1. రెప్ప
వాలింది
తొలి రెక్క
తలను వాల్చింది
మరో
సూర్యోదయానికై..!!
2. అంటరానివౌతున్న
బంధాలు
దగ్గరౌతున్న
దూరాలు
మాటలు కరువౌతున్న
బుుణ సంబంధాలు..!!
3. వెదికేది
దొరకదని తెలుసు
దొరికినది
నచ్చదు
సర్దుకుపోవడం
అలవరుచుకోవడమే..!!
4. ముగిసిపోయిన
అధ్యాయాలేం వుండవు
తలు(ల)పులు
తడుతూనే వుంటాయి
కాలం
పరిగెడుతూనే వుంటుంది..!!
5. పురోగమనపు
పునాదులు
తిరోగమనపు
తీరుతెన్నులు
నోట్లకు
రాచబాటే ఎప్పుడైనా..!!
6. చీకటి
చూడని జీవితాల్లేవు
వెలుతురు
పడని వాకిలి లేదు
బతుకు పుస్తకంలో నిండిన
కాగితాలివి..!!
7. ప్రజా రంజక
పాలన
ప్రజా కంటక
పరిపాలన
అందరికి తెలిసిన
సత్యమిది..!!
8. ఉన్నతస్థితి
ఆపాదించుకుంటే రాదు
అధమస్థాయికి
ప్రవర్తనే సాక్ష్యం
విచక్షణ
వివేకవంతుల లక్షణం..!!
9. యంత్రాలతో
మాయలు
తంత్రాలతో
ముసుగులు
యాంత్రికతే
ఇప్పటి లక్షణం..!!
10. జీవితంలో
సమస్యలు కొందరికి
జీవితమే
సమస్య మరికొందరికి
అవినాభావ సంబంధం
జీవితానికి, సమస్యకు..!!
11. దెప్పిపొడుపు
కరతలామలకం
మౌనమే
ఆభరణం
ఏ నైజం
ఎవరిదో..!!
12. చంపడం
చావడం
మధ్య
చిన్న తేడా
అంతరం
ఆంతర్యానికెరుక..!!
13. నాటకాలేగా
ఎప్పుడూ
అప్పుడప్పుడూ
కాసింత నిజాయితీ
వెదకడం
దొరకడం కష్టమేనేమో..!!
14. గుండె
గుప్పెడు
మనసు
మౌనం వీడదు
మాట
మహా నేర్పరి!!
15. దండుకున్నంత
ధనము
దాచుకున్నన్ని
గురుతులు
కాలంతో
జీవితం..!!
16. దూరం
దగ్గర చుట్టమే
అనుబంధమే
ఆమడదూరం
పాశాల
వ్యామోహం..!!
17. అనుభవాల
పసితనమెుకటి
అరమరికలెరుగని
ఆకతాయితనమెుకటి
బాల్యం
జ్ఞాపకాల చిట్టానే ఎప్పుడూ..!!
18. అమ్మనీ
మర్చిపోతున్నాం
అనుబంధాలకు
దూరమౌతున్నాం
దగ్గరి చుట్టం
ధనమే..!!
19. రూపం లేని
మనసు
నటనాగ్రేసరుడు
మనిషి
జీవన నాటకం
రక్తి కడుతోంది..!!
20. పుస్తకం
ఏదైనా
అచ్చుతప్పులు
సరిదిద్దుకోవాలి
జీవితపు పుటల్లో
అనుభవాల పాఠాలు..!!
21. సహనం
ఉండాలి
సమయపాలన
తెలియాలి
మనసును
అక్షరాలు (సం)గ్రహిస్తాయి..!!
22. నిత్యంలేని
బతుకు
నిత్యసంచారి
కాలం
ఆశ చావని
మనిషి..!!
23. శూన్యానికి చుట్టమైన
ఆకాశం
మనసు దాచిన
మౌనం
కడలి నేర్పిన
పాఠం..!!
24. అర్థం కాని
రాత
వీడలేని
పాశాలు
అంతర్మథనం
జీవితం..!!
25. తప్పించుకోలేని
తడబాట్లు
తలపడలేని
యుద్ధాలు
పట్టువిడుపుల
మంత్రాలు..!!
26. విశ్రాంతి కోరిన
దేహం
విరామమెరుగని
మనసు
ఉరుకుల పరుగుల
బతుకు ఆట..!!
27. చీకటి చుట్టం
పక్కనే ఉంటుంది
వెలుతురు బంధుత్వాన్ని
కాదంటూ
పోరాటం తప్పని
బతుకులు..!!
28. మేకాపులి
ఆట
ఎత్తులు పైఎత్తులు
రాజకీయం
బుద్ధికుశలత
అవసరం..!!
29. మనసెరిగిన
రుచులే అన్నీ
అక్షరాలకు
మాలిమైన భావాలే ఇవన్నీ
నుదుటిరాత
జీవనగీతగా మారింది..!!
30. అడుగే
ఆమడ దూరం
బంధం
బల’హీనమే
మా’నవ సంబంధాలన్నీ
ఆర్థికావసరాలే..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి