17, సెప్టెంబర్ 2011, శనివారం

అంతర్మధనం...!!

కనుల నీరు జారనీయకు
కనుదోయి కలవర పడేను
కలత నిదుర కానియకు
కలలు కల్లలయ్యేను

మదిలోనికి చొరబడనీయకు వేదనను
మానసికోల్లాసం దూరమయ్యేను
మనసుతో మాటాడు మౌనంగా
మౌనభాష్యాలు సాక్షులుగా

మనసుకి తగిలిన ప్రతి గాయం
రాబోయే మరో గెలుపుకి పునాది
ఓటమి నుంచి నేర్చుకునే మెళకువలు
గెలుపు అందలానికి బాటలు వేయాలి

పడిపోయామని లేవడం మర్చిపోతే
పరుగునే కాదు నడకనే మర్చిపోతాము..
జీవిత సత్యాన్ని తమలో ఇముడ్చుకున్న
ఎగసిపడి లేచే కడలి తరంగాలే అందుకు సాక్ష్యం...!!

9, సెప్టెంబర్ 2011, శుక్రవారం

వినమ్ర వినతి....

కల్లోల కడలి తరంగం అంతరంగం
కలహంస నడకల నాట్యమయూరం
ఉప్పొంగే వరద ఉదృతం కోపావేశం
గల గల పారే సెలఏటి సరిగమల
గమకాలు వినసొంపైన సంగీతం
కన్నెర చేసి కరుణ చూపే కృష్ణమ్మ
ఉరవళ్ళ పరవళ్ళ వరద వెన్నెలగోదారి
ఒంపుల వయ్యారాల కన్నెకిన్నెరసాని
అందాల సోయగాల వయ్యారి యమున
కలువ కన్నియబాల కావేరి
మకరందాల మధుర మందాకినీ
సకల పాపాలు హరించు గంగమ్మ
పొంగులెత్తే వాగువంకలతో....గుండాల సుడిగుండాలతో...
జన జీవనాన్ని అతలాకుతలం అస్తవ్యస్తం చేయకుండా...
సొగసు సోయగాలతో...చల్ల చల్లని చూపులతో...
ప్రకృతి అందాలు పాడిపంటలు పుష్కలంగా....
ప్రశాంత జీవితం అందించాలని వినతి.

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

అపాత్రదానం..!!

ఏదైనా చేయాలంటే కాస్త భయంగానే ఉంటోంది...ఎందుకంటారా!! చెప్పేస్తున్నా  ఫాలో అయిపోండి మరి...
మా ట్రస్టు తరపున అమ్మానాన్న లేని ఒక అబ్బాయిని ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివిస్తున్నాము గత నాలుగు ఏళ్లుగా....మొన్నీమద్య ఒకసారి ఫ్రెండ్ సిస్టర్ పెళ్లికి వచ్చి ఇంటికి వస్తే ప్రతి సంవత్సరం ఇచ్చే డబ్బులు కాకుండా చిన్న మొత్తమే అనుకోండి ఓ ఐదు వందలు ఇచ్చి పంపాను. క్రిందటి నెలలో ఇంటికి వచ్చి మళ్ళి ఇంకో ఇయర్ డబ్బులు కావాలి అని అడిగాడు. కాంపస్ సెలక్షన్స్ లో జాబ్ రాలేదా అంటే గవర్నమెంట్ జాబ్ కోసం... వచ్చినది కాదనుకున్నాడంట. ఎన్ని ఇయర్స్ డబ్బులు తీసుకున్నాడో కూడా గుర్తు లేని ఆ అబ్బాయికి అపాత్ర దానం చేసామేమో అని అనిపించింది. ఇంజనీరింగ్ అయిపోయి కుడా ఇంకా డబ్బులు అడగడానికి మరి ఏమి అనిపించలేదో లేక మాకు ఊరికినే డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకొవాలో తెలియక ఇస్తున్నాము అనుకుంటున్నాడో అర్ధం కాలేదు....ఇంతకు ముందు కూడా ఒక అమ్మాయి కి ఇంజనీరింగ్ లోనే డబ్బులు ఇస్తే లాప్ టాప్ కొనుక్కోవాలి ఇరవై వేలు ఇవ్వండి అంది....మొదటి ఇయర్ అయ్యి రెండో ఇయర్ కి రాగానే....మనమేమో ఒకరు అయినా బావుంటారు అని మనకు వున్న దానిలోనే వాళ్లకు ఇస్తూ వుంటే వీళ్ళు ఇలా వున్నారు....జనాలు ఇలా వున్నంత కాలం స్విస్స్ బాంక్ ఎకౌంట్లు కాని ఇంకా ఏమైనా పెద్దవి వుంటే అవి కూడా చాలవు...ఊరికినే డబ్బులు కష్టపడకుండా రావాలంటే ఎలా కుదురుతుంది....?? ఇవ్వడం తీసుకోవడం తప్పు కాదు...ఇదిగో ఇలాంటివి కాకుండా వుండాలి......ఇచ్చే ముందు ఓసారి అలోచించి ఇవ్వండి....-:)
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner