మనం బతకడం మామూలు విషయం. మనతో పాటుగా పదిమందిని బతికించడం అసాధారణ విషయం. సహజంగా మనమెంతసేపు మనము, మన ఇంటివారి గురించే ఆలోచిస్తాం. మన చదువు మనకు, మనవారికి ఉపయోగ పడితే చాలనుకుంటాం. చిన్న పల్లెటూరులో అతి సాధారణ కుటుంబం నుండి వచ్చి, చదువుకున్నది ఐటిఐ అయినా, ఈనాడు పుట్టిన ఊరిలోని చదువుకునే పిల్లలకు మా చదువు అయిపోగానే మాకు మా నవీన్ అన్నయ్య ఉన్నాడు అండగా అన్న భరోసానిచ్చిన అసాధారణ వ్యక్తి గురించి నాలుగు మాటలు చెప్పాలి.
తండ్రి ప్రేమ తెలియకున్నా..అమ్మా, అమ్మమ్మ, తాతయ్య, మేనమామ, పిన్నిల వద్దనే పెరిగి, ఐట్ఐ చదివి, ఈరోజు హైదరాబాదులో ఓ కంపెనీ పెట్టి, పదిమందికి ఉపాధి కల్పించిన నవీన్ ఈనాటి యువతకు ఆదర్శప్రాయం. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన నవీన్ ను, నేను అవనిగడ్డ పాలిటెక్నిక్ కాలేజ్ లో పని చేసేటప్పుడు, ఓరోజు అవనిగడ్డ బస్ స్టాండ్ లో వాళ్ళ అమ్మమ్మతో చూసాను. తనే నా దగ్గరికి వచ్చి అక్కా అంటూ పలకరించాడు. తర్వాత చూసిన జ్ఞాపకమేమి లేదు.
ఈరోజు ఎందరో అమెరికా, ఆస్ట్రేలియా వంటి సంపన్న దేశాలు వెళ్ళి డాలర్లు సంపాదిస్తూ, తమ తమ కుటుంబాలను పోషించికుంటున్నారు. బతకడం అంటే మనం మాత్రమే కాదు, మనతో పాటు పదిమందికి దారి చూపించడమన్న సదుద్దేశ్యం ఏ కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో నవీన్ ఉన్నందుకు, ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని, తనే కాకుండా తన పిన్ని పిల్లలను కూడా సొంతవారిలా చూసుకుంటూ, పదిమందికి నేనున్నానన్న భరోసానిస్తున్న నవీన్ ను చూస్తుంటే, నిజంగా మా విజయక్క చాలా అదృష్టవంతురాలు అనిపించింది. తను చాలా ఇబ్బందులు పడే నవీన్ ను పెంచింది. కాని బిడ్డొచ్చిన వేళా, గొడ్డొచ్చిన వేళా అన్నట్టు నవీన్ జీవితంలో అర్ధాంగి రాకతో వచ్చిన మార్పు చాలా సంతోషకరమైనది. ఇద్దరు బిడ్డలతో చక్కని కుటుంబం. జీవితాన్ని గెలవడమంటే ఇది అని అనిపించింది నాకు.
మేమందరం కలిసి పెరిగిన ఊరు జయపురం. మా జయపురానికే కాకుండా అందరికి ఆదర్శప్రాయుడు నవీన్. సంకల్పం గొప్పదైతే దైవం తోడవుతుందని పెద్దలు ఊరికినే చెప్పలేదు. నవీన్ మరింత ఉన్నతిని సాధించాలని, సమాజానికి మరింత ఉపయోగ పడాలని కోరుకుంటూ.. హృదయపూర్వక శుభాభినందనలు…
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి