బంధాలు, బంధుత్వాలు ఎంతగా పలచబడి పోతున్నాయంటే చెప్పడానికి కూడా ఏదోలా ఉంది. అక్క బిడ్డలు, అన్న బిడ్డలు అని మనకున్నా, ఎంతగా మన చేతుల్లో పెరిగినా వారి నుండి ఓ పలకరింపు కరువై పోతోంది ఈనాడు. పలకరింపు అనేది మనసునుంచి రావాలి, తెచ్చిపెట్టుకొనకూడదు. వరుసలను వాడుకునే వారు కొందరైతే, మనసులతో, మనుష్యులతో డబ్బు కోసం ఆడుకునే వారు మరికొందరు. డబ్బు జబ్బు సోకగానే ఆప్యాయతలు మరచిపోతున్నారు. సంపాదన మనకు ఉంటే మనమే అనుభవిస్తాము కానీ ఎవరికీ ఒక పైసా పెట్టము. మాటలు, చేతలు మాత్రం కలకాలం నిలిచిపోతాయి. అసలు ఒకరు మనలని పలకరించలేదు అనుకోవడానికి ముందు మనం ఎంత వరకు పలకరిస్తున్నాం అనేది చూసుకుంటే బంధాలు కొన్ని రోజులైనా నిలబడతాయి. నాలుగు రోజులు ఒకరితో, మరో నాలుగు రోజులు మరొకరితో మన అవసరాలు గడుపుకోవడం ఎంతవరకు సబబు..? మనం చేసిన తప్పొప్పులను నిజాయితీగా ఒప్పుకున్న రోజు మనకు ఓ మనస్సాక్షి ఉందని అనిపిస్తుంది. అందరం బతికేస్తున్నాం కనీసపు విలువలు లేకుండా అన్ని బంధాలను దుయ్యబడుతూ అల్లరిపాలు చేస్తూ కొన్నిరోజులు, తరువాతేమో తప్పయిపోయింది అని మన అవసరాలు తీర్చుకోవడానికి ఆ బంధాలను వాడుకుంటున్నాము. అన్నం పెట్టిన చేతినే కాటు వేసే విషపు పురుగులున్న సమాజం మనది. ఇక ఈ అభిమానాలకు, అనుబంధాలకు చోటు ఉంటుందని ఎదురుచూడటం కూడా అత్యాశే అవుతుంది. చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయగానే సరి కాదు, పెద్దలు తప్పుచేసినా సరిదిద్దే పిన్నలు ఉండాలి. అంతేకానీ ఆ తప్పుని సమర్ధించే వ్యక్తిత్వం మీకుంటే మీరుగానే మిగిలిపోతారు రేపటి రోజున.
అన్నట్టు చెప్పడం మరిచా .. ఇది నా బ్లాగులో 1401 వ పోస్టు.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి