15, ఫిబ్రవరి 2018, గురువారం

జీవన "మంజూ"ష ...!! (6)

నేస్తం,
          అవసరానికి అనుబంధాలను అడ్డుగా పెట్టుకుంటూ, అవసరం తీరాక అధఃపాతాళానికి తొక్కేస్తున్న రోజులివి. కుటుంబ బంధాలు కానీ, స్నేహ సంబంధాలు కానీ ఏదైనా తమ స్వార్ధం కోసం వాడుకునే నీచ నైజాలు ఎక్కడికక్కడే దర్శనాలిస్తున్నాయి. పిల్లలని చూడని తల్లిదండ్రులు, తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు సర్వ సాధారణమై పోతున్న రోజులు ఈనాడు మన సమాజంలో. ఒకప్పుడు ఇంటి నిండా బాంధవ్యాలు, బంధుత్వాలు వెల్లివిరిసేవి. ఇప్పుడు ఉమ్మడి అన్న పదమే మర్చిపోయి బ్రతికేస్తున్నాం. అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు నిండుగా కనిపిస్తున్న రోజులు ఇవి. జన్మనిచ్చిన వారిని గాలికి వదిలేసి జల్సాగా కాలం గడిపేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎందరో. భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్న గౌరవ ఉపాద్యాయులెందరో. 
          ఆధునికంగా ఎంతో ముందగుడు వేస్తున్నాం కానీ మానవత్వాన్ని, మంచితనాన్ని మరుగున పడేస్తున్నాం. చేసిన సాయాన్ని మర్చిపోతూ, మన స్వార్ధమే చూసుకుంటూ రోజులు గడిపేస్తున్నాం. అమ్మ పెట్టిన గోరుముద్దలు మరచి ఆ అమ్మ ఎప్పుడు పోతుందా అని రాబందుల్లా ఎదురుచూస్తున్నాం. తాటాకు పెట్టిన ముంత తలా వైపునే ఉంటుందని మర్చిపోతున్నాం. ఎందుకీ మార్పు మనలో. మన అమ్మాబాబు మనకి విలువలతో కూడిన జీవితాన్నే ఇచ్చారు కానీ మనమెందుకిలా మారిపోయాము...? డబ్బులతో అనుబంధాలను, అభిమానాలను కొనాలని చూస్తున్నాం. పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు అని పూర్వపు నానుడి. బతికుండగానే నరకాన్ని చూపిస్తున్న పుత్ర రత్నాలెందరో నేడు. 
          పిల్లలని ఇబ్బంది పెడుతున్న పెద్దలు ఉన్నారు. అహంకారంతో కొందరు, ఆత్మాభిమానంతో మరికొందరు అనుబంధాలను అభాసుపాలు చేస్తూ నలుగురిలో నగుబాటు అవుతున్నారు. దీనివల్ల మనసులు విరిగి మమతలు దూరం అవుతున్నాయి తప్ప ఏ విధమైన ఉపయోగం ఉండటం లేదు. అవసరాలు అగాధాలను సృష్టిస్తున్నాయి కాని అనుబంధాలను పెంచడంలేదు. దీనికి కారణం మన ఆలోచనల్లో వైరుధ్యాలుండటమేనా...!!

ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం.

ఈ నెల నవ మల్లెతీగలో నా వ్యాసం .... 

11, ఫిబ్రవరి 2018, ఆదివారం

శోధన....!!

నిరంతర సంఘర్షణల్లోనుంచి
జీవన పరిణామ క్రమాన్ని
ఆవిష్కరించడానికి పడే
తపనలో మేధస్సుకు చిక్కని
ఆలోచనల వలయాలు
ఆక్రమించిన మనసును
సమాధాన పరిచే క్రమంలో
నన్ను నేను శోధించుకుంటూ
తప్పొప్పుల తూకాలను
అసహజ అంతరాలను
అర్ధం కాని ఆవేదనలను
కోల్పోతున్న బంధాల బాధ్యతలను
మధ్యస్థంగా మిగిలిపోయిన
వ్యక్తిగత వ్యవస్థలోని లోపాల భారాన్ని
ముసురు పట్టి ముసుగులోనున్న
మానవత్వపు మమకారాన్ని
వెలుగుపూలు పూయించాలన్న
ఆరాటంలో ఆలంబన చేసుకున్న
ఆత్మ పరిశీలన నుండి అంకురమై
మెుదలైందే ఈ అక్షర ప్రయాణం....!!

8, ఫిబ్రవరి 2018, గురువారం

ప్రేమంటే...!!

రాసి రాసి
నలిపి పడేసిన
కాగితాలు ఏరుకుంటే
వాటిలో దొరికే
రాతల్లోని భావమేమెానని
వెదుకుతుంటే..
కలం నుంచి
జారి పడిన అక్షరాలు
పదాలతో జత కట్టి
పరిచయాన్ని పెంచిన
మనసుతో మమేకమై
మౌనాన్ని మాటలుగా
పరిచిన కలవరాల కలకలం...!!

29, జనవరి 2018, సోమవారం

తుషార మాలిక ...!!

 మాలికలో వచ్చిన నా వ్యాసం                         

                                                      తుషార మాలిక లఘు సమీక్ష  ...!!             

కవితలకు, కథలకు సమీక్షలు రాయడం అంటేనే చాలా కష్టమైన పని.  సిరి వద్దే గారు రాసిన త్రిపదలకు అది 1300 ల త్రిపదలకు నేను సమీక్ష రాయడమంటే సాహసం చేయడమే.  అక్షరాలకు అందమైన పదభావాలను జత చేసి ముచ్చటైన మూడు వాక్యాల్లో త్రిపద కవితలను సిరి వడ్డే మనకు "తుషార మాలిక" తొలి త్రిపద సంపుటిగా అందించారు. ముందుగా వారికి నా ప్రత్యేక అభినందనలు.
                ఒక్కో వాక్యానికి 20 అక్షరాలకు మించకుండా మూడు వాక్యాల్లో ముచ్చటైన కవితలను అందించిన తీరు చదువరులను ఆకట్టుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక తుషార మాలికలో మొదటి త్రిపదం జన్మనిచ్చిన అమ్మతోనే మొదలు.  చరాచర సృష్టికి మూలం అమ్మ. ఆ అమ్మ ఒడి ఓనమాలతో మొదలై జీవిత పాఠాలు నేర్చుకునే వరకు చదువుల తల్లి శారదమ్మలా మనకు బాసటగా ఉంటుందని చెప్పడం. అమ్మని కూడా పసిపాపను చేస్తూ మనల్ని కొట్టి అమ్మ కూడా ఏడవడాన్ని ఎంత బాగా చెప్పారో..
అమ్మ కూడా పసిపిల్లనే ...
నన్ను కొట్టి ,

తను ఏడుస్తోందేమిటో...అలా వెక్కి వెక్కి..!!

పాపాయి బోసి నవ్వులతో నేర్చుకోవడం మొదలైన అమ్మ చదువుకోవడంలో ఎప్పటికి నిత్యా విద్యార్థిగానే ఉందని చెప్పడంలో భావుకురాలి గొప్పదనం తెలుస్తోంది. జ్ఞాపకాల గురించి చెప్పినప్పుడు వాడని పున్నాగపూల పరిమళాన్ని వీడని జ్ఞాపకాల మడతలతో పోల్చడం, ఇష్టమైనవాళ్లు విసిరిన చిరునవ్వు ఎదను హత్తుకున్న అమ్మ చేతి స్పర్శతో పోల్చడం, పాపాయి అలిగి అన్నం తినకపోతే అన్నం తినని అమ్మ అలకని తన చిన్నతనంలో పోల్చుకుని చెప్పడం, నాన్నతో అనుబంధాన్ని జీవితపు అవినాభావ సంబంధంగా, గుప్పెడుగుండేలో ఒదిగిన ప్రేమ అమ్మానాన్నల స్పర్శగా అనుభూతించడం, మానవత్వాన్ని చాటిచెప్పేవి పల్లెలే అని, ప్రపంచాన్ని, పుట్టిన పల్లెటూరును తూకం వేస్తె అనుబంధాలకు తూనిక తమ పల్లెలే అని తేల్చి చెప్పడం, అనుభవ పాఠాలను నేర్పే జీవితాన్ని గురువుగా భావించడం, వెన్నెల్లో విహరిస్తున్నా మాటల అమృతాన్ని మది నిండుగా గ్రోలడంలో ఓ రకమైన తీయని విరహాన్ని చెప్పడం, మనసు కొలనులో స్వప్నసుమాలను, చేజార్చుకున్న స్మృతుల మూటల వేడుకులాటలు, రెప్పలా మాటున దాగిన కలల మంత్రంనగరి మర్మాన్ని ఛేదించడం, కాలాన్ని పట్టి ఆపేసిన జ్ఞాపకాల డైరీని, అల కల  దూరాల తీరాలని,నిశీథి సుమాలను ఏరి వెన్నెల నవ్వులకివ్వడం, మది వేదన శిశిరాన్నిదాటి ఆశతో పోల్చడం, కలిసిన క్షణాలన్నీ అందెల మువ్వల నవ్వులే అని, దైన్యాన్ని దాటి ధైర్యాన్ని అందుకోవడం, మౌన ధ్యానంలో వరమైన ప్రేమని, విధి పంపకాలను అప్పగింతలుగా, హృదయపు తికమకలను, మనోనేత్రపు మనసును, ప్రక్రుతి, సనాతన ఆవర్తనాలను, సెలయేటి గలగలలు, మబ్బు గిన్నెలు తొలకరి వర్షపు పూలజల్లులను, ఆకులపై అలరాలే చినుకుల ముత్యాలను, పాత పరిచయాన్ని పడే పడే పలవరించడం, చిగురాకు సవ్వడిలో పూమొగ్గల పరిమళాన్ని ఆస్వాదించడం, తలపుల తాకిడిని పెనుగాలికి రాలిపోయే పూలతో పోల్చడం, నది నడకలను,  రాకను, పోకను కూడా సంధ్యానాదంతో పోల్చడం చాలా చాలా బావుంది. కదిలే మేఘాలను, పొద్దుపొడుపుల అందాలను, చీకటి దుప్పటిలో వెన్నెల నక్షత్రాలను, జ్ఞాపకాల తుంపర్లను, ప్రేమలో విజయ కేతనాన్ని,  ధీరత్వాన్ని జీవితంలో ఆటుపోట్లకు వెరవని మనసని చెప్పడం, పొగడ్త మంచిదికాదని, సాగర సంగమం జీవితమని, పున్నమి, కలువల అనుబంధాన్ని, కలల నిరీక్షణలో వేసారిన కనురెప్పలకు,  రెప్పల పరదాలను  వేయడం చాలా అద్భుతమైన భావం. 
రెప్పల పరదాలను వేసేసాను...
కనుల సౌధానికి,
నీ కలలను గుట్టుగా దాచుకుందామనే..!!

ఇలాంటి ఎన్నో అద్భుతమైన త్రిపదలు ఈ సంపుటి నిండా పరుచుకుని మనలను ఆపకుండా చదివిస్తాయనడంలో సందేహం లేదు. అన్ని సమీక్షించడం కన్నా చదవడం బావుంటుంది. ఓ చక్కని తుషార మల్లికను అందించిన సిరి వడ్డేకి మరోసారి మనఃపూర్వక అభినందనలు. 

మంజు యనమదల 
విజయవాడ 


సంకురాతిరి సంబరాలు...!!

మనం మకుటంలో వచ్చిన నా వ్యాసం... ధన్యవాదాలు యజ్ఞమూర్తి గారు..                                

                                         సంకురాతిరి సంబరాలు...!!           

            ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. డిసెంబర్ వచ్చింది అంటే పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరికి సంబరమే. పల్లెటూర్లో పెరిగిన మాకైతే మరీనూ. అప్పటి సరదాలు, సంతోషాలు గుర్తు చేసుకుంటూ ఇప్పుడు యాంత్రికంగా జీవితాలు గడిపేస్తున్నాము. ఒక్కసారి ఆ పాత రోజుల్లోకి వెళ్లగలిగితే మన పిల్లలు ఏం కోల్పోతున్నారో మనకు గుర్తుకు వస్తుంది. మనం మన తరువాతి తరాలకు అందించాల్సిన సంపద ఏమిటో మనకు అవగతమౌతుంది. అటు పాత తరాలకు ఇటు కొత్త తరాలకు మధ్యన వారథులం మనం. అందుకే మన వంతుగా మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిద్దాం.
               మా ఊర్లో అయితే పొలాల్లో వరికుప్పలు, వడ్ల రాశులు, చిన్న చిన్న మినుము, పెసర మొక్కలు, గడ్డి వాములు  పొలాల్లో సందడి చేస్తూ ఉంటే, ఇక ఇళ్ళ దగ్గర ముద్దబంతి, చామంతి, కారబ్బంతి, సీతమ్మవారి జడబంతి వంటి పులా మొక్కలతోప్రతి లోగిలి, సంక్రాంతి ముగ్గులతో గుమ్మాలు,  ఆ ముగ్గుల్లో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు వాటి అలంకారాలతో వాకిళ్లు కనువిందు చేయడం ఇప్పటికి ఓ మధుర జ్ఞాపకమే.
               చదవడానికి తెల్లవారుఝామున లేవని మేము పండగ శెలవల్లో నాలుగింటికే లేచి ఆ చీకటిలో భయం లేకుండా ఆవులు పొడుస్తాయేమోనని కూడా లెక్క చేయక ఆవుపేడ కోసం వెళ్ళడం, గొబ్బెమ్మలు చేసి వాకిట్లో ముగ్గుల్లో అందంగా అమర్చడం, ధనుర్మాసంలో రామాలయంలో తెల్లవారుఝామున పంచే ప్రసాదాల కోసం పరిగెత్తడం, చలి కాచుకోవడానికి చలిమంటల దగ్గర చేరడం, ఆ చలిమంటలో వరిగడ్డి వేసినప్పుడు వడ్ల పేలాలు ఏరుకోవడం లాంటి బోలెడు జ్ఞాపకాలు తడుముతూనే ఉంటాయి ఇప్పటికి కూడా.
             ఇంట్లోవాళ్ళు దులుపుళ్ళు, కడుగుళ్ళతో మొదలుబెట్టి నానబెట్టిన బియ్యం పిండి రోట్లో రోకళ్ళతో దంపడం, జల్లించడం, ఆ పిండితో చలిమిడి చేయడానికి పాకాలు చూడటం, నేతి అరిసెలు నొక్కడం, బూందీ లడ్డ కోసం బూందీతో పాటు మేము మిరపకాయ్ బజ్జిలు వేయించుకోవడం, చెక్కలు, చక్కిడాలు మొదలైన పిండి వంటలు మెక్కడం, భోగి మంటలు, భోగి  స్నానాలు, బొమ్మల కొలువులు, చిన్న పిల్లలకు భోగిపళ్ళు పోయడం, కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు, కబడ్డీ ఆతల పోటీలు, పండగ పేకాటలు ఇలా చాలా సరదాగా గడిచిపోయేది సంక్రాంతి. కొన్ని సంవత్సరాల క్రిందట జరిగిన సంక్రాంతికి మా తాతయ్యనానమ్మల కుటుంబం అంతా మా ఇంటి దగ్గర చేరి ఆడిన అంత్యాక్షరి, పిల్లలు, పెద్దలు అని లేకుండా అందరమూ చేసిన అల్లరి, సముద్ర స్నానాలు, చూసిన అర్ధరాత్రి టూరింగ్ టాకీస్ లో సినిమా, అందరం కలసి చేసిన భోజనాలు ఇప్పటికి నిన్నే జరిగినట్లుగా అనిపించడం అంటే బహుశా ఆ అనుబంధాలలోని దగ్గరితనం కావచ్చు.
              మన పెద్దలు మనకు మిగిల్చిన ఆస్తులు ఏమైనా ఉన్నాయి అంటే అవి ఈ మరిచిపోలేని అనుబంధపు ఆనవాళ్ళని నేను చెప్పగలను. తమకు తామే సమయాన్ని కేటాయించుకోలేని దీనస్థితిలో ఇప్పుడు జీవితాలు చాలా వేగంగా వెళ్లిపోతున్నాయి. మనం పుట్టి పెరిగిన మన ఊరుని చూడటానికి, ఆప్యాయంగా వినిపించే ఆ పల్లె పలకరింపులు కోసం కనీసం ఒక్కసారైనా మన అనుకున్న మనవాళ్ళ కోసం ప్రతి ఒక్కరు తమ తమ పరిమిత కుటుంబాలను తీసుకుని ఉమ్మడి కుటుంబాల సాంప్రదాయపు పండుగల సంతోషాలను ఆస్వాదించాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు మన తరువాతి తరాలకు కూడా అందించాలని కోరుకుందాం.
ఇంతకీ మా ఉరి పేరు చెప్పనే లేదు కదూ .... నరసింహపురం, కోడూరు మండలం, దివిసీమ అండి.. తీర ప్రాంతపు అందాలకు, వెలకట్టలేని ఆప్యాయతలకు పుట్టినిల్లైన ముచ్చటైన పల్లెటూరు మాది. 
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner