8, జూన్ 2013, శనివారం

నీకెలా తెలుసు బంగారూ....!!

కలలోని కధలో నీవెవ్వరో....!!
కనుల ఎదుట నీవున్నా....
కనిపెట్టలేని నేనెవ్వరో....!!

అస్పష్టమైన నీ రూపాన్ని
కరిగిపోయిన కలలో కాంచి
స్పష్టంగా గీయాలన్న నా యత్నం....!!

అమ్మదనపు హక్కుతో
నాలో చేరిన నువ్వు
నా ప్రతి రూపంగా నాలో నీ
ఆకారాన్ని పొందే ప్రయత్నంలో....!!

నీ స్పర్శ సుతి మెత్తగా తగిలి
నాలో నువ్వున్నావని గుర్తించిన వేళ...!!
నాలోని మమకారమో...
నీలొని మాయాజాలమో...
నాకే తెలియకుండా నా తలపులన్ని నీతోనే...!!

ఆకృతి లేని నీకు అర్ధం కాదనుకున్న
నా మనసు భాష నీకు తెలిసిందో...!! ఏమో ...!!
నీ కదలికల అలజడితో...
భాష తెలియని బంధంతో
పాశాన్ని పెనవేసుకున్నావు నాతో...!!

ఎప్పుడెప్పుడు నిను చూస్తానా...!!
కలలోని ఊసులు నిజంగా నీతో చెప్పాలని...
నాలో జీవమైన నీ సజీవ చిత్రాన్ని 
చూసుకోవాలని పడే తాపత్రయం....!!


నా గీతల్లో ఉంది నువ్వే అని
నా ఎదురుగా ఉన్న నీ చిత్తరువు చెప్తున్నా....
నా ప్రతిరూపమైన అపురూపమైన
నీ ఆగమనం కోసం ఆత్రంగా
ఎదురు చూస్తున్న అమ్మని
నేనే అని నీకెలా తెలుసు బంగారూ....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner