23, అక్టోబర్ 2017, సోమవారం

జీవన 'మంజూ'ష (3)...!!

నేస్తం,
        హక్కులు, బాధ్యతల నడుమ కొట్టుమిట్టాడుతున్న మధ్యతరగతి జీవితాలు మనవి. పాత కొత్త తరాల మధ్యన నలుగుతూన్న అనుబంధాలకు వారసులం. బాధ్యతలకు కట్టుబడి బంధాలను వదులుకోలేని బాంధవ్యాలకు బానిసలం. దూరమై పోతున్న చుట్టరికాలను చూస్తూ, తరిగిపోతున్న ఆత్మీయతలు కోసం అల్లాడుతు అక్కడక్కడా దొర్లుతున్న మమతలను పదిలంగా దాచుకోవాలని ప్రయత్నిస్తున్న అతి సామాన్యులం. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలకు ప్రతిరూపంగా అరకొరగా మిగిలిన అనుబంధాలు వెలవెల బోతున్నాయి. ఇవి అన్ని చూస్తూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నిలిచిన అస్సహాయులం.
        క్రొత్తగా మారిన విలువలతో, వింతైన జీవన విధానాలు మింగుడు పడక అటు పాత తరానికి, ఇటు కొత్త తరానికి మధ్యన మిగిలిన అసంపూర్ణ జీవితాలై పోయాయి. తోడబుట్టిన బంధాలను, తోడుగా వచ్చిన తోడును అపహాస్యం చేస్తూ కాపురాలను, కట్టుబాట్లను నడిరోడ్డున పడేస్తున్న అహంకారపు మదగజాలను భరిస్తున్న ఎందరో అమృతమూర్తులు కన్నీళ్ళను కాననీయక, బడబానలాన్ని దిగమింగుతూ చిరునవ్వుల చాటున వెతలను దాచేస్తూ, అహానికి తలను వంచుతూ బతుకు బండిని  వెళ్లదీస్తున్నారు. మానవతా విలువలతో కూడిన క్రొత్త శకానికి నాంది పలికే రోజు కోసం ఎదురుచూస్తూ... !!
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం. 
       

21, అక్టోబర్ 2017, శనివారం

ద్విపదలు...!!

1.   ఎదురుచూపులు అలవాటేనట
మాటల మౌనానికి...!!

2.  మధుర స్వరాలు మనవే
నీ నా తేడాలెందుకు...!!

3.  మమతలన్ని నీతోనే
గాయాలన్నింటిని మాన్పేస్తూ..!!

4.  మూన్నాళ్ళ ముచ్చటే
ఏడడుగుల బంధం ఎగతాళి చేసాక....!!

20, అక్టోబర్ 2017, శుక్రవారం

అంతర్లోకాలు....!!

కనిపించని లోకాల్లో
వినిపించని కథనాలు

తెరచిన రెప్పల్లో
తెలియని భావాలు

మూసిన గుప్పిట్లో
దాగిన సూర్యోదయాలు

వెలితి పడుతున్న బంధాల్లో
వెతల సంకలనాలు

గతించిన గతాల్లో
గమనించలేని గురుతులు

అలసిన ఆత్మ నివేదనల్లో
మిన్నకుండి పోయిన అంతర్లోచనాలు....!!

19, అక్టోబర్ 2017, గురువారం

స్నిపెట్స్....!!

1.  మనసు ఉలిక్కి పడుతోంది
మౌనం అర్ధం కావడం లేదని...!!

16, అక్టోబర్ 2017, సోమవారం

ద్విపదలు..!!

జ1.  చీకటి స్వప్నాలే అన్నీ
వెలుతురు వర్ణాలు అంటనీయకుండా...!!

2.  అనుభవాల ఆస్వాదనలో నేను
కలల సాగరంలో తరిస్తూ... !!

3.  చీకటి చుట్టమైంది
కలల హరివిల్లై నువ్వు కనిపిస్తావని...!!

4.  మౌనమే మారణాయుధం
మనసుని గాయపరచడానికి...!!

5.   మర్మాలన్ని మనకెరుకే
మౌనం మాటాడుతుంటే...!!

6.  కన్నీటికర్ధం తెలియని జన్మది
అమ్మ రుథిరాన్ని అమ్మేస్తూ...!!

7.  నిరీక్షణో వరం
నిన్ను చేరే క్షణాల కోసం..!!

8.   సమర్ధింపు అసమర్ధమైంది
అన్యులకు చోటిచ్చినందుకు...!!

9.   మనసు విప్పుతూనే ఉంటాయి
మాటలు మౌనాలై మిగిలినా..!!

10.  మృగ్యమైన ఆత్మలు
మానవరూపంలోనున్న మృగాలకు..!!

11.  ఆశ్చర్యమే ఎన్నటికీ
ఆశించని ఆత్మీయతలెదురైనప్పుడు..!!

12.  అతిశయం అక్షరాలదే
అన్నింటా తనదే పైచేయి అయినందుకు...!!

13.  శబ్దం చేరువౌతోంది
నిశబ్దానికి వీడ్కోలిస్తూ...!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner