3, నవంబర్ 2023, శుక్రవారం

జీవన మంజూష నవంబర్23


 నేస్తం,

         “మెుదటి అడుగు ఎప్పుడూ ఒంటరేఅన్న నానుడి మనకు తెలిసిందే. చివరి పయనానికి కూడా తోడెవరూ వుండరు. ప్రపంచంలోకి రావడం, పోవడం రెండు ఒంటరిగానే జరుగుతాయి. నడిమధ్యన బంధాలు, బాధ్యతలు, కోపాలు, తాపాలు వగైరాలన్నీ మన మానసిక, శారీరక స్థితిని బట్టి వస్తూ, పోతూ వుంటాయి. రెప్పపాటు జీవితానికి రెప్పలార్పే క్షణాలను లెక్కేయడం సాధ్యమేనా..!

           అధికారమైనా, అహంకారమైనా మన మానసిక స్థితి వాటిలో ప్రతిఫలిస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. వ్యక్తిగతానికి, వ్యవస్థకు ముడిబెడితే ఫలితం ఏమిటన్నది చరిత్ర చెబుతోంది. గీతాబోధకుడు చెప్పినట్టు చేసేది, చేయించేది పైవాడే. నేను నిమిత్తమాత్రుణ్ణి అంటే నమ్మడానికి ఇది పురాణయుగం కాదు. మన లెక్కల తక్కెడ మనదే. మార్చాలని చూడటం అవివేకం. “బుద్ధి కర్మానుసారిణేఅన్న మాట అక్షరాలా నిజం. మనం మన కుటుంబానికే న్యాయం చేయలేనప్పుడు వ్యవస్థకు ఎలా న్యాయం చేయగలం? ప్రశ్న మనల్ని ఎవరో వేయడం కాదు మనల్ని మనమే ప్రశ్నించుకునే ధైర్యం మనకుండాలి. అప్పుడే వ్యక్తిగా మనం గెలిచినట్లు. వ్యక్తిగా మనం ఓడిపోయినప్పుడు వ్యవస్థను గెలిపించగలమా!

             పుట్టడం, గిట్టడం అన్నది సృష్టిలో జరిగేనిరంతర ప్రక్రియ”. మనమెలా బతికామన్నది చివరకు మన చావు చెబుతుందట. ఇది నా మాట కాదు పెద్దల మాట. పుడుతూ ఏమి తీసుకురాము. పోతూ ఏం తీసుకుపోతామన్నది మనం చూసిన రణాలు చెప్పిన బహిర్గత రహస్యం. అయినా పాకులాటలు వదులుకోలేక పోతున్నాం. మన బలాలు, బలహీనతలు ఏమిటన్నది మనకే బాగా తెలుసు. కల్పనలు, వాస్తవాలు ఏమిటన్నదీ తెలుసు. నిజాన్ని నిర్భయంగా ఎదుర్కునే ధైర్యమున్నప్పుడు ఓటమి కూడా గెలుపేనని ఎంతమందికి తెలుసు? ఇక్కడ గెలిచామా, ఓడామా అని కాదు పోరాటంలో ఎంతమంది స్ఫూర్తిని పొందారన్నది ముఖ్యం. విజేత ఎప్పుడూ ఓడిపోడు. ఓటమి నుండే విజయాన్ని సొంతం చేసుకుంటాడు. ఇది తెలుసుకుంటే జీవితాన్ని గెలిచినట్లే..!!


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner