12, మార్చి 2024, మంగళవారం

జీవన మంజూష 03/24


 నేస్తం,

          కొందరిని చూస్తుంటే వీరు ఇంతగా దిగజారి ప్రవర్తించడానికి కారణాలు ఏమిటన్నది అస్సలు అర్థం కావడం లేదు. తల్లిదండ్రులు వీరిని అంత సంస్కారహీనంగా పెంచారా అని బాధ వేస్తున్నది. అబ్బాయిలు ఏమైనా చేయవచ్చు ఆనాటి నుండి ఈనాటి వరకు. కాని అమ్మాయిలు పని చేసినా ఆక్షేపణలే అని బుుజువైంది. మనం వాడే బాష మన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది అని మనం మర్చిపోవడం చాలా బాధాకరమయిన విషయం. మన చట్టసభలే ఇందుకు ఉదాహరణ.

           ఒకప్పుడు ఆడపిల్లల్ని కాలేజ్ లలో ఏడిపించేవారు. ఎక్కడో ఒకటి అరా సంఘటనలు మినహాయించి శృతిమించని విధంగానే ఉండేది. రానురానూ కాలేజ్ లే కాకుండా స్కూల్స్ లో కూడా మెుదలైఇంతింతై వటుడింతైఅన్నట్టుగా టీజింగ్ వేళ్ళూరుకు పోయింది. ఇక మోబైల్ యుగంలో అది ఎంతలా పాకిపోయిందంటే మనం మనిషి అన్న విచక్షణని మరిచిపోయేతంగా!

            రీల్స్, వీడియోస్ పలానావాళ్ళే చేయాలి, ఇలాగే చేయాలి అన్న రూల్ ఏమైనా ఉందా! నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసినప్పుడు, ఎదుటివారికి కూడా హక్కు ఉందని మరిచిపోయి, మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారని, మనమూ అమ్మకే పుట్టామని మర్చిపోవడం చాలా విచారకరం. గత ఐదేళ్ళుగా ట్రోలింగ్ సంస్కారాన్ని పెంచి పోషిస్తున్న ప్రతి ఒక్కరికి మనం పాదాభివందనం చేయాల్సిందే. ఎందుకంటే ఇంత సంస్కారవంతంగా వారిని పెంచిన తల్లిదండ్రులకు మనం బుుణపడివున్నాం కనుక.

            బాధ్యతాయుతమైన పదవుల్లో వుండి, చట్టసభల్లో కూడా హేయమైన సంస్కృతికి శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్కరూ ఇందుకు బాధ్యులే. ఇలాంటి సంస్కారవంతుల్ని ఎన్నుకుంటున్న మన ప్రజాస్వామ్యానికి నా ప్రగాఢ సానుభూతి. మార్పైనా ఒక్కరితోనే మెుదలవుతుంది అన్న మాటకు ఇవన్నీ సాక్ష్యాలే. వ్యవస్థ అయినా బావుండాలంటే ముందు మన ఇంట్లో మనతో వున్న వారి వ్యక్తిత్వాన్ని చూడాలి. నిజానిజాలు తెలుసుకోవాలి. పదవులదేముంది, కొన్ని కోట్లు మనవి కావనుకుంటే చాలు. కాని పదవికి వన్నె తేవడంతోనే మన వ్యక్తిత్వం, సంస్కారం తేటతెల్లమౌతుంది. విచక్షణా జ్ఞానం మనిషికి భగవంతుడు ఇచ్చిన వరం. దానిని ఉపయోగించడం, ఉపయోగించక పోవడం అన్నది మనిషి పెరిగిన పరిసరాలు, పెంపకాలపై ఆధారపడి వుంటుంది. సంస్కారం లేనప్పుడు ఎన్ని వున్నా ఏమి లేనట్లే. మంచి మార్పు కోసం ఎదురుచూడటమే మన పని. ఆధునిక పోకడల యుగంలో కాస్తయినా మన అమ్మానాన్నల పెంపకాలను నలుగురూ ప్రశ్నించకుండా ఉండేలా నడుచుకోవడానికి ప్రయత్నిద్దాం..!!



           

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner