6, జులై 2024, శనివారం

నా కొత్త పుస్తకాలు


నావి 15 పుస్తకాలు ముద్రించిన  నవమల్లెతీగ కలిమిశ్రీ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు

జీవన మంజూష జులై24


 నేస్తం,

         ఇంటిపెద్ద సక్రమంగా లేకపోతే ఇల్లు సంతోషానికి నిలయంగా మనలేదు. పరిసరాలు, పరిస్థితులు, పెద్దల నడవడి పిల్లల మీద చాలా ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలు చిన్నప్పటి నుండి వారు పెరిగిన పరిసరాలకు ఎక్కువగా ప్రభావితులౌతారు. కొందరికేమో వీటన్నింటితో సంబంధం లేకుండా జీన్స్ బాగా డామినేట్ చేస్తాయి. మన పిల్లలు ఎలా ఎదగాలన్నది చాలా వరకు మన ప్రవర్తన మీదనే ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులయినా తమ పిల్లలు పద్దతిగానే పెరగాలని అనుకుంటారు. కాని విధిరాతను మార్చలేరు.

           కొందరు పిల్లలు కాస్త వయసు రాగానే తామేదో మహా గొప్పవారైనట్లు అనుకుంటూ, నలుగురిని తమ వెంటేసుకు తిరుగుతూ అదే ప్రపంచమన్న భ్రమలో బతుకుతుంటారు. అయినదానికి కానిదానికి ఇంటిని అరుపులు, కేకలతో దద్దరిల్లేటట్లు చేస్తూ ప్రతి చిన్న దానికి నానా యాగీ చేస్తుంటారు. వీరి అవసరాలకు, గొప్పలకు మాత్రం అమ్మాబాబు డబ్బులు కావాలి కాని మాటా మంచి ఏమి ఉండదు. వీరి నడవడి కూడా కాస్త అసహజంగానే ఉంటుంది. నిద్రకు, తిండికి సమయాసమయాలతో పని ఉండదు

           వయసు ప్రభావమనుకోవడానికి మనమూ వయసును దాటి వచ్చిన వారమే కదా. కాకపోతే మనము పెరిగిన వాతావరణం వేరు. ఇప్పటి పిల్లలు పెరుగుతున్న తీరు వేరు. ఆలోచనల్లోనే కాకుండా, ఇంట్లోవారితో ప్రవర్తించే తీరు కూడా చాలా తేడా ఉంటోంది. మన తరానికి పాఠశాలల్లో విద్యాబుద్ధులు గురువులు నేర్పించేవారు. వారు చెప్పిన మంచి చెడులను మనమూ అవగాహన చేసుకునేవారం. ఇప్పటి పిల్లలకు అంత సహనమూ లేదు, అదే కాకుండా కాస్త అహం కూడా తోడైంది. కాస్త ప్రశ్నించడాన్ని కూడా తట్టుకోలేక పోతున్నారు.

            బర్త్ డే పార్టీలంటూ లక్షలు తగలేయడమూ, అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా తిరగడమే ఈనాటి కల్చర్ అని అనుకుంటున్నారు. ఇంట్లోవాళ్లతో మాట మాట్లాడే తీరిక ఉండదు కాని గంటలు, గంటలు ఫోన్లు మాట్లాడటాలు, చాటింగ్ లు వీటికి మాత్రం సరిపడినంత సమయముంటుంది. ఇంటికి ఎవరైనా అతిథులు, బంధువులు వచ్చినా కూడా పలకరింపు ఉండదు. వారు పలకరించినా ముక్తసరి సమాధానాలు, లేదా పరాయివారు ఉన్నారు అన్న స్పృహ కాని, చుట్టుపక్కవారు వింటారన్న ధ్యాస కాని లేకుండా ప్రతిదానికి అరుపులతో, కేకలతో ఇష్టం వచ్చినట్టు వాగడం చేస్తుంటారు. వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటేమన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇదో మంత్రంఅన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు

            పిల్లలయినా పెద్దల విలువ తెలియకుండా ప్రవర్తిస్తుంటే మనం చూస్తూ నవ్వుకుంటే, రేపటి రోజున మనకూ అదే అందుబాటులోనికి వస్తుందని మర్చిపోకూడదు. డబ్బులు, అధికారం, హోదా ఇవన్నీ మన జీవితంలో చివరి వరకు ఉండవు. బంధాలు, అనుబంధాలు మనం ఎంతకాదనుకున్నా మన వెంట పడుతూనే ఉంటాయి. పిల్లల తప్పులను సరిదిద్దే ప్రయత్నం మనం చేయలేకపోతే, ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు


కాస్త ఆలోచించండి..!!

 నేస్తం,

         లక్షలు లక్షలు పోసి వస్తువులు కొనడం ఒక ఎత్తైతే వాటికి వచ్చే రిపేర్లతో తల ప్రాణం తోకకి వస్తోంది. కొనేటప్పుడు 10 ఏళ్ళు వారంటీ అంటారు. కనీసం సంవత్సరం కాకుండానే రిపేర్లు వస్తే వేలకు వేలు తీసుకుంటున్నారు. L G  కంపెనీ డబల్ డోర్ ఫ్రిజ్ లక్ష రూపాయలు పోసి తీసుకుని సంవత్సం పైన నాలుగు రోజులు అయ్యింది. సరిగ్గా సంవత్సరానికి వెనుక మోత వస్తుంటే డోర్ తీసి పట్టుకుంటే పోతోంది. డోర్ వేస్తే వస్తోంది. కాసేపటి ఓసారి ఇలా వస్తోంది. కంప్లయింట్ చేస్తే ఇద్దరు వచ్చి కాసేపు అది ఇది చూసి పైన బోర్డ్ తీసుకువెళ్లి, 2650 అవుతుంది అని ఫోన్లు. కంపెనీ వాడేమో 10 ఇయర్స్ వారంటీ అంటాడు. L G ఫ్రిజ్ లు కొత్తగా కొనేవారు కొనకండి. లోపల ఫాన్ల ప్రోబ్లం అని మధ్యన అవి మార్చారు. ఇప్పుడేమో బోర్డులు కంప్లయింట్లు వస్తున్నాయట. ఆలోచించి కొనుక్కోండి

      ఈమధ్యన ఆక్వాగార్డ్ నీళ్ళ చుక్కలు పడుతోందని కంప్లయింట్ ఇస్తే రిపేర్ ఎంత బాగా చేసారో. అంతకు ముందు చుక్కా చుక్కా పడే నీళ్ళు, ఇప్పుడు బోలెడు కారుతున్నాయన్న మాట. రెండు మూడు రోజులు లచ్చి చేసారు కాని ప్రోబ్లం పోలేదు.

       గత రెండు దశాబ్దాలుగా మాకు మహీంద్రా కంపెనీతో అనుబంధం ఉంది. స్కార్పియో నుండి XUV500, XUV700 వరకు వారితోనే. అంతకు ముందు రెండు వెహికల్స్ తో ఇబ్బందీ రాలేదు కాని XUV700 విజయవాడలో మెుదటిది మాది. కాకపోతే డెలివరీ మేము కాస్త లేట్ గా తీసుకున్నాము. తీసుకున్న రోజు రైట్ సైడ్ లైట్ పై గీతలు ఉంటే ఈసారి సర్వీస్ కి వచ్చినప్పుడు మార్చి ఇస్తామన్నారు. వెహికల్ తీసుకున్న రోజు నుండి స్టీరింగ్ కంప్లయింట్ ఉంది. లోపల మోతలు వస్తూ ఉన్నాయి. స్టీరింగ్ వదిలితే లెఫ్టికి వెళిపోతోంది వెహికల్. మధ్యన నెల రోజులు షోరూమ్ లోనే వదిలేసాము కంప్లయింట్స్ క్లియర్ చేసి ఇమ్మని. వాళ్ళు వెహికల్ బయటికి వేసుకెళ్లి యాక్సిడెంట్ చేసి కూడా మనకి చెప్పలేదు. డబ్బులు మాత్రం బోలెడు తీసుకుంటున్నారు. కంప్లయింట్స్ మాత్రం క్లియర్ చేయడం లేదు. మరి వాళ్ళకు రిపేరు చేయడం రానప్పుడు ఎందుకు రాదని చెప్పరో మనకు తెలియదు. ఇక మహీంద్రా వారి వెహికల్ మాత్రం తీసుకోము. సారీ ఆనంద్ మహీంద్రాగారు ఇలా చెబుతున్నందుకు. పనితనం తెలిసిన వారిని పెట్టుకోండి. ప్రోబ్లం రిజాల్వ్ చేయనివారిని మీరు పోషించడం ఎంత వరకు కరక్ట్. కనీసం రెండు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు మాకు స్టీరింగ్ ప్రోబ్లం, సౌండ్స్ ప్రోబ్లం క్లియర్ చేయలేదు. అదేమని అడిగితే XUV700 హైవేలకు మాత్రమే అని ఇప్పుడు చెప్తున్నారు. 30 లక్లల వెహికల్ హైవేలకు మాత్రమేనట

  

       లక్షలు లక్షలు పోసి ఏదైనా కొనే ముందు కాస్త ఆలోచించి కొనుక్కోండి


1, జులై 2024, సోమవారం

జీవన మంజూష సమీక్ష

 ప్రముఖ కవయిత్రి, రచయిత్రి మంజూ  యనమదల గారి                "జీవన మంజూష" 

పుస్తకం చదివితే ఏనాడో ఆంధ్రప్రభ వార పత్రికలో ధారవాహికంగా ప్రచురితమైన తెన్నేటి హేమలత గారి"ఊహా గానం" చటుక్కున గుర్తుకు వస్తుంది. ఈ నాడు నవమల్లెతీగ లో వచ్చే జీవన మంజూష వ్యాసాల కోసం ఎదురు చూసినట్లు గానే ఆ రోజుల్లో టీనేజ్ లోనే వారం వారం ఊహాగానం కోసం ఎదురు చూసేవాడిని. లత గారి వ్యాసాలలో భావుకత, మంజూ గారి వ్యాసాల లో వాస్తవికత కొట్టొచ్చినట్లు కనబడతాయి.

కుల మత వర్గ  రాజకీయ పరంగా నేటి సమాజంలో (కుటుంబాల తో సహా) జరుగుతున్న కుసంస్కార, వికృత పోకడలను  ఆమె నిర్మోహమాటంగా , నిర్బీతిగా  ఎండగట్టారు....చీకొట్టారు... ఘాటుగా సుద్దులు చెప్పారు.

అలా చేయకుండా ఆమె చూస్తూ ఊరుకోలేదు. అది ఆమె నైజం (అదంతా 

లోపల దాచుకోకుండా ప్రతిస్పందించక పోతే ఆమెకు నిదుర పట్టదు. లావై పోతాననే భయంకూడా నేమో!!! )  ఏ రంగంలో నైనా సరే చెడును సహించ లేదు... అక్షరాయుధలతో విరుచుకు పడుతుంది.   ఆరోగ్యం సహకరించక పోయినా తన రచనల ద్వారా సామాజిక బాధ్యతను నూటికి నూరుపాళ్లు ఆదర్శ ప్రాయంగా నిర్వహిస్తున్న  రచయిత  మంజూకు అభినందనలు.

....... డా. డి. ప్రసాద్.


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner