13, మార్చి 2018, మంగళవారం

మరో ఉగాదికై ...!!

ఉషస్సుల ఉగాది పయనమౌతోంది
వసంతాల సంతసాలను మనకందించ
మరలిపోయిన సుఖ దుఃఖాల మరపుల్లో
క్రొంగొత్త ఆశల కొత్త కాంతులకై
అరుదెంచిన ఆనందాలహేలల సందడిలో
కొత్త పాటను నేర్చిన కోయిలమ్మ రాగాల సడిలో
మావి చివురుల వగరు ఆస్వాదనలో
తీపి చేదు పులుపు కారాల వంటి షడ్రుచుల సమ్మేళనంలో
వేదనాదాల నడుమ పుణ్యమూర్తుల పంచాంగ శ్రవణ ఆశీస్సులతో
విందు భోజనాల విస్తరిగా వడ్డించిన జీవితం
మరో ఉగాదికై మనసు పడుతోంది...!!
హితులకు, సన్నిహితులకు, మిత్రులకు, శత్రువులకు అందరికి విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు.... 

12, మార్చి 2018, సోమవారం

ఎనిమిదో రంగు పుస్తక సమీక్ష....!!

                మన అందరికి తెలిసిన ఏడురంగుల ఇంద్రధనస్సే కాకుండా ఎనిమిదో రంగును మనకు పరిచయం చేయడానికి అనిల్ డ్యాని తన కవితలతో మన ముందుకు వచ్చేసారు. ముఖ చిత్రంలోనే ఆ రంగు ఏమిటన్నది చెప్పకనే చెప్పేసారు. యథాలాపంగా చెప్పడం మొదలు పెట్టినా సమాజపు తీరు తెన్నులు ఏమిటనేది ఈరోజు గాయపడ్డ సూరీడుతో రేపటి ప్రభాతమైనా ఆంక్షలు లేకుండా రావాలన్న కాంక్షని, ధర్మస్థలిలో వెలివాడల ఒంటరి కేకల ఆర్తనాదాన్ని,  ఆమె - రాత్రి చందమామలో చీకటిలో మేల్కొన్న ప్రపంచంలో నిన్నటికి నేటి మధ్యనున్న ఓ శూన్య కాలంలో బీద గొప్పల అంతరాన్ని గ్రహణం పట్టిన చీకటికి వెలుగులు పూస్తున్న సందడి హడావిడిలో పెళ్లి ఊరేగింపులో పెట్రోమాక్స్ లైట్ పట్టుకున్న ఓ అమ్మ చీర చిరుగుని దాచడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మనసుకు హత్తుకునేటట్లు చెప్పడం అభినందించదగ్గ విషయం. మరణ వాంగ్మూలంలో మృతదేహం ఎప్పుడు మరణించిందో మనకు స్పష్టంగా విప్పి చెప్పారు. నీకు నువ్వుగా నీతో నువ్వుమాట్లాడే సమయాన్ని నీకు కేటాయించుకో అని ఈ మౌనం మంచిది కాదు అని ఓ చురక వేశారు. జండాపై కపిరాజులో తెలిసిన నిజం జనం చప్పట్ల మధ్య నలిగిపోతోందని ఙివిత నాటకంలో గెలుపెవరిదో చెప్పని ముగిసిన నాటకం పాత్రలో ఎక్కడ వాలాలో తెలియని పావురం ఆసరా కోసం మనిషి భుజాన్ని వెదుక్కోవడం, వ్యూహంలో వీరుని తుపాకిని ముద్దాడే సీతాకోక చిలుక, ఆమెతనంలో ఇసుక రేణువులో దాగిన సంద్రం,అణచబడినా మొలకెత్తే మరో వసంతం, తెల్లారొచ్చిన సూర్యుడి వెలుగంతా ప్రపంచ తల్లులు స్రవించిన రక్తమంటూ అహాలకు, అధికారాలకు అంగడిబొమ్మగా మారిన అతివ మనసును ఆవిష్కరించారు. ఆలింగనం మతాల మానవత్వాన్ని చాటి చెప్తోంది. ఇదిగో పొలం నుంచే వస్తున్నాను గత జ్ఞాపకాల గుర్తులను తడమడం, ఇక్కడ ఏడుపు నిషేధంలో మూర్ఖుల మారణకాండకు బలైపోతున్న అన్నెం పున్నెం ఎరుగని పసి ప్రాణాలను, అతని పాటలో మనసు రాగాన్ని, ఓ ధిక్కార స్వరాన్ని కొత్తగా వినిపించారు. వలస వాన అవసరానికి అందని చినుకు పల్లెలకు మొఖం చాటేయడాన్ని అద్భుతంగా అందించారు. జనరల్ బోగీలో మనిషితనం కాస్త మనసులకు అంటడానికి సహజత్వాన్ని కోల్పోవద్దని సూచించారు. ప్రవాహం, వాన రాత్రి, ఒంటి రెక్క పక్షులు, గ్రేటర్ దెన్ వంటి కవితల్లో కవిత్వం వినబడడాన్ని, సంఘర్షణల చిత్తాలను చూపించారు. కొన్ని మాటలంతే అంటూ మనం పోగేసుకున్నంత కాలం మిగిలేది మాటలు రాల్చిన మౌన గాయాల కబుర్లే అంటారు. ప్రతీకలుగా నిలిచేది కొన్ని పొద్దులు, సాయంత్రాలు కలిపి మిగిల్చిన కాసిన్ని నిజాలు, అబద్దాలని చెప్పడం, భలే మంచి చౌక బేరములో దేశ రాజకీయంపై విసుర్లు, వెలుతురూ విరుగుతున్న శబ్దం, పంజరం చిలుక,పిల్లలారా వంటి చక్కని సందేశాత్మక కవితలు, వెకెటింగ్ కవితలో వెలయాలి గుండెకోతను, కాటి సీను పద్యంలో మనిషిగా మనలేని మన బతుకుల్ని, గాయపడ్డవాడాలో ఓ ఆశావహ దృక్పధాన్ని, మనుషుల మధ్యలో దూరమౌతున్న అనుబంధాలను చూపించారు. ఇక చివరిదైన ఈ కవితా సంపుటి పేరైన ఎనిమిదో రంగు గురించి చెప్పడం అనిల్ మాటల్లోనే .. అన్ని రంగులను తనలో ఇముడ్చుకునే నలుపు వర్ణం . అదే "ప్రేమ".
నిజరూప దర్శనం, గాజు దేహాలు, నివేదన, మాయ తెర, పహారా, ఆ ఇంటి ముందు వంటి చక్కని ఆలోచింప చేసి కవితలు, మరో రెండు ఆంగ్లానువాద కవితలతో ఎనిమిదో రంగు ఓ కొత్త సోయగాన్ని అందుకుంది.

  అద్భుతమైన 35 కవితలను ఎనిమిదో రంగుగా ఆవిష్కరించిన అనిల్ డ్యానికి అభినందనల శుభాశీస్సులు...

మంజు యనమదల. 

జీవన 'మంజూ'ష (7)..!!

నేస్తం,
        నాలుగు తరాల అనుభవాలను అందిపుచ్చుకున్న జీవితం కాసిన్ని అనుభూతులను పంచుకోమంటూ ఆహ్వానిస్తోంది. వడ్లు దంపుకు తిన్న ఆ రోజుల అనుభవాలు, గొప్పగా బ్రతకకపోయినా గుంభనంగా గుట్టువిప్పని అనుభూతులను, పంచుకున్న తాయిలాలను, పట్టుపరుపుల మీద పడుకోకున్నా పండువెన్నెల్లో పంచుకున్న బంధాలను, కష్టం వస్తే కలిసికట్టుగా పెనవేసుకున్న అనురాగాలను ఇలా ఎన్నెన్నో ఆనాటి కబుర్లను  అమ్మమ్మ కథలుగా చెప్తుంటే వింటూ.. 
      అమ్మ పక్కలో పడుకుని అమ్మ చదివే చందమామ కథలు వింటూ ఆరుబయట వెన్నెల చల్లదనాన్ని అందిపుచ్చుకుంటూ, ఆటలాడుతూ చదివిన చదువులను నెమరువేసుకుంటూ అందరి మధ్యలో పెరిగిన బాల్యాన్ని, చుట్టపు చూపుల చుట్టరికాల్ని పెంచుకుంటూ, చక్కని స్నేహాలను పంచుకుంటూ రెండు తరాల సంపదను కాపాడుకుంటూ బంధాలను, బాధ్యతలను మరువని మన తరాన్ని... 
   పండు వెన్నెలా తెలియదు, పలకరించే బాంధవ్యాలు పెద్దగా తెలియని మన పిల్లలు, మన వరకే పరిమితమైన కుటుంబాలు, మన ఆలోచనా విధానంలో మార్పులతో మొదలైన మానసిక దౌర్భాగ్యాలు తొలగించలేని దుర్భేద్యాలుగా మారి అనుబంధాలను తెంచేస్తుంటే ఏమి చేయలేక చూస్తూ మిగిలిపోతూ, బాల్యాన్ని బరువైన చదువుల బరువుతో నింపేస్తూ, నలుగురిలో మనమూ గొప్పగా కనబడాలనే తపనతో నైతిక విలువలను నేల కూల్చుతూ ఆధునిక తరాన్ని డబ్బు, విలాసాలకు బానిసలుగా చేస్తున్న మనకు తెలిసినా తెలియనట్లు నటిస్తున్న అటు ఇటూ కానీ తరంగా మిగిలిపోతున్నందుకు ఖేదపడుతూ బోలెడు అభివృద్ధిని నాదించేశామని పొంగిపోతున్న నేటి సమాజ సామాజిక జీవులం మనం...!!

ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం....

ఈ నెల నవ మల్లెతీగలో నా వ్యాసం.... 

శ్రీ భవభూతి శర్మ గారి పుస్తక సమీక్ష గోదావరి వార్తా పత్రికలో...

గోదావరి యాజమాన్యానికి, కత్తిమండ ప్రతాప్ గారికి నా ధన్యవాదాలు...

7, మార్చి 2018, బుధవారం

ఆయుధ కర్మాగారం...!!

అంతర్యుద్ధమే అనునిత్యము
అలవికాని ఆశల ఆరాటాలకు
అర్ధం లేని అనుబంధాలకు నడుమ

వెసులుబాటు లేని వ్యాపకాల
వ్యామెాహానికి లోనైన మనసుల
నిర్వికార వాంఛల నిరోమయాలు

కన్నీళ్లకు కట్టుబడని వేదనలను
నేలరాలుతున్న జీవితాల రోదనలను
అక్షరాలకు పరిమితం చేస్తున్న భావాలు

సమాధాన పరిచే వెదుకులాటను
వెంటబడుతూ వేధిస్తున్న
వెతలకతలను అంతం చేసే ఆయుధ కర్మాగారమెక్కడని...!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner