20, అక్టోబర్ 2022, గురువారం

పరకాయ ప్రవేశం..!!

ఏదోకనాడు

మనమూ

చేతనంగా

మారక తప్పదు


బతుకో

భ్రమో

బాధో

భయమో తెలియదు


కాలాన్ని 

నెమరువేయడానికో

నిమరడానికో

మనకంటూ కొన్ని క్షణాలుంటాయి


మంచి

చెడు

మనసుకు మనిషికి

మరణానికి ముందే తెలుస్తాయేమో


కాయానికి

కట్టెకు

తూకం వేయడానికి

పరకాయ ప్రవేశం అవసరమే..!!


19, అక్టోబర్ 2022, బుధవారం

రెక్కలు

​1.   రెప్ప 

వాలింది

తొలి రెక్క

తలను వాల్చింది


మరో

సూర్యోదయానికై..!!

2.   అంటరానివౌతున్న

బంధాలు

దగ్గరౌతున్న

దూరాలు


మాటలు కరువౌతున్న

బుుణ సంబంధాలు..!!

3.  వెదికేది

దొరకదని తెలుసు

దొరికినది

నచ్చదు


సర్దుకుపోవడం

అలవరుచుకోవడమే..!!

4.   ముగిసిపోయిన

అధ్యాయాలేం వుండవు

తలు(ల)పులు

తడుతూనే వుంటాయి


కాలం

పరిగెడుతూనే వుంటుంది..!!

5.  పురోగమనపు

పునాదులు

తిరోగమనపు

తీరుతెన్నులు


నోట్లకు

రాచబాటే ఎప్పుడైనా..!!

6.  చీకటి

చూడని జీవితాల్లేవు

వెలుతురు

పడని వాకిలి లేదు


బతుకు పుస్తకంలో నిండిన

కాగితాలివి..!!

7.  ప్రజా రంజక

పాలన

ప్రజా కంటక

పరిపాలన


అందరికి తెలిసిన

సత్యమిది..!!

8.  ఉన్నతస్థితి

ఆపాదించుకుంటే రాదు

అధమస్థాయికి

ప్రవర్తనే సాక్ష్యం


విచక్షణ

వివేకవంతుల లక్షణం..!!

9.  యంత్రాలతో

మాయలు

తంత్రాలతో

ముసుగులు


యాంత్రికతే

ఇప్పటి లక్షణం..!!

10.  జీవితంలో

సమస్యలు కొందరికి

జీవితమే

సమస్య మరికొందరికి


అవినాభావ సంబంధం

జీవితానికి, సమస్యకు..!!

11.  దెప్పిపొడుపు

కరతలామలకం 

మౌనమే

ఆభరణం


ఏ నైజం

ఎవరిదో..!!

12.   చంపడం

చావడం

మధ్య

చిన్న తేడా


అంతరం

ఆంతర్యానికెరుక..!!

13.   నాటకాలేగా

ఎప్పుడూ

అప్పుడప్పుడూ

కాసింత నిజాయితీ


వెదకడం

దొరకడం కష్టమేనేమో..!!

14.  గుండె

గుప్పెడు

మనసు

మౌనం వీడదు


మాట

మహా నేర్పరి!!

15.  దండుకున్నంత

ధనము

దాచుకున్నన్ని

గురుతులు


కాలంతో

జీవితం..!!

16.   దూరం

దగ్గర చుట్టమే

అనుబంధమే

ఆమడదూరం


పాశాల

వ్యామోహం..!!

17.   అనుభవాల

పసితనమెుకటి

అరమరికలెరుగని

ఆకతాయితనమెుకటి


బాల్యం

జ్ఞాపకాల చిట్టానే ఎప్పుడూ..!!

18.   అమ్మనీ

మర్చిపోతున్నాం

అనుబంధాలకు

దూరమౌతున్నాం


దగ్గరి చుట్టం

ధనమే..!!

19.  రూపం లేని

మనసు

నటనాగ్రేసరుడు

మనిషి


జీవన నాటకం

రక్తి కడుతోంది..!!

20.  పుస్తకం 

ఏదైనా

అచ్చుతప్పులు

సరిదిద్దుకోవాలి


జీవితపు పుటల్లో

అనుభవాల పాఠాలు..!!

21.  సహనం

ఉండాలి

సమయపాలన

తెలియాలి


మనసును

అక్షరాలు (సం)గ్రహిస్తాయి..!!

22.  నిత్యంలేని

బతుకు

నిత్యసంచారి

కాలం


ఆశ చావని

మనిషి..!!

23.  శూన్యానికి చుట్టమైన 

ఆకాశం

మనసు దాచిన

మౌనం


కడలి నేర్పిన

పాఠం..!!

24.  అర్థం కాని

రాత

వీడలేని

పాశాలు


అంతర్మథనం

జీవితం..!!

25.  తప్పించుకోలేని

తడబాట్లు

తలపడలేని

యుద్ధాలు


పట్టువిడుపుల

మంత్రాలు..!!

26.  విశ్రాంతి కోరిన

దేహం

విరామమెరుగని

మనసు


ఉరుకుల పరుగుల

బతుకు ఆట..!!

27.  చీకటి చుట్టం

పక్కనే ఉంటుంది

వెలుతురు బంధుత్వాన్ని

కాదంటూ


పోరాటం తప్పని

బతుకులు..!!

28.  మేకాపులి

ఆట

ఎత్తులు పైఎత్తులు

రాజకీయం


బుద్ధికుశలత

అవసరం..!!

29.  మనసెరిగిన 

రుచులే అన్నీ

అక్షరాలకు

మాలిమైన భావాలే ఇవన్నీ


నుదుటిరాత

జీవనగీతగా మారింది..!!

30.  అడుగే

ఆమడ దూరం

బంధం

బల’హీనమే


మా’నవ సంబంధాలన్నీ

ఆర్థికావసరాలే..!!

14, అక్టోబర్ 2022, శుక్రవారం

​చీ’కటి బతుకులు..!!

అదో దాహార్తి

నిలకడగా నిలువనీయదు

కుదురుగా కునుకేయనీయదు

రెప్ప పడితే

రేపన్నది వుండదని భయమేమో

కన్ను తెరిస్తే

నిజాన్ని చూడాలన్న సంకోచం

వాస్తవాన్ని తట్టుకోలేని నైజం

విరుద్ధ భావాల వింత పోకడలు

అధికారమిచ్చిన అహంతో

సరికొత్త రాజ్యాంగానికి

తెర తీయాలన్న ఆరాటంలో

చరిత్ర హీనులుగా మిగిలిపోతున్నామని

మరిచిపోవడమే..

మన నిశాచర పాలనకు పరాకాష్ఠ

మనమనుభవించిన 

చీ’కటి బతుకునే

వ్యవస్థకు నిసిగ్గుగా ఆపాదించేస్తున్నాం

అదేమని అడిగితే..

సమాధానం తెలియనప్పుడే 

ప్రశ్నించడం భరించలేని 

అసహనం మనకాభరణం

రేపటి కాలాన్ని శాసించలేమని

గుర్తెరగని గాలి బుడగ జీవితాలివని

భవిష్యత్ నిరూపిస్తుంది..!!

3, అక్టోబర్ 2022, సోమవారం

జీవన మంజూష అక్టోబర్ 22

ఈ నెల నవమల్లెతీగలో నా వ్యాసాన్ని ప్రచురించిన సాహితీ సంపాదకులకు, యాజమాన్యానికి మనఃపూర్వక ధన్యవాదాలు…


నేస్తం,

         అవసరం అనేది ఎప్పుడు ఎవరితో ఎలా వస్తుందో మనకే కాదు, ఆ భగవంతుడికి కూడా తెలియదేమా. మనకేంటి మన దగ్గర అన్నీ వున్నాయన్న అహం మనకుంటే, మరుక్షణం ఏమౌతుందన్నది మనకు తెలియదు. ఏది జరగడానికైనా రెప్పపాటు చాలు. ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవడం గురించి చరిత్రలో ఎన్ని సంఘటనలు చూడలేదు.

          కాలాన్ని మించిన చరిత్ర ఎక్కడుంది? కాలం చేతిలో మనమందరం ఆటబొమ్మలమే. ఈరోజు అవకాశం మనదని విర్రవీగితే రేపటి రోజున అదే అవకాశం మరొకరి సొంతమౌతుంది. ప్రపంచమంతా ఇప్పుడు నడిచేది అధికారం, డబ్బు అనే రెండు అంశాలపైనే. అవి ఎప్పుడు స్థిరంగా ఒకరి దగ్గరే ఉండవు. ఈ దాహార్తిని తీర్చుకోవడానికి ఎవరి ప్రయత్నం వారు చేస్తూనే ఉంటారు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా. అశాశ్వతమైన ఆడంబరాల కోసం నిరంతరం ప్రాకులాడుతూనే ఉంటారు ఉచ్చం నీచం మరిచి. మనల్ని పదికాలాలు గుర్తుగా ఉంచేది నలుగురికి మనం చేసిన మంచో చెడో ఈ రెండింటిలో ఏదైనా కావచ్చు. మనం ఏం చేయాలన్నది మన నడవడిపై ఆధారపడి ఉంటుంది. 

           అటు పాత తరానికి, ఇటు కొత్త తరానికి మధ్యన నలిగిపోతున్న మధ్య తరం గురించి ఎవరికి పట్టడం లేదు. ఆధునికత మోజులో పిల్లలు, వారి గొంతానమ్మ కోరికలు తీర్చడానికి వీరు పడే అవస్థలు చెప్పనలవి కావు. ఇంట్లో ఇవతల పుల్ల తీసి అవతల పెట్టరు కాని జిమ్ములు, గమ్ములంటూ అర్ధరాత్రి వరకు తిరుగుళ్ళు. ఇంటి వంటలు ఒంటికి పట్టవు కాని వేలకు వేలు తగలేసి బయట కుళ్లిన వంటలు లొట్టలోసుకుంటూ తింటారు. ఇంట్లో మనుషులతో అవసరాలకు మాత్రమే మాటలు. సెల్ ఫోనుల్లో నిదుర మరచి చాటింగ్లు, కబుర్లు. అదేమని మాట అడిగామా ఇక మహాభారత యుద్ధమే. మళ్లీ దానికో పేరు ప్రస్టేషన్ అని. 

             కాలంతో పాటుగా మనమూ మారాలని అనుకున్నా , మారలేని మధ్య తరగతి బతుకులు మనవి. గతానికి, వాస్తవానికి మధ్యన నలిగిపోతూనే ఉంటాయిలా. అన్నింటిని తనలో నింపేసుకుని, నిమిత్తమాత్రురాలిని అన్నట్టుగా కాలం సాగిపోతూనే ఉంటుంది చరిత్ర పుటల్ని నింపేస్తూ..!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner