7, సెప్టెంబర్ 2024, శనివారం

జీవన మంజూష సెప్టెంబర్24


 నేస్తం,

         “ (జాతి)దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వంఅన్న మహాకవి శ్రీశ్రీ గారి మాటలు అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి నిజమే. రాతియుగం నుండి అంతరిక్ష పయనం వరకు మానవజాతి ఎదుగుదల జరిగినా మార్పు లేనిది మనిషి ఆలోచనల్లోనే. వ్యవస్థలో మనుగడ కోసం ఆనాటి మనిషి తపన పడితే, ఈనాటి మనిషి తన ఎదుగుదల కోసం ఎంతకయినా దిగజారే పరిస్థితికి రావడం వెనుక అనేక కారణాలు

           నిత్యావసరాలు సామాన్యునికి అందుబాటులో లేనట్లే, విద్య, వైద్యం కూడా అందని ఆకాశమే అవుతోందిప్పుడు. నోరు తిరగని రోగాలు, మింగలేని మందులు, డబ్బుల కట్టలు గుప్పించి కొనలేని సూదిమందులు ఇలా చెప్పుకుంటూబోతే సవాలక్ష కారణాలు సగటు మనిషి జీవితాన్ని సగంలోనే హరించేస్తున్నాయి. నూటికి ఎనభైశాతం మంది తమకు వచ్చిన రోగాలతో కాకుండా కొందరు వైద్యుల ధనదాహానికి, వారి జీవితాలను అర్థాంతరంగా ముగించాల్సి వస్తోంది. విద్య, వైద్యం కార్పొరేట్, ప్రైవేట్ రంగాల చేతుల్లో వుండటంతో వ్యవస్థ మెుత్తం వారి చేతుల్లో బంధీగా మారిపోయింది

             చిన్నపాటి జ్వరానికి కూడా స్కానింగ్ లు, ఎంఆర్ఐలు తీయించమనడం మనందరికి అనుభవమే. ఇక సాధారణ రక్త పరీక్షలు అవి ఎలాగూ తప్పవు. ఇవన్నీ చేయిస్తేకాని మనకు వచ్చింది మామూలు జ్వరమా, టైఫాయిడ్ లేదా మలేరియానా అన్నది చెప్పరు. ఇవన్నీ జరిగే లోపల ఐసియు బిల్ వేలల్లో పెరిగిపోతుంది. డబ్బున్న వాళ్ళకు ఇవన్నీ పర్లేదు. కాని మధ్యతరగతి, సామాన్యుల సంగతే ప్రశ్నార్థకం. ఒకడేమో డబ్బులు ముందు కట్టకపోతే వైద్యం చేయనంటాడు. మరొకరేమో కాస్త ముందుచూపుతో దీర్ఘకాలిక రోగాలకు ముందుగానే మినహాయించుకుని, మన మతిమరుపుని వాడుకుంటారన్న మాట. మరోసారి మనకు బాదేస్తూ..

              ఇలాంటివారు చదువుకొన్న విజ్ఞానవంతులేమోనన్న అనుమానం వస్తూ వుంటుంది అప్పుడప్పుడు. వారు కొనుక్కున్నప్పుడు మరి ఎదుటివారి దగ్గర వసూలు చేయాలి కదా. పెట్టుబడికి తగిన లాభం చూసుకోవడం ఈరోజుల్లో సహజమే మరి. విషయాల్లో ఎవరినీ తప్పు పట్టలేము. ఎందుకంటే ఎవరి వ్యాపారం వారిది. ప్రపంచమే ఓవ్యాపార కేంద్రంగా మారిపోయింది. ముడిసరుకు, అంగడిసరుకు అన్నీ ధనంతోనే నడుస్తున్నాయి. అందరు దానికి దాసోహం అనక తప్పని పరిస్థితులు ఇప్పటి సమాజంలో వున్నాయి. అందుకే నా వ్యాపారం నాది. నీ వ్యాపారం నీది అన్న చందాన మనిషి మనుగడ సాగుతోంది. తీరు మారేదెన్నడో..!!



       


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner