నేస్తం,
పంచుకోవడానికో, పెంచుకోవడానికో కాదు బంధాలు. నమ్మకమనే పునాది మీద బంధాలు ఏర్పడతాయి. అంతే కాని బంధాల మధ్యన కాలాన్ని లెక్కలేసుకోవు. మన మధ్యన వున్న బంధంలో అనుబంధం వుందా లేదా అని తరచి చూసుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు ప్రతి చోటా కనిపిస్తున్నాయి. బంధమేదయినా డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తోంది. బ్రతికుండగానే బంధాలను గాలికొదిలేసి, బాధ్యతలను విస్మరించి, మెుక్కుబడిగా ఓ ముద్ద పడేస్తున్న నేటి అనుబంధాలు మనవి.
ఏ తల్లిదండ్రులయినా పిల్లలను ప్రేమగా, బాధ్యతగానే పెంచుతారు కాని భారమని అనుకోరు. మరి అలాంటప్పుడు అపర వయసులో పెద్దలను ఎంతమంది పిల్లలు ప్రేమగా, బాధ్యతగా చూస్తున్నారిప్పుడు? ఈరోజు మనం ఖర్చు పెట్టేస్తే రేపటి రోజున మన పిల్లలు నలుగురిలో తక్కువగా కనబడతారేమోనని తిని తినకా పిల్లలకు ఆస్తులు కూడబెడితే, ఆ ఆస్తుల కోసమే బాధ్యతలు మోస్తున్న బిడ్డలున్న సమాజం మనది. మధ్యతరగతి బతుకులు మధ్యస్థంగా మిగులుతాయని చరిత్ర చెబుతోందిప్పుడు.
తప్పొప్పులు మానవ జీవితాల్లో సహజం. కాని మన తప్పులకు ఎదుటివారిని బాధ్యులుగా చేయడం సమంజసం కాదు కదా. మన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు వాటి పర్యవసానాలు కూడా మనమే భరించాలి. అది బాధయినా, సంతోషమయినా మననిర్ణయానికి ఫలితం మాత్రమే. పెంపకాలు, పరిస్థితులు అందరివి ఒకేలా వుండవు. వారి వారి స్థితిగతులను బట్టి, చుట్టూ వున్న మనుష్యులను బట్టి, ఆలోచనలను బట్టి మనిషి ప్రవర్తన వుంటుంది. అదే మనిషి జీవితాన్ని శాసిస్తుంది.
సమస్యలను వద్దనుకుంటే సరిపోదు. వాటిని అధిగమించడం నేర్చుకోవాలి. సమస్య లేని జీవితాలు బహు అరుదు. సమస్యలను తట్టుకుని, సానుకూల దృక్పధంతో ఆలోచించే వారికి జీవితంలో గెలుపు సాధ్యమౌతుంది. ప్రతిక్షణం నిరాశ, నిస్పృహలతో వుండేవారికి జీవితంలో ప్రతిక్షణం భయానకంగానే వుంటుంది. సమస్యకు ఎదురు నిలవడం మెుదలు పెడితే ఎంతటి సమస్యయినా పరిష్కారమౌతుంది. ఆస్తులను మాత్రమే పంచుకుంటున్న మనం అనుబంధాలను కూడా కాసింత అక్కునజేర్చుకునే రోజు ఎప్పుడు వస్తుందో..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి