నేస్తం,
ఇంటిపెద్ద సక్రమంగా లేకపోతే ఆ ఇల్లు సంతోషానికి నిలయంగా మనలేదు. పరిసరాలు, పరిస్థితులు, పెద్దల నడవడి పిల్లల మీద చాలా ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలు చిన్నప్పటి నుండి వారు పెరిగిన పరిసరాలకు ఎక్కువగా ప్రభావితులౌతారు. కొందరికేమో వీటన్నింటితో సంబంధం లేకుండా జీన్స్ బాగా డామినేట్ చేస్తాయి. మన పిల్లలు ఎలా ఎదగాలన్నది చాలా వరకు మన ప్రవర్తన మీదనే ఆధారపడి ఉంటుంది. ఏ తల్లిదండ్రులయినా తమ పిల్లలు పద్దతిగానే పెరగాలని అనుకుంటారు. కాని విధిరాతను మార్చలేరు.
కొందరు పిల్లలు కాస్త వయసు రాగానే తామేదో మహా గొప్పవారైనట్లు అనుకుంటూ, నలుగురిని తమ వెంటేసుకు తిరుగుతూ అదే ప్రపంచమన్న భ్రమలో బతుకుతుంటారు. అయినదానికి కానిదానికి ఇంటిని అరుపులు, కేకలతో దద్దరిల్లేటట్లు చేస్తూ ప్రతి చిన్న దానికి నానా యాగీ చేస్తుంటారు. వీరి అవసరాలకు, గొప్పలకు మాత్రం అమ్మాబాబు డబ్బులు కావాలి కాని ఓ మాటా మంచి ఏమి ఉండదు. వీరి నడవడి కూడా కాస్త అసహజంగానే ఉంటుంది. నిద్రకు, తిండికి సమయాసమయాలతో పని ఉండదు.
వయసు ప్రభావమనుకోవడానికి మనమూ ఆ వయసును దాటి వచ్చిన వారమే కదా. కాకపోతే మనము పెరిగిన వాతావరణం వేరు. ఇప్పటి పిల్లలు పెరుగుతున్న తీరు వేరు. ఆలోచనల్లోనే కాకుండా, ఇంట్లోవారితో ప్రవర్తించే తీరు కూడా చాలా తేడా ఉంటోంది. మన తరానికి పాఠశాలల్లో విద్యాబుద్ధులు గురువులు నేర్పించేవారు. వారు చెప్పిన మంచి చెడులను మనమూ అవగాహన చేసుకునేవారం. ఇప్పటి పిల్లలకు అంత సహనమూ లేదు, అదే కాకుండా కాస్త అహం కూడా తోడైంది. కాస్త ప్రశ్నించడాన్ని కూడా తట్టుకోలేక పోతున్నారు.
బర్త్ డే పార్టీలంటూ లక్షలు తగలేయడమూ, అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా తిరగడమే ఈనాటి కల్చర్ అని అనుకుంటున్నారు. ఇంట్లోవాళ్లతో ఓ మాట మాట్లాడే తీరిక ఉండదు కాని గంటలు, గంటలు ఫోన్లు మాట్లాడటాలు, చాటింగ్ లు వీటికి మాత్రం సరిపడినంత సమయముంటుంది. ఇంటికి ఎవరైనా అతిథులు, బంధువులు వచ్చినా కూడా ఓ పలకరింపు ఉండదు. వారు పలకరించినా ముక్తసరి సమాధానాలు, లేదా పరాయివారు ఉన్నారు అన్న స్పృహ కాని, చుట్టుపక్కవారు వింటారన్న ధ్యాస కాని లేకుండా ప్రతిదానికి అరుపులతో, కేకలతో ఇష్టం వచ్చినట్టు వాగడం చేస్తుంటారు. వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే “మన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇదో మంత్రం” అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు.
ఏ పిల్లలయినా పెద్దల విలువ తెలియకుండా ప్రవర్తిస్తుంటే మనం చూస్తూ నవ్వుకుంటే, రేపటి రోజున మనకూ అదే అందుబాటులోనికి వస్తుందని మర్చిపోకూడదు. డబ్బులు, అధికారం, హోదా ఇవన్నీ మన జీవితంలో చివరి వరకు ఉండవు. బంధాలు, అనుబంధాలు మనం ఎంతకాదనుకున్నా మన వెంట పడుతూనే ఉంటాయి. పిల్లల తప్పులను సరిదిద్దే ప్రయత్నం మనం చేయలేకపోతే, ఆ ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి