8, నవంబర్ 2022, మంగళవారం

ఏక్ తారలు..!!

​1.  బాధ్యతలెరుగని బంధాలే అన్నీ_పేరేదైతేనేం..!!

1.  మనిషెప్పుడూ నిత్య సంచారే_కాలంతో పరుగిడుతూ..!!

3.   మాటేం చేయగలదు_మనసుని చుట్టేయడం తప్ప..!!

4.  మనసు తెలిసింది_కనుచూపు చేవ్రాలులో..!!

5.  బంధం బలపడిందట_నమ్మిన మనసుకు దాసోహమంటూ..!!

6.  మథనం మనసుది_అక్షరం ఊతమైందంతే..!!

7.  మనసుకెంత మమకారమో_నువ్వు విదిల్చిన గురుతులను తడుముతూ..!!

8.  తలపుల తక్కెడకు తూకమేయగలమా_మానని గాయాలనూ దాచే మదితో..!!

9.  అనుభవాలే జీవితమయ్యాయి_కాలంతో జత కట్టాక..!!

10.  ఆసరా అవసరమే ఎప్పటికైనా_అది కలమా కాలమా అన్నది విధిరాత..!!

11.  కాలాన్ని కలంలోనికి వంపేసా_నాలోని నిన్ను కాదనదని..!!

12.  కథలన్నీ కాలానికెరుకే_ముడి విప్పే మాటే కరువంటూ..!!

13.  మనసంతా ఖాళీ_కొన్ని గురుతులంటూ వెళ్లిపోయాక..!!

14.  నన్ను నేను కోల్పోయా_బాధ్యతల్లేని బంధాలకు చిక్కుకుని..!!

15.  ఓటమే గెలుపు_మనదనుకున్న అనుబంధాల నడుమ..!!

16.  ముక్తాయింపు అవసరమైంది_మనసును సముదాయించడానికి..!!

17.  జీవితాన్ని ఆస్వాదిస్తున్నా_శూన్యాన్ని నింపేయాలని..!!

18.  దారులెన్నున్నా గమ్యం ఒకటే_అది బ్రహ్మమయినా పరబ్రహ్మమయినా..!!

19.  దగ్గరతనమెక్కడుంది_దూరమే దగ్గరౌతుంటేనూ..!!

20.  పరుగాపిన జీవితాలకు తెలుసు_తప్పుటడుగుల మూల్యమెంతో..!!

21.  మనసుకు తెలుసు_స్థిరత్వం విలువెంతో..!!

22.  నిజ జీవిత కథనాలే అన్నీ_మది ఒంపిన అక్షర కవనాలుగా..!!

23.  బాధ బంధువే_పంచుకునే బంధాన్ని పరిచయం చేస్తుంది..!!

24.  అమ్మ స్పర్శే అనునిత్యం_ఆత్మీయతను పంచే అక్షరాల్లో..!!

25.  ఆత్మాభిమానమెక్కువే నా మనసుకు_పడిన చోటే లేవాలనుకుంటూ..!!

26.  తెలిసిన బంధమే_తెలియని జన్మల అనుబంధమై..!!

27.  ఎన్ని అనుభవాలను దాచుకుందో మనసు_నిత్యం అక్షరాలతో సంభాషిస్తున్నా..!!

28.  ప్రతి క్షణాన్ని పలకరిస్తున్నా_నీ చిరునామా తెలుపుతాయేమోనని..!!

29.  ఒడుపు తెలిస్తేనే విజయం_గాలివాటం ఎటువైపు వీచినా..!!

30.  మనోసంద్రం ఆకాశనేత్రమైంది_ఒంటరితనానికి ఊరటగా..!!


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner