ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. డిసెంబర్ వచ్చింది అంటే పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరికి సంబరమే. పల్లెటూర్లో పెరిగిన మాకైతే మరీనూ. అప్పటి సరదాలు, సంతోషాలు గుర్తు చేసుకుంటూ ఇప్పుడు యాంత్రికంగా జీవితాలు గడిపేస్తున్నాము.
మా ఊర్లో అయితే పొలాల్లో వరికుప్పలు, వడ్ల రాశులు, చిన్న చిన్న మినుము, పెసర మొక్కలు, గడ్డి వాములు పొలాల్లో సందడి చేస్తూ ఉంటే, ఇక ఇళ్ళ దగ్గర ముద్దబంతి, చామంతి, కారబ్బంతి, సీతమ్మవారి జడబంతి వంటి పులా మొక్కలతోప్రతి లోగిలి, సంక్రాంతి ముగ్గులతో గుమ్మాలు, ఆ ముగ్గుల్లో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు వాటి అలంకారాలతో వాకిళ్లు కనువిందు చేయడం ఇప్పటికి ఓ మధుర జ్ఞాపకమే.
చదవడానికి తెల్లవారుఝామున లేవని మేము పండగ శెలవల్లో నాలుగింటికే లేచి ఆ చీకటిలో భయం లేకుండా ఆవులు పొడుస్తాయేమోనని కూడా లెక్క చేయక ఆవుపేడ కోసం వెళ్ళడం, గొబ్బెమ్మలు చేసి వాకిట్లో ముగ్గుల్లో అందంగా అమర్చడం, ధనుర్మాసంలో రామాలయంలో తెల్లవారుఝామున పంచే ప్రసాదాల కోసం పరిగెత్తడం, చలి కాచుకోవడానికి చలిమంటల దగ్గర చేరడం, ఆ చలిమంటలో వరిగడ్డి వేసినప్పుడు వడ్ల పేలాలు ఏరుకోవడం లాంటి బోలెడు జ్ఞాపకాలు తడుముతూనే ఉంటాయి ఇప్పటికి కూడా.
ఇంట్లోవాళ్ళు దులుపుళ్ళు, కడుగుళ్ళతో మొదలుబెట్టి నానబెట్టిన బియ్యం పిండి రోట్లో రోకళ్ళతో దంపడం, జల్లించడం, ఆ పిండితో చలిమిడి చేయడానికి పాకాలు చూడటం, నేతి అరిసెలు నొక్కడం, బూందీ లడ్డ కోసం బూందీతో పాటు మేము మిరపకాయ్ బజ్జిలు వేయించుకోవడం, చెక్కలు, చక్కిడాలు మొదలైన పిండి వంటలు మెక్కడం, భోగి మంటలు, భోగి స్నానాలు, బొమ్మల కొలువులు, చిన్న పిల్లలకు భోగిపళ్ళు పోయడం, కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు, కబడ్డీ ఆతల పోటీలు, పండగ పేకాటలు ఇలా చాలా సరదాగా గడిచిపోయేది సంక్రాంతి. కొన్ని సంవత్సరాల క్రిందట జరిగిన సంక్రాంతికి మా తాతయ్యనానమ్మల కుటుంబం అంతా మా ఇంటి దగ్గర చేరి ఆడిన అంత్యాక్షరి, పిల్లలు, పెద్దలు అని లేకుండా అందరమూ చేసిన అల్లరి, సముద్ర స్నానాలు, చూసిన అర్ధరాత్రి టూరింగ్ టాకీస్ లో సినిమా, అందరం కలసి చేసిన భోజనాలు ఇప్పటికి నిన్నే జరిగినట్లుగా అనిపించడం అంటే బహుశా ఆ అనుబంధాలలోని దగ్గరితనం కావచ్చు.
మన పెద్దలు మనకు మిగిల్చిన ఆస్తులు ఏమైనా ఉన్నాయి అంటే అవి ఈ మరిచిపోలేని అనుబంధపు ఆనవాళ్ళని నేను చెప్పగలను. తమకు తామే సమయాన్ని కేటాయించుకోలేని దీనస్థితిలో ఇప్పుడు జీవితాలు చాలా వేగంగా వెళ్లిపోతున్నాయి. మనం పుట్టి పెరిగిన మన ఊరుని చూడటానికి, ఆప్యాయంగా వినిపించే ఆ పల్లె పలకరింపులు కోసం కనీసం ఒక్కసారైనా మన అనుకున్న మనవాళ్ళ కోసం ప్రతి ఒక్కరు తమ తమ పరిమిత కుటుంబాలను తీసుకుని ఉమ్మడి కుటుంబాల సాంప్రదాయపు పండుగల సంతోషాలను ఆస్వాదించాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు మన తరువాతి తరాలకు కూడా అందించాలని కోరుకుందాం.
ఇంతకీ మా ఉరి పేరు చెప్పనే లేదు కదూ .... నరసింహపురం, కోడూరు మండలం, దివిసీమ అండి.. ముచ్చటైన పల్లెటూరు మాది.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి