12, డిసెంబర్ 2017, మంగళవారం

త్రిపదలు...!!

1.  వలపులతో వల వేశా
ప్రేమైనా ప్రాణమైనా
నీతోనే నేనని...!!

2.    కల"వరమెా"
కలకలమెా
తెలియని భావమిది...!!

3.  ఒక్క క్షణం చాలదూ
నీ జ్ఞాపకాలలో
నేనున్నానని తెలియడానికి...!!

7, డిసెంబర్ 2017, గురువారం

ఏక్ తారలు...!!

1.  ఊరడిస్తున్న వాస్తవ కథనం_ఊపిరై తానుంటానంటూ...!!

2.  ప్రాణ వాయువు పక్కుమంటోంది_అక్షరమే నీ ఊపిరైందని...!!

3.  మరలిపోతోంది కాలం_కనికట్టు మాయలో కకావికలమై...!!

4.  దిగులుకు గుబులైంది_సంతోషం చోటడిగిందని...!!

5.  నిశ్శబ్దమే నచ్చింది_మనుష్యుల మనసు మర్మాలు తెలిసాక...!!

6.  మమేకమైన మనసుల సవ్వడులు_ఓదార్పుకి వారధులు..!!

7.  అర్ధమూ మారింది_నిశ్శబ్దానికి నిట్టూర్పులు మెుదలై.. !!

8.   చెప్పలేని మౌనాలే_మది కోటలో గాథలన్నీ....!!

9.  గుట్టు విప్పని భావాలెన్నో ...గుండె గుప్పెడయినా..!!

10.  పేర్చిన ఇటుకల్లో_జ్ఞాపకాల సమాధులు...!!

11.  రతనాల రాశులవి_జీవించడం నేర్పిన అక్షరాలు...!!

12.  తూనీగలా తుళ్ళింది_నీ తలపులు ఒంపిన వయ్యారమనుకుంటా...!!

13.   విలాసాల వెర్రితలలు_మనో వికృతరూప ఆవిష్కరణలు..!!

14.   కలతలు వెంబడిస్తున్నాయి_కష్టమైన నిజాన్ని భరించలేక...!!

15.    వేకువ వద్దంటోంది_ముసుగు తొలిగిన మృగాలను చూడలేక...!!

6, డిసెంబర్ 2017, బుధవారం

స్నేహానికి మరో కోణం...!!


   

నేస్తం,

        స్నేహం ముసుగులో కొందరు చేసిన మోసాన్ని భరించాక ఈ నాలుగు మాటలు చెప్పాలనిపించింది. ఇంటి మనిషి అని నమ్మినందుకు ఇంటినే అల్లరి చేసి, ఎవరో ఒకరు కాస్త ఆవేశంలో, బాధలో ఆలోచనలేకుండా పెట్టిన దానికి నమ్మిన స్నేహితులని మోసం చేసిన మనిషి తానే మోసపోయానని అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకరినో ఇద్దరినో మంచివాళ్ళు కాదని అనడం సహజం కానీ ప్రతి ఒక్కరిని ఇంటికి తీసుకువచ్చి వారి వెనుక వారిని చాలా చెడ్డగా మాట్లాడటం కొందరి సహజ లక్షణం. తన అవసరానికి అడ్డాగా నా స్నేహాన్ని, ఇంటిని వాడుకుని పాపం బోలెడు కష్టాలు నా ఇంట్లో పడ్డానని వారికి చెప్పి మరి కొందరి ఇండ్లలో చేరి వారిని అల్లరిపాలు చేసి, కాపురాల మధ్యన చిచ్చు పెట్టి, నా ఆప్తుల మీద నాకే చెప్పిన మా దొడ్డ ఇల్లాలు. తన అసలు రూపానికి తానే నాకు సాక్ష్యాలు ఇచ్చి, ఆత్మీయమైన స్నేహాన్ని అభాసుపాలు చేసిన మహా 'మనీ' 'షి'.  కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఏమి చెప్పలేని అశక్తురాలిని చేసిన ఘనత ఆమెది. తన అనుకున్న వారి దగ్గరే నా గురించి వాగితే వాళ్ళు అప్పటినుండి తననే దూరం పెట్టారు. తాను తప్ప అందరు పాతివ్రత్యం లేనివాళ్లే అని భావించే పతివ్రతాశిరోమణి తాను వాగిన వాగుడు బయటపడుతోందని అందరు ఒకరి గురించి ఒకరు అన్నారని చెప్పడం మొదలు పెట్టి నాలుగురోజులు పబ్బం గడుపుకుంటూ తన ఉనికి కోసం శాయశక్తులా కష్టపడుతోంది. ఇలాంటిదాన్ని, దాని మాటలను  నమ్మినవాళ్లను ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. దయచేసి దాని మాయలో పడకండి.  బురదలో పద్మం వికశిస్తుంది కానీ ఈ పుట్టుకలో బురదలో మకిలే ఆభరణం. క్షేత్ర లక్షణాలు బాగా వంటబట్టాయి.
     స్నేహాన్ని వ్యాపారంగా మార్చి లెక్కలు వేయడం, అనుబంధాలను అల్లరిపాలు చేయడం,  ఆత్మీయతను మోసం చేయడం వంటివి వారికి వెన్నతో పెట్టిన విద్య అని తెలుసుకోలేక పోవడం నా తెలివితక్కువతనం. ముఖపుసక్తంలో మంచి చెడు ఉంటాయని మనమే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పవు. ఒకరి మీద ఒకరికి చెప్పి ఎన్నాళ్ళు పబ్బం గడుపుకుంటారో ఇలాంటి వాళ్ళు. నిజం అనేది ఎప్పటికయినా బయటపడుతుందని మర్చిపోతే ఎలా. పచ్చకామెర్లు సామెత అందరికి గుర్తుండే ఉంటుంది కదా. అదే ఈవిడ నైజం కూడా. చాలామంది నాకు చెప్పారు రెండో వైపు వినకుండా ఎలా అని, నిజానిజాలు తెలియకుండా నేను ఏ నిర్ణయమూ తొందరపడి తీసుకోను. అందులోనూ స్నేహం విషయంలో అస్సలు పొరపాటు చేయను. క్షమ అనే పదం కూడా ఇలాంటి వారికి వాడకూడదు. ఇంతకన్నా ఏమి చెప్పలేను. పెద్దలు, సన్నిహిత మిత్రులు, ఆత్మీయులు ఇచ్చిన సలహాలకి, నాపై చూపిన అభిమానానికి నా కృజ్ఞతలు.
    
నాలాంటి కొందరికి అక్షరాలే  ఆయుధాలైనా ఆదరిస్తున్న ఆత్మీయుల అభిమానమే మాకు అండ. నా కబుర్లు కాకరకాయలు బ్లాగుని గత ఎనిమిదేళ్లుగా అభిమానిస్తూ, ఆదరిస్తున్న అందరికి నా కృతజ్ఞతావందనాలు. తొమ్మిదో వసంతంలోకి అడుగిడుతున్న కబుర్లు కాకరకాయలు పుట్టినరోజు సందర్భంగా నాకెంతో ఇష్టమైన స్నేహాన్ని మరో కోణంలో చూడటానికి బాధగా ఉన్నా మరికొందరు మోసపోకూడదనే ఈ పోస్ట్.     

28, నవంబర్ 2017, మంగళవారం

ఏకాంతం - ఒంటరితనం...!!

నేస్తం,
        ఏకాంతం -  ఒంటరితనం అనేవి ప్రస్తుతం మన అందరితో స్నేహం చేస్తున్న స్నేహితులు. ఏకాంతం కొందరికిష్టమైతే మరి కొందరేమో ఒంటరితనానికి ఏకాంతపు స్నేహాన్ని ఆశిస్తారు. ఒంటరితనం కొందరికి భయాన్ని, బాధను కలిగిస్తుంది. అభద్రతాభావాన్ని ఎక్కువ చేస్తుంది. ఒంటరితనం ఎంత ప్రమాదకారి అంటే ఒక్కోసారి మరణానికి దగ్గరగా తీసుకువెళ్తుంది. కానీ ఏకాంతం అలా కాదు మరణంలో సైతం మళ్ళి బతికితే బావుండుననిపిస్తుంది.
      మన ఒంటరితనానికి కారణం మనమే అవుతున్నాం. మనకంటూ మనం లేనప్పుడు ఒంటరినన్న భావన పొడచూపుతుంది. తన చుట్టూ ఎందరున్నా ఎవరూలేని ఏకాంతానికి చోటిస్తారు కొందరు. మరికొందరేమో తన అన్న బంధాలెన్నున్నా ఎవరూలేని ఏకాకుల్లా ఒంటరిగా మిగిలిపోతారు.కొన్ని స్వయంకృతాపరాధం అయితే మిగిలినవి విధిరాతలని సరిపెట్టేసుకుంటున్నాం.
     ఒంటరితనం శాపమని, జీవితానికి ముగింపని అనుకుంటే మన  చుట్టూ చీకటే ఉంటుంది. ప్రపంచంలో ఒంటరితనమంత పెద్ద శిక్ష మరొకటి లేదనుకునే ముందు భరించలేని ఆ ఒంటరితనానికి కారణాలను తెలుసుకోగలిగితే దాన్ని అధిగమించడం చాలా సులువు. మనకంటూ, మనకోసం ఎవరు ఉండరు మనం తప్ప. మనలోని మనకిష్టం లేని ఒంటరితనం సమస్యను పెంచి పోషించకుండా దాన్ని నాశనం చేయడానికి మన వంతుగా ప్రయత్నించాలి. నాకు తెలిసి ఏకాంతం ఒంటరితనానికి సన్నిహితం. బాధగా కాకుండా ఇష్టంగా భరిస్తే ఒంటరితనమూ ఓ వరమే నువ్వేంటో నీకు తెలియడానికి. ఈ ప్రపంచంలో మనదే పెద్ద కష్టం అనుకుని మన మీద మనమే జాలి పడటం కన్నా దురదృష్టం మరొకటి ఉండదు. ఇష్టంగా భరిస్తే కష్టమూ ఇష్టంగానే ఉంటుంది. ఒక్కసారి అలా అనుకుని చూడండి ఎంత బావుంటుందో మీకే తెలుస్తుంది... !!

జత కలిపేవారెందరు..??

ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ అని గగ్గోలు పెడుతున్నాయి కానీ ఆచరణ ఎక్కడ..? నిన్నటికి నిన్న గన్నవరం దగ్గర శివాలయానికి వెళితే తెలిసిన పెద్దావిడ మా ఇంటికి వచ్చేవరకు ఎంత ఇబ్బంది పడిందో.. అభివృద్ధిలో మునుముందుకు వెళుతున్నాం అని నాయకులు చెప్పుకునే మాటల్లో ఎంత నిజం ఉందనేది తేటతెల్లం అవుతోంది. పార్టీ  ఆఫీసులు,  పబ్బులు, మాల్స్, సినిమా హాల్స్ కాదు సామాన్యులకు కావాల్సింది... ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి మనం ఏం చేయాలన్నది ఆలోచించండి. ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఎప్పటిలాగే ఎదురుచూసి మోసపోవద్దు. ఏ రాజకీయపార్టీ ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపదు, నిధులు స్వాహా చేయడం తప్ప....
దయచేసి మానవతా భావంతో ఈ సమస్యకు పరిషారాన్ని చూపండి. సుందర్ మోహన్ గారు ట్రస్ట్ ప్రారంభించి ప్రతి ఊరికి కట్టిద్దాం అంటున్నారు. తన వంతుగా 5000 రూపాయలు ఇస్తాను అని కూడా అంటున్నారు. మొదటి అడుగు పడింది. మరి ఆ అడుగులో జత కలిపేవారెందరు..??

https://www.facebook.com/jordarpori/videos/523662558010068/
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner