ఈ నెల నవ మల్లెతీగలో నా వ్యాసం ....
15, ఫిబ్రవరి 2018, గురువారం
జీవన "మంజూ"ష ...!! (6)
నేస్తం,
అవసరానికి అనుబంధాలను అడ్డుగా పెట్టుకుంటూ, అవసరం తీరాక అధఃపాతాళానికి తొక్కేస్తున్న రోజులివి. కుటుంబ బంధాలు కానీ, స్నేహ సంబంధాలు కానీ ఏదైనా తమ స్వార్ధం కోసం వాడుకునే నీచ నైజాలు ఎక్కడికక్కడే దర్శనాలిస్తున్నాయి. పిల్లలని చూడని తల్లిదండ్రులు, తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు సర్వ సాధారణమై పోతున్న రోజులు ఈనాడు మన సమాజంలో. ఒకప్పుడు ఇంటి నిండా బాంధవ్యాలు, బంధుత్వాలు వెల్లివిరిసేవి. ఇప్పుడు ఉమ్మడి అన్న పదమే మర్చిపోయి బ్రతికేస్తున్నాం. అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు నిండుగా కనిపిస్తున్న రోజులు ఇవి. జన్మనిచ్చిన వారిని గాలికి వదిలేసి జల్సాగా కాలం గడిపేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎందరో. భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్న గౌరవ ఉపాధ్యాయులెందరో. .
ఆధునికంగా ఎంతో ముందడుగు వేస్తున్నాం కానీ మానవత్వాన్ని, మంచితనాన్ని మరుగున పడేస్తున్నాం. చేసిన సాయాన్ని మర్చిపోతూ, మన స్వార్ధమే చూసుకుంటూ రోజులు గడిపేస్తున్నాం. అమ్మ పెట్టిన గోరుముద్దలు మరచి ఆ అమ్మ ఎప్పుడు పోతుందా అని రాబందుల్లా ఎదురుచూస్తున్నాం. తాతకు పెట్టిన ముంత తల వైపునే ఉంటుందని మర్చిపోతున్నాం. ఎందుకీ మార్పు మనలో. మన అమ్మాబాబు మనకి విలువలతో కూడిన జీవితాన్నే ఇచ్చారు కానీ మనమెందుకిలా మారిపోయాము...? డబ్బులతో అనుబంధాలను, అభిమానాలను కొనాలని చూస్తున్నాం. పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు అని పూర్వపు నానుడి. బతికుండగానే నరకాన్ని చూపిస్తున్న పుత్ర రత్నాలెందరో నేడు.
పిల్లలని ఇబ్బంది పెడుతున్న పెద్దలు ఉన్నారు. అహంకారంతో కొందరు, ఆత్మాభిమానంతో మరికొందరు అనుబంధాలను అభాసుపాలు చేస్తూ నలుగురిలో నగుబాటు అవుతున్నారు. దీనివల్ల మనసులు విరిగి మమతలు దూరం అవుతున్నాయి తప్ప ఏ విధమైన ఉపయోగం ఉండటం లేదు. అవసరాలు అగాధాలను సృష్టిస్తున్నాయి కాని అనుబంధాలను పెంచడంలేదు. దీనికి కారణం మన ఆలోచనల్లో వైరుధ్యాలుండటమేనా...!!
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం.
ఈ నెల నవ మల్లెతీగలో నా వ్యాసం ....
ఈ నెల నవ మల్లెతీగలో నా వ్యాసం ....
వర్గము
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి