నేస్తం,
సంస్కారం-కల్చర్ అన్న ఈ పదాలు నాటి-నేటి మన జీవన విధానాన్ని సూచిస్తున్నాయనడంలో అబద్ధమేం లేదు. ఐదు తరాల అనుభవాలను చూసిన మనలో కొందరికి సంస్కారం అంటే ఏమిటన్నది మనమేమి విడమరిచి చెప్పనక్కర్లేదు. అలానే ఇప్పటి కల్చర్ కు అలవాటు పడిన మనస్తత్వాలకు ఎవరి జీవితాలు ఎలా సాగుతున్నాయన్నది లోక విదితమే.
మనం మాత్రమే బావుండాలన్న చట్రంలోనే బందీలుగా మారిపోయి, కుటుంబం అంటే నేను, నా భర్త/భార్య, పిల్లలు అని మాత్రమే అనుకునేంత విస్తృత పరిధి మన మనసులకు ఆపాదించేసుకున్నామిప్పుడు. వయసైపోయిందన్న వారితో పనేముందనే మానసిక పరిపక్వత సాధించేసి, మనమెంత కల్చర్ గా బతికేస్తున్నామో నలుగురు గుర్తించేయాలన్నంత అభిలాషతో ప్రగతిపథంలో మునుముందుకి సాగిపోతున్నాం. ఒకే చోట ఉంటున్నా రోజూ ముఖాముఖాలు చూసుకోలేని తల్లీబిడ్డలెందరో ఈనాటి కల్చర్ కి నిలువెత్తు సాక్ష్యాలు. నాలుగు మెట్లు దిగి నడిచి రాలేక ముదిమి వయసును మనసారా నాలుగు మాటలు పలకరించలేని మన పెంపకాలకు మనమే గర్వపడదామీ రోజున.
డబ్బు, మందు, మగువ, మత్తు, షాపింగ్ లు మాత్రమే మన హై క్లాస్ కల్చరని భ్రమపడుతూ, పిల్లలను విచ్చలవిడిగా వదిలేయడమే మన అసలైన సంస్కారమని మనమనుకుంటే సరిపోదు. ఉన్నత చదువులు చిదివిస్తున్నామన్న మాయలో పడి కనీస విలువలు పిల్లలకు నేర్పలేక పోతున్నామన్న నిజాన్ని మర్చిపోతున్నాం. పరాయి భాషలు మాట్లాడటమే అసలైన కల్చర్ అని అనుకుంటూ, మనం వదిలేసుకుంటున్న జీవితపు విలువలు, రేపటి రోజున మనల్నే ఎగతాళి చేస్తాయని గుర్తెరగలేక పోతున్నామెందుకో?
అమెరికా, ఆస్ట్రేలియాల్లో మన పిల్లలు ఉండటమే మన డిగ్నిటి అని మనం ఫీలవడంలో వింతేమీ లేదిప్పుడు. ఎందుకంటే రూపాయికున్న విలువను డాలర్లు, పౌండులతో పోల్చుకుని మన చుట్టరికాలు పెంచుకోవడం, చేస్తున్నాం కదా! బంధాలను బాధ్యత అనుకోకుండా బంధనాలని మనమిప్పుడు అనుకుంటున్నాం కనుక మన చేతలు తప్పేం కాదసలు. ఒకప్పుడు వలస పక్షులు కూడా మన గూటిలోనే తలదాచుకునేవి. ఇప్పుడేమో ఒకే కప్పు కిందున్నా యోజనాల దూరం అనుబంధాల మధ్యన. అవసరాలకు బంధాలను వాడుకోవడమే ఇప్పటి కల్చర్.
అన్నం పెట్టిన చేతినే కాటు వేసే విషపు నైజమున్న సంస్కారులిప్పుడు కోకొల్లలు. పరాయి కొంపల్లో పాకులాడుతూ, బతుకునిచ్చిన బంధాలను అల్లరిపాలు చేసి, చాటుమాటు వ్యవహారాలు నడుపుతూ, ఊసరవెల్లిలా బతికే అధములు నీతులు వల్లించేయడం, ఎవరి బతుకేంటో అందరికి తెలిసినా అహంతో
మాట తూలడం గొప్పనుకుంటున్నారు. ఒకరిని అనేముందు మన పుట్టుక ఏమిటన్నది మనం గుర్తుంచుకుంటే మంచిది. అమ్మ రక్త సంబంధాలను అవసరానికి ఉపయోగించుకునే అవకాశవాదులమని నలుగురికి తెలిసినా, మన నటనే గొప్పదన్న భ్రమ మనల్ని వీడనంత కాలం పరాయి పంచనే మన బతుకు. మాట జారడం సుళువే. పగిలిన మనసతకడమే విధాతకైనా సాధ్యం కాదు. అహానికి, ఆత్మాభిమానానికి తేడా తెలుసుకుంటే మినుములది జీవితంలోనైనా మనకంటూ నలుగురు మిగులుతారు.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి