22, ఫిబ్రవరి 2018, గురువారం

స్వోత్కర్ష ఎక్కువైతే...!!

నేస్తం,
         మన గొప్పలు మనం చెప్పుకుంటే తప్పు లేదు కానీ, ప్రతి ఒక్కళ్ళ మీద పడి ఏడవడం ఎంత వరకు సబబో విజ్ఞులే చెప్పాలి. భాషని, భాషలోని లోతుపాతుల్ని అవపోసన పట్టిన వాళ్ళు కూడా ఎదుటివారిలో తప్పుల్ని ఎట్టి చూపరు, సున్నితంగా చెప్తారు. నాలుగు అక్షరాలూ రాయడం వచ్చింది కదా అని ఎవరిని పడితే వారిని అంటుంటే ఎదురుదెబ్బలు తప్పవు. గొప్పదనం మనం ఆపాదించుకుంటే రాదు. వ్యక్తిత్వం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి దానితోనే మనకు విలువ వస్తుంది. నోటి దురుసుదనంతో మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఆ గొప్పదనం తుడిచిపెట్టుకు పోతుంది.
       అక్షరాలకు కూడా అధికారాన్ని, హోదాను, డబ్బుతో కొలుస్తూ కులాలను విరివిగా ఆపాదించేస్తున్న రోజులివి. మంచి చెడు అన్ని చోట్ల ఉంటుంది, అందరిలో ఉంటుంది. అందుకని అందరిని ఒకే గాటిన కట్టేయడం కూడా సరి కాదు కదా. నాలుగురాళ్లు వెనకేసుకోవచ్చుకాని నలుగురి నోళ్లు కొట్టి సంపాదించడం కాదు. నీతులు చెప్పడం చాలా సుళువు కానీ ఆ చెప్పే నీతులలో ఒక్కటైనా పాటించడం కనీస బాధ్యత అని మనలో ఎందరం అనుకుంటున్నాం. నలుగురి గోడల మీద నుంచి నాలుగు నాలుగు ముక్కలు సేకరించి అన్ని కలిపేసి మన సొంతమే అని మన గోడ మీద పెట్టేసుకుంటే మనమేమి మంచివాళ్ళం అయిపోము, మన బుద్ది తెలియనంత వరకే మన ఆటలు, ఒకసారంటూ మన ఊసరవెల్లి రంగులు బయటపడ్డాక జీవితంలో మన మొఖం ఎవరు చూడరు. ముఖ్యంగా స్నేహాలకు, అనుబంధాలకు విలువలనిచ్చే కొద్దిమంది అస్సలు దగ్గరకు కూడా రానివ్వరు. మన చిల్లర వేషాలు తెలియనంత వరకే మన ఆటలు సాగేది. ఫంక్షన్లు, పార్టీలు చేసి డబ్బులు ఎగ్గొట్టే రకాలు, మన ముందు ఒకలా నటించి, మన వెనుక అవాకులు చెవాకులు వాగుతూ మన కొంపల్లో చేరి మనల్ని వాడుకుంటూ మరో నాలుగు ఇళ్లల్లో నాలుగు రకాలుగా గడుపుతుబతికే బతుకులు, నేపద్యాలంటూ వల్లె వేస్తూ నలుగురి దగ్గరా నాలుగు మాటలు చెప్పి డబ్బులు దండుకుని ఎదుటివారిలో తప్పులు వెదుకుతూ బతికేసే జనాలు, స్నేహం ముసుగులో నయవంచన చేసి పదిమంది దగ్గరా కాసిన్ని కన్నీళ్లు ఒంపేస్తే మంచితనం వచ్చి పడిపోదు. ఇలాంటి వాళ్లకు శూన్యం కూడా చుట్టమై రావాలంటే భయపడుతుంది.
       ఏంటో నేస్తం చాలా చెప్పాలని ఉన్నా ఇన్ని రోజులు నిస్తేజంగా ఉండిపోయాను. ఇంకా బోలెడు చెప్పాలనే ఉంది కానీ ఇప్పటికే నా మీద కారాలు మిరియాలు నూరే వాళ్ళు ఎక్కువై పోయారు. మరోసారి మరిన్ని కబుర్లతో ... !!  

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner