17, జూన్ 2013, సోమవారం

నిత్య నూతనంగా....!!

ఇది దేవుడు రాసిన బంధమో లేక నేను చుట్టుకున్న అనుబంధమో అర్ధం కావడం లేదు కాని నీతో పెంచుకున్న పాశం తెంచుకుందామంటే ఎక్కడో ఓ మూలన ఉన్న అనురాగం ఆ పని చేయనివ్వడం లేదు. ఇన్ని ఏళ్ళలో ఓ క్షణమైనా నీకోసమే అన్ని వదులుకుని వచ్చిన నా గురించి కేటాయించాలని నీకనిపించక పోవడం నా అదృష్టమో దురదృష్టమో మరి. నీతో మాట్లాడాలంటే నీకు క్షణం తీరిక లేదాయే....నాకు మాత్రం జీవితమంతా నీతో మాట్లాడటానికే చాలదు....ఏమిటో ఈ అర్ధం కాని వ్యత్యాసం మనలో...!! కాసేపు నాతో మాట్లాడితే నువ్వు నాకు తెలిసిపోతానని నీకు భయం కదూ....అయినా నీకు తెలియని విష్యం చెప్పనా...నువ్వు నాకు కొత్తగా తెలియడానికేముంది....నేను తెలియని నువ్వూ  కాదు నువ్వు తెలియని నేను కాదు....!! ఇది నీకు అర్ధం అయ్యేసరికి ఓ జీవితకాలం పడుతుందేమో....!! అప్పటికి నా జీవితం అయిపోతుంది నీకోసం చూసి చూసి....నిరాశతోనే....!! నీకు తెలుసు....నీకోసమే నేనని అయినా ఒప్పుకోలేవు...ఎక్కడ నీలోని అహం దెబ్బతింటుందేమో అని నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ దానిని గెలిపిస్తూ నువ్వు ఓడిపోతున్నావు....!! కానీ అదే గెలుపు అనుకుంటున్నావు....నేను ఓడినా నువ్వు గెలిచినా అది అది మన ఇద్దరిది కలిపి ఒక్కరిదే....!! నిన్ను గెలిపించాలని నేను ఓడిపోతూనే ఉన్నానని నీకు ఈ జన్మకి తెలుస్తుందా...!! నేను కరిగి పోతూనే ఉన్నా నీకు వెలుగు కనిపించాలని పడే తాపత్రయం నీకెప్పటికి తెలుస్తుందో....!! చితికి ముక్కలైన మనసుకి సర్ది చెప్తూ కాసింత సంతోషమనే మందుతో దానిని ఓదార్చుతూ ఎప్పటికప్పుడు నిద్ర పుచ్చుతూనే ఉన్నా.....!! అందమైన అనుబంధం దగ్గరగానే ఉందని ఆశతో....!! గల గల పారే జలపాతాన్ని.... మాటలు మర్చిపోయిన మౌన సరస్సులా చేశావు. నే అల్లుకున్న పూల పొదరింటిని...పరిమళం లేని రెల్లు గదిలా మార్చేశావు....!! గడచిన కాలాన్ని తిరిగివ్వలేని నీకు....
నీతో ముడి పడిన నా జీవితాన్ని నీ జ్ఞాపకాల ఒడిలో....నిదుర పొమ్మని చెప్తూ నువ్వు వెళ్తూ నా నిదురని కూడా  తీసుకు వెళ్తే నేనెలా మరి...?? రెప్ప వేయడం మరచిన కనుపాపలో కూడా నువ్వే కనిపిస్తున్నావని అందరు అనుకుంటున్నారు తెలుసా నీకు...!! కలత నిదుర కలలో నిన్ను చూస్తానని ఆ నిదురలో కలలను కూడా మాయం చేసిన నీ మాయాజాలం నాకెరుకలే....!! నేనే నువ్వయ్యానని నీకు తెలియక పోయినా నాకు తెలుసు....నీ చిత్తరువు నాతోనే ఎప్పటికి సజీవంగా నిత్య నూతనంగా....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner