19, సెప్టెంబర్ 2024, గురువారం

ఇంకా మానవత్వం మిగిలేవుంది..!!













 నాకు తెలిసిన చిన్న పాప 7,8 ఏళ్ల వయసు నుండి SLE అనే ఆటో ఇమ్యూనిటి డిసీజ్ తో చాలా ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు ఆ పాపకు 12 ఏళ్లు. అప్పటి వరకు చాలా బాగా చదువుకునే పాప దీని బారిన పడింది. పాప తల్లిదండ్రులు బయట పని చేసుకు బతికేవారు. ఇప్పటి వరకు ఈ ఖరీదైన రోగానికి వెరవక పాపకు మందులు వాడుతూనే వున్నారు. గత గురువారం పాపకు బ్లీడింగ్ అవడంతో పాటుగా, ప్లేట్ లెట్స్ 10000 కు పడిపోయాయి. తర్వాత 6000కి. అలా పాప కండిషన్ బాగా సీరియస్ అయ్యింది. బ్లడ్, ప్లేట్ లెట్స్ ఎక్కిస్తూనే వున్నారు. 

          గవర్నమెంట్ హాస్పిటల్ పని తీరు మనకు తెలిసినదే. పాపకు అర్జంటుగా ఇంజక్షన్ చేయాలి. బయట ఆ ఇంజక్షన్ 208000ల రూపాయలు. మా డాక్టర్ గారు కంపెనీవాళ్ళతో మాట్లాడి 128000ల రూపాయలకు ఇప్పించారు. పాప వాళ్ల అమ్మతో మాట్లాడి మా విజయనగర్ ఇంజనీరింగ్ కాలేజ్ వాట్సప్ గ్రూప్ లలో చిన్న పోస్ట్ పెట్టాను. అదే పోస్ట్ ఫేస్ బుక్ లో కూడా పెట్టాను. 

            నేను తెలిసిన, నాకు తెలిసిన అందరు తమకు తోచిన సాయం వెనువెంటనే చేసారు. నేను తెలియని వారు కూడా చాలా సాయం చేసారు. దాదాపు 24 గంటల్లో 120000 ల రూపాయల వరకు ఇచ్చారు. ఇంకా ఇస్తూనే వున్నారు. మీ అందరి మంచితనంతో పాపకు ఇప్పుడు బావుంది. కోలుకుంటోంది. ఖరీదైన రోగాలకు తెలియదు కదా మన దగ్గర డబ్బులున్నాయో లేదోనని. 

            మానవత్వం, మనిషితనం ఇంకా మిగిలుందనడానికి నిదర్శనం ఈ పాపకు దక్కిన సాయం. మీ అందరి మానవత్వానికి పాప తల్లిదండ్రులతో పాటుగా,నేను కూడా మనఃపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాను.



8, సెప్టెంబర్ 2024, ఆదివారం

కొలమానం..!!


 

       గొప్ప రచనకు కొలమానం ఏమిటి? వ్యక్తిలోని సృజనాత్మకతను గుర్తించే పురస్కారాలు ఈనాడు నిజాయితీగా వున్నాయా? ఒక రచనకు పురస్కారం లభిస్తేనే అది గొప్ప రచన అవుతుందా? అవార్డులు, రివార్డుల కోసం పబ్బులు, పార్టీలంటూ అర్ధరాత్రుళ్లు, అపరాత్రుళ్లు తిరిగే జనాలకు అసలైన పురస్కారం అంటే ఏమిటో తెలుసా? మన పేరు, ప్రతిష్టల కోసం జాతినే అవమానించే స్థాయికి దిగజారిన బతుకులకు ఎవరి రాతల గురించి, పురస్కారాల గురించి మాట్లాడే అర్హత లేదు. 

       పత్రికా విలువలు నశించి చాలా కాలమయినా ఇంకా ఎక్కడో మిగిలున్నాయని భ్రమపడ్డానిన్నాళ్ళు. అసలైన విద్రోహులు వీరేనని వీరి పత్రికల్లో ప్రచురణలు చూస్తుంటే తెలుస్తోంది. రాసేవాళ్లకు బుర్రా,బుద్ది లేదు సరే, ఆ రాతలను అచ్చేసి జాతిని చిన్నాభిన్నం చేస్తున్న వీరిని ఏమనాలి? తప్పుని ప్రశ్నించాల్సిన పత్రికలే ఆ తప్పులకు వెన్నుదన్నుగా నిలవడంలో ఆంతర్యమేమిటి? ప్రాంతాల మధ్యన ఎలాగూ చిచ్చు రగిల్చేసారు ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు. అది అక్కడితో ఆగలేదు.

         తెలుగు అనేది జాతి భాష. ప్రాంతీయతలు, మాండలికాలు మారుతూవుంటాయి కాని భాష మారదు. సాహిత్యం భాషతో ముడిబడి వుంటుంది కాని పైన చెప్పిన వాటితో కాదు. గొప్ప గొప్ప రచయితలకు ఈ చిన్న విషయం తెలియక పోవడం కడు సోచనీయం. అవార్డుల కోసం ఇంత దిగజారుడు రాతలు రాయడం, వాటిని సమర్థించడం, అవి ప్రచురించడం చాలా చాలా చీదరగా వుంది. అసలు ఇదేది రాయకుండా ఆ పేర్ల లిస్ట్ పెట్టేసి నా లిస్ట్ నుండి ఆ గొప్ప వారినందరిని సవినయంగా దయచేయమని చెప్పాలనుకున్నా. ఇప్పుడు చెప్తున్నా ఆ రాతను సమర్థించిన ఎవరైనా సరే నా లిస్టు నుండి వెళిపొండి. 

          నేను రాసిన సమీక్షల్లో ఏ ప్రాంతం వారున్నారో, అక్కడా, ఇక్కడా స్టేజ్ ల మీద కాని, అవార్డులు, రివార్డులు ఎవరు తీసుకున్నారో, కొన్ని సంస్థలు ఎవరెవరికి ఎలా పురస్కారాలిస్తున్నారో అన్నీ వివరంగా అందరికి తెలుసు. అనవసరంగా ఈ దిక్కుమాలిన వ్యాసం రాసి మీ దరిద్రపు బుద్దిని బయటేసుకున్నారు. కులం, మతం మనుష్యులకే కాకుండా భాషకు కూడా అంటగట్టేస్తున్నారు కదరా. ఛీ ఛీ మీ బతుకులు చెడా. ఇంకా చాలా రాయాలనున్నా చిరాకుగా వుంది. 


7, సెప్టెంబర్ 2024, శనివారం

జీవన మంజూష సెప్టెంబర్24


 నేస్తం,

         “ (జాతి)దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వంఅన్న మహాకవి శ్రీశ్రీ గారి మాటలు అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి నిజమే. రాతియుగం నుండి అంతరిక్ష పయనం వరకు మానవజాతి ఎదుగుదల జరిగినా మార్పు లేనిది మనిషి ఆలోచనల్లోనే. వ్యవస్థలో మనుగడ కోసం ఆనాటి మనిషి తపన పడితే, ఈనాటి మనిషి తన ఎదుగుదల కోసం ఎంతకయినా దిగజారే పరిస్థితికి రావడం వెనుక అనేక కారణాలు

           నిత్యావసరాలు సామాన్యునికి అందుబాటులో లేనట్లే, విద్య, వైద్యం కూడా అందని ఆకాశమే అవుతోందిప్పుడు. నోరు తిరగని రోగాలు, మింగలేని మందులు, డబ్బుల కట్టలు గుప్పించి కొనలేని సూదిమందులు ఇలా చెప్పుకుంటూబోతే సవాలక్ష కారణాలు సగటు మనిషి జీవితాన్ని సగంలోనే హరించేస్తున్నాయి. నూటికి ఎనభైశాతం మంది తమకు వచ్చిన రోగాలతో కాకుండా కొందరు వైద్యుల ధనదాహానికి, వారి జీవితాలను అర్థాంతరంగా ముగించాల్సి వస్తోంది. విద్య, వైద్యం కార్పొరేట్, ప్రైవేట్ రంగాల చేతుల్లో వుండటంతో వ్యవస్థ మెుత్తం వారి చేతుల్లో బంధీగా మారిపోయింది

             చిన్నపాటి జ్వరానికి కూడా స్కానింగ్ లు, ఎంఆర్ఐలు తీయించమనడం మనందరికి అనుభవమే. ఇక సాధారణ రక్త పరీక్షలు అవి ఎలాగూ తప్పవు. ఇవన్నీ చేయిస్తేకాని మనకు వచ్చింది మామూలు జ్వరమా, టైఫాయిడ్ లేదా మలేరియానా అన్నది చెప్పరు. ఇవన్నీ జరిగే లోపల ఐసియు బిల్ వేలల్లో పెరిగిపోతుంది. డబ్బున్న వాళ్ళకు ఇవన్నీ పర్లేదు. కాని మధ్యతరగతి, సామాన్యుల సంగతే ప్రశ్నార్థకం. ఒకడేమో డబ్బులు ముందు కట్టకపోతే వైద్యం చేయనంటాడు. మరొకరేమో కాస్త ముందుచూపుతో దీర్ఘకాలిక రోగాలకు ముందుగానే మినహాయించుకుని, మన మతిమరుపుని వాడుకుంటారన్న మాట. మరోసారి మనకు బాదేస్తూ..

              ఇలాంటివారు చదువుకొన్న విజ్ఞానవంతులేమోనన్న అనుమానం వస్తూ వుంటుంది అప్పుడప్పుడు. వారు కొనుక్కున్నప్పుడు మరి ఎదుటివారి దగ్గర వసూలు చేయాలి కదా. పెట్టుబడికి తగిన లాభం చూసుకోవడం ఈరోజుల్లో సహజమే మరి. విషయాల్లో ఎవరినీ తప్పు పట్టలేము. ఎందుకంటే ఎవరి వ్యాపారం వారిది. ప్రపంచమే ఓవ్యాపార కేంద్రంగా మారిపోయింది. ముడిసరుకు, అంగడిసరుకు అన్నీ ధనంతోనే నడుస్తున్నాయి. అందరు దానికి దాసోహం అనక తప్పని పరిస్థితులు ఇప్పటి సమాజంలో వున్నాయి. అందుకే నా వ్యాపారం నాది. నీ వ్యాపారం నీది అన్న చందాన మనిషి మనుగడ సాగుతోంది. తీరు మారేదెన్నడో..!!



       


15, ఆగస్టు 2024, గురువారం

స్వతంత్రం ఎవరికి..?

అంగబలానికి

అర్థబలానికి

వచ్చిన స్వేచ్ఛని

స్వతంత్రమందామా..


మనిషితనానికి

మనసుతనానికి

వేసిన ముసుగులను

స్వతంత్రమందామా..


బంధాలను

అనుబంధాలను

గాలికొదిలేయడాన్ని

స్వతంత్రమందామా..


వి(వీ)ధిరాతల

వింతపోకడలను

రాయలేనితనాన్ని

స్వతంత్రమందామా..


ఏదేమైనా

ఎవరెలా పోతున్నా

మనకు మనం బావుండాలంటూ

లేని స్వతంత్రానికి 

రాని స్వాతంత్ర్యానికి

మరోసారి శుభాకాంక్షలు..!!


12, ఆగస్టు 2024, సోమవారం

పుస్తక సమీక్ష

 రాము కోలా గారికి, సూర్య పత్రిక యాజమాన్యానికి మనఃపూర్వక ధన్యవాదాలు…


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner