నేస్తం,
తన కోపమే తన శత్రువు అన్నది ఒకప్పటి మాట. మన కోపమే మన ఉన్నతికి పునాది అన్నది ఇప్పటి మాట. ఓటమి నుండి విజయానికి బాటలు ఎలా పడతాయో అలాగే కోపం నుండి వచ్చే పట్టుదల ఉన్నత శిఖరాలను అందుకోవడానికి దోహదపడుతుంది. లక్షణం, అవలక్షణం అనేవి మనం చూసే విధానంలో వుంటాయి. ఎదుటివారిలో లోపాలు మాత్రమే చూసే మన కంటికి మంచి లక్షణాలు కనబడక పోవడంలో వింతేమీ లేదు. మనం చేసే ప్రతి పనీ మనకు గర్వకారణం అయినప్పుడు ఇతరులు కూడా అలాగే అనుకోవడంలో తప్పేం లేదు కదా.
మనవి మాత్రమే నికార్సయిన బతుకులు అనుకోవడం సహజమే మరి. చెణుకులు, విరుపులు మనకు మాత్రమే చాతనౌనని, మిగతావారంతా ఎందుకూ కొరగానివారని అనుకోవడం మన అమాయకత్వం. పురస్కారాల కోసం వెంపర్లాటలు, ఎవరెవరో ఏదేదో చేస్తున్నారని వాపోవడం, మనం మాత్రం మన రాతలు గొప్పవి కనుక ఆ పురస్కారాలు మనల్ని సహజ సిద్ధంగా వరించాయని సంబరపడటం మంచిదే. అవును మరి మనం పరిస్థితులను మనకనుకూలంగా మలచుకోవడంలో సిద్ధహస్తులం కదా. ఏ ఎండకా గొడుగు పట్టడం మన అలవాటని నలుగురికి తెలిసిపోతోందిప్పుడు.
అక్షరాలను అర్థవంతమైన పదాలుగా, వాక్యాలుగా కూర్చడమనేది భగవదనుగ్రహం. మనకు ఆ వరముందని మన ఇష్టం వచ్చినట్టు రాతలు రాయడం చేస్తే ఆభగవదనుగ్రహమే, ఆగ్రహంగా మారి నామరూపాలు లేకుండా పోవడమన్నది చరిత్ర చెప్పిన సత్యం. మన కుసంస్కారాన్ని బయటేసుకోవడంలోనే మన బుద్ధి నలుగురికి తెలిసిపోతోంది. ఎర్రగుడ్డ కప్పుకున్నోళ్ళందరూ ఎర్రసైన్యమైపోరు. ఏ నిజమైన సిద్ధాంతమైనా, రాతలయినా ప్రజలు, సమాజం పురోగతిలో వుండాలని కోరుకుంటుంది కాని మన అవసరాలకు సిద్ధాంతాలను, మనకనుగుణంగా మార్చుకొమ్మని చెప్పదు. కులమతాల చిచ్చులను ప్రోత్సహించదు. పరాయి కులమతాలను అవహేళన చేయమని మనల్ని కన్న తల్లిదండ్రులు కూడా చెప్పరు. ఒకవేళ మన ప్రవర్తన అలా వుందంటే మన సంస్కారం ఏపాటిదో నలుగురికి మనం చెప్పకనే చెబుతుంది.
ఖురాన్ చెప్పినా, బైబిల్ చెప్పినా, భగవద్గీత చెప్పినా సర్వమానవ హితాన్నే కాంక్షించమని చెప్తుంది. విశ్వ వినాశనాన్ని బోధించదు. మనది లౌకికదేశం. అది మనకు గర్వకారణం కావాలి కాని కులమతాను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం సమంజసం కాదు. ఈ దిక్కుమాలిన సంత నేడు సాహిత్యానికి కూడా ఎగబాకి, విలువైన సాహితీ సంపదను నడిబజారులో అపహాస్యం చేస్తోంది. సాహిత్య విలువలను దిగజారుస్తున్నారు కొందరు పెద్దలు ఈ (కు)సంస్కారులకు వెన్నుదన్నుగా నిలుస్తూ.
కొందరు సాహితీ పెద్దలు ఈ కులమతాలను ఎద్దేవ చేసే సాహిత్యాలను భుజాలపై మోయడం, వారిని అందలాలు ఎక్కించడం, వారికి మిగతా అనుయాయులు తప్పెట్లు మోగించడం చేస్తుంటే, మనం చూస్తూ వుండడం తప్ప ఏం చేయలేక పోతున్నాం. అదేమని అడిగితే మన మీద కూడ కులమతాల జల్లు కురిపించేస్తారు సదరు సమూహాలు. రాతల్లో గొప్పదనాన్ని చూడటం ఎప్పుడు మెుదలు పెడతారో అప్పుడే సాహిత్యానికి మంచిరోజులు వచ్చినట్టు. రాబోయే కాలంలోనయినా ఆ మంచిరోజులు వస్తాయని ఎదురుచూద్దాం..!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి