ఈ నెల నవమల్లెతీగలో నా వ్యాసాన్ని ప్రచురించిన సాహితీ యాజమాన్యానికి మనఃపూర్వక ధన్యవాదాలు.
నేస్తం,
కవి, కళాకారుడు అనేవాడు ఎక్కడినుండో ఊడిపడడు. వాడు సమాజంలో ఒక భాగమే. వాడికి సొంత అభిప్రాయాలు, ఇష్టాలు ఉంటాయి. వ్యక్తిగా మనకంటూ స్పందన లేనప్పుడు కవి కాదు కదా దేవుడు కూడా ఎవరినీ చైతన్య పరచలేడు. ఇది వాస్తవం.
సంఘాలకు, ఉద్యమాలకు నాయకులమని చెప్పుకుని బతికేటప్పుడు, ఆ నాయకత్వం అంటే ఏమిటో, ఏమి చేయాలో తెలియకుండానే నాయకులయ్యారా! మెుదటి అడుగు ఎప్పుడూ ఒంటరే అన్న సత్యం మరిస్తే ఎలా! దిశా నిర్దేశం చేయాల్సిన నాయకులు వ్యక్తిగత దూషణలు చేయడం సబబేనా! మీ సమస్యలకు మరెవరో స్పందించాలనే ముందు, కనీసం సమాజంలో మరే ఇతర సమస్యలకయినా మీ స్పందన తెలిపారా మీరెప్పుడయినా! ఒకరిని విమర్శించే ముందు మనమేంటన్నది చూసుకోవాలి.
అందరికి ఇదో ఊతపదమయిపోయింది. “ కవులు, కళాకారులు మాకు స్పందన తెలుపడం లేదు.” మీ దృష్టిలో కవి, కళాకారుడు మనిషి కాదా! వాడికంటూ స్వతంత్ర భావాలు ఉండకూడదా! సమాజంలో సమస్యలను మన కోణంలోనే వాడూ చూడాలనుకోవడం న్యాయమేనా! మన సమస్యకు ముందు మనం స్పందించాలి. మన సమస్యను నలుగురికి అర్థమయ్యేలా చేయడం, దానికి పరిష్కారం ఆలోచించడం మన పని. ఇతరులు మనతో వస్తారా రారా అన్నది తర్వాత విషయం. వ్యవస్థలో లోపాలన్నవి సహజం. వాటిని దాటుకుంటూ పోవడంలో విజ్ఞత చూపడం మనిషి నైజాన్నిబట్టి ఉంటుంది. మన చేతికున్న ఐదు వేళ్ళే ఒకేలా లేనప్పుడు అందరి అభిప్రాయాలు, ఇష్టాలు ఒకేలా ఎలా ఉంటాయి? సమాజమంటేనే భిన్న సంస్కృతుల సమ్మేళనం. వివిధ వృత్తులు, రకరకాల జీవన విధానాలు అన్నీ కలగలిపి ఉంటాయి. కవికయినా, మరెవరికయినా తన మనసు స్పందనే ముఖ్యం. తాను తీసుకునే వస్తువు అది సమాజంలో సమస్య కావచ్చు, మరొకటి కావచ్చు. ఏదైనా తన మనసుకు అనుగుణంగానే తన స్పందన తెలియబరుస్తాడు. కవయినా, కళాకారుడయినా ముందు ఈ సమాజంలో మనిషి. వాడిని మీకనుగుణంగా నడుచుకోవాలని అనుకోకండి. వాడికంటూ వాడి సొంత దారి ఉంటుంది. ఆ దారికి అడ్డు రాకండి. వాడి పని వాడిని చేసుకోనీయండి దయచేసి.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి