10, సెప్టెంబర్ 2023, ఆదివారం

స్మృతిపథంలో…సమీక్ష..!!


                 మానవ సమాజంలో మనిషి తత్వం..”

      కృషితో నాస్తి ధుర్భిక్షం అన్న మాటకు నిదర్శనం డాక్టర్ పోగుల శేషగిరికుమార్ గారు. చదువుకున్న చదువుకు కొలువు రాకపోయినా నిరాశ చెందలేదా.ఎవరిని నిందించనూ లేదు. అవకాశాలను వెదుకుతున్న వారికి విజయం తథ్యమని నిరూపించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, సకళ కళ్లలో నిష్ణాతులు అయిన డాక్టర్ పోగుల శేషగిరికుమార్ గారు చిత్ర లేఖనం, తండ్రిగారి వారసత్వ సంపదైన నాటక రంగం, రచనా రంగాల్లో చక్కని ప్రతిభ కలిగినవారు. గ్రంథాలయ విద్యలో రాణించినా, ఎన్నో పరిశోధనలు చేసి రచించిన గ్రంథాలు వారికి ఎనలేని కీర్తిప్రతిష్టలను సంపాదించి పెట్టాయి. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆయనను వరించాయి.

     పురిటిగడ్డ మీద మమకారం లేనివాడు బహు అరుదు. పుట్టిన నేల మీద ప్రేమను వదలలేక తన చుట్టూ జరిగిన సంఘటనలను కథలుగా మలిచిస్మృతిపథంలో..” అనే కథా సంపుటిని అందించారు. కథలన్నీ అతి సాధారణ శైలిలో సామాన్య చదువరులకు సాయం చక్కగా అర్థమయ్యే రీతిలో రచింపబడ్డాయి. ప్రతి కథా మన చుట్టూ కనబడే సంఘటనలకు రూపమే


మరి స్మృతిపథంలో..ఏముందో క్లుప్తంగా నా మాటల్లో..


         ఫలితమాశించని స్వచ్ఛమైన భక్తికి, ప్రేమకు దక్కిన గౌరవం భక్త శబరిలో మనం చదవవచ్చు. భగవంతునికి భక్తితో అర్పించే తృణమైనా, ఫలమైనా దేవదేవునికి అత్యంత ప్రీతికరమని ఆనాటి శబరి కాకుండా, ఈనాటి శబరి కూడా నిరూపించింది. మనిషితనాన్ని, మానవత్వాన్ని చుట్టుపక్కలవారు నిరూపించుకున్నారు కథలో.

        చంద్రమోహన్ తిరిగిరాలేదు కథ ఎన్నో వాస్తవ సంఘటనలకు మూలం. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో చంద్రమోహన్ లు ఇలా కనబడుతూనే ఉన్నారు. మనసు బాధగా అనిపించింది కథ చదువుతుంటే.

   అల్లుడు దిద్దిన కాపురంలో సగటు మగవాడికి వాడి దారిలోనే బుద్ధి చెప్పిన వైనం చాలా బావుంది. బోలెడు కుటుంబాల్లో జరిగే విషయమే అయినా చక్కని పరిష్కారాన్ని రచయిత చూపారు కథలో.

     పంచిన ప్రేమ కథలో ఆత్మీయతకు, అనుబంధానికి బంధుత్వమేమి అవసరం లేదని, ఇద్దరి మధ్యన అభిమానమే విడదీయరాని బంధంగా మారుతుందని తెలిపిన కథ. మమకారం ఎంత తీయగా ఉంటుందో, అంత తీయగానూ చెప్పారు రచయిత.

     మాస్టారు తప్పు చేసారా? నిజమే ఇది మనకూ వచ్చే సందేహమే. సందేహం రాకపోతే కథకు అర్థం పరమార్థం ఉండదు. కొన్ని జీవితాలు ఎందుకలా అయిపోతాయన్న దానికి ఎవరి దగ్గరా సమాధానముండదు. సందేహాలు మాత్రమే పుట్టుకొస్తాయి

     గెలుపు -ఓటమి చాలా జీవితాల్లోని కథే ఇది. తమ స్వార్థానికి ప్రేమను ఎరగా వేసి తాము అందలాలెక్కాలనుకునే వారి కథ. నమ్మిన ప్రేమకు దక్కిన కానుక ఆత్మహత్య. విద్యార్థి జీవితంలోనే కాదు, మరెన్నో చోట్ల స్వార్థపు ప్రేమల్లో పడి జీవితాలు నాశనం చేసుకున్న ఎందరో మనకు గుర్తుకు రాక మానరు.

     కలను నమ్మి కలలో కనిపించిన దైవానికి తన యావదాస్తిని దానం చేయడం గొప్ప విషయమే. రామార్పణం కథలోని విషయమిది.

      ఇష్టమైన వ్యాపకం కోసం కష్టాన్ని కూడా ఇష్టంగా భరించడమంటే ఇదే కాబోలు. సినిమా మీద ఇష్టంతో కష్టపడిన పెద్దాయన కథ సినిమా పిచ్చోడు

  చదువు నేర్పిన గురువుకు శిష్యుడికి వచ్చిన అధికారంతో ఇచ్చిన గురుదక్షిణ గురించి చాలా బాగా చెప్పారు.

     పూలమ్మిన చోటనే..కథలోని పాత్రలు నిత్యం మనకు తారస పడుతూనే ఉన్నాయి ఇప్పటికి. అపాత్రదానం చేయడం వలన కష్టనష్టాలను తెలిపే కథ ఇది. కథలోని నారాయణరావులు చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా. అలానే పొందిన సాయం మరిచిన వారు కూడా

   చెప్పుడు మాటలు చేసే చేటు, మించిన కూడా చెడు దృష్టితో చూటే చుట్టుపక్కల అమ్మలక్కలు ఉన్నంత వరకు సమాజంలో చాలామంది కథలు పునుగుల సుందరం కథలే.

   డబ్బుకు ఎంత వరకు విలువ ఇవ్వాలి అని కథ మనకు చక్కగా తెలుపుతుంది

          

           డాక్టర్ పోగుల శేషగిరికుమార్ గారుస్మృతి పథంలో..” రాసిన ప్రతి కథా మనకూ తెలిసిన కథలే. ఆనాటి సమాజంలో తన చుట్టూ జరిగిన ప్రతి చిన్న విషయాన్ని చిన్నతనం నుండి గుర్తుంచుకుని కథలుగా రాయడం అభినందించదగ్గ విషయం. ప్రతి కథా వాస్తవ కథనమే. ప్రపంచాన్ని చుట్టినా, తాను పెరిగిన ఊరిని, మనుష్యులను మరువక తన అక్షరాల్లో వారిని మనందరికి చూపించి , అందరి మనసులను ఆలోచింపజేసారు. ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకంస్మృతి పథంలో..” . ఇప్పటి సమాజానికి అవసరమైన చక్కని విషయాలను కథలుగా అందించిన డాక్టర్ పోగుల శేషగిరికుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు.


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner