ఐదారేళ్ళ వయసులో అక్షరాలను నేర్చుకున్నా, తర్వాత చదవడం, రాయడం మొదలైనా, వాటిని పదాలుగా కూర్చడం మొదలైంది కూడా ఆ వయసులోనే.. అక్షరాలతో అనుబంధం దాదాపుగా ఏడెనిమిది ఏళ్ళ వయసు నుండి బాగా బలపడింది. అలా మొదలైన మా అనుబంధం ఇప్పటికి విడదీయలేనిదిగానే ఉండిపోయింది. నాలుగు పదుల నా పుస్తకాల సహచర్యం చదవడంతోనే ముగియకుండా నేను నా రాతలను పుస్తకాలు వేస్తూ, అచ్చులో చూసుకునే భాగ్యం కల్పిస్తున్న నా ఆత్మీయులకు ఎప్పటికి ఋణపడే ఉంటాను.
నా మనోభావాలను కవితలుగా, వ్యాసాలుగా ఐదు పుస్తకాలుగా మీ ముందుంచాను. ఇప్పుడు మరో ప్రక్రియగా "ఏకాంతాక్షరాలు" గా 28 అక్షరాల్లో రెండు వాక్యాలను కలుపుతూ చిరు కవితలుగా ఏక్ తారలను మీ ముందుంచుతున్నాను. సహృదయంతో ఆదరించి సద్విమర్శలు అందించండి.
కృతజ్ఞతలు...!!
ముందుగా ఈ పుస్తకం రావడానికి కారణమైన నా నెచ్చెలి అను కోనేరుకు మనఃపూర్వక కృతజ్ఞతలు. "నువ్వు రాస్తూ ఉండు మేము వేయిస్తాం నీ పుస్తకాలు" అంటూ ఏళ్ళు గడుస్తున్నా చెక్కు చెదరని అభిమానంతో నా వెన్నంటి ఉంటూ, ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో నన్ను నా రాతలను, నా తెలుగును సరదాగా ఆటపట్టిస్తూ, నా యాసను, భాషను అనుకరిస్తూ అభిమానించి నా రాతలు అచ్చులో పుస్తకాలుగా రావడానికి తమ సహకారాన్ని అందిస్తున్న నా నేస్తాలు నీరజ, శోభ, అనిత, మమతలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అడిగిన వెంటనే కాదనకుండా ముందు మాటలు రాసి నా అక్షరాలపై అభిమానపు జల్లులు
ఏక్ తారలు రాసింది నేనే అయినా ఇలా షడ్రుచుల సంగమంగా మీ ముందుకు రావడానికి కారణమై, తన అభిప్రాయాన్ని అక్షరాల్లో అందించిన సునీల్ కుమార్ నన్నపనేని గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆరు రుచులకు తగిన చక్కని చిత్రాలను, ముఖ చిత్రాన్ని వెదికి అందించిన సోమ శేఖర్ గారికి, గూగులమ్మకు మనఃపూర్వక ధన్యవాదాలు.
నా ఐదు పుస్తకాలతోపాటు ఆరో పుస్తకమైన "ఏకాంతాక్షరాలు" ని అందంగా తీర్చిదిద్దడంతోపాటుగా తమ అమూల్యమైన అభిప్రాయాన్ని అందించిన మల్లెతీగ పబ్లికేషన్స్ కలిమిశ్రీ గారికి, వారి సతీమణి రాజేశ్వరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖపుస్తకంలోనూ, బ్లాగు లోకంలోనూ నిరంతరం నా రాతల్ని అభిమానిస్తూ, నన్ను ప్రోత్సహిస్తున్న వేలాదిమంది సాహితీ మిత్రులకు నా వినమ్రపూర్వక నమస్సులు.
అక్షరాంకితం...!!
బంధాలు, అనుబంధాలు రాతలకు, మాటలకు పరిమితమై పోతున్న ఈ రోజుల్లో నాలుగేళ్ళ స్నేహాన్ని మరువక, మూడు పదుల తర్వాత కూడా ఆ ఆప్యాయతనలాగే పదిలంగా నాకందించిన నా ప్రియ నెచ్చెలి, తన అర్ధభాగము, తెలుగు సాహిత్యాభిమాని అయిన " శ్రీనివాస్ సిరిగిన " కు ఈ "ఏకాంతాక్షరాలు" అంకితం.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి