“సాధన”మున పనులు సమకూడు ధరలోన..!!
మనసుకు హత్తుకునే కథలు రాయడంలో అందె వేసిన చేయి మన డాక్టర్ లక్ష్మీ రాఘవ గారిది. హంగులు, ఆర్భాటాలు లేకుండా, మన చుట్టూ జరిగే సంఘటనలను కథలుగా మలచడమే కాకుండా, సమస్యలకు తగు రీతిగా పరిష్కారాలు కూడా చూపించడం వీరి కథలలోని ప్రత్యేకత. చాలా కాలం నుండి రాయడం వీరికి అలవాటైన విద్యే. వీరి కలం నుండి వెలువడిన మరో కథల సమాహారమే ఈ “ సాధన “. ఇందులో ప్రతి కథా మనకు ఏదోకటి నేర్పుతుంది.
విమలమ్మ లాంటి వారు ఇంటికొకరు వుంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా భార్యాభర్తల మధ్యన ఏ గొడవలు రావు. జీవితాన్ని ఎలా జీవించాలో “ జీవితం “ లో చక్కగా చెప్పారు.
“ దేవుడి న్యాయం “ కథ చదివిన ప్రతి ఒక్కరి మనసుని తడుతుంది. అమ్మ జ్ఞాపకాన్ని ఆత్మీయంగా దాచుకోవడం, చేజారిపోయిందనుకుంటే, తిరిగి చేరడం చాలా హృద్యంగా అమ్మ ముక్కుపుడక గురించి రాసారు.
మనం సవరించుకోవాల్సిన సమస్యలకు సమాధానం ఆత్మహత్య కాదని చెప్తూ, ఎంత పెద్ద సమస్యలకైనా పరిష్కారం ఏదొక రూపంలో దొరుకుతుందని తెలిపే కథ “ సవరణ “.
మనం చేసే వృత్తికి, స్వార్థం లేని మంచితనానికి చక్కని “ నిర్వచనం ” ఈ కథ.
జంతుప్రేమను తెలిపే కథ “ రాణీ - రాజా “ . రాణీ మనసు మాటలు బావున్నాయి.
రాయడం తెలిసిన వారంతా గొప్ప రచయితలు ఎలా అవగలుగుతారో! రచయితల సంఘాలు ఎంత వరకు కొత్త వారిని ప్రోత్సహిస్తూ(నిరుత్సాహ పరుస్తూ), రాతల్లో మార్పులు, చేర్పులు చెబుతారో వగైరా రచయితల సాధకబాధకాలు వివరంగా చెప్పిన కథ “ అనుభవం “.
కష్టపడకుండా వచ్చే సొమ్ముతో ఇబ్బందులు, చిన్నతనంలో ఆకతాయితనంగా మెుదలైన పందెం డబ్బుల సంపాదన, తర్వాత తెచ్చిన చిక్కులు, తెలుసుకున్న జీవిత సత్యాలు తెలియాలంటే “ శివ B K “ కథ చదివితీరాల్సిందే.
ప్రతి తల్లీ, తండ్రి తప్పక చదవాల్సిన కథ “ పొరబాటు “. ఇద్దరు పిల్లల అలవాట్లు, చదువు వగైరాల మధ్యన పోలిక తెచ్చిన తంటా, వాటికి పరిష్కారాలు సూచించడం చాలా బావుంది.
మనసులోని నమ్మకానికి, దొంగ స్వాముల మోసాలకు తేడా తెలిపే కథ “ నమ్మకం “.
ఊరిలో వారికి మాట ఇచ్చిన తండ్రి కాలం చేస్తే ఇద్దరు బిడ్డల ఆలోచనల వ్యత్యాసాన్ని విప్పి చెప్పిన కథ “ మాట విలువ “. మనిషి ఉన్నా లేకున్నా మాట విలువను తెలిపిన కథ ఇది.
అనుకోనివి జరగడమే జీవితం. వెళ్తా అని చెప్పిన కొడుకుని మందలించిన తల్లికి తెలియదు, తిరిగిరానని ఆ కొడుకుకి తెలియదు. అనుకోకుండా వచ్చిన నోటి మాట నిజమైన వేళ. మనసుకి బాధనిపించే కథ “ వెళ్ళొస్తా “.
ఆత్మీయత మనం పెంచుకునే ప్రాణులపైనా వుంటుంది. వస్తువులపైనా వుంటుంది. ఆ మమకారం వదులుకోవడం కన్నా ప్రాణం వదిలేయడమే సుళువని “ రామయ్య బంటు “ కథ చెబుతుంది. వయసుడిగిన వారి మనసు పడే బాధను చూపిన కథ కూడా.
అమ్మ ఏం చేసినా పిల్లల బాగు కోసమేనని “ అమ్మ నిర్ణయం “ కథ తెలుపుతుంది.
“ కులవృత్తికి సాటి లేదు గువ్వలచెన్నా! “ అన్న పెద్దల మాట నేటి కరోనా కాలానికి నిజమైన వేళ..ఓ హెడ్మాస్టర్ తండ్రికి తన ముందు రెండు తరాల కులవృత్తిని గుర్తుకు తెచ్చిన ఇంజనీరు కొడుకు చేద్దామనుకున్న ఆధునిక వ్యాపారం గురించి “ హెడ్మాస్టర్ కొడుకు “ కథలో మనం చదవవచ్చు.
వయసుతో వచ్చే మార్పులు, ఆలోచనలు కాలానుగుణంగా కొందరికి చాదస్తంగా అనిపించడం సహజం. మనమూ ఓరోజు ఆ వయసుకే చేరతామని అనుకోము. చక్కని మాటలను కూతురితో తల్లికి చెప్పించి, అమ్మమ్మను ఆనంద పరిచిన మనుమరాలి కథ. “ వయసు “.
కవులు కనుల భాష్యాలు కవితలుగా, పాటలుగా వినిపించారు. కాని కనుల మనసు కలతని “ కళ్ల కలవరం “ లో కొత్తగా, సరదాగా చెప్పినా నిజాన్ని చెప్పారు రచయిత్రి.
కొందరు వ్యక్తులు కొద్ది పరిచయంలోనే కలకాలం గుర్తుండిపోతారు. ప్రతిఫలమాశించని వ్యక్తులు బహు అరుదు. అలాంటి అరుదైన “ మస్తాను “ చనిపోయినా సజీవుడే.
జ్వాల అనుకోకుండా పల్లెటూరు అమ్మాయి సీతకు నేర్పిన కంప్యూటర్ తరువాత రోజులలో ఆ పల్లెకు, అక్కడి వారికి ఎలా ఉపయోగ పడింది అన్న కథ “ సీత “.
ఎవరికి ఎవరితో బుుణానుబంధమో తెలిపే కత “ బుుణం “.
చేజారి పోయిందనుకున్న అమ్మ జ్ఞాపకం తిరిగి ఎలా చేరిందన్న కథే “ ఉంగరం “. మంచితనం ఇంకా ఈ లోకంలో కొందరిలో మిగిలున్నదనడానికి కూడా నిదర్శనం ఈ కథ.
తండ్రి తప్పుకు కొడుకు చేసిన “ దిద్దుబాటు “ ఈ కథ. అందరికి బాగా నచ్చే కథ.
మరణానికి “ కాపరి “ ఎలా పని చేస్తాడు. అతని మనసు ఎలా ఆలోచిస్తుంది. అంతిమ ప్రయాణం ఏర్పాట్ల గురించిన వివరణ ఈ “ కాపరి “ కథ.
మంచంలో వున్న అమ్మ బుుణం కొడుకు ఎలా తీర్చుకున్నాడన్నది ఈ “ కొడుకు బాధ్యత “ కథ.
విమాన ప్రయాణంలో సరదా సంఘటన “ ఎర్ర రిబ్బను “ కథ.
చెడు జరిగినా అది మన మంచికే అన్న పెద్దల మాట నిజం. కరోనా మూలంగా కలతల కుటుంబంలో జరిగిన మంచి “ రహస్యం “ కథ.
పురాణాల నుండి నేర్చుకున్న తెలివి ఈనాటి పిల్లలది. “ ప్రశ్న “ కథ లో కరోనా రాకుండా కట్టుకునే మాస్క్ ని హనుమంతుడి నోటితో పోల్చడం బావుంది.
జీవితంలో ప్రతి మనిషికి సమస్యలు సహజం. వాటిని అధిగమించి ఉన్నతస్థాయిని అందుకోవడం కొందరికే సాథ్యం. అలా ఆ స్థాయిని సాధించిన “ సాధన “ కథ అందరికి ఆదర్శప్రాయం.
ఇరవై ఏడు కథలతో వెలువడిన ఈ “ సాధన “ కథా సంపుటి చదవడం మెుదలు పెడితే ఆపడం కుదరలేదు. ఇందులో కథలు మా అమ్మమ్మ చదివి ఆమెకు దగ్గరగా ఉన్న కథలను నాకు, అమ్మకు వివరించడమే ఈ పుస్తకం ప్రత్యేకతని మరోసారి చెప్పనవసరం లేదు. నాకున్న అనేక కారణాల దృష్ట్యా పుస్తకం పంపి చాలా కాలమయినా చదవడానికి ఇప్పటికి తీరింది. మూడు రోజులు పట్టింది చదివి నా అభిప్రాయాన్ని ఇలా రాయడానికి. మరిన్ని మంచి మంచి కథలు మీ నుండి కోరుకుంటూ..ఆలస్యానికి మన్నించమంటూ..హృదయపూర్వక అభినందనలు లక్ష్మీ రాఘవ గారు.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి