7, జూన్ 2022, మంగళవారం

అతివా జాగ్రత్త..!!

​     అనాది నుండి పురుషాధిపత్యం కొనసాగుతున్న మన సమాజంలో మహిళకు జరుగుతున్నది అన్యాయమే. అది ఏ విషయంలో తీసుకున్నా సరే. అహంకారం పురుషుడికి ఆభరణంగా మారిపోయింది. ఇంటి పనులు, ఒంటి పనుల విషయంలోనే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా మహిళకు సరైన న్యాయం జరగడం లేదు. యుక్త వయసులో మెుదలయ్యే శారీరక మార్పులు, ఓ బిడ్డకు జన్మనివ్వడానికి పడే శారీరక, మానసిక అవస్థలు, నడిమి వయసులో హార్మోనుల వలన కలిగే ఇబ్బందులు, మోనోపాజ్ సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు మహిళలను చుట్టుముడుతున్నాయి. ఇవి ప్రకృతి పరంగా సమస్యలు. ఇక వ్యక్తుల పరంగా, సమాజ పరంగా వచ్చేవి కోకొల్లలు. ఎంత చదువుకున్నా, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నా, ఇంటా బయటా సమస్యలు తప్పడం లేదు కొందరికి. 

     మన శరీర ఆరోగ్యం బాగుండాలంటే ముందు మన మానసిక ఆరోగ్యం బావుండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మానసికంగా దృఢంగా వుంటే ఎన్నో శారీరక సమస్యలు, అనారోగ్యాలు వాటంతట అవే పోతాయి. పోక పోయినా శారీరక అనారోగ్యాన్ని ఎదుర్కునే ధైర్యం మానసిక శక్తి అందిస్తుంది. అన్ని అనారోగ్యాలను నయం చేసే మందులు లేవు. మనోధైర్యం మనిషి ఆయువును పెంచుతుంది. ఇప్పటి ప్రపంచ సమస్య కరోనా, కాన్సర్, కొన్ని ఆటో ఇమ్యూనిటి అనారోగ్యాలను జయించాలంటే మనకు ముందుగా కావాల్సింది మానసిక స్థైర్యమే. 
      ఆటో ఇమ్యూనిటి డిసీజ్ ల పై ఇప్పుడిప్పుడే కాస్త అవగాహన వస్తోంది. వాటిలో అందరికి తెలిసింది సొరియాసిస్. మరొకటి కీళ్ళనొప్పి. ఈ కీళ్ళనొప్పులు కూడా పురుషుల కన్నా మహిళలలోనే ఎక్కువ. కీళ్ళ వాపులు, జాయింట్ల దగ్గర నొప్పులు వస్తుంటే సహజంగా మనం కీళ్ళనొప్పులని అనుకుంటాం. కాని వీటిలో మనకు తెలియనివి చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది లూపస్. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మే 10ని లూపస్ డే గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ లూపస్ రావడానికి రకరకాల కారణాలున్నాయి. ఇదమిద్ధంగా పలానా కారణమని చెప్పలేము. ఈ వ్యాధి లక్షణాలు కూడా మనిషికి మనిషికి వేరు వేరుగా వుంటాయి. అన్ని లక్షణాలు ఉంటేనే లూపస్ అని నిర్థారించనవసరం లేదు. ఏ లక్షణాలన్నా దీనికి సంబంధించిన కీళ్ళవ్యాధి నిపుణులను సంప్రదించాలి. 
    ఈ లూపస్ ప్రధాన లక్షణం ముఖంపై సీతాకోకచిలుక చిలుక ఆకారంలో ఎర్రని, నల్లని మచ్చలు రావడం. కాస్త జ్వరం, ఎండ తగిలితే శరీరం మంట పుట్టడం, చర్మంపై ఎర్రని పొక్కులు రావడం, కీళ్ళ దగ్గర వాపులు, నొప్పులు వంటి మిగతా లక్షణాలు కనబడతాయి. లూపస్ వున్న రోగిలో ఇవి అన్ని ఉండకపోవచ్చు.వీటిలో ఏ కొన్ని వున్నా వెంటనే డాక్టర్ ని సంప్రదించడం అవసరం. దీనిని మెుదట్లోనే గుర్తించడం కాస్త కష్టమే. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో దీనికి వైద్య సలహాలు తీసుకోవాలి. ఇది పూర్తిగా తగ్గదు. కాని సరైన వైద్యం, సకాలంలో తీసుకుంటే లూపస్ ని కంట్రోల్ చేయవచ్చు. వైద్యం చేయించుకోవడంలో అశ్రద్ధ చేస్తే రోగి శరీరంలో వ్యాధులు రాకుండా పరిరక్షించే యాంటిబాడీస్ వ్యతిరేకదిశలో పనిచేస్తూ శరీరంలోని వివిధ కణజాలాల వ్యవస్థలపై దాడి చేసి ఆ యా వ్యవస్థలను నిర్వీర్యం చేసేస్తాయి. ఈ వ్యాధి ఎక్కువగా 40 వయసు దాటిన మహిళలలో కనబడుతుంది. మగవారికి తక్కువగానే వస్తుంది. కాని వస్తే మాత్రం దాని ప్రభావం చాలా తీవ్రంగా వుంటుంది. 
      తెలిసిన సాధారణ లక్షణాలని అశ్రద్ధ చేయకుండా ఏ కాస్త అనారోగ్యమున్నా వెంటనే సంబంధిత వైద్యుని సలహా తీసుకోండి. మహిళలూ మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. మీరు లేనిదే ఇల్లు, సమాజం మనలేదు. ఇంటికి, సమాజానికి మీరెంత అవసరమో..మీ ఆరోగ్యం కూడా మీకంత ముఖ్యమేనని మరువకండి. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner