21, ఫిబ్రవరి 2018, బుధవారం

జీవన 'మంజూ'ష (8)..!!

నేస్తం,
        ఏమిటో ఈ హడావిడి జీవితాలు. ఎక్కడ చూసినా అంతులేని అగాధాలు పరుచుకున్న అనుబంధాలు, అర్ధం కాని సంబంధాలు కాన వస్తున్నాయి. నేటి మన వివాహ వ్యవస్థ చాలా బలహీన పడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు బరువు బాధ్యాల నడుమ భార్యాభర్తలు కీచులాడుకున్నా తమ ఉన్న బంధాలకు బద్ధులై సరిపెట్టుకునేవారు. ఇప్పటి రోజుల్లో సామాజిక మాధ్యమాల పుణ్యమా అని మంచిని మరచి చిన్న చిన్న మాట పట్టింపులకే తమతో పెనవేసుకున్న అనుబంధాలను వదలి వేయడానికి క్షణం కూడా ఆలోచించడం లేదు. ఖరీదైన విలాసవంత జీవితాల వైపు మొగ్గు చూపుతూ క్షణిక సుఖాల కోసం జీవితాలను అధఃపాతాళంలో పడవేసుకుంటున్నారు. వ్యక్తిత్వాలకు విలువ లేకుండా డబ్బుకు దాసోహమౌతున్నారు. వివాహ బంధమనే కాకుండా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై పోవడానికి ఈ సామాజిక మాధ్యమాలు చాలా దోహద పడుతున్నాయి. మనం కోరుకుంటున్న మార్పు ఇదేనా..?
       మన చుట్టూ ఉన్న ప్రతి అనుబంధంలోనూ నిజాయితీ ఉండాలని అనుకోవడంలో తప్పు లేదు, కానీ మనం ఎంత వరకు నిజాయితీగా ఉంటున్నామని మనస్సాక్షిని ప్రతి ఒక్కరు ప్రశ్నించుకుంటే మనం కోరుకుంటున్న మార్పు మనతోనే మొదలౌతుంది. అనుబంధాలను వ్యాపారంగా మార్చుతున్న కొందరు తమకంటూ కనీసం ఒక్క కన్నీటిచుక్కను కూడా మిగుల్చుకోలేరు. అధికారం, డబ్బు, హోదా ఇవేవి అనుబంధాలను, మానవతా విలువలను మనకు ఆపాదించలేవు. ప్రతి మనిషికి వ్యక్తిత్వం చాలా విలువైన ధనం. అది లేని నాడు కోట్లు ఉన్నా గుణానికి పేదవారే. తమ చుట్టూ ఎందరున్నా ఎవరు లేని ఏకాకుల్లా మిగిలిపోతారనడంలో ఏమాత్రం సందేహం లేదు.  కొన్ని వేల జీవితాలు అసంతృప్తిలో నలిగిపోతూ త్రిశంకు స్వర్గంలో తేలుతున్నాయనడానికి మన చుట్టూ ఉన్న నిదర్శనాలు చాలు. మనకు లేని సంతోషం ఎదుటివారికి ఉందని  ఈర్ష్య పడితే పెద్దలు చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకోవడమే " ఒకళ్ళకి పడి ఏడిస్తే ఒక కన్ను.."  సామెత మనకు నిజమై పోతుంది.  ప్రపంచంలో డబ్బు, హోదాతో గెలవలేనివి కొన్ని ఉంటాయని మనము గుర్తెరిగి నడుచుకుంటే రేపు పోయినప్పుడు మోయడానికి నలుగురు దొరుకుతారు, లేదా... ఆ నలుగురే కాదు కన్నవాళ్ళు, కడుపున పుట్టినవాళ్ళు కూడా అసహ్యించుకునే బ్రతుకై పోతుంది. ..!!                                                                                                                                                                        ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం....         

ఈ నెల మల్లెతీగలో లో నా ఆర్టికల్...                              

1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

sam చెప్పారు...

dear sir very good blog and very good information
Latest Telugu News

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner