నేస్తం,
మనకి మనం గొప్ప కావచ్చు కాని, అదే ఉద్దేశ్యం మనపట్ల ఎదుటివారికి ఉండాలనుకోవడం సరి కాదు. చూడగలిగే మనసుంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్కరిలో ఏదోక గొప్పదనముంటుంది. ఆ గొప్పతనాన్ని గుర్తించే గొప్ప మనసు మనకుండాలి. సమయం అందరిది ఒకటే. మన కోసం ఎదుటివారు ఓ క్షణం కేటాయించినా అది వారి సహృదయత. దానిని గౌరవించే సంస్కారం మనకు కూడా ఉండాలి.
నా రాతలకు ప్రతిస్పందన తెలియజేస్తున్న అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇన్ని సంవత్సరాలుగా ఆదరిస్తున్న మీ సహృదయతకు మనఃపూర్వక వందనం. ముఖపుస్తకానికి వచ్చిన కొత్తలో “మన తెలుగు మన సంస్కృతి” సమూహంలో ప్రతి ఒక్కరి పోస్ట్‌కి నా స్పందన తెలియజేసేదాన్ని. నా గోడ మీద పోస్టులకు సరిగా స్పందన ఉండేది కాదు. అయినా నాకు నచ్చిన రాతలు రాసుకుపోతున్నాను ఇప్పటికి. అప్పటికి ఇప్పటికి నా రాతలకు స్పందనలు బాగా పెరిగాయి. అలా అని నేను చూసిన ప్రతి పోస్ట్ కి వీలైనంత వరకు నా స్పందన తెలియజేస్తూనే ఉన్నాను ఇప్పటికి.
మనమేదో గొప్ప అనో, మన రాతలు గొప్పవనో కాదు. మనకు ఎదుటివారు స్పందించినప్పుడు కనీసం మనకు తోచిన విధంగా వారికి ప్రతిస్పందించడం మన సంస్కారం. సమయం మనకెంత విలువైనదో ఎదుటివారికి కూడా అంతే కదా. నాకు తెలిసి నేను అనవసరంగా రాసాను అనుకున్నవి రెండు పోస్టులు ఇప్పటికి. ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను.
తెలుగు భాషను అభిమానించే అందరికి, స్పందనలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి మనఃపూర్వక ధన్యవాదాలు. ఏమరుపాటున ఎవరినైనా నొప్పిస్తే మంచి మనసుతో మన్నించేయండి మరి..🙏
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి