నేస్తం,
ఏ బంధం ఎందుకన్నది మనకు అది ఏర్పడినప్పుడు తెలియదు. ఈ సృష్టిలో ప్రతి దానికి ఏదోక కారణముంటుంది. మనకు మంచి జరిగిందా, చెడు జరిగిందా అన్న దానికి కూడా ఏ కారణము లేకుండా లేదు. చెడు నుండి ఓ పాఠాన్ని నేర్చుకుంటాం. మంచి నుండి కాస్త సంతోషాన్ని పొందుతాం. ఈ విశ్వం మనకు పాఠశాల వంటిదని మనం నమ్మక తప్పదు. మనందరి మాస్టారెవరో మీకు తెలిసిపోయింది కదా!
కొందరితో మాట్లాడినప్పుడు కొన్ని మాటలు మన మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. మన అనుకున్న బంధాలు, ముఖ పరిచయమున్న సంబంధాలు, మనతో అవసరాలు తీర్చుకున్న అనుబంధాలు కనీసం మాట మాత్రంగానైనా అనలేని మాట, మనతో ముఖ పరిచయం లేకున్నా, మనకు ఏమీ కాకున్నా “ మీకు నేను చేస్తాను “ అన్న మాట మనకిచ్చే సంతోషం వెల కట్టలేనిది.
ఈ మధ్యన నా ఇంజనీరింగ్ నేస్తం యశోద అన్న మాట బోలెడు సంతోషాన్ని అందిస్తే, ఈరోజు ముఖపుస్తక నేస్తం అన్న అదే మాట అత్యంత సంతోషాన్ని అందించింది. నాకు సాయమందించిన వారున్నారు, నాద్వారా అందుకున్న వారున్నారు కాని వారెవరి నోటి నుండి రాని మాట నా రాతల వలన పరిచయమైన ముఖపుస్తక నేస్తం అన్నందుకు నిజంగా చాలా చాలా సంతోషమనిపించింది. థాంక్యూ సోమచ్ అండి .
చిన్ననాటి స్నేహితులం అందరం కలవాలనుకున్నప్పుడు ఒకొక్కరి ఫోన్ నెంబర్ దొరకగానే వెంటనే ఫోన్ చేసి మాట్లాడేసుకున్నాం ముప్పై ఏళ్ళైనా. అది అప్పటి స్నేహానికున్న అనుబంధమనుకుంటా. ఇప్పుడు కాలేజ్ వాళ్ళంతా కలవాలనుకున్నప్పుడు ఫోన్ నెంబర్లు చూసినా, మనం ఫోన్ చేసి మాట్లాడాలన్నా ఏదో సంకోచం. ఎవరి హోదా ఏమిటో, మనం పలకరిస్తే మాట్లాడతారో లేదో అని కూడా సందేహమే. చూద్దాం ఏ స్నేహం గొప్పదనమెంతో..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి