27, నవంబర్ 2017, సోమవారం
సహజత్వమైన నటన...!!
నేస్తం,
సూక్తిముక్తావళి సూక్తులు చాలా ఎక్కువై, మనం పెట్టే సూక్తులు మనకే వర్తిస్తున్నాయని మర్చిపోతూ మనమూ గురువింద గింజలమై పోతున్నాం. మనలో సహజత్వమైన నటన సహజాతంగా మనతో కలిసిపోయిందని ఇతరులు గుర్తించరని అనుకుంటే అది పొరబాటే. మనం మంచివాళ్ళం అని నలుగురు గుర్తించడానికి మనతోనే ఉన్నవారిని అల్లరిపాలు చేయడం, లేనిపోని నిందలు వేయడం, అవాకులు, చవాకులు పేలడం వంటి పనులు ఎంత వరకు సబబు...?
వ్యక్తిత్వం పుట్టుకతోను, పెరిగిన పరిసరాల నుంచి మనకు ఆభరణంగా వస్తుంది. మన చుట్టూ వెన్నెలే చిమ్ముతున్నామని మనమనుకుంటే సరిపోదు, చీకటి నుంచి ఆ వెన్నెలను అనుభూతించే వాళ్లకు తెలుస్తుంది ఆ చల్లదనం. జీవితం విలువ తెలిసినవాళ్ళు ఇతరుల జీవితాలను నవ్వులపాలు చేయడానికి ప్రయత్నించరు. విలాసాలు, విందులు జీవితం కాదు, మనలని నమ్మినవాళ్లకు నేనున్నానన్న భరోసా ఇవ్వగలిగితే ఆ నమ్మకానికి వెల కట్టలేము. బంధం అనేది బలీయంగా ఉండాలి కానీ భరించలేనిదిగా ఉండకూడదు. ఆచరణ లేని సూక్తిముక్తావళి అసహ్యంగా ఉంటుంది. అభిమానం అనేది డబ్బుతో కొనేది కాదు, మనసుతో ముడిపడేది. నిజాయితీగా బతకాలంటే చాలా ధైర్యం కావాలి, సమయమూ ఉండాలి కానీ ఆ నిజాయితీని కోల్పోవడానికి ఒక్క క్షణం కానీ, ఓ మాట కానీ చాలు. నమ్మకం పోయిన తరువాత మళ్ళి ఎన్ని జన్మలు ఎత్తినా రాదు. మన పెద్దలు చెప్పినట్లు కాలు జారితే తీసుకోగలం కానీ మాట జారితే వెనక్కు ఎలా తీసుకోగలం..?
మనసులతోనూ, మనుష్యులతోను బంధాల పేర్లు, స్నేహ సంబంధాల ముసుగులు వేసి వక్ర భాష్యాలతో మంచితనంగా నటిస్తూ మోసాలు చేస్తున్న ఎందరో మహానుభావులందరికి మా పాదాభి వందనాలు. కాని ఒకటి మాత్రం మర్చిపోకండి ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీమీదే పడుతుందని తెలుసుకోండి చాలు...!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి