8, ఏప్రిల్ 2024, సోమవారం

జీవన మంజూష ఏప్రియల్ 24


 నేస్తం,

         నలుగురికి మంచి చేయాలన్న సత్ సంకల్పం ఉండటం మంచిదే. కాని ఈరోజుల్లో మన అనుకున్న బంధాలే అపరిచితంగా మారిపోతుంటే ఇక సమాజంలో మనకు సంబంధం లేని వ్యక్తులు మనం చేసే లేదా చేసిన మంచిని గుర్తుంచుకుంటారని పొరబడటం మన తప్పే అవుతుంది. మాట సాయానికే ఆమడ దూరం పోతున్న అనుబంధాలతో సహచర్యం చేస్తున్న రోజులివి. మనమేదో సమాజానికి మంచి చేయాలని, మన కష్టార్జితాన్ని పణంగా పెట్టి ముందుకు రావడం అన్నది కాస్త ఆలోచించాల్సిన విషయమే

          “మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేఅన్న మాట కాలం నుండి కాలం వరకు తన నిజాయితీని నిరూపించుకుంటూనే వుంది. బంధం ఏదైనా ధన సంబంధానికే ప్రాధాన్యత. మన అవసరాలు మనకి ముఖ్యం కాని మనకు ఎదుటివారు చేసిన సాయం అసలు గుర్తుంచుకోవాల్సిన అవసరం నేడు లేదు. ఎక్కడో ఒకటీ అరా గుర్తుంచుకునే కోవలో ఉంటాయి తప్పించి యావత్ ప్రపంచానిది ఒకటే బాట. ఏదేమైనా మనిషి సృష్టించిన సంపదే ఈనాడు మనిషి మనుగడను శాసించడం గర్హనీయం.

            పిల్లలను వృద్ధిలోనికి తీసుకురావాలని ప్రతి తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు. అది బంధానికున్న గొప్పదనం. పిల్లలు మాత్రం తాము ఎదిగాక, తల్లిదండ్రులు పరిచిన పూలదారిని మర్చిపోతున్నారు. అంతా తమ స్వయంకృషేనన్న అహం ప్రదర్శిస్తున్నారు. మన సమాజం నేడు ఇంతగా ఆర్థిక అనుబంధాలను మాత్రమే పెంపొందించు కోవడానికి రకంగా ఈనాటి తల్లిదండ్రుల పెంపకం నుండే బీజం పడుతోంది. “మనఅన్న పదం మనం మర్చిపోయినప్పుడు మన పిల్లలు కూడా మనం చూపిన దారిలోనే ప్రయాణిస్తారు

             స్వతహాగా మనకున్న సహజత్వాన్ని కోల్పోతూ, అసహజత్వాన్ని అందంగా ఆపాదించేసుకుంటూ, యంత్రాల్లా బతికేయడమే అసలైన బతుకని భ్రమపడుతున్నాం. మనకే అనుబంధాలు అక్కర్లేనప్పుడు మన పిల్లలకు వాటి అవసరమేముంటుంది? స్వార్థపు కొసలకు వేలాడుతున్న అనుబంధపు పాశాలు ఎప్పుడు పుటుక్కున తెగిపోతాయో ఎవరం చెప్పగలం. ప్రస్తుత సమాజంలో మనమూ భాగస్వాములమే కనుకనలుగురితో నారాయణాఅనుకుంటూ మనిషి ముసుగేసుకుని బతికేద్దాం..!


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner