నేస్తం,
కాల ప్రవాహం పరుగులు తీస్తూనే వుంటుందెప్పుడు. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతామా లేక ఎదురీది నిలదొక్కుకుంటామా అన్నది మన బలాల, బలహీనతలపై ఆధారపడి వుంటుంది. కాలానికి విశ్రాంతి లేదెప్పుడు. నీటి ప్రవాహం మాత్రం ఎక్కడోచోట ఆగక తప్పదు. మనిషి మనసు వేగాన్ని బట్టి జయాపజయాలు వుంటాయి. గెలుపనేది మన విజయానికి తార్కాణం కాదెప్పుడు. ఆ విజయం ఎలా వచ్చిందనేది కూడా అవసరమే. కాని ఇప్పటి పరిస్థితుల్లో గెలిచామా లేదా అన్నది పరిగణన లోనికి తీసుకుంటున్నాం. ఆ గెలుపు వెనుక మంచి చెడు చూడటం లేదు. నిజంగా ఓ మనిషి గెలవడం అంటే ఏమిటో మనలో ఎంతమందికి తెలుసు?
కుటుంబంలోనైనా, సమాజంలోనైనా ఓ వ్యక్తిగా మనం గెలవడం అంటే ఏ ఫలితాన్ని ఆశించకుండా మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం. భార్యాభర్తలతో మెుదలైన కుటుంబం ముందు తరాల పెద్దల బాధ్యతను తీసుకోవడంతో పాటుగా, పిలల్ల పెంపకం, కుటుంబ అవసరాలు వగైరా బాధ్యతలను తీసుకుంటుంది. పిల్లలు తమకన్నా బావుండాలన్న దు’రాశ పెద్దలకు వుండటంలో తప్పేం లేదు. ఆ దు’రాశతోనే ఇప్పటి తరాలను భారమైనా దూరం పంపుతూ, ఒంటరి పక్షులుగా మారిపోతున్నారు బోలెడుమంది. మనసులో బాధున్నా పైకి ఆనందాన్ని నటిస్తున్నారు.
మన చుట్టూ వున్న ఎంతోమంది పిల్లలుండి అనాధలుగా బతకడం మనం చూస్తూనే వున్నాము. అలాగే పెద్దలుండి పిల్లలు నిరాదరణకు గురౌతున్న సంఘటనలు చూస్తున్నాం. పదిమంది పిల్లలున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు కరువైన నిరాశ్రయులు ఎందరో. ఈరోజుల్లో వృద్ధశ్రమాలు కళకళలాడుతున్నాయంటే కారణాలు అనేకం కావచ్చు. కాని రేపటి రోజున మనమూ ఆ దశకు చేరుకోవాల్సిన వాళ్ళమేనని మర్చిపోతున్నాం. ఇంతకు ముందు మనమెలా బతికామన్నది కాదు అవసాన దశలో మనకెంతమంది అందుబాటులో వున్నారన్నది ముఖ్యం. మనం చూడలేక పోవచ్చు కాని రేపటి రోజున మన చావు చెప్తుందట మనమేంటన్నది. ఈరోజు డబ్బు, అధికారం, అంగబలం వున్నాయని విర్రవీగితే రేపు కాల ప్రవాహం ఎటు విసిరి కొడుతుందో మన ఊహకు కూడా అందదు. పైవాడు మంచి రచయిత. ఎవరి ముగింపు వారికి పుట్టినప్పుడే రాసేస్తాడు. దాన్ని మార్చాలనుకోవడం మన భ్రమ. ఇది తెలుసుకుని మన నడక, నడవడి వుంటే చరిత్రలో మనకో పేజి కాకపోయినా కనీసం ఓ పేరా అయినా మిగులుతుంది.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి