ఎదురింటి బేబమ్మ పరిచయమైంది. ఆవిడకు మెుదట్లో నేను నచ్చలేదట. ఎందుకీ0పిల్ల ఇలా పెళ్ళి చేసుకుంది అని. తర్వాత తర్వాత నా మాటలు నచ్చి, బాగా దగ్గరైంది. ఆ ఊరిలో నాకెవరు తెలియదు. మా మేనత్తది కూడా ఆ ఊరే కాని ఆ టైమ్ లో వాళ్ళు లేరు. పిల్లలు మా పక్కింటి ఉమక్క వాళ్ళింటికి వచ్చినా నన్ను పలకరించేవాళ్ళు కాదు. మమ్మల్ని చిన్నప్పుడు జయపురం నుండి పచ్చ వాన్ లో స్కూల్ కి తీసుకెళ్లిన సుబ్బారావు మా చిన్నప్పటి పరిచయాన్ని మర్చిపోకుండా నన్ను చూడటానికి ఇంటికి వచ్చి కాసేపు మాట్లాడి వెళిపోయారు. చిన్నప్పటి ఫ్రెండ్ లాల్ కిషోర్ కూడా వచ్చి వెళ్ళాడు. మా రాణి అక్క, నాగభూషణం మామయ్య వాళ్ళకు ఎవరో నా పెళ్ళి గురించి చెప్పారట. నేనిలా పెళ్ళి చేసుకున్నానని నమ్మలేక పోయారట. నరశింహాపురం ఇంటికి వెళ్ళి నాన్నతో మాట్లాడి, మంజు దగ్గరకి వెళ్తామంటే సరేనన్నారట. నా దగ్గరకి వచ్చినప్పుడు మా పెద్దాడపడుచు ఇంట్లోనే ఉంది. ఏంటమ్మాయ్ ఇలా చేసావు? నువ్విలా చేసావంటే నమ్మలేకపోతున్నామన్నారు. పరిస్థితులు అలా వచ్చాయక్కా అని చెప్పాను. నాగాయలంక సుబ్బారావు అంకుల్, ఆంటీ కూడా వచ్చి ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళారు.
అమ్మతో అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉండేదాన్ని ఫోన్ లో. చల్లపల్లి టెలీఫోన్ బూత్ లక్ష్మణ, వాళ్ళ ఓనర్ గారు ఈ విషయంలో అమ్మకు, నాకు బాగా హెల్ప్ చేసారు. అప్పట్లో డైరెక్ట్ STD ఉండేది కాదు. వీళ్ళకు ఫోన్ చేస్తే కలిపేవారు. నాన్న ఫోన్ బిల్ కట్టడానికి వెళ్ళినప్పుడు అమ్మ బిల్ చెప్పమంటే చెప్పలేదు. నాకు తెలుసు చెప్పండి ఎంత అయ్యిందో అన్నా కూడా వాళ్ళు బిల్ తీసుకోలేదు. నా పెన్ ఫ్రెండ్ లలితను కలవడానికి రాఘవేంద్ర నన్ను విజయవాడ తీసుకు వెళ్ళినప్పుడు రాణి అక్క వాళ్ళింటికి కూడా వెళ్ళాను. నాకు బాగా గుర్తు అప్పుడు రాణి అక్క వద్దన్నా వినకుండా తన మారేజ్ డే కి కొనుక్కున్న చీర నాకు పెట్టింది. పరిచయం కొద్ది రోజులే అయినా ఇంటి ఆడపిల్లలా చూసేవారు. తర్వాత నాగాయలంక అంకుల్ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు అమ్మ, పసి అక్క అక్కడికి వచ్చారు. అదే అమ్మని అన్ని రోజుల తర్వాత చూడటం. ఎంత సంతోషమనిపించిందో. అమ్మ బాగా చిక్కిపోయింది అప్పటికి. ఆ రాత్రంతా కబుర్లు చెప్పుకున్నాం.
నేను పెళ్ళికి ముందు గజపతినగరంలో లెక్చరర్ పోస్ట్ కి అప్లై చేసాను. అది ఇంటర్వ్యూ కార్డ్ ఇంటికి వస్తే, మా లక్ష్మి అక్క వాళ్ళ అబ్బాయి రమణకు ఇచ్చి మా ఆడపడుచు వాళ్ళింటికి పంపించారు. ఆ టైమ్ లో నేను హైదరాబాదు వెళ్ళాను. అమ్మకు ఫోన్ చేస్తే ఈ విషయం చెప్పింది. వెంటనే మా ఆడపడుచుకు ఫోన్ చేసి,కార్డ్ పంపారట కదా, చెప్పలేదేంటి? ఇంటర్వ్యూ ఎప్పుడు అని అడిగితే రేపే ఇంటర్వ్యూ. అయినా నువ్వు లెక్చరర్ పోస్ట్ కి పనికిరావని చెప్పలేదు అంది. అది నేను ఇష్టపడి అప్లై చేసుకున్న జాబ్, కనీసం చెప్పలేదు మీరు అని ఊరుకున్నాను. జీవిత పాఠాలు నేర్చుకుంటూ, మనుష్యుల నైజాలు అర్థం చేసుకోవడం మెుదలుపెట్టాను.
వచ్చే వారం మరిన్ని కబుర్లతో...
వర్గము
ముచ్చట్లు
7, అక్టోబర్ 2020, బుధవారం
గొప్ప రచయిత / రచయిత్రి
నేస్తం,
నా రాతలు నేను నా మనసుకు నచ్చినట్టుగా రాసుకుంటాను. అందరికి నచ్చాలనేం లేదు. తెలుగు భాష మీద ఇష్టం పెంచుకోవడం, మా చిన్న తెలుగు, పెద్ద తెలుగు మాస్టార్ల మీద పంతంతో కావచ్చు. కారణమేదైనా కాని నాలుగు అక్షరం ముక్కలు రాయడం నేర్చుకున్నానంటే అది గురువుల వలనే. రాస్తున్నా కదాని ఓ నాకు బాగా రాయడం వచ్చని కాదు. నేను రాసేవన్నీ కవితలని, కథనాలని చెప్పను. మనం రాసేది నలుగురికి కాకపోయినా కనీసం ఒక్కరికయినా చేరితే చాలన్న కోరిక. అది తీరిందో లేదో ఆ పరమాత్మకెరుక.
మనం ఏది రాసినా మనకు నచ్చేస్తుంది. అది సహజం. దానికి ఎవరిని ఎవరూ తప్పు పట్టరు. కాని ఎదుటివారి రాతల గురించి విమర్శించే ముందు మన రాతలేంటన్నది ఓపాలి చూసుకుంటే పోలా. మన రాతలే గొప్ప రాతలనే అహం మనకుంటే ఎదుటివారి రాతలెప్పుడూ నచ్చవు. అన్ని లోపాలే కనబడతాయి. మనమేదో బాగా రాసేస్తామని మనల్ని సమీక్షలు, ముందు మాటలు రాయమని అడగరు. మన మీద అభిమానంతో, ఇష్టంతో అడిగినప్పుడు ఆ రాతలకు, వారికి విలువనివ్వడం మన సంస్కారం.
నాకు చిన్నప్పటి నుండి చదువులో ఏదైనా విషయం గురించి అడిగితే రాదని చెప్పడం తెలిసేది కాదు. నేను అమెరికాలో నేర్చుకున్న మంచి విషయమేంటంటే ఎదుటివారి పనిలో లోపాలను చూడకుండా, వారి పనిలో మంచిని చూడటం. నేను సమీక్షలు చాలానే రాశాను. పుస్తకం గురించి రాసేటప్పుడు పుస్తకంలో విషయాన్ని నాకు అనిపించినట్టుగా చెప్పడమే నాకు తెలుసు. ముందు మాటలు రాసేటప్పుడు ఆ వ్యక్తి గురించి, పుస్తకంలోని విషయాన్ని సంక్షిప్తంగా రాయడమే నాకు తెలుసు. ఇవన్నీ ఒకొక్కరు ఒకోలా రాస్తారు. దీనిలో ఆక్షేపణలేం లేవు. అలానే కవిత్వం, కథలు, కథానికలు, నాటకాలు ఇలా సాహిత్యం బోలెడు రకాలు. రాసే విధానాలు పలురకాలు. ఎవరు ఎలా రాసారన్న దానికన్నా ఏం రాశారన్నది ముఖ్యం. వారు రాయలనుకున్న సంకల్పానికి మన చేయూత ఉండాలి కాని, రాయాలన్న కోరిక నశింపజేయకూడదు మన మాటలతో, చేష్టలతో. ఏదో మనం నాలుగు పుస్తకాలు వేసేసామని మనకేదో బాగా రాయడమెుచ్చని ఫీల్ అయిపోతే మనకన్నా మూర్ఖులు మరొకరుండరు. ఇక అవార్డులు, సన్మానాలు, సత్కారాలంటారా అవి ఎలా, ఏమిటి, ఎందుకు అన్నది జగమెరిగిన సత్యం. ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారన్నట్టు నిజమైన ప్రతిభను గుర్తించాలంటే మనలో కూడా ఆ ప్రతిభను గుర్తించే ఆనవాళ్ళుండాలి కదా.
రాయడమనేది భగవదనుగ్రహం. మీకు వీలుంటే రాతలను ప్రోత్సహించండి కాని మీ మాటలతో, చేష్టలతో రాయాలన్న ఉత్సాహాన్ని చంపేయకండి మీరెంత గొప్ప రచయిత/రచయిత్రి అయినా సరే. మనందరి రాత రాసే ఆ భగవంతుడే అందరికన్నా గొప్ప రచయిత. ఇది నామాట.
వర్గము
కబుర్లు
6, అక్టోబర్ 2020, మంగళవారం
భూతల స్వర్గమేనా...28
పార్ట్.. 28
ఓ నెల రోజులు మరో ప్రాజెక్ట్ ఇంట్లో నుండి వర్క్ చేసాను. గ్రీన్ కార్డ్ కోసం కంపెనీ వాళ్ళు అప్లై చేసిన నా లేబర్ అప్రూవ్ అయ్యిందని చెప్పారు. ఈ లోపల H1B మరోసారి రెన్యువల్ చేయించుకోవాల్సి వచ్చింది. H1B రెన్యువల్ అయ్యింది. అమెరికాలో ఎప్పటికప్పుడు ఇమ్మిగ్రేషన్ రూల్స్ మారుతూ ఉంటాయి. అప్పట్లో పోస్ట్ లో H1B వీసా స్టాంపిగ్ కి పంపడం అదే ఆఖరుసారి. వీసా స్టాంపిగ్ కి పంపించాను, కాని వీసా స్టాంపిగ్ అవలేదు. అవుటాఫ్ కంట్రీ వెళ్ళమని వచ్చింది. అప్పటికే కొందరికి బయట కంట్రీస్ కి వెళ్ళడం మూలంగా వీసా స్టాంపిగ్ కాకపోవడము, హోమ్ కంట్రీ వెళ్ళమనడము జరుగుతోంది. కొందరికి మెక్సికో, కెనడాలలో వీసా స్టాంపిగ్ అవుతోంది. మా పెద్దోడు మౌర్యని వీసా స్టాంపిగ్ కోసం ఇండియాలో మద్రాస్ లో అమెరికన్ కన్సోలేట్ కి రెండుసార్లు పంపిస్తే అవలేదు. ఎవరితో పంపిస్తారంటే మా నాన్న తెలిసిన వారితో పంపిస్తామని చెప్పారట. అందుకు రిజెక్ట్ చేసారు. రెండవసారి వాళ్ళ పేరెంట్స్ ని వచ్చి తీసుకువెళ్ళమని చెప్పారట.
అందరు మెక్సికో, కెనడా వీసా స్టాంపిగ్ కి వెళుతున్నారు కదా అని నేను మెక్సికో వెళడానికి అపాయింట్మెంట్ బుక్ చేసాను. తీరా పాస్పోర్ట్ చూస్తే 5,6 నెలలే ఉంది ఎక్స్పైర్ కావడానికి. వెంటనే అపాయిట్మెంట్ కాన్సిల్ చేసి, పాస్పోర్ట్ రెన్యువల్ కి అమెరికాలో హ్యూస్టన్ లోని ఇండియన్ ఎంబసికి పంపాను. పాస్పోర్ట్ రెన్యువల్ కి చాలా టైమ్ తీసుకున్నారు మనవాళ్ళు.
మా చిన్నాడపడుచుకి AMSOL లో పనిచేసే అతనితో పెళ్ళి చేసాం కదా. ఆమెకు అతనికి కుదరలేదు. ఆమె అమెరికా వచ్చిన తర్వాత కూడా ఇద్దరికి కుదరలేదు. మా వాళ్ళు ఎవరు ఏమి మాకు చెప్పలేదు. అతనే చెప్పేవాడు విషయాలు. శౌర్య పుట్టినప్పుడు కూడా ఫోటో చూడటానికి కూడా ఆవిడ ఇష్టపడలేదని కూడ చెప్పాడు. నాకు అంత హెల్త్ ప్రోబ్లం అయినా ఈయన వైపు వారు ఎవరు కనీసం ఓ ఫోన్ కూడా చేయలేదు. వాళ్ళ అవసరాలకు మాత్రం డబ్బులు బానే తీసుకున్నారు. డబ్బులు పనికివచ్చాయి కాని మనుషులు పనికిరాలేదు. శౌర్యకి కాకానిలో అన్నం పెట్టినప్పుడు కూడా అందరికి ఫోన్ చేసి రమ్మని చెప్పినా ఎవరూ రాలేదు. వీళ్ళిద్దరికి బాగా గొడవ ఎక్కువైంది. మా AMSOL CEO సుబ్బరాజు ఇందుకూరి కూడా చాలా చెప్పి చూసారు ఆవిడకి. వినలేదు. ఆఖరికి మా పెద్దాడపడుచు ఈయనకి చెప్పిందేమెా, ఆ పిల్లను మా ఇంటికి రమ్మని టికెట్ బుక్ చేసాము. అప్పటికే నన్ను చాలా మాటలు అని ఉంది. అయినా అవేం పట్టించుకోలేదు నేను. ఆ అబ్బాయికి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఉంది. ఓ నెల రోజులు మా ఇంట్లో ఉంచుకున్నాం. ఎన్ని రకాలుగా చెప్పినా వినలేదు. అప్పటికే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకు బాలేదు కాన్సర్. నేను శౌర్యని ఇండియాలో వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు ఆవిడను చూసి వచ్చాను. ఇద్దరు డైవోర్స్ కి అప్లై చేయడానికి ఇండియా వెళతామన్నారు. ఈ పిల్లను తీసుకుని న్యూజెర్సీ వెళ్ళి, ఇద్దరిని ఇండియాకి ఫ్లైట్ ఎక్కించి నేను హంట్స్విల్ వచ్చేసాను.
వెంటనే నాకు రాచెస్టర్ మినిసోటా లోని మేయెా క్లినిక్ లో ప్రాజెక్ట్ Allied Informatics ద్వారా వచ్చింది. ఈ అలైడ్ ఇన్ఫర్మాటిక్స్ CEO క్రిష్ మామగారు పూర్ణచంద్రరావు మద్రాస్ లో కంపెనీ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి H1B వీసా ప్రాసెస్ చేసేవారు. నేను అమెరికా రాకముందు దీనిలో పని చేసాను. నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళను సెలక్ట్ చేసి నన్ను అమెరికా వెళ్ళడానికి పనికిరానన్నాడు. మా AMSOL వాళ్ళు అలైడ్ వాళ్ళతో పని చేయడానికి ఇష్టపడలేదు పేమెంట్ సరిగా ఇవ్వరని. నేను నచ్చజెప్పి ఈ ప్రాజెక్ట్ కి వచ్చాను. ఓ వారం హోటల్ లో ఉండి, తర్వాత వేరే అమ్మాయితో రూమ్ షేర్ చేసుకున్నాను. ఆ టైమ్ లో వింటర్. కంపెని బస్ కోసం కాస్త దూరం నడవాలి సబ్ వే లో. బోలెడు ట్యూలిప్స్ పువ్వులు రంగురంగులలో దారంతా ఉండేవి. చూడటానికి భలే అందంగా ఉండేది నాకయితే. ఉగాది అక్కడి ఇండియన్స్ అందరు కలిసి చాలా బాగా చేసారు. తలా ఓ వంటకం చేసారు. నేనూ పచ్చిమిరపకాయి బజ్జీలు వేసి తీసుకెళ్ళాను. అందరు మెచ్చుకున్నారు కూడా. వంట ఎలా ఉన్నా మనం నొచ్చుకోకుండా మెచ్చుకోవడం అక్కడి మనవారి సంస్కారం. పాటలు, డాన్సులు, స్కిట్స్ లతో ప్రోగ్రామ్ బాగా జరిగింది. ఆ రాత్రి బౌలింగ్ కి కూడా వెళ్ళాము. ఆ టైమ్ లోనే " జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది " పాట కార్ లో వినడము, నాకు బాగా నచ్చడమూ జరిగిపోయింది. ఆ పాట ఏ సినిమాలోదో కూడా తెలియదు. ఓ రెండు నెలలు ఆ ప్రాజెక్ట్ జరిగింది. తర్వాత ఫ్రెండ్ శాం రాచెస్టర్ వస్తే తనతో డెట్రాయిట్ వచ్చి, వాళ్ళ ఫ్రెండ్ కెనడా నుండి వస్తే తనని కలిసి, జాబ్ గురించి మాట్లాడి మళ్ళీ హంట్స్విల్ వచ్చేసాను. తర్వాత కొన్ని రోజులు డెట్రాయిట్ కి దగ్గరలో క్విక్ స్టార్ లో ఓ ప్రాజెక్ట్ చేసాను.
ఈ లోపల లేబర్ అప్రూవ్ అయ్యాక, గ్రీన్ కార్డ్ లో నెక్స్ట్ ప్రాసెస్ I 140 కి ఫైల్ చేసారు.
కొసమెరుపేమిటంటే " అమెరికా వెళ్ళడానికే పనికిరానన్న వాళ్ళతోనే ఓ ప్రాజెక్ట్ అదీ పెద్ద పేరున్న Mayo Clinic తో పని చేయడం, మా వాళ్ళు భయపడినట్లే అలైడ్ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వెంటపడి అడిగి మరీ ఇప్పించడం. "
మళ్లీ కలుద్దాం....
వర్గము
ప్రయాణం
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉగాది పండగ ... వీసా స్టాంప్ కోసం ప్రయత్నాలు ...
నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి, రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉగాది పండగ ... వీసా స్టాంప్ కోసం ప్రయత్నాలు ...
5, అక్టోబర్ 2020, సోమవారం
కాలం వెంబడి కలం...22
చల్లపల్లిలో బస్ దించి, అక్కడి నుండి కార్ లో రావివారిపాలెం తీసుకువెళ్ళాడు రాఘవేంద్ర. మా ఊరి నుండి పసి అక్క వచ్చింది. ఆ రాత్రిపూట పసి అక్క, నేను ఏదో మాట్లాడుకుంటుంటే, రాఘవేంద్ర ఏదో అన్నాడు. అమ్మావాళ్ళు గుర్తు వచ్చి ఏడ్చేసాను. పెళ్ళి ముందు రోజు మా హాస్టల్ ఫ్రెండ్స్ ఉష, విని వాళ్ళతో కలిసి ఇంజనీరింగ్ క్లాస్మేట్ శ్రీధర్ కూడా వచ్చారు. వీళ్ళని నాతో పాటు హాస్టల్ లో ఉండే మా చిన్నాడపడుచు తీసుకువచ్చింది. ఆ రాత్రి పక్కింటి ఉమక్క వాళ్ళింట్లో చేరి అందరం పిచ్చాపాటి కబుర్లు చెప్పుకున్నాం. నా అనుకున్న నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఎవరూ రాలేదు పెళ్ళికి. పాపం వాళ్ళకి భయమేసి ఉంటుంది. అసలే గొడవ పెళ్ళి కదా. వారి మీదకు ఏమైనా వస్తుందని భయమేసి ఉంటుంది. ఆటోగ్రాఫ్ లు రాయడం కాదు. పాటించడం కూడా ఉండాలి కదా.
పెళ్ళిరోజుకి వాసు, బాలు, రాము, కంది శ్రీను వాళ్ళు విజయనగరం నుండి వచ్చారు. పావని, దుర్గ, పుష్ప వాళ్ళు హైదరాబాదు నుండి వచ్చారు. మా జయపురం పార్వతి అక్కవాళ్ళకు రాఘవేంద్రను చెప్పమంటే, వాళ్ళు కూడా వచ్చారు. నా చిన్ననాటి స్నేహితుడు లీలాకుమార్, మా పాతింటి దగ్గరి నా ఆత్మీయురాలు దేవి, తన చిన్న కూతురు నాకెంతో ఇష్టమైన నా బుల్లినేస్తం స్వాతి ఇంకా చాలామంది మా ఊరివాళ్ళు అందరు పెళ్ళికి వచ్చారు
నేను చిన్నప్పటినుండి పెళ్ళి చేసుకోను, ఓ వేళ చేసుకున్నా ఎవరిని పిలువను, సంతకాల పెళ్ళి చేసుకుంటా అనేదాన్ని. మా మేనత్తలు, పిన్ని వాళ్ళు కొందరు ఆ మాటలు తల్చుకుని చాలా బాధ పడ్డాడట. మా నాన్న కోసం మా వాళ్ళెవరూ పెళ్ళికి రాలేదు. మా నాన్న ఫ్రెండ్ రామ్మెాహనరావు పర్చూరి అంకుల్ కృష్ణాపురం నుండి వచ్చారు.
నా ఫ్రెండ్స్ ఉష, విని రడీ చేసారు. స్వాతి పాపిటచేరు తీసి దేవి నాకు పెట్టింది. రాఘవేంద్ర వాళ్ళ అక్క రాఘవమ్మ గారు పట్టుచీర తెచ్చింది. రాఘవేంద్ర వాళ్ళ అన్నయ్య, తమ్ముడు, తమ్ముడి ఫ్రెండ్ లత వచ్చారు. లత కూడా మా హాస్టల్ లోనే ఉండేది. అప్పట్లో నాతో బావుండేది. రెండో అక్క హరిపురం నుండి వచ్చింది.
నేను అన్నట్టుగానే సంతకాల పెళ్ళిలా జరిగింది. రాఘవేంద్ర వాళ్ళ బావగారు తనకు బాగా తెలిసిన పూజారితో ముహూర్తము పెట్టించారు పెళ్ళికి. ఆ టైమ్ కి తాళి కట్టించారు పూజారి గారు. ఐదారుగురు మీటింగ్ చెప్పారు. రామ్మెాహన్ అంకుల్ చెప్పేటప్పుడు నా కళ్ళమ్మట నీళ్ళు కారిపోయాయి. నేను ఆ టైమ్ లో ఊరిలో లేను, ఉంటే ఇలా జరిగుండేది కాదు అని చెప్పారు. కమ్యూనిష్టు పార్టీ పెళ్ళి కదా. ప్రమాణం పేపర్ మీద రాసి, అది చదవమన్నారు. నేను బానే చదివేసాను కాని రాఘవేంద్ర కాస్త తడబడ్డాడు. మా మేనత్త కమలక్కాయి నా కోసమే పెళ్ళికి వచ్చింది. తనకి కాస్త బాధనిపించిందట మనసులో చదువు గుర్తుకు వచ్చి. లీలాకుమార్ కూడా కనబడకుండా బాధ పడ్డాడు. పెళ్ళి తర్వాత ఇంటికి వెళ్ళి నాన్నను అడిగాడని తర్వాత అమ్మ చెప్పింది. రాఘవేంద్ర వాళ్ళ మేనమామ నాకు చీర పెట్టారు. మెట్లు కూడా తెచ్చారనుకుంటా. ఎవరు తెచ్చారో నాకు గుర్తు లేదు. మా పెద్జాడపడుచు ఉంగరం చేయించింది కాని అది నా బొటనవేలికి సరిపోయింది. మరుసటి రోజు తీసేసి ఆవిడకే ఇచ్చేసాను. ఏంటో బాగా దిగులుగా అనిపించింది. కాని బయటికి మాత్రం నవ్వుతూనే ఉన్నాను. అమ్మానాన్నలను వదిలి ఉండలేని నేను ఇలాంటి సంఘర్షణలతో కొత్త జీవితానికి ఏ ఆధారము లేకుండానే నాంది పలికేసాను.
కొందరికి రేపేమిటన్నది ప్రశ్న కావచ్చు. కాని నాకు మరుక్షణమేమిటన్నది ప్రశ్నగా మారిపోయింది అప్పటి నుండి ఇప్పటి వరకు.
వచ్చే వారం మరిన్ని కబుర్లతో...
వర్గము
ముచ్చట్లు
3, అక్టోబర్ 2020, శనివారం
మనమెక్కడో మరి...!!
కొందరంతే
బంధాలను పట్టించుకోక
బాధ్యతలను గాలికొదిలేస్తూ
కొందరంతే
బంధుత్వాలను డబ్బుతో తూకమేస్తూ
బాంధవ్యాలను తెంచుకుంటూ
కొందరంతే
జ్ఞాపకాల్లేకుండా బతికేస్తూ
గతానికి సమాధి కట్టేస్తూ
కొందరంతే
మాటకు మౌనానికి మధ్యన
మనసుని అక్షరాలకప్పజెప్తూ
కొందరంతే
మనిషిగా మరణించినా
వేల గుండెల్లో జీవించేస్తూ
కొందరంతే
కారణమేదైనా
కావాలని యుద్ధం చేస్తూ
కొందరంతే
తప్పిపోయిన పసితనాన్ని
అమ్మ ఒడిలో వెదుక్కుంటూ
కొందరంతే
కారణజన్ములుగా
చరిత్రలో నిలిచిపోతూ
మరికొందరంతే
అకారణజన్ములుగా
చరిత్రహీనులుగా మిగిలిపోతూ...!!
వర్గము
కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)