4, సెప్టెంబర్ 2023, సోమవారం

జీవన మంజూష 09/23


 నా వ్యాసాన్ని ప్రచురించిన నవమల్లెతీగ సాహితీ యాజమాన్యానికి మనఃపూర్వక ధన్యవాదాలు..చదివి తమ విలువైన స్పందనలను అందిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు…


నేస్తం,

          కొన్ని బంధాలు దూరంగా వుంటేనే అందం. అలాగే మరికొన్ని దూరాలు దగ్గరగా రాకుంటేనే బావుంటుంది. ఇల్లంటే నాలుగు గోడలు, రెండు గుమ్మాలు, రెండు కిటికీలు, ఓ పైకప్పు మాత్రమే అని చాలామంది అనుకుంటారు. కాని ఆ ఇంటిలో ఉన్న జీవాల మధ్యన అనుబంధంపై ఆ ఇంటి విలువ ఆధారపడి ఉంటుంది అని తెలుసుకోలేరు. మన వారసత్వాన్ని గొప్పగా మనం చెప్పుకోవడానికి కాకుండా, వారసులకు మనమేం పంచామన్నది మనం చూసుకోవాలి. మంచి వ్యక్తిత్వాలను, ఉన్నతమైన ఆలోచనలను అందించిన రోజు నిజంగా మనం గొప్పవారమే. మన ఇంటిని మనం చక్కదిద్దుకుంటే సమాజాన్ని ఉద్ధరించినట్లే. సమాజం కోసం ప్రత్యేకంగా మనం ఏ ప్యాకేజీలు పంచనక్కర్లేదు. మన నడవడి సరిగ్గా ఉంటే చాలు. సమసమాజ ఉద్ధరణకు బీజం పడినట్లే.

          ఏమాటైనా ఒకరిని అనే ముందు, మనమేంటన్నది మనం తెలుసుకోవాలి. ఎదుటివారిని విమర్శించడం, అవహేళన చేయడం అన్నది క్షణాల్లో చేయవచ్చు. కాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది మన ఊహకు కూడా అందదు. వస్తువుకైనా, మనిషికైనా విలువ అనేది ఎలా వస్తుందో మన అందరికి తెలుసు. మనకు నచ్చినది గొప్పదని, నచ్చనిది విలువ లేనిదని అనుకుంటే మనకన్నా మూర్ఖులు మరొకరుండరు. 

       తూకానిదేముంది ముం వేసే రాళ్ళని బట్టి ఉంటుంది. న్యాయదేవత చేతిలోని తక్కెడ కూడా సాక్ష్యాలకు మాత్రమే తూగుతుంది. మనకు నచ్చినవారిని పొగడటం, నచ్చనివారిని అదేపనిగా ఎద్దేవా చేయడం విజ్ఞులకు తగదు. ఎవరి భావాలు వారివి. అవార్డులు రానంత మాత్రాన కొందరి అక్షరాలకు విలువ లేదని అనలేం కదా. అలాగే మనకు నచ్చినవారికి పురస్కారాలు వచ్చినంతనే..ఆ రాతలు గొప్పవేం కాదు. ఈరోజుల్లో పురస్కారాలు ఎవరికి ఎలా వస్తున్నాయన్నది జగద్విదితమే. దానికోసం అదేపనిగా మనమేం గొంతు చించుకోనక్కర్లేదు. అందరు వెళ్లేది అదే దారిలో అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. కాదంటే ప్రతిసారి తమ గొంతుకను వినిపించాలి. నిష్పక్షపాతంగా.

          సాహిత్యం కూడా కులాలకు, మతాలకు, భజనలకు మాత్రమే తల వొగ్గుతోంది. ప్రతిభకు కొలమానాలు ఒకప్పుడు పురస్కారాలు. ఇప్పుడు బిరుదులు, పురస్కారాలంటే ఏపాటి విలువ వుందో మనకూ తెలుసు. ఎవరికి అనుగుణమైన దారుల్లో వారు పోతూ వుంటారు. ప్రాంతీయతకు, మాండలీకాలకు ప్రాధాన్యత ఇవ్వడం, మందులకు, పార్టీలకు, డబ్బులకు లొంగడం అనేది లోక విదితమే. ఏది ఎలా వున్నా మన పని మనం చేసుకుపోవడం ఉత్తమం.


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner