12, ఫిబ్రవరి 2019, మంగళవారం

ఏక్ తారలు...!!

1.   పద బంధాలు పలకరిస్తూనే ఉంటాయి_ఆశలను అక్షరాలకందిస్తూ....!!
2.   ఈ అక్షరాలే అనునయించేది_విషాదానికిీ వెసులుబాటిస్తూ...!!
3.   ఎదను తాకిన ఉప్పెనది_ఎన్ని జన్మల ఎడబాటో మరి...!!
4.   నకలుతో పనేముంది_అచ్చంగా మనసంతా నీదే అయితే...!!
5.   స్వగతాలను సముదాయిస్తున్నా_స్వప్నాలను సాకారం చేద్దామంటూ....!!
6.   మరలని జ్ఞాపకమై మనతోనే ఉంది_గాయమైనా గతించని స్వప్నమై...!!
7.    మనసును మమతను పంచుకునేవి_మర్మమెరుగని ఈ అక్షరాలే....!!
8.   దేహాన్నంతా చీకటి చుట్టేసింది_మనసుని వెన్నెల్లోనికి ఒంపేస్తూ...!!
9.   అందిన నెయ్యమలాంటిది_ఆఖరి మజిలీ అచ్చెరువందేలా...!!
10.    అలలకు ఆశలెక్కువే_కల్లోలాన్ని సైతం కనబడనీయకుండా చేద్దామని..!!
11.    అక్షరాలు అలుకను మరిచాయి_హొయలొలికే నీ భావాలను చూస్తూ....!!
12.   పదాలు పరవశిస్తున్నాయి_అందమైన భావాల నడుమ అనునయంగా చేరుతూ....!!
13.   అక్షర అలల తుళ్ళింతలు_అలసిన మదికి ఆస్వాదనలా....!!
14.   విలక్షణాలు సులక్షణాలౌతాయి_మనకి మనం సరికొత్తగా ఆవిష్కృతమైతే...!!
15.    మది దాసోహమందుకే_పలకరించిన పలుకులన్నింటా నీ ప్రేమే నిండినందుకు...!!
16.    ఆర్ద్రత మనసుది_పదాలను పదిలంగా అందిపుచ్చుకునేవి భావాలైనప్పుడు...!!
17.   మనసు పడిందే నీ మౌనానికి_చదవనక్కర్లేకుండా అవగతమయ్యావనేమెా...!!
18.   రాతిరికి ప్రేమెక్కువైందట_చీకటిని వెన్నెలకు చుట్టేసిందందుకే...!!
19.    గమనం గెలుపు కొరకే_ఓటమిని సోపానాలుగా చేసుకుంటూ...!!
20.    ముగింపు వాక్యమెుక్కటే_మురిపెంగా మిగిలిన కవనానికి...!!
21.    కుదింపు తప్పని జీవితాలే అన్నీ_ముగింపు కథనం తెలిసినా....!!
22.   క్షణాలు క్షణికమైనవే_అనుభూతులను పదిలంగా మదిలో నిక్షిప్తం చేస్తూ...!!
23.   ముక్తాయింపు ముచ్చటైనదే_కవనంలో భావం సరికొత్తగా చేరితే...!!
24.   గాటిన బడుతున్నాయి సంతోషాలు_కాలాన్ని మది వశపర్చుకున్నాక...!!
25.   సద్దు మరచిన గుండె సవ్వడి నేర్చింది_కల'రవళులు నీతో ఊసులాడుతుంటే...!!
26.    వాస్తవమై వద్దనే ఉన్నానుగా_నిరంతరాయంగా నీ హృది సవ్వడి వింటూ..!!
27.    అక్షరాలకు మాటిచ్చాను_మనోభావాలను అనుసంధానం చేస్తానని..!!
28.    మర్చిపోతేనే కదా గుర్తుకొచ్చేది_ఏమయ్యావన్న చింతేల మరి...!!
29.   విలువైనది శూన్యమే_అనంత విశ్వాన్ని తనలో ఇముడ్చుకుని....!!
30.   పలకరిస్తున్నాయి బాల్యస్మృతులు_ఒడిదుడుకుల జీవితానికి ఒయాసిస్సుల్లా...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner