24, సెప్టెంబర్ 2018, సోమవారం

గుంభనంగా...!!

సముద్రాన్ని చూడు
ఎంత గుంభనంగా ఉంటుందో
లోలోపల ఎన్ని బడబానలాలున్నా
పైకి ప్రశాంతంగా కనిపిస్తూ

చూస్తూనే ఉన్నావుగా  
చీకటంతా నా చుట్టమైనా 
వెలుగుల కోసం వేగిరపడని 
నిశ్శబ్ద నిరీక్షణ నాదని 

నీకు తెలుసు కదా
కాలమాడుతున్న దోబూచులాటలో
మనసుకు దేహానికి కుదరని సమతూకం
మారణాయుధమై వెన్నంటే ఉందని

క్షణాల ఆశల ఆరాటానికి
యుగాల ఎదురుచూపుల  
ఏకాంతాల సహవాసానికి నడుమన 
నిలిచినదీ జీవితమని గమనించు..!!

21, సెప్టెంబర్ 2018, శుక్రవారం

మాటల వరకే పరిమితం....!!

                            పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు, రైతు రాజ్యమే మా లక్ష్యం, రైతన్న అన్నం పెట్టే దేవుడు ఇలా వగైరా వగైరా మాటలన్నీ ఎక్కడో విన్నట్టుగా ఉంది కదూ. పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఓట్ల కోసం చెప్పే మాటలే ఇవి... హమ్మయ్య అందరికి గుర్తు వచ్చాయనుకుంటాను. ఇక అసలు విషయానికి వస్తాను. మాది కృష్ణాజిల్లా దివితాలూకాలోని కోడూరు పక్కన ఓ మారుమూల పల్లెటూరు.  కనీసం ప్రభుత్వ రవాణా సౌకర్యాలు లేని ఊరు. కోడూరు నుంచి ఆటో వారు ఎంతంటే అంతా ఇచ్చి నడవలేని వారు వెళ్లడం అనాదిగా జరుగుతోంది. ఒకప్పుడు రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఇప్పుడు ఉన్నా కూడా ప్రభుత్వం ఒక్క బస్ కూడా వేయని ఊరు మా ఊరు నరసింహపురం.
                           అసలు విషయం ఏంటంటే రైతులకు పంటకు ఆధారమైన కాలువలే ఇప్పుడు కనబడకుండా పోయే పరిస్థితి వస్తోంది. పంట కాలువ, మురుగు నీటి  కాలువ అని ప్రత్యేకంగా ఉండే కాలువలు కూడా సరిగా లేని దుస్థితి ఇప్పుడు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే నాధుడు లేడు. మా ఊరి నుంచి సాలెంపాలెం, గొంది ఊర్లకు   దారి, 2500 ఎకరాలకు వెళ్ళడానికి అదే దారి, జయపురం, కృష్ణాపురం, నరసింహపురం, ఉల్లిపాలెం పొలాలకు మురుగు కాలువ అయిన లింగన్న కోడు కాలువ మీద వంతెన 2001 లో పడిపోయినా ఇప్పటి వరకు దాని అతి గతి పట్టించుకున్నవారు లేరు. ఊరివారు కాస్త మట్టి, అవి ఇవి వేసి ఆ వంతెన పూర్తిగా పడిపోకుండా చేసారు. కాని బాగా శిథిలావస్థలోనున్న వంతెన ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునేవారు లేరు. ఊరివారు ఏమైనా చేయగలరా అంటే ఒకరు బాగు చేద్దాం అంటే మరొకరు వద్దని అడ్డం తిరగడం, పనికిమాలిన రాజకీయాలు, మంచి చేసే వారిని తిట్టడం, స్వలాభం లేనిదే ఏమి చేయనివ్వని తత్వాలు పెరిగిపోయాయి.
                       పదిమందికి ఉపయోగ పడే ఆ వంతెన ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, కనీసం మన ఊరంతా కలిసి బాగు చేసుకుందామన్న ఆలోచన వచ్చిన వారికి అండగా నిలబడడానికి ఊరిలోని అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ముందుకు రాకపోవడమన్నది చాలా విచారకరం. ఊరి వాళ్ళ ఓట్లతో గెలిచింది మీరు డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే కాదు, కనీసం దానిలో కొంతయినా శ్రద్ధ ఊరి అవసరాల కోసం, ఊరి బాగు కోసం మీ పరపతిని ఉపయోగించండి. నాలుగు కాలాలు ఊరి జనాలు మీ పేరే చెప్పుకుంటారు. అందరికి అవసరమైన వంతెన పునర్నిర్మాణానికి ప్రభుత్వం, ప్రజలు సహకరించాలని కోరుకుంటూ... ఊరి మీద అభిమానాన్ని చంపుకోలేని ఓ సామాన్యుడు. 

త్రిపదలు...!!

1.  ప్రణయం..
పరిచయమయ్యాకే తెలుపుతుందనుకుంటా
బంధాల నడుమ బాంధవ్యాన్ని...!!

2.  మాయ చేసినా
మరిపించినా
జ్ఞాపకమెప్పుడూ మురిపెమే...!!

3.   చిక్కని చీకటి వనంలో
ధనం వర్ణ శాంతి కపోతం
స్వేచ్ఛా వాయువులకై గగనయానం...!!

20, సెప్టెంబర్ 2018, గురువారం

జీవన "మంజూ"ష (సెప్టెంబర్ )

నేస్తం,
        వ్యవస్థలో విలువలు తగ్గుతున్నాయంటే కారణాలు మరెక్కడో వెదుకుతాం కాని వెదుకులాట మనతోనే మొదలు పెట్టం. ఎందుకంటే మన మీద మనకంత నమ్మకం. మనం ఏ తప్పు చేయని ప్రబుద్ధులమని ప్రగాఢ విశ్వాసం కూడాను. పెళ్ళాం / మొగుడు పిల్లల మంచి చెడు అవసరం లేదు. ప్రపంచానికంతా ఆదర్శవంతులమే కాని మన ఇంట్లో మాత్రం ఎవరి అవసరాలు పట్టించుకోము. కుటుంబం మన అలంకారానికనుకుంటూ, బాధ్యతలు పంచుకుని, బంధాలను పెంచుకోవడానికని మాత్రం మర్చిపోతాం. ఆపదల్లో అందరిని ఆదుకోవడానికి మన విశాల హృదయాన్ని చాటుకుంటాం ఎల్లప్పుడూ. మంచితనం ముసుగు మనమే కప్పుకున్నామో, మరెవరయినా మనకు దాన్ని ఆపాదించారో తెలియని స్థితిలో ఆ ముసుగు నుండి బయటకు రావడానికి ఇష్టపడక నటిస్తూనే జీవించేస్తుంటాం.
      బాధను సంతోషాన్ని పంచుకోవడానికి మన అన్న వారికి మనం ఎలా లేకుండా ఉంటామో, రేపటి రోజున మనకంటూ ఎవరు ఉండరని తెలుకోలేము. చావు పుట్టుకలు ప్రతి ఇంటిలోనూ సహజమన్నది మరచి, మన అహంకారానికి మనమే మురిసిపోతూ డబ్బు పొగరుతో ఆ డబ్బు జబ్బుని మర్చిపోయి రేపన్నది మనకి ఉంటుందని గుర్తు లేనట్టు ప్రవర్తిస్తాం. విభజించి పాలించడం రాజకీయాల్లోనే పరిమితం కాకుండా మనమూ ఆ లక్షణాలన్నీ అవపోసన పట్టేసి అనుబంధాలను అతలాకుతలం చేస్తూ మన ప్రతిభకు మనమే గర్వపడి పోతున్నాం. ఆ ఇంటి బాధ రేపటి రోజున మన ఇంటిది కాకుండా పోదని మర్చిపోయి ప్రవర్తిస్తున్నాము. వయసు పెరుగుతున్న కొలది మన వ్యక్తిత్వం నలుగురు మెచ్చేదిగా ఉండాలి కాని నలుగురిలో నవ్వులపాలు కాకూడదు. నీతి సూత్రాలు వల్లే వేసి, నాలుగు గుడులు తిరిగినంత మాత్రాన మన సహజ లక్షణం పోయి మనము ఏమి మహాత్ములమైపోము. మనస్సాక్షి ఉంటుంది కదా దాన్ని తరచి చూస్తే తప్పొప్పులు తేటతెల్లమౌతాయి. కాదు కూడదు అహంకారాన్నే ఆభరణంగా అమర్చుకుంటామంటారా అది మీ ఇష్టానికే వదలి నలుగురితోపాటు నారాయణా అనడం మేమూ నేర్చుకుంటాం.

ఇప్పటికి ఈ  ముచ్చట్లకు సశేషం.... 

15, సెప్టెంబర్ 2018, శనివారం

కలల ప్రపంచం...!!

కలల ప్రపంచం కాలిపోతోంది
నైరాశ్యపు నీడలలో పడి

మనోసంద్రం ఘోషిస్తోంది
మౌనపు అలల తాకిడికి

కాలం కనికట్టు చేస్తోంది
ఊహలకు ఊతమిచ్చే క్షణాలకు లొంగి

రెప్పల కవచం అడ్డు పడుతోంది
స్వప్నాల మేలిముసుగు తొలగించడానికి

తెలియని చుట్టరికమేదో పలకరించింది
గతజన్మ బాంధవ్యాన్ని గుర్తు చేయడానికి

ముచ్చట్లకు మనసైనట్లుంది
శూన్యాన్ని నింపేయడానికి

ముగింపునెరుగని జీవితమైంది
మూగబోయిన ఎడద సవ్వడికి

అలసట తెలియని అక్షరాలంటున్నాయి
ఆగిపోయే ఊపిరికి ఆసరాకమ్మని....!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner