నిన్న సాయంత్రం ఠాగూర్ గ్రంథాలయంలో ఆత్మీయులు మధ్యన జరిగిన “జీవన మంజూష” ఆవిష్కరణ..
16, నవంబర్ 2024, శనివారం
5, నవంబర్ 2024, మంగళవారం
జీవన మంజూష నవంబర్24
నేస్తం,
వస్తువైనా, మరేదైనా మనది కాని దాని మీద మమకారం ఎక్కువెందుకో కొందరికి. మన వస్తువులు, బంధాలు మనకి జాగ్రత్త అయినప్పుడు ఎదుటివారివి కూడా అంతే అని మనం అనుకోక పోవడం మన అతి తెలివి అనుకోవాలేమో. మనవి అడిగి తీసుకోవడంలో లేని మొహమాటం, మనవి కాని వాటి మీద హక్కు మనకి వుందనుకోవడం సరికాదు కదా.
అవసరం అనేది ఎప్పుడు ఎవరి తలుపు ఎలా తడుతుందో తెలియదు. ఈరోజు మిడిసిపాటు పడితే రేపు అధోగతిపాలు కాక తప్పదు. ఎంతటి వారికైనా మరొకరితో అవసరం లేకుండా వుండదు. అవసరం అనేది ఏ రూపంలోనయినా రావచ్చు. అన్నీ మనకున్నాయన్న అహం మనకుంటే మనల్ని సృష్టించిన భగవంతునికి మనకి సరైన సమాధానం చెప్పడం బాగా తెలుసు.
తరగని సంపద మనకుందని, మనకెవరితో పని లేదని, బంధాలను, రక్త సంబంధాలను కూడా వదిలేసుకుంటే, రేపన్నది మన చేతిలో లేదని మనకు తెలిసినా తెలియనట్లు నటించడం చాలామందికి ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. మాకేంటి మేము, మా పిల్లలు బావున్నాము, మాకది చాలనుకుంటే..ఎదుటివారు కూడా అలానే వుంటారు. మరి మనం నేర్పిన విద్యనే కదా ఇది.
కలిసి పెరిగిన బంధాలు కూడా నటనే అని అర్థం కానంత వరకే మన ఆటలు. ఓసారి మన నిజస్వరూపం తెలిసాక నలుగురి కోసం మనతోపాటుగా వారు నటించడం అలవాటు చేసుకుంటారు. మనం పెంచిన దూరమే రేపు మన పాలిట శాపంగా మారుతుందని మనకు తెలియదు ఇప్పుడు. ఎందరి దగ్గర ఎన్ని నటనలు ప్రదర్శించినా, అసలు నైజం ఎప్పటికైనా బయటపడక తప్పదు.
మానవ జీవితానికి అవసరం అనేది తప్పదు. అది ఎంతటివారికైనా తప్పదు. మన జన్మ సార్థకం కావాలంటే, నలుగురికి మంచి చేయకపోయినా పర్లేదు కాని ఒక్కరికయినా మనకు తెలిసి చెడు చేయకుండా వుంటే చాలు. డబ్బు అందరి దగ్గరా వుండొచ్చు కాని అది సద్వినియోగ పడేది కొందరి నుండే. అయినవారిని పరాయివారిగా చూస్తున్న ఈరోజుల్లో ఎదుటివారి కష్టాన్ని చూసి తమకు చేతనైన సాయమందించే ఆ మంచి మనసులకు పాదాభివందనం.
1, నవంబర్ 2024, శుక్రవారం
లోపల..!!
మనసులోని
మర్మమెరుగ సాధ్యమా
మనిషిలోని
మరో మనిషి నెరుగ తరమా
బాహ్యమెంత అవగతమైనా
అంతర్గతం తేటతెల్లమౌనా
ఏ గాలెటుపోతుందో
ఏ జీవి పయనమెక్కడికో తెలియునా
ఆంతర్యమెరిగినా
అంతరాల అడ్డు తొలగునా
కాలానికి తెలిసిన
గతాన్ని మార్చుట సాధ్యమా
రాసిన రాతనే మార్చలేడు విధాత
అక్షరాలను అటు ఇటు అద్దినా
తలరాతకు మించిన రాత
తరలి రాగలదా ఈ ధరణిలోన..!!