20, సెప్టెంబర్ 2022, మంగళవారం

ఆరాధన..!!

నీ కోసం 

విశ్వాన్ని 

గుప్పెట బంధించాలన్నంత 

ఆరాటం


అదేంటో మరి

శూన్యానికి తావీయని

అనంతమే

నువ్వయ్యావు..!!



17, సెప్టెంబర్ 2022, శనివారం

​రాలిన స్వప్నాలు..!!

రాతిరి పొద్దులోనో

ఉలిక్కి పడిన మనసు

ధైర్యాన్ని కూడగట్టుకుంటోంది


గతాన్ని కాదనలేని స్థితిలో

వాస్తవాన్ని భరించే శక్తిని కోల్పోయి

భవిత లేని బతుకుగా మిగిలిపోతోంది


అంతరంగపు ఆలోచనలను ఆపలేక

ప్రశ్నలుగా సంధించాలని ప్రయత్నిస్తున్న 

కలవరాలను కట్టడి చేయలేక పోతోంది


వెలుగుల నిదురలో

చీకటి మెలకువను వెదకలేక

వేసారిన ఊపిరితో ఊరడిల్లుతోంది


తన ఆశల సౌధాలను అందిపుచ్చుకోవడానిక్

కూలిన కట్టడాల్లో, కాలిన జీవితాల్లో

రాలిన స్వప్నాలను ఏరుకుంటుంటోంది..!!


13, సెప్టెంబర్ 2022, మంగళవారం

అవస్థ..!!

రచనలో విభిన్న శైలి సాగర్ శ్రీరామకవచం గారిది. వారి కలం నుండి జాలువారిన నవల “ అవస్థ”. దాని గురించి చిన్న సమీక్ష.


స్వప్నానికి వాస్తవానికి నడుమనున్న మరో శో(లో)కమే ఈ “అవస్థ”


“జీవితానికి వాస్తవానికి వ్యతిరేక దిశలో కలల వాస్తవికత వుంటుంది.” 

ఈ పై మాటల ఆధారంగానే ప్రముఖ నవలాకారుడు, విమర్శకుడు, కవి, ప్రచ్ఛన్న వస్తు శిల్పాల సిద్ధాంతకర్త అయిన సాగర్ శ్రీరామకవచం రచించిన “అవస్థ” నవల ధారాహికగా “నవమల్లెతీగ” సాహితీ మాస పత్రికలో ప్రచురితమైనది. ఇప్పుడు పుస్తకరూపంలో మనముందుకు వచ్చింది. ప్రేమ,ద్వేషం,కోపం, దుఃఖం ఇలా సాధారణ మనిషికుండే ప్రతి భావనను మనిషి అన్ని సంద్భాల్లోనూ బయట పెట్టలేడు. సాగర్ శ్రీరామ కవచం గారు పైన చెప్పిన మాటల ఆధారితంగానే ఈ “అవస్థ” నవల మెుత్తం వాస్తవానికి, కలకు మధ్యన మరో లోకంలో నడిచిందని నాకనిపించింది. 

ఐదు భాగాలుగా విభజింపబడిన “అవస్థ” లో మెుత్తంగా దత్తుడి పాత్ర ఆవిష్కరింపబడింది. భారతదేశానికి స్వతంత్రం రాక మునుపు కథగా చెప్పబడింది. సౌత్ ఆఫ్రికా నుండి ఓడ ప్రయాణం ముందు కాస్త ప్రోలాగ్ తో మెుదలై కథ నడుస్తుంది. చదువుతున్న మనకూ జరుగుతున్నది ఏమిటన్న మీమాంస ఉంటుంది. ప్రతి మనిషిలో వున్న మరో మనిషి ఆశలనండి, కోరికలనండి, మరేదైనా పేరు పెట్టినా…వీటన్నింటిని కలిపి మనసుకు స్వేచ్ఛనిస్తే ఆ మనసు ప్రయాణమే ఈ “అవస్థ” నవలగా నాకనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే జీవించడానికి, మరణించడానికి మధ్యన వాస్తవానికి, స్వప్నానికి నడుమ జరిగిన మనసు మాటలకు యదార్థ స్వేచ్చానువాదంగా చెప్పవచ్చు. 

సాధారణంగా నవల అంటే ప్రేమ, విరహం, ఆరాధన, అనుబంధాలు ఇలా ఉంటాయి. “అవస్థ”లోనూ ఇవన్నీ ఉన్నాయి. భారతీయ సంప్రదాయానికి, కట్టుబాట్లకు పెద్ద పీటే వేసారు. కథంతా దత్తుడు, దొంగజగ్గడు(చిత్రకారుడు), భగవతి, స్వరాజ్యం, సమయపాలన, గుడ్డలమూట అమ్మాయి వగైరా ముఖ్యపాత్రల నడుమ సంభాషణలుగా జరుగుతుంది. బతకడానికి, చావడానికి మధ్యన జరిగిన పెద్ద యుద్ధమే ఈ అవస్థ. కథనమంతా చాలా స్వేచ్ఛగా నడుస్తుంది. 

భారతదేశానికి ఓడలో ప్రయాణంలో ఎన్నో సంఘర్షణలు, అనుభవాలు నిజమో స్వప్నమో తెలియని అయోమయంలోనే కథంతా జరుగుతుంది. అండమాన్‌ దీవులలో అంతరించిపోతున్న తెగను పునరుద్ధరించే క్రమం కూడా మనకు ఈ ప్రయాణపు “అవస్థ”లోనే కనబడుతుంది. చిత్రాలలోనే వి’చిత్రాలను మనకు చూపిస్తారు రచయిత. బతకడానికి, చావడానికి మధ్యనున్న మరో జీవితమే “అవస్థ”గా చెప్పవచ్చు. రచయిత మనసుకు స్వేచ్ఛ వచ్చిందో లేక అక్షరాలకు స్వేచ్ఛ వచ్చిందో! ఆలోచనలకు స్వేచ్ఛ వచ్చిందో అన్న సందిగ్ధం మనల్ని వేధిస్తూనే ఉంటుంది నవల అసమాప్తమయ్యే వరకు. రచయిత నవలను సమాప్తం చేయలేదు. అందుకే చావుపుట్టుకలనేవి సృష్టిలో జరుగుతూనే ఉంటాయి కనుక ఇలా “అవస్థ” ని అసమాప్తంగానే ఉంచేసారనిపించింది.

సాగర్ శ్రీరామకవచం గారి నవలకు సమీక్ష రాయలేను కాని నాకనిపించిన నాలుగు మాటలను సంక్షిప్తంగా మీముందుంచాను. ఈ నవల రచనాశైలి కూడా చాలా విభిన్నంగానే ఉంది. చివరగా ఓ చిన్నమాట ..ఈ నవల చదవడానికి మనము కూడా కాస్త “అవస్థ” పడాలి తప్పదు. మెుదటి అడుగెప్పుడూ ఒంటరేనన్న మాట అక్షర సత్యం. ఆనాటి చలం గారి నుండి ఈనాటి సాగరుని వరకు. ఈ నవలలో నాకు బాగా నచ్చిన మాటలను ముందు చివర ఉంచాను. 


“నేరానికి గౌరవానికి ఏదో సంబంధం వుంది.” ఇప్పటి వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి ఈ మాటలు. కాదంటారా..!!

తెలుగు సాహిత్యంలో అవస్థ ఒక అరుదైన ప్రయోగాత్మక నవల

.. రచయిత ఆరు సార్లు తిరగ రాసి ఎడిటింగ్ చేయటం ఈ నవల పట్ల సాగర్ గారి శ్రద్ధ ఎంతో విదితమవుతుంది. కాలానికి తట్టుకొని నిలబడే ఈ నవల అందరు చదవప్రార్ధన.

సాగర్ శ్రీరామకవచం గారి సరికొత్త రచనాశైలికి, ఆలోచనాసముద్రానికి హృదయపూర్వక అభినందనలతో…

7, సెప్టెంబర్ 2022, బుధవారం

కాలం వెంబడి కలం….సరళ ఉప్పలూరి

కాలం వెంబడి కలం" నాకర్ధం అయినది ఇలా..


మంజు యనమదల గారు నాకు ముందు రచయిత్రిగానే పరిచయం. తర్వాత మాకు అందరికీ తనకి సీరియస్ ఐందని తెలిసి, వివరాలు కనుక్కుంటూ వచ్చాం. గెలిచిన వారు ఒక మార్గం చూపిస్తారు. ఎదురు దెబ్బలు తిని లేచేవారు ఎన్నో మార్గాలను తమ పయనంలో పరిచయం చేస్తారు. అలా  ఎక్కడా ఓటమి ఒప్పుకోని సైనికురాలే తను. చావుతో యుద్ధం అంటే ఎంత ఢీలా పడతారో ఎవరైనా, కానీ తను తరుముతూనే ఉంది. మోసపోయాక మరొకరిని నమ్మలేం, తను నమ్ముతూనే ఉంది. నేను నిజాయితీగా ఉన్నా, వారికే మనస్సాక్షి లేదు వదిలేయ్ అంటుంది. 

జీవితం అంటే ఏదో సాగనివ్వన్నట్లు కాక, పోరాటమే చేసింది. నా కూతురు అమెరికా వెళ్ళాలి అన్నాక తన పుస్తకం చదివించా, ఇలా ఉంటుంది అని సిద్దపడి వెళ్ళాలి అని. కొన్ని చోట్ల ఇంత ఖచ్చితంగా ఉంటుందే అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎందుకు సహించింది అనిపించింది. జీవితం అన్నీ నేర్పుతుంది అన్నది మనలాంటి జీవితాలే చెప్తాయేమో. ఇదే కొనసాగింపు పిల్లల బాధ్యత తీరేవరకూ సాగాలని కోరుకుంటున్నాను.

6, సెప్టెంబర్ 2022, మంగళవారం

స్నేహం విలువ..!!

నీ ప్రేమకు దాసోహం హైమా😍. థాంక్యూ సోమచ్. 


ఏ పురస్కారమూ వీటికి సాటిరాదు. స్వచ్ఛమైన ప్రేమకు, చిన్ననాటి స్నేహానికి ఏ హంగులు, ఆర్భాటాలు అంటని మనసాక్షరాలు ఇవి. మేము కలిసి చదువుకుంది కొన్ని సంవత్సరాలే. రెండు నుండి నాలుగు వరకో, ఐదు వరకో అనుకుంటా. కాని మా స్నేహం 1977 నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే వుంది. వెల కట్టలేని విలువైన సంపదను అందించిన నా చిన్ననాటి నేస్తం హైమకు మనఃపూర్వక కృతజ్ఞతలు.

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner