ఈ నెల నవమల్లెతీగలో నా వ్యాసాన్ని ప్రచురించిన సాహితీ సంపాదకులకు, యాజమాన్యానికి మనఃపూర్వక ధన్యవాదాలు…
నేస్తం,
అవసరం అనేది ఎప్పుడు ఎవరితో ఎలా వస్తుందో మనకే కాదు, ఆ భగవంతుడికి కూడా తెలియదేమా. మనకేంటి మన దగ్గర అన్నీ వున్నాయన్న అహం మనకుంటే, మరుక్షణం ఏమౌతుందన్నది మనకు తెలియదు. ఏది జరగడానికైనా రెప్పపాటు చాలు. ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవడం గురించి చరిత్రలో ఎన్ని సంఘటనలు చూడలేదు.
కాలాన్ని మించిన చరిత్ర ఎక్కడుంది? కాలం చేతిలో మనమందరం ఆటబొమ్మలమే. ఈరోజు అవకాశం మనదని విర్రవీగితే రేపటి రోజున అదే అవకాశం మరొకరి సొంతమౌతుంది. ప్రపంచమంతా ఇప్పుడు నడిచేది అధికారం, డబ్బు అనే రెండు అంశాలపైనే. అవి ఎప్పుడు స్థిరంగా ఒకరి దగ్గరే ఉండవు. ఈ దాహార్తిని తీర్చుకోవడానికి ఎవరి ప్రయత్నం వారు చేస్తూనే ఉంటారు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా. అశాశ్వతమైన ఆడంబరాల కోసం నిరంతరం ప్రాకులాడుతూనే ఉంటారు ఉచ్చం నీచం మరిచి. మనల్ని పదికాలాలు గుర్తుగా ఉంచేది నలుగురికి మనం చేసిన మంచో చెడో ఈ రెండింటిలో ఏదైనా కావచ్చు. మనం ఏం చేయాలన్నది మన నడవడిపై ఆధారపడి ఉంటుంది.
అటు పాత తరానికి, ఇటు కొత్త తరానికి మధ్యన నలిగిపోతున్న మధ్య తరం గురించి ఎవరికి పట్టడం లేదు. ఆధునికత మోజులో పిల్లలు, వారి గొంతానమ్మ కోరికలు తీర్చడానికి వీరు పడే అవస్థలు చెప్పనలవి కావు. ఇంట్లో ఇవతల పుల్ల తీసి అవతల పెట్టరు కాని జిమ్ములు, గమ్ములంటూ అర్ధరాత్రి వరకు తిరుగుళ్ళు. ఇంటి వంటలు ఒంటికి పట్టవు కాని వేలకు వేలు తగలేసి బయట కుళ్లిన వంటలు లొట్టలోసుకుంటూ తింటారు. ఇంట్లో మనుషులతో అవసరాలకు మాత్రమే మాటలు. సెల్ ఫోనుల్లో నిదుర మరచి చాటింగ్లు, కబుర్లు. అదేమని మాట అడిగామా ఇక మహాభారత యుద్ధమే. మళ్లీ దానికో పేరు ప్రస్టేషన్ అని.
కాలంతో పాటుగా మనమూ మారాలని అనుకున్నా , మారలేని మధ్య తరగతి బతుకులు మనవి. గతానికి, వాస్తవానికి మధ్యన నలిగిపోతూనే ఉంటాయిలా. అన్నింటిని తనలో నింపేసుకుని, నిమిత్తమాత్రురాలిని అన్నట్టుగా కాలం సాగిపోతూనే ఉంటుంది చరిత్ర పుటల్ని నింపేస్తూ..!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి