26, జూన్ 2013, బుధవారం

ఎలా ఉన్నానని చెప్పను...??

అమ్మా...!! వానలో కాకులు తడిచిపోతున్నాయి పాపం వాటిని లోపలి పిలువు అన్న అప్పటి అమాయకత్వం, హాయిగా అమ్మ చాటు బొమ్మలా ఆడి పాడిన రోజుల ఆ కమ్మదనం ఇంకా నిన్నా మొన్నటిలానే అనిపిస్తోంది...!! పసితనపు స్వచ్చత, ఆనందం, హాయి ఎప్పటికి మళ్ళి దొరకవేమో....!! అందుకే దేవుడు కూడా ఆ ఆనందాన్ని చూడటానికే మనకు పసితనాన్ని వరంగా ఇచ్చాడేమో అనిపిస్తోంది. ఏ బాదరబంది లేని జీవితం అది.
ఏంటో చూస్తూ చూస్తూనే జీవితం కాలంతో పోటి పడి పరుగెత్తి పోతూంది నా ప్రమేయం లేకుండానే...!! ఎన్నో అనుకోని ఊహించని మలుపులు మెలికలు తిరుగుతూ చుట్టుకు పోతుంటే వదిలించుకోడానికి శతవిధాల ప్రయత్నాలు...ఆ యత్నంలో కొన్ని సఫలం మరికొన్ని విఫలం....ఏదైనా మన ప్రయత్నలోపం లేకుండా చూసుకోవడమే....!! ఫలితం అనుభవించడమే ఏదైనా....!! అస్సలు నీకు కోపమే రాదా....!! అని అడిగితే ఏం చెప్పను....?? కోపం, బాధ, సంతోషం అన్ని కలిసిపోయి నేనుగా ఉన్నానని చెప్పాలా....!! మనిషినే కాక మనసుని కూడా ఇబ్బంది పెట్టిన మానవ బంధాలను గురించి చెప్పాలా...!! ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఏది చేయలేని నిస్సహాయత నాదని చెప్పాలా....!! అనుబంధాల పేరుతో జలగల్లా పట్టి పీల్చుకున్న నెత్తుటి చుక్కల్లో.... మోసపోయిన నా గతాన్ని చూడమని చెప్పాలా....!! అవసరానికి పై పై ప్రేమలకు కరిగిపోయిన నా అమాయకత్వాన్ని అడగమని చెప్పాలా...!! ఇలా ఎన్నో గాయాలతో చితికిపోయిన హృదయానికి కొన్ని పన్నీటి జల్లులతో మందు వేస్తూ రేపటి పై మమకారంతో చిరిగిన మనసుకి అతుకులు వేస్తూ చస్తూ బతుకుతున్నానని చెప్పాలా....!! ఎలా ఉన్నానని చెప్పను...??

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

surya prakash apkari చెప్పారు...

ఎలా ఉన్నానని చెప్పను ...??లో మంజుగారు బాల్యపు పురాస్మృతులను ఆనందంగా అందంగా నెమరేసుకొని,నమ్మించి గొంతుకోసిన గోముఖవ్యాఘ్రం తన గుండెలోతుల్లో చేసిన గాయాలను తడుముకొని ,లుప్తమవుతున్న మానవసంబంధాలను పరమసున్నితంగా మాటలతో బొమ్మ గీశారు!

చెప్పాలంటే...... చెప్పారు...

అమాయకత్వం...మంచితనమని నమ్మిన మానవ బంధాలు కొన్ని అలానే ఉన్నాయండి....అతి చక్కని మీ ప్రశంస కి నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రకాష్ గారు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner