23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

ఆకాశం అవతలి వైపుకి....!!

                                     
              ఆకాశానికి అవతలి వైపున ఏముందోనని మనల్ని కూడా ఒకింత ఆలోచింపజేయడానికి సమాయత్తమైన రసాయన శాస్త్ర అధ్యాపకులు శ్రీ జమ్ములమడుగు భవభూతి శర్మ గారికి ముందుగా నా అభినందనలు. ఆకాశానికి ఒక వైపు జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించిన శర్మగారు ఆకాశానికి మరో వైపున ఏముందో చూడాలన్న జిజ్ఞాసతో తన అనుభవాలను, భావాలను, అభిప్రాయాలను మన ముందుకు తీసుకు రావడానికి చేసిన కవితా ప్రయత్నమే ఈ "ఆకాశానికి అవతలి వైపుకి" కవితా సంపుటి ముఖ్యోద్దేశ్యం.
             ఆత్మ దర్శనం కోసం నిత్యాన్వేషణ చేసి పరమానందం కోసం మనిషి తనకు తానుగా పొందవలసింది జ్ఞాన యోగమని చక్కని అలతి పదాల్లో వివరించారు. అక్షరాల అక్షయాన్ని కలం బలంతో మాటల వీణలు మ్రోగిస్తూ తన కవితలను ఆ నుండి అం, అఃలతో సాగించి అమ్మానాన్న, బంధాలు, బలహీనతలు,  అనుబంధాలు,సమానతలు, అసమానతలు, నిత్యావసరాలు, చెత్తబుట్ట, చిగురుటాకు,.. ఇలా ప్రకృతిలోని ప్రతి సాధనాన్ని, సున్నిత అంశాలను తనదైన ప్రత్యేక శైలిలో అక్షరాలను అందంగా పదాల్లో పొందు పరచి మన ముందుంచారు. 
               జనన మరణాల తరువాత ఏమిటి అన్న సందేహానికి పరిపూర్ణ జీవితాన్ని చూసిన జమ్ములమడక భవభూతిశర్మ గారి "ఆకాశం అవతలి వైపుకి" కవితాసంపుటి ఓ చక్కని సమాధానం అవుతుంది.  ఆత్మ దర్శనం కోసం అన్వేషించే నిత్యాన్వేషణలో జ్ఞానయోగ మార్గానికి సాధన, పరమానందాన్ని పొందడమే మోక్షమని సరళ పదాల్లో చెప్పడమే ఓ తార్కాణం.
                  ఆటపాటల పసితనాన్ని ఆది అక్షరం ఆ తో మొదలు పెట్టి పదాలు, కవితలు, రచనలతో పుస్తకాలుగా మలిచి బడి, గుడి, పండుగలు, పద్ధతులు, ప్రామాణికాలు, కుటుంబం, ఆరాటం, పోరాటం వెరసి జీవితాన్ని మనకు చూపే ఎన్నో కవితలు ఈ సంకలనం నిండా మనకు కనిపిస్తాయి. ప్రక్రుతి, పర్యావరణం, మట్టి, మనసు, అంతరంగం, కాలం, పురాణాలు, ఆధునికత, విశ్వ పరిణామ క్రమం అన్ని కలిపి మరణానికి ఆవలి వైపుననున్న మరో ప్రపంచం ఏమిటన్నది తెలుసుకోవాలన్న ఆరాటాన్ని పరమాత్మ అంతరిక్ష చైతన్యంలో విశ్వరూప అద్భుత అంతరిక్ష విజ్ఞాన శాస్త్ర కృతిని పరమాత్మ ఆకృతిని ఆవిషరించడం నిజంగా ఓ అద్భుతమే. ఇది "ఆకాశం అవతలి వైపుకి" ఒక వైపునే జీవితం.
                ఇక రెండో వైపున ఏముందనేది శర్మ గారి మాటల్లోనే చూద్దాం. గమ్యం తెలియని జీవన ప్రయాణాన్ని ఆత్మసాధనలో అనంత విశ్వాన్ని, విశ్వ పరిణామక్రమంలో ప్రకృతిలో జరుగుతున్న మార్పులను జీవితానికి వైజ్ఞానికి శాస్త్రానికి, మనకు తెలియని విశ్వా చైతన్యానికి అన్వయిస్తూ అంతరిక్షాన్ని, ఆ వింతలను తన భావాల్లో మనకు చూపి మనలో సరికొత్త ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం చేశారుమేథస్సుకు అంతు చిక్కని నిగూఢ శక్తిని అక్షరీకృతం చేయడంలో కృతకృత్యులయ్యారనే చెప్పవచ్చు.
                  ముఖపుస్తక పరిచయమే అయినా అభిమానంగా ఆదరించే శర్మగారు ఈ "ఆకాశం అవతలి వైపుకి" కవితాసంపుటికి నన్ను నాలుగు మాటలు రాయమనడం మహద్భాగ్యంగా భావిస్తూ ... మరిన్ని కవితా సంపుటాలు వెలువరించాలని కోరుకుంటూ.. మనఃపూర్వక అభినందనలతో ...   
                                                                                               మంజు యనమదల 
                                                                                                   విజయవాడ 
          


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner