2, ఆగస్టు 2023, బుధవారం

జీవన మంజూష ఆగస్ట్ 23


 నేస్తం,

         “ మాటరెండక్షరాల పదమే కాని మాటలోనే ఎన్నో భావాలు దాగున్నాయి. మనుష్యులను, మనసులను దగ్గర చేసేది, దూరం చేసేది కూడా మాటే. ఒక్కోసారి వేల మాటలకన్నా క్షణం మౌనం ఎన్నో సమస్యలకు సమాధానం చెబుతుంది. అలా అని మాటకు విలువ లేదని కాదు. దూరాలను తగ్గించి, బంధాలను పెంచేదీ మాటే. కాకపోతే కాస్త పొదుపుగా వాడాలంతే

            కొందరికి మాటే అలంకారమైతే, మరికొందరికి మౌనం ఆభరణం. మనం కొలిచే భగవంతుడు విగ్రహ రూపంలో ఎప్పుడూ మనతో మాట్లాడడు కాని మనం చెప్పే ప్రతిదీ వింటాడు. మన మనసులను తేలిక చేస్తాడు. కొందరు పెద్దలు అనర్గళంగా ఉపన్యాసాలు చెప్తుంటారు. వాటిలో మంచి మాటలు(మనకు నచ్చిన మాటలు) మన మనసులను ఆకట్టుకుంటాయి. మరి కొందరి మాటలు అస్సలు వినబుద్ది కాదు. ఇది మాటల్లో తేడా కాదు. మనలోని ఆలోచనల్లో తేడా

            చిరునవ్వు మహా భారత యుద్ధానికి కారణమైతే, మాట ఎన్నో ప్రళయాలను సృష్టిస్తుంది. మరెన్నో సత్సంబంధాలను నెలకొల్ప గలుగుతుంది. మాటకున్న శక్తి అలాంటిది. ఒకరిని హేళన చేయడమూ మాటే. అవహేళనకు పది రకాల సమాధానాలనూ మాటే తిరిగి ఎదుటివారితో చెప్పించి నోరు మూయించనూ గలదు. మన వ్యక్తిత్వాన్ని మనం పలికే మాటలు తెలుపుతాయి. మన నడవడిని బట్టే మన మాట కూడానూ.

            మన రాతలు, మాటలు మనమేంటో నలుగురికి చెప్తాయి. మాటల్లో తేనెలు ఒలకబోయడమే కాకుండా ఇతరులకు చెప్పడంతో పాటుగా కాస్తయినా మనమూ పాటిస్తుంటే మన మాటకు, రాతకు విలువ. అధికారమో, ధనబలమో వుందని మాట మాట్లాడినా, పని చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో చరిత్రను తిరగవేస్తే తెలుస్తుంది. మాటయినా, రాతయినా మితిమీరకుండా హద్దుల్లో వుంటేనే ఎవరికయినా విలువ, గౌరవం దక్కుతాయి. కాదూకూడదని మన అహాన్ని మనం నమ్ముకుంటే మన భవిష్యత్తేంటో గత చరిత్రలు చెప్పకనే చెబుతాయి


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner