17, ఏప్రిల్ 2019, బుధవారం

వేదనగా మారినప్పుడు..!!

తరాలు తరిగిపోతున్నాయి
విలువలు వెలవెలబోతున్నా 
అంతరాలను నిలువరించలేక 
నిస్సహాయతను మోసుకుంటూ 

బంధాలు భారమైపోతున్నాయి
అనుబంధాలకు కొత్త అర్ధాలు చెప్తూ 
సహజీవనాలకై వేగిరపడుతూ 
మూన్నాళ్ళ ముచ్చటే మురిపెమనుకుంటూ 

బాధ్యతలు బంధనాలౌతున్నాయి
కన్నపేగు కదిలిస్తున్నా 
కన్నప్రేమ వారిస్తున్నా 
కాదంటూ.. కాసుల కోసం అమ్ముడుబోతూ 

బతుకులు భయపెడుతున్నాయి 
ముసుగుల మనస్తత్వాలు బయటపడి 
నీలినీడల్లో నిజాలు దాగుండిపోయి 
వాస్తవమో వద్దనలేని వేదనగా మారినప్పుడు..!! 

14, ఏప్రిల్ 2019, ఆదివారం

ఏటంటావు...!!

నేస్తం,
          పురస్కారాలిస్తున్నారు, సన్మానాలు చేస్తున్నారు..ఎందుకంటావ్..? రాత బాగుండంటావా లేక కులం చూసంటావా లేక పరాయి మతాన్ని హేళన చేసినందుకంటావా లేదంటే విలువలు వదిలేసి అక్షరాలతో విశృంఖలంగా నగ్న ప్రదర్శన చేయిస్తున్నందుకంటావా...లేదంటే మరొకందుకంటావా..మనకయితే మన విద్వత్తు, ప్రతిభను చూసి కట్టబెట్టినట్టు. మరొకరికయితే ఏమెా ఎందుకో. అవహేళన చేయడం, కించపరచడమే మనకున్న సంస్కారమని నలుగురు గుర్తిస్తున్నారిప్పుడిప్పుడే. జర జాగ్రత్త..😊

4, ఏప్రిల్ 2019, గురువారం

మానసిక రోగులు...!!

చాలామంది మానసిక రోగులకన్నా నా మానసికారోగ్యం చాలా చాలా బావుంది...నా గురించి కులమత, సాహిత్య, దీర్ఘకాలిక అనుమానపు  మానసిక రోగులు ఆందోళన చెందనవసరం లేదు... శారీరక రుగ్మతలకన్నా మానసికరోగం చాలా ప్రమాదకరం....!!

2, ఏప్రిల్ 2019, మంగళవారం

దేవులాట....!!

ఎక్కడెక్కడో రాలిపోయిన
చుక్కల లెక్కల కోసం
వెదుకులాట మెుదలైనట్టుందిగా

పేగుబంధాన్ని తెంపుకున్న
బిడ్డలకు అనుబంధాన్ని
మర్చిపోవడమెా లెక్క కాదనుకుంటా

అమ్మ విసిరిపారేయని
పసితనం మనదైనప్పుడు
ఆ తల్లి బాల్యాన్ని అసహ్యించుకోగలమా

ఆస్థులు పంచలేదని
ఆప్యాయతానురాగాలను
నడి బజారులో నగ్నంగా వదిలేయడమేనా

అంతిమం క్షణాల
పోరాటపు ఆరాటాన్ని
ప్రేక్షకపాత్రలోనుండి చూడటం సబబేనా

ఆదరించి అక్కున చేర్చుకునే
సహృదయం మనకివ్వని
దేవునిదే ఈ నేరమనుకుంటా..!!

30, మార్చి 2019, శనివారం

ఏక్ తారలు...!!

1.  మనసు తడి నే తీసుకున్నా_మౌనం నీకొద్దంటూ...!!

2.   అప్పటి పరిచయ క్షణాలే_ఇప్పటికీ అదే పరిమళ భావాలతో...!!

3.   మనసు మనసుకో ముచ్చట_మురిపెంగా మురిసిపోవాలని...!!

4.   మౌనానికీ ఎరుకయ్యింది_నీ మాటల మాయలో నే పడిపోయానని..!!

5.   ఏమెరుగని అమాయకత్వమది_చవితి చంద్రుని చూసిన నీలాపనిందలతో..!!

6.   మనసాక్షరాలంతే మరి_భావాలనలా బంధించేస్తూ.....!!

7.  మనసుకు ఊరటనందివ్వడమే_అక్షరంతో నెయ్యమంటే...!!

8.   అలవాటే అది అక్షరాలకు_జత చేరుతున్న భావాలను ముచ్చటగా చూపడం...!!

9.    అక్షరాలకూ అలవాటే_మనసుని తమలో చూపడం...!!

10.   అక్షరాలతో జత కట్టానందుకే_భారాన్నంతా భావాల్లో వొంపేద్దామని...!!

11.  అధిగమించాలి అడ్డంకులను_భావాక్షర బంధాలను బలోపేతం చేయడానికి...!!

12.   పదాలన్నీ దాసోహమంటున్నాయి_గుండెల్లో దాగిన నీ ప్రేమ తెలిసిందనుకుంటా...!!

13.   తొలగించావుగా విముఖతను_నీ ప్రేమతో మనసు అందాన్ని అలంకరిస్తూ...!!

14.   మౌనం మనసు విప్పింది_ఆరాధనకు పరమార్థాన్ని వివరిస్తూ...!!

15.   కంటి కొలను నిండింది_మనసు భారాన్ని తాను స్వీకరిస్తూ...!!

16.   వెక్కిరింతలకు వెరవకూడదు_కలతల గాయాన్ని గెలవనీయక...!!

17.   గాయానికి ఓటమి రుచి చూపాలి_కలతల కల్లోలానికి ఆనకట్ట వేస్తూ...!!

18.   మౌనాకికెరుకే మరి_మది గాయాలకు లేపనమేమిటో...!!

19.   అనునయాల ఊరడింపులే అన్నీ_మది గాయాల కలవరింపులకు...!!

20.   చెంతనే చేరింది చెలిమి_కన్నీటి కడలికి తావీయకంటూ...!!

21.   చేయూతనివ్వడానికే చెంత చేరింది_నెచ్చెలి మనసు నొచ్చకుండా...!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner