25, మే 2017, గురువారం

రహస్యపు అంతరంగం...!!

'మ'రణం పదే పదే పలకరిస్తుంటే
చెదరని చిరునవ్వులు చిందిస్తూ
మళ్ళి రమ్మని వాయిదాలు వేస్తూ
ఉలికిపడే ఊపిరితో ఊసులాడుతూ
తెల్లని కాగితాలపై నల్లని సిరా ఒలికిస్తూ
అక్షరాల సహవాసంలో సేదదీరుతూ
భావాలను మాలిమి చేసుకుంటూ
మనసు మౌనాలకు మాటలద్దుతూ
గతపు గాయాల గుండె చప్పుళ్ళు వింటూ
కాలాన్ని ఒడిసి పట్టాలని ఉవ్విళ్ళూరుతూ
మిగిలిన క్షణాల ముచ్చట్లకై ఎదురుచూస్తూ
రాలిపడలేని రాతిరి చుక్కల ఆరాటమే
రెక్కలు విప్పిన ఈ రహస్యపు అంతరంగం...!!

12, మే 2017, శుక్రవారం

నిశ్శబ్దపు క్షణాలు...!!

ఏకాంతపు సహవాసంతో
కొన్ని ఘడియల కాలాన్ని
నాలో దాచేసుకున్నా

మౌనాన్ని తర్జుమా చేయాలని
మనసు సిరాలో కలాన్ని ముంచి
ఆకృతికై  ప్రయత్నిస్తున్నా

దాచేసుకున్న కన్నీళ్ళన్నీ
ఒక్కసారిగా దాడి చేస్తాయని
బెంగ పడుతూనే ఉన్నా

జ్ఞాపకాలకు రెక్కలొఛ్చి
వాస్తవాన్ని విస్మరిస్తాయని
గతాన్ని హెచ్చరిస్తూనే ఉన్నా

కోల్పోతున్న జీవితాన్ని
నిశ్శబ్దపు క్షణాలకు అంకితమిస్తూ
రావద్దంటూ మరణాన్ని శాసిస్తున్నా...!!

4, మే 2017, గురువారం

ఎందుకిలా...!!

నేస్తం,
       ఒకప్పుడు పై చదువుల కోసం పక్క రాష్ట్రాలు వెళ్ళడం జరిగేది మనకు ఇక్కడ ఎక్కువ అవకాశాలు లేక. ఇప్పుడు కూడా అప్పటికన్నా ఎక్కువమంది చదువుల కోసం పక్క రాష్ట్రాలపై ఆధారపడటం జరుగుతోంది. ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు మనకు ఉండగా చదువు కో(న)వడానికి వలసలు వెళ్ళాల్సి రావడం ఎందుకు జరుగుతోంది. ? చదువుల వ్యాపారం మన రాష్ట్రంలోనే జరుగుతున్నప్పుడు మనం వేరే రాష్ట్రాలు వెళ్ళడం వెనుక కారణాలు ఏమిటి.?
    లక్షలకు లక్షలు పోసి ఇంటర్ ప్రైవేట్ కాలేజీల్లో చదివించడం, తిండి సరిగ్గా పెట్టరు సరే కనీసం చదువు కూడా సరిలేకుండా ఉంటోంది మనకు. పరీక్షల్లో మార్కులు డబ్బులు పోసి కొనుక్కోవడమే కాకుండా ప్రాక్టికల్స్ చేయించడం పక్కన పెట్టి కనీసం చూపించడం కూడా ఉండడటం లేదు. పేరుకి శ్రీ చైతన్య, నారాయణ వగైరా పెద్ద పేరున్న కాలేజీలు, చేసేది చదువుల వ్యాపారమే కానీ కనీసం కాస్తయినా విలువలు పాటించని కార్పొరేట్ కాలేజీలు.పోనీ గవర్నమెంట్ కాలేజీలో చేర్పిద్దామా అంటే మనకు ధైర్యం చాలదు. అప్పో సప్పో చేసి నలుగురితో నారాయణ అంటుంటే ఆఖరికి ఆ నారాయణ నామాలే గతి అవుతున్నాయి.
  చదువుల్లో, ఉద్యోగాలు తెప్పించడంలో పక్క రాష్ట్రాల్లో కాలేజీలు తీసుకునే కనీస జాగ్రత్తలు మనవాళ్ళు పాటించక పోవడమే కారణమా..! మనవాళ్ళు వెళ్ళి అక్కడ చదువుతున్నారు కానీ అక్కడివారు ఒక్కరైనా మన కాలేజీల్లో చేరుతున్నారా.! లోపం ఎక్కడ ఉంది.? పెట్టుబడులు కావాలి అంటే ఊరికినే ఎవరూ పెట్టరు. కొన్ని ప్రామాణిక విలువలు, పద్ధతులు పాటిస్తే కాస్తయినా మార్పు వస్తుంది. చదువుల్లో క్వాలిటీ లేకుండా ఉద్యోగాలు ఎలా వస్తాయి. మొన్న మొన్నటి వరకు అందరు టీచర్లే. మరి ఎంత మంది గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నారో కానీ టీచర్లకు జీతాలు మాత్రం బోలెడు. ఇక ఇప్పుడేమో ఖాళీగా ఉన్న ఇంజనీర్లు కోకొల్లలు. ఉన్నది అందరు వాళ్ళే కదా.. మరి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో..! మొన్నటి వరకు ఇంజనీరు అయిపోవడం అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించేయడమే అని అందరి కల. నేడు ఆ కల కల్లయిపోయింది ట్రంప్ పుణ్యమా అని. ఆ బాటలోనే మరికొన్ని దేశాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్.. ఇలా మరికొన్ని దేశాలు.
ఈ కార్పొరేట్ చదువుల వలన పిల్లల చదువు ప్రశ్నార్థకమై పోయింది ఇప్పుడు.
  
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner